*పూజల పరమార్థం ఏమిటి?*
🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻
సాధారణంగా చాలామంది ప్రతిరోజు దేవునికి దీపం పెట్టడం, పూజ చేయడం చేస్తూనే ఉంటారు. అసలు పూజచేయడం అంటే ఏమిటి? దేవునికి ఎదురుగా దీపం పెట్టి, ముక్కు మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదు. పర్వదినాలలో, పండుగలప్పుడే కాకుండా నిత్యము చేసే పూజకు కూడా ఒక క్రమపద్ధతి అంటూ ఉన్నది. ఆ పూజావిధానము ఏమిటి? ఏక్రమములో పూజ చేయాలి? అలా చేయడంలోని అంతరార్థమేమిటి? అనే విషయాలు తెలుసుకొందాము.
పూజగదిలోనికి పూజచేసే వ్యక్తి ఎలా వెళ్ళాలి? అన్నది మొదలు పెట్టి పూజానంతరం చేసే ప్రణామం వఱకు ఎలా చేయాలి? అను వాటన్నింటిలో చాలా గూఢార్థము నిబిడీకృతమై ఉన్నది. పూజ చేయడానికి ఆసనంపై నిశ్చల మనస్సుతో కూర్చోవడం ముఖ్యం. ఆచమనం, రకరకాల ఉపచారాలు అన్ని అర్థగర్భితాలే.వీటిలో దేంట్లోను ఉపయోగపడనివి లేవు. ఇవి ఏమాత్రమూ అర్థ రహితములు కావు. పూజావిధుల విశిష్టతను తెలుసుకొని పూజ చేస్తే ఆ పూజలో ఆనందము కూడ హెచ్చుగా ఉంటుంది. పూజ చేసే వ్యక్తిలో భక్తిశ్రద్ధలు, దేవునిముందు ఏకాగ్రత బలపడతాయి. కాబట్టి పూజను పూజగానే చేయాలి. నియమబద్ధంగా భక్తిప్రపత్తులతో అర్థసహితంగా పూజాక్రమాన్ని పాటించాలి. పూజచేసే వ్యక్తి మొట్టమొదట స్నానంచేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. స్త్రీలైతే ముఖానికి కుంకుమబొట్టు, కాళ్ళకు పసుపు రాసుకోవాలి. మగవారైతే నుదుట విభూతి, కుంకుమ పెట్టుకోవాలి. పూజ గదిలోనికి ప్రవేశించిన వెంటనే దేవునకు నమస్కారం చేయాలి. పూజచేయడానికి తూర్పు లేక ఉత్తర ముఖంగా కూర్చోవాలి. సూర్యుడు ప్రత్యేక దైవం, జ్ఞానానికి ప్రతీక. అందుకే సూర్యుడు ఉదయించే తూర్పువైపుకే కూర్చోవాలి. అలాగే ఉత్తరం కుబేరస్థానం, దిక్సూచి ఎప్పుడూ ఉత్తరాన్నే చూపిస్తూ ఉంటుంది. అలాగే మన మనస్సుకూడ సదా భగవంతునివైపే చూస్తుండాలి. అందుకే ఉత్తర ముఖంగా కూర్చోవాలంటారు. ఒక పూజ చేసేటప్పుడే కాకుండా ఏ రకమైన పనులు చేయడానికైనను తూర్పు ముఖంగానో, ఉత్తరముఖంగానో తిరిగి చేయాలంటారు.
*ఆచమనం* : దైవాన్ని పూజించడానికి ముందు ఆచమనం చేస్తారు.
మానసికంగా పవిత్రులైనప్పుడే ఎవరైనా పూజించడానికి అర్హులవుతారు. మనసును శుద్ధిచేయడమే ఆచమనములోని ప్రధానఆశయం. అంతే కాకుండా దేవునిపూజ చేయకుండ ఏవిధమైన పానీయాలు త్రాగరాదు. అందుకే పూజ చేసేటప్పుడు మొదట ఆచమనం చేస్తూ నీటిని శబ్దము రాకుండా నోటిలోనికి తీసుకుంటే దివ్య ఔషధంగా కూడా పనిచేస్తుంది.
*స్వస్తివాచన* : 'స్వస్తి' అని శుభం పలకడం మొదటిపని, చేయబోయే పనులు సఫలం చెందటానికి, అందరికి శుభం కలగాలని చేసే ప్రార్థన సంకల్పం. మనిషికి సంకల్పమనేది ప్రధానం. అది ఒక మహత్తరశక్తిగా పనిచేస్తుంది. సంకల్పములో సంవత్సరము, అయనం, ఋతువు, మాసం, పక్షం, తిథి, నక్షత్రం, వారం అన్నీ చెప్పు కొంటాము. ఏ పని చేయడానికైనా సంకల్పము ముఖ్యం. అలాగే ఆరోజు చేయబోయే పనులన్నీ సక్రమంగా జరిగి అందరికి శుభము జరగాలనే ఉద్దేశ్యముతో దేవుని ప్రార్థిస్తాం.ప్రొద్దుటే మంచి వాక్యాలు పలికితే ఆరోజు మొత్తము శుభప్రదంగా ఉంటుంది.
*కలశస్థాపన* : పూజలో ఇది ప్రధాన ప్రక్రియ. ఏ దేవుని పూజించినను కలశాన్ని ఏర్పాటు చేస్తారు. ఒక రాగిచెంబుతో కాని, గ్లాసుతోగాని నీళ్లు తీసుకొని, దానికి గంధం రాసి కుంకుమ పెట్టి నీళ్ళలో అక్షతలువేసి తమలపాకు, పువ్వువేసి అన్ని నదుల పేర్లు చదువుతూ ఆయా దేవతలను ఆహ్వానిస్తూ దాన్ని పూజిస్తాం. కలశము దేవతకు ప్రతిరూపము. ఇంట్లో విగ్రహాలు లేకపోతే అప్పుడు కలశమే దేవతకు ప్రతీక అవుతుంది. పూజ చేసేవారు కలశపూజ చేసి ఆ నీటిని పూజాద్రవ్యాలమీద, దేవునిమీద చల్లి, పిదప తమమీద చల్లు కొంటారు. అలా చేస్తే ప్రతిరోజు పవిత్రమైన అన్ని నదులలో స్నానం చేసినంత పుణ్యం వస్తుంది.
*ప్రాణప్రతిష్ఠ :* ఏ దేవునికి పూజ చేసినను ప్రాణప్రతిష్ఠ అనేది తప్పనిసరిగా చేయాలి. ప్రాణ ప్రతిష్ఠ అంటే తమలపాకుగాని, పువ్వుగాని తీసుకొని దేవునిమీద ఉంచుతారు. ఇలా చేయడము ఎందుకంటే ఎదురుగా ఉన్న విగ్రహంలోనికి తన దివ్యాత్మను పంపించడం. అప్పుడు అతని ఆత్మలో దివ్యచేతన వస్తుంది. అంటే చిన్మయరూపదేవతను శాస్త్రోక్తముగా విగ్రహములో స్థాపించడమే ప్రాణప్రతిష్ఠ ఉద్దేశ్యము.
*ధ్యానము* : కళ్ళుమూసుకొని మనము పూజించే దేవతల రూపాలనుమనసులో తలచుకొని దేవునిపై పువ్వు పెట్టాలి. ఇలా చేయడం వలన మనసు వేరే విషయాలమీదకు మళ్ళకుండ దేవుని మీద నిమగ్నమౌతుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇలా దైవధ్యానము చేయడంవలన ఏకాగ్రత అనేది అలవడుతుంది. దృఢచిత్తముతో ఏ పని చేయడాని కైనను ధైర్యంగా సంసిద్ధులవడానికి అవకాశము ఏర్పడుతుంది.
*షోడశోపచారపూజ* : షోడశోపచార పూజ అంటే దేవునికి అన్ని ఉపచారాలు
చేసి, అలంకరించడం. ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, పంచామృత స్నానం, శుద్దోదక స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షతలు, పుష్పములు, ఆభరణం ఇలా అన్నీ సమర్పించి దేవునిని ప్రసన్నము చేసుకోవడం. మనము చేసుకొనే నిత్య కృత్యాలలాగే మన ఇంట్లో పెట్టుకొని పూజించే దేవుళ్ళకు కూడా అన్నియు సమకూర్చాలి. ఇలా చేస్తే అన్నివిధాలా మేలు జరుగుతుంది. అంతేగాక ప్రతిరోజు విభూతి, గంధం, అక్షతలు, పువ్వులను తాకడంవలన అనేక శారీరకరుగ్మతలబారిన పడకుండా ఉండవచ్చు.
*ధూపం, దీపం* : షోడశోపచారపూజలో భాగంగా దేవునకు ధూపం వేసి, దీపం వెలిగించి చూపించాలి. ప్రతిరోజు ధూపంవేసినపుడు వచ్చేవాసన పొగవల్ల శ్వాసకోశవ్యాధులు రావు. పరిసరాల్లో ఉండే క్రిమికీటకాలు వెళ్ళిపోతాయి,
*నైవేద్యం* : ఇంట్లో చేసుకొనే పదార్థాలను దేవునకు నైవేద్యం పెట్టాలి, లేకపోతే కొంచెం పాలు తీసుకొని అందులో చక్కర వేసి దేవునకు నైవేద్యం పెట్టాలి. అనంతరం వాటిని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
*తాంబూలం :* తమలపాకులో వక్కలు పెట్టి దేవునకు తాంబూలం సమర్పించాలి. భోజనానంతరము ప్రసాదబుద్ధితో వాటిని తింటే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. దంతాలకు బలం చేకూరుతుంది. శరీరంలో ఉండే వాతము తగ్గుతుంది. తమలపాకురసము మింగడంలో కఫము, శ్లేష్మము తగ్గుతాయి.
*నీరాజనము* : హారతికర్పూరం వెలిగించి నీరాజనం సమర్పించాలి. తదనంతరం దాన్ని కళ్ళకు, హృదయానికి హత్తుకోవాలి. హారతికర్పూరం పొగను పీల్చడంతో శ్వాసగ్రంధులు శుభ్రపడతాయి. ఇంటిలోనికి క్రిమికీటకాలు రావు. హారతి కర్పూరం జ్యోతిని చూడడంవలన కళ్ళకు మంచిది.
*ఆత్మప్రదక్షిణం, సాష్టాంగనమస్కారం* :
అక్షతలు, పువ్వులు తీసుకొని లేచి నిలబడి ప్రదక్షిణం చేసి, వాటిని దేవునిమీద వేయాలి. తరువాత సాష్టాంగ నమస్కారం చేయాలి. అంటే దేవునిముందర అన్ని అవయవాలు నేలను తాకునట్లుగా బోర్లాపడుకొని సాష్టాంగ నమస్కారం చేయాలి.
🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
No comments:
Post a Comment