*`నాన్నా..`*
*మూడు తరాల తర్వాత ఇంట మొదటి అడపిల్లనని..*
*తతగారివైపు..నానమ్మ వైపు ఇంట్లో మొదటి బిడ్డనని నన్నెంతో ముద్దుగా పెంచారు..*
*నాన్నా అని మిమ్మల్ని ఒక్కరినే పిలిచినా...మీ నాన్న కూడా నాకు నాన్నేగా..*
*మీరు అమ్ములు అంటే తాతగారు అమ్మా అంటూ*
*ఎప్పుడూ నా వెన్నంటి ఉండేవారు..*
*ఒకరి కూతురుగా ...మరొకరి మనవరాలిగా..నేనెంతో అదృష్టవంతురాలిని..*
*మీరెప్పుడూ నాకు గొప్పగానే కనిపిస్తారు..*
*గంభీరంగా..కోపంగా..అచ్చంగా మన పెంకుటింటి పెద్ద దూలంలా..*
*మీ మీదనే ఇల్లంతా ఉన్నా..ఓ మాట అనరు..*
**కర్తవ్యమే అది అన్నట్టు ఉంటారు..*
*నీ కాళ్ళపై ఊగిన ఉయ్యాల ఇంకా గుర్తే..*
*వద్దులే నాన్నా అంటే..*
*రా తల్లీ నా కాళ్ళ నొప్పులు తగ్గుతాయని మీరన్నప్పుడు ..*
*నీ వేలు పట్టుకు నడిచిన అడుగులు..*
*ఎలా ఉండాలో నేర్పుతూ చెప్పిన కథలు..*
*వద్దన్నది చేసినప్పుడు అలకలు..*
*కాస్త జ్వరానికే మీ కళ్ళలో నీళ్ళు..*
*అలసి ఇంటికొచ్చినా వాడని చిరునవ్వులు..*
*ప్రతీ పుట్టినరోజున వేసిన మొక్కలు ..*
*అవి పెరుగుతుంటే ఆ కళ్ళలో మెరుపు ఇప్పటికీ గురుతే...*
*చిన్న విషయాలకు పెద్ద హోదా ఇచ్చే పల్లెల్లో..*
*కొన్ని అనవాయితీలను....*
*మరికొన్ని అనవసర సంప్రదాయాలను కుదరదంటే కుదరదని*
*మీ అమ్మ మాటని కూడా కాదని మాకెంతో స్వేచ్చనిచ్చి పెంచారు..*
*ఏడవ తరగతిలో అనుకుంటా సైకిల్ నేర్చుకుంటా అంటే..*
*సైకిల్ తొక్కటం నేర్పించొద్దని నానమ్మ దెబ్బలాటకి..*
*నానమ్మకు నచ్చ చెబుతూ మీరు..*
*నాకు మీ బజాజ్ చేతక్ నేర్పుతూ తాతగారు..*
*ఊరంతా ముక్కున వేలేసుకున్నా గర్వంగా తలెత్తి చూస్తూ .నా కూతురనేవారు.. ఇప్పటికీ.. ఎప్పటికీ గుర్తే..*
*నేనెప్పుడు పెరిగానో..*
*అంత పెద్దదాన్ని ఎప్పుడు అయ్యానో అప్పుడే పెళ్లా..*
*అని ఆలోచనల్లో ఉండగానే పెళ్లి పిల్లలు..*
*`నాన్నా..`*
*అప్పటివరకు మీరు నాకు నాన్న..*
*నేను అమ్మయ్యాక మీరు నాకు పసిపిల్లాళ్ళా అనిపించారు.*
*నా పిల్లలతో పిల్లల్లా కలసిపోయి మీరాడే ఆటలు..*
*అమ్మ నాదంటే నాదని పిల్లలంటంటే*
*అమ్ములు నాదని మీరు చేసే అల్లరి..అలకలు...*
*పిల్లలకు నా గురించి మీరు చెప్పే కథలు..*
*మీలో మరో పసివాడిని గుర్తు చేస్తాయి..*
*వారికి జాగ్రత్తలు చెబుతూ మీకు కూడా చెబుతుంటే*
*మీ పెదాలపై విరిసే నవ్వు...* *కళ్ళలో సన్నటి నీటి పొర..*
*మీ నుండి దూరం పంపిన ప్రతీసారి ఎదో పనుందని మేం బయలుదేరే వరకు వచ్చేవారు కాదు..*
*రాకుండా ఉండలేక వచ్చాక వదల్లేక మీరు పడే వేదన తెలుస్తూనే ఉంటుంది..*
*మీరు చెప్పిన కొన్ని మాటలు ఎప్పటికీ గుర్తే..*
*మనపై మనకున్న నమ్మకాన్ని కానీ...*
*ఎదుటి మనుష్యులపై ఉండే నమ్మకాన్ని కానీ వదలొద్దని...*
*నమ్మకమే మనల్ని నడిపించే శక్తి అని..*
*నిజమే అనిపిస్తుంది...*
*`నాన్నా...`*
*నమ్మకాన్ని..విశ్వాసాన్ని నింపి..*
*నడకను...నడవడికను నేర్పే నాన్నకు....*
*నీడై...తోడుండే నాన్నకు*
*ధైర్యమై...దారి చూపే నాన్నకు*
*నిజమై..నిలకడై నిలిచే నాన్నకు...*
*కష్టమైనా....ఇష్టమై సాగే నాన్నకు*
*కన్నీటిని దాచేసి..గాంభీర్యాన్ని మాత్రమే చూపే నాన్నకు..*
*మూసినా తెరిచినా కంటిలోనే నిలుపుకునే నాన్నకు...*
*కలవరాల్ని సైతం కలల వరాలుగా ఇచ్చే నాన్నకు...*
*ఇంకో తరాన్ని చూసినా తన బిడ్డ మాత్రం ఇంకా చంటి పాపే అనుకునే నాన్నకి...*
*బిడ్డల బిడ్డలతో ఆడుకుంటూ తానూ పసిబిడ్డయ్యే నాన్నకు..*
*ఎక్కడ ఏం తప్పటడుగులు వేస్తామో అని అడుగులు తడబడనీయని నాన్నకు ప్రేమతో...!*
No comments:
Post a Comment