*💐💐💐💐💐💐💐💐💐
*ఆలోచనలు*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*'ఆలోచనల రూపమే మనం'* అంటాడు *బుద్ధుడు•*
మనసులో అమంగళ కరమైన ఆలోచనా తరంగాలు ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే, ముఖంలో అవే వికృత భావాలు ప్రస్ఫుటంగా ప్రకటితం అవుతుంటాయి.
*ముఖం - మనసుకు ప్రతీక* అంటారు పెద్దలు• ప్రశాంతమైన మోము కలిగినవారి మనసు *'తేటనీటి కొలను'•*
ఆలోచనలు - వికసించిన పువ్వు చుట్టూరా తిరిగే *భ్రమరం* లా శుభాల చుట్టూ పరిభ్రమిస్తాయి. అశుభం వైపు పోకుండా మనసును సున్నితంగా పట్టి ఉంచుతాయి.
మన సంప్రదాయంలో *దీవెన* కు విశేష స్థానం ఉంది. అప్పుడే పుట్టిన శిశువు నుంచి వృద్ధాప్య దశ దాకా వివిధ సందర్భాల్లో పెద్దల ఆశీర్వాదాలు పొందుతూనే ఉంటారు.
*మంగళాశాసనం* అంటే మనసా వాచా ఒకరి భావబలం మనల్ని వెన్నంటి ఉండటం. ఆశీర్వాదబలం వెన్నుదన్నుగా ఉంటే విద్యార్థి నుంచి కార్యార్థి వరకు... అందరికీ అన్నింటా సఫలమే!
పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు, *'అన్నీ తామే, అంతా తామే'* అన్నట్లుగా... కాస్త బెడిసి కొడితే... *'తమ చేతిలో ఏదీ లేదన్నట్లుగా'* మాట్లాడుతుంటారు కొందరు.
ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా శ్రేయోతత్త్వాన్ని విడిచిపెట్టనివారు - *విజయకాంక్ష* ఉన్నవారు. ఓటమికి వెరవనిది, కుంగిపోనిదీ వారే!
*చదవడం* అంటే అందరికీ *పుస్తకమే* గుర్తుకు వస్తుంది.
ఒక లక్ష్యం ఏర్పరచుకుని, అనుక్షణం శ్రేయోభిలాషతో - ఎవరు తనతో కలిసివచ్చినా, రాకపోయినా దృఢంగా అడుగులేసుకుంటూ గమ్యం వైపు సాగిపోయేవారు మనకు ఎక్కడో అక్కడ అరుదుగా తారసపడతారు. వారిని శ్రద్ధగా చదివి ఆకళింపు చేసుకుంటే, మన మనసులో *'పుట్టినందుకు ఏదైనా సాధించాలి'* అనే తపనకు బీజం పడుతుంది. మన నిత్య కృషితో అది, ఏదో నాటికి మహావృక్షం అవుతుంది. మన కీర్తిని అజరామరం చేస్తుంది.
మన ప్రమేయం లేకుండా చెయ్యి కదలదు, కాలు నడవదు. మరి *ఆలోచనలు మాత్రం కట్టు తెగిన కోడెల్లా, కట్ట తెగిన వరద నీటిలా ఇచ్ఛారీతిన ప్రవహిస్తే ఎలా?* వాటికి కళ్లెం వేయాలి. మన ఆలోచనలు మనకు ఉపయోగపడాలి. చెరుపు చేయకూడదు.
*శరీరం మీద కాకుండా మనసుపై పెట్టే శ్రద్ధ మేలు చేస్తుంది. మనుషులను ఋషులుగా మాధవులుగా చేస్తుంది.*
*హృదయం నవనీతం అయితే, నోటి నుంచి కర్ణపేయంగా వెలువడే మాటలు నలుగురికీ దగ్గరయ్యేలా చేస్తాయి.*
*కీడెంచి మేలెంచమని* మన పూర్వులు చెప్పింది, జీవితంలో ఏమరుపాటును వదిలి అప్రమత్తంగా ఉండమని హెచ్చరించడానికి. అంతేకాని - ఆ భావాన్నే అంటి పెట్టుకుని, నిత్యం శంకలతో కాలం గడుపుతూ, జీవితాన్ని వృథా చేసుకొమ్మని కాదు.
శ్రేయోదాయక ఆలోచనలు మనసును స్వచ్ఛమైన వేదికగా మారుస్తాయి. దానిపై కొలువుదీరడానికి అంతర్యామి ఉవ్విళ్లూరతాడన్నది సత్యం.
ఆధ్యాత్మికంగా ఉత్తమ ఆలోచనలకు ఉన్న గొప్ప శక్తి అది. ముముక్షువులు భగవదవతారంగా గుర్తింపు పొందడానికి అదే కారణం.
🙏సమస్త లోకాః సుఖినోభవంతు🙏
🌼శుభమస్తు🌺
No comments:
Post a Comment