Monday, March 3, 2025

 Vedantha panchadasi:
వ్యవహారో లౌకికో వా శాస్త్రీయో వాఽన్యథాపి వా౹
మమాకర్తురలేపస్య యథారధ్వం ప్రవర్తతామ్ 
౹౹267౹౹
అథవా కృత కృత్యోఽ పి లోకానుగ్రహ కామ్యయా౹
శాస్త్రీయేణైవ మార్గేణ వర్తేఽ హం కా మమ క్షతిః 
౹౹268౹౹
దేవార్చన స్నానశౌచభిక్షాదౌ వర్తతాం వపుః ౹
తారం జపతు వాక్తద్వత్పఠత్వామ్నాయ మస్తకమ్ 
౹౹269౹౹
విష్ణుం ధ్యాతు ధీర్యద్వా బ్రహ్మానన్దే విలీయతామ్ ౹
సాక్ష్యహం కిఞ్చిదప్యత్ర న కుర్వేనాపి కారయే 
౹౹270౹౹
ఏవం చ కలహః కుత్ర సంభవేత్కర్మిణో మమ ౹
విభిన్న విషయత్వేన పుర్వాపర సముద్రవత్ 
౹౹271౹౹

ప్రారబ్ధమెట్లుండిన అట్లే వ్యవహారము నడుచుగాక.
అకర్తను అసంగుడను అయిన నన్ను ఏదీ అంటదు.

వ్యాఖ్య:- వ్యవహారంలో కర్త్రత్వాన్ని తిరస్కరించటం వల్ల జ్ఞానికి ఉచ్ఛృంఖలత్వం అబ్బుతుందేమో అని సంశయము.ఐతే -

వ్యవహారము లౌకికమే గానిమ్ము శాస్త్రేయమే గానిమ్ము తదితరమే గానిమ్ము అకర్తను అసంగుడను అయిన నన్ను అది అంటదు.

భిక్షాటనంలాంటి లౌకిక వ్యవహారాలూ హింస మొదలైన ఇతర నిషిద్ధ వ్యవహారాలూ,జప తప సమాధిలాంటి శాస్త్రీయ వ్యవహారాలూ కర్తగా గాని, భోక్తగా గాని కాకుండా నిర్లిప్తుడనై నా ప్రారబ్ధకర్మ వశాన జరుగుతూ ఉంటే జరగనివ్వు ! 
ఎందుచేతనంటే,ప్రారబ్ధమనేది చాలా ప్రబలమైనది.
అనుభవిస్తేనే తప్ప అది క్షయం కాదు.

లేదా, నేను కృతకృత్యుడనై -
చేయవలసినవన్నీ చేసినవాడనై - కేవలం లోకానుగ్రహం కోసం అనే కోరికతో,శాస్త్రీయ మార్గాన వ్యవహరించినప్పటికీ దానివల్ల నాకేమీ హాని లేదు - ఉండదు.
శాస్త్రీయ మార్గాన్ని అంగీకరించటమంటూ జరిగితే దానిమీద(ఆ మార్గం మీది) అభిమానంతో కూడిన వికారం ప్రాప్తిస్తుంది ఎదా ? అంటే -

నా శరీరం అనేది - దేవార్చన,స్నానం,శౌచం,భిక్షాటనం మొదలైన పనులని ఆచరిస్తే ఆచరించుగాక !
అట్లాగే వాక్కు - 
ప్రణవ జపం చేయుగాక ! వేదాంత దర్శనాది శాస్త్రాలు పఠించుగాక !
బుద్ధి - 
విష్ణుధ్యానంలో లీనమౌగాక ! లేదా,బ్రహ్మానందంలో నిమగ్నమౌగాక !
"నేను మాత్రం సాక్షిని" !
"నేనేమీ చేయటం లేదు".
నేనెవరిచేతా చేయించటం లేదు.అందుచేత, 

నేను శాస్త్రీయ కర్మలు చేస్తున్నానని గాని,ఇతర పనులు చేస్తున్నాననిగానీ -
చేయునదోగాని చేయించునదిగాని అణుమాత్రమైనను లేదు.
వికారం అనేవి నాకు కలగవు -
అనేవి నాకు అంటవు.

ఇట్లుండగా కర్మపరునకు నాకు వివాదమెక్కడిది ?పూర్వపశ్చిమ సముద్రముల వలె ఇరువురి విషయాలూ పూర్తిగా భిన్నమైనవి.అంటే -

వపుర్వాగ్ధీషు నిర్భంధః కర్మిణో న తు సాక్షిణి ౹
జ్ఞానినః సాక్ష్యలేపత్వే నిర్బంధో నేతరత్ర హి
౹౹272౹౹
ఏవం చాన్యోన్య వృత్తాంతానభిజ్ఞౌ బధిరావివ ౹
వివదేతాం బుద్ధిమన్తో హసన్త్యెవ విలోక్య తౌ 
౹౹273౹౹
యం కర్మీ న విజానాతి సాక్షిణ తస్య తత్త్వవిత్ ౹
బ్రహ్మత్వం బుధ్యతాం తత్ర కర్మిణః కిం విహీయతే 
౹౹274౹౹

కర్మికి, జ్ఞానికి వారి నిశ్చయములు ఆసక్తి విషయములు భిన్నములు.

వ్యాఖ్య :- కర్మవరుడు అనగా జ్ఞాని యొక్క కర్మలనిగాని,
మనస్సనిగాని, కర్మతత్పరులైన ప్రతివాదులనిగాని అర్థము చెప్పవచ్చును.ఏ అర్థములో నైనను జ్ఞానికి వానితో విరోధము లేదు.

కర్మికి వాఙ్మనః కాయములతో మాత్రమే సంబంధము అంటే -
కర్మిష్ఠియైన వానికి శరీరం,బుద్ధి,వాక్కు,
వీటియందు అభినివేశం (ఆసక్తి,పట్టుదల)ఉంటుంది.
సాక్షితో ఏ సంబంధమును లేదు.కాని-

జ్ఞానులకు సంగరహితమైన సాక్షితో మాత్రమే సంబంధము. ఎటువంటి ఆసక్తులు ఉండవు.
జ్ఞానికి ఉండే అభినివేశం
"తాను అలిప్తుడను" అనే విషయంలో ఉంటుంది - శరీరాదులమీద ఉండదు. ఇతరములతో వారికి పని లేదు.ఇట్లా ఉభయుల క్షేత్రాలూ భిన్నంగా ఉంటాయి.కనుక వారి నిశ్చయములు ఆసక్తి విషయములు భిన్నములు.

ఈ విధంగా జ్ఞానికి కర్మిష్ఠికి వివాదానికి అవకాశం లేకపోయినప్పటికీ,ఈ యిరువురి విషయమూ తెలియనివారు చెవిటివారూ పోట్లాడుకున్నట్లుగా కలహిస్తూ ఉంటారు.
ఈ ఉభయుల వివాదము , కలహము విని తత్త్వజ్ఞుడు నవ్వుకుంటూ ఉంటాడు.

ఇట్లా ఆ యిరువురూ పరిహాస పాత్రులెట్లా అవుతారు ? 
అంటే -
కర్మయే ప్రధానమనువారు,
జ్ఞానమే ముఖ్యమనువారు
పరస్పరము వివాదపడుట హాస్యాస్పదము.ఒకరు చెప్పునది మరొకరికి తెలియదు.

కర్మిష్ఠియైన వాడు తన కర్మకాండలకు అవసరమైన శరీరం,వాక్కు,బుద్ధి వీటిని తప్ప వీటన్నింటిని మించిన సాక్షి రూపంలో ఉండే ఆత్మను ఎరుగడు.
తత్త్వజ్ఞాని సాక్షియొక్క ప్రభావాన్ని తెలుసుకొన్నందువల్ల ఆ కర్మిష్ఠి యొక్క కర్మానుష్ఠానానికి కలిగే హాని ఏముంది ?

కర్మికి తెలియని సాక్షియే బ్రహ్మమని తత్త్వవిదురుడు తెలిసికొనుగాక.దాని వలన కర్మికి నష్టమేమి ?      

No comments:

Post a Comment