Sunday, March 23, 2025

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓమ్ నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
               *చీకటి వెలుగులు*

*చుట్టూ చీకటి పరచుకున్నప్పుడు నీడ కూడా తోడుండని అంధకారంలో ఒంటరితనం భయపెడుతుంది. చీకటి తొలగిపోయి వెలుగురేకలు విచ్చుకోగానే మనసు ఉత్సాహభరితమవుతుంది. సూర్యకాంతిలో చుట్టూ ఉన్న ప్రకృతి మనకు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చీకటి వెలుగుల విన్యాసమే కాలచక్ర పరిభ్రమణం.*

*కష్టాలు, ఆపదలనే చీకట్లు మనిషికి దుఃఖాన్ని మిగులుస్తాయి. కష్టకాలంలో ఆదుకునేవారుండరు. బంధువులు, మిత్రులు తప్పించుకు తిరుగుతారు. ఉన్నత స్థితి, సంపదలతో మనిషి ప్రకాశించినప్పుడు మిత్రులు ఆత్మీయులవుతారు. కష్టకాలంలో దూరమైనవారు కాలం కలిసిరాగానే చేరువవుతారు. విమర్శించినవారే అభినందిస్తారు. త్యాగం, దయ, ధర్మం, సత్యం మనసులో నిత్యం ప్రకాశించే సద్గుణసంపన్నుడు అందరి గౌరవం పొందుతాడు.*

*బాల్యంలో మనసు కల్మషరహితంగా ఉంటుంది. కౌమార, యౌవన దశల్లో భిన్న ప్రవృత్తుల స్నేహితులు తోడవుతారు. స్నేహితుల ప్రభావం జీవనగమనంలో మార్పు తెస్తుంది. సజ్జన సాంగత్యం అభ్యుదయ పథమనే ప్రకాశవంతమైన క్రాంతిమార్గంలో నడిపిస్తుంది. దుర్జన సాంగత్యం మనసులో దురలవాట్లను ప్రేరేపించి మనిషిని అంధకారంలోకి లాగుతుంది. మంచి చెడుల విచక్షణ తెలుసుకోకుండా స్నేహితులను అనుకరించడం ప్రమాదకరం.*

*మనిషి తనను తాను తెలుసుకోవాలి. తన శక్తిసామర్థ్యాలను అంచనా వేసుకోవాలి. తన బలహీనతలను గుర్తించి సరిదిద్దుకునే మార్గాలను అన్వేషించాలి. జీవనపథంలో ఎదురైన అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అవరోధాలను అధిగమించాలి. ఇవన్నీ ఒక్కరోజులో సంభవించేవి కావు. ఏళ్లతరబడి కష్టపడి శ్రమిస్తేనే ప్రగతి రథం ఆహ్వానిస్తుంది. నిత్య శ్రామికుడు విజయపథంలో ప్రకాశిస్తూ తోటివారికి చేయూతనిస్తాడు.*

*భగవంతుడు అనుగ్రహించిన జ్ఞానమనే కాంతితో అజ్ఞానమనే చీకటిని పారదోలాలి. విజ్ఞులు తమ మేధను ఉపయోగించి సద్బుద్ధితో, స్వయంకృషితో తేజోవంతులవుతారు. సానుకూల దృక్పథమే మనోబలం. మనోబలమే చీకటిలోనూ కాంతులీనుతుంది. వ్యతిరేక ధోరణులు తిరోగమన సూచికలు. ప్రగతి ప్రతిబంధకాలు. అవి మేధను హరించి మనసును చీకటిమయం చేస్తాయి. సూర్యకిరణాలు పడకపోతే చీకటి తెరలు విడిపోనట్లు, కేశవుడి కీర్తన లేకపోతే చుట్టుముట్టిన ఆపదలు తొలగిపోవని భాగవతం చెబుతోంది.*

*'మనిషి ఆయుర్దాయంలో సగభాగం కారుచీకట్లతో కూడిన రాత్రివల్ల వృథా అవుతుంది. మిగిలిన సమయంలో కామక్రోధాదుల బంధంలో చిక్కుకుని బయటకు రాలేక సతమతమవుతాడు. తాను వేరు, మిగిలిన వారు వేరు అనే భావంతో సంసారమనే చీకటి నూతిలో కష్టాలను అనుభవిస్తాడు. శ్రీహరి చరణ కమల స్మరణమనే అమృతరసం తాగి పరవశులు కాగలిగిన వారికి భగవంతుడి కృపవల్ల కోరకుండానే ధర్మ, అర్థ, కామాలతోపాటు మోక్షం సిద్ధిస్తుంది’ అని ప్రహ్లాదుడు ఉద్బోధించాడు.*

*భగవన్నామస్మరణతో మనసు నిండిపోయినప్పుడు కారుచీకటిలోనూ కమలాక్షుడు అభయ ప్రదానం చేసి ఆదుకుంటాడు. శీతోష్ణస్థితుల్లో మార్పును దేహం తట్టుకున్నట్టే సుఖదుఃఖాలను మనసు సమానంగా స్వీకరించగలగాలి. అప్పుడే మనిషి జీవన గమనంపై చీకటివెలుగుల ప్రభావం ఉండదు. సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించగల స్థితప్రజ్ఞుడే తనకిష్టమైన భక్తుడని భగవంతుడి గీతోపదేశం.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴

No comments:

Post a Comment