Thursday, August 20, 2020

గొప్పవాడు

గొప్పవాడు
- కొయిలాడ రామ్మోహన్‌రావు

గొప్పవాడు


‘నేనెందుకు ఈ ఇంట్లో పుట్టాను... నేను ఏం పాపం చేశాను? మా నాన్న డాక్టరో కలెక్టరో ఎందుకు కాలేదు? నేను ఎందుకిలా పేద కుటుంబంలో ఒక స్కూల్‌ టీచర్‌ ఇంట్లో పుట్టాను? నా స్నేహితులంతా ఏం పుణ్యం చేశారని గొప్పగొప్ప కుటుంబాలలో పుట్టారు?’ అని అనుకోని రోజు లేదు నా జీవితంలో.
నా స్నేహితుల తండ్రులంతా గొప్ప గొప్ప ఉద్యోగాలో వ్యాపారాలో చేస్తున్నారు. నాకు మెరిట్‌ మీద గొప్పవాళ్ళు చదివే స్కూల్లో సీటు వచ్చిందిగానీ, లేకపోతే గవర్నమెంటు స్కూల్లో చదవాల్సిన దౌర్భాగ్యం పట్టేది. చదువులో నేనెప్పుడూ ఫస్టే. నాకున్న తెలివితేటలవల్లే నా ఫ్రెండ్స్‌ అంతా నన్ను ఎప్పుడూ వదలరు. చదువులో వాళ్ళ సందేహాలన్నీ తీరుస్తూ వాళ్ళకు బాగా దగ్గరయిపోయాను. వాళ్ళు నాకు గిఫ్ట్‌లూ బొమ్మలూ చాక్లెట్లూ బిస్కెట్లూ ఇవ్వడానికి పోటీపడుతూ ఉంటారు. అలా మా నాన్న కొనిపెట్టలేనివన్నీ నా తెలివితేటలతో సంపాదించుకుంటున్నాను. అయినా నాకెంతో అసంతృప్తి. ‘ఇవన్నీ నేనే ఎందుకు సంపాదించుకోవాలి? ఇద్దరక్కలతో సరిపెట్టుకుని ఉండొచ్చు కదా? సరైన సంపాదన లేనప్పుడు నన్నెందుకు కనాలి?’ అని తరచుగా అనుకుంటూ బాధపడుతూ ఉంటాను. ‘వచ్చే జన్మలో నాకిలాంటి నాన్న వద్దు, ఈ పేదరికమూ వద్దు. గొప్పవారింటిలోనే పుట్టాలి’ అనుకుంటూ ఉంటాను చాలాసార్లు.
ఇలా ఆలోచించుకుంటూ మా ఇంటికి ఎదురుగా ఉన్న పోలీస్‌ స్టేషన్‌ వైపు చూశాను. సరిగ్గా అప్పుడే సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ దేవరాజ్‌ బయటకు వచ్చి సిగరెట్‌ కాల్చుకుంటున్నాడు. ఆ సీన్‌ నేను రోజూ చూసేదే. రోజూ అతనలా బయటకు రావడం, ఒక పోలీసు వచ్చి సిగరెట్‌ ముట్టించడం, అతను దర్జాగా పచార్లు చేస్తూ సిగరెట్‌ కాల్చడం వంటి సీన్‌ చూడడం నాకు అలవాటైపోయింది. అప్పుడప్పుడూ అతనికి కాఫీయో, టీయో అందిస్తుంటే, అతను విలాసంగా తాగుతూ పచార్లు చేస్తుంటే, దారిన వెళ్ళేవాళ్ళు వంగి వంగి దణ్ణాలు పెడుతున్నప్పుడూ పోలీసులు చాలా గౌరవంగా సెల్యూట్‌ చేస్తున్నప్పుడూ ‘అబ్బా, ఇతనిదెంత గొప్ప ఉద్యోగం... నేను కూడా పెద్దయ్యాక పోలీస్‌ ఆఫీసర్ని అవుతాను’ అనుకునేవాడిని.
ఇలా ఆలోచిస్తుండగా చల్లగాలి నన్ను తాకింది. ఇదేమీ నాకు కొత్త కాదు. మా ఇంట్లోకి రాదుగానీ, ఇంటి నుంచి బయటకొస్తే మాత్రం గాలి ఎప్పుడూ వీస్తూనే ఉంటుంది. కానీ ఈసారి గాలి నన్ను తాకినప్పుడు చాలా విచిత్రమనిపించింది. నన్ను తాకిన గాలి, అంత విసురుగా లేకపోయినా, దాని తాకిడికి నేను పైకి తేలిపోతున్నట్లు అనిపించింది. అనిపించడమేమిటి... నిజంగానే తేలిపోతూ, అలా అలా ఇన్‌స్పెక్టర్‌ దగ్గరదాకా వెళ్ళిపోయాను. అయితే, అతను నన్ను గమనించలేదనుకుంటా... సీరియస్‌గా సిగరెట్‌ కాల్చడంలో మునిగిపోయాడు. ఇంకాస్త దగ్గరకు పోయినా, అతనిలో చలనం లేదు. అంత దగ్గరగా అతన్ని చూడటం నాకదే మొదటిసారి. దగ్గర్నుంచి చూస్తే పెద్ద సినిమా విలన్‌లా కనిపించాడు- నేనొక హీరోలా ఆరాధించే దేవరాజ్‌. అతనికి ఇంకా దగ్గరయి మీద పడిపోతున్నాను ఇప్పుడు. గాలి నన్ను తోసేస్తోంది. దేవరాజ్‌ నన్ను కొట్టేస్తాడేమోనని విపరీతంగా భయపడిపోయాను.
ఆశ్చర్యం! నేను అతనిమీద పడిపోయినా అతనిలో ఏ చలనమూ లేదు. ఏమీ జరగనట్లే తన పనిలో తానున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదుగానీ, ఎవరో జాగ్రత్తగా దించినట్లు మెల్లగా కిందకు దిగాను.
ఏం జరుగుతుందో నాకేమీ అర్థంకావడం లేదు. భయం భయంగా అటూ ఇటూ చూశాను. ఎవరూ కనబడలేదు. ‘నన్నెవరు - గాలిలో అలా అలా తిప్పి, నేలమీదకు దించారు? ఇది కలా నిజమా?’ అనుకుంటూ బెంబేలెత్తిపోయాను. భయంతో ఇంట్లోకి పరిగెత్తాలని ప్రయత్నించాను. ఊహూ... సాధ్యం కాలేదు. నన్నెవరో పట్టి ఆపుతున్నట్లు అనిపించింది. గింజుకున్నా అంగుళం కూడా కదలలేకపోయాను. ఏడవడం మొదలుపెట్టాను.
దేవరాజ్‌ నా పక్కనే ఉన్నాడుగానీ, నేను ఏడవడం అతనికి పట్టినట్లు లేదు. నేనక్కడున్నట్లు కూడా తెలియనట్లే ప్రవర్తిస్తున్నాడు. ‘ఏయ్‌ ఏడవకు. నీకేమీ కాదు’ అన్నారెవరో. భయం భయంగా అటూ ఇటూ చూశాను. ఎవరూ కనబడలేదు.
‘‘ఎవరు? ఎవరు?’’ అని అన్నివైపులా చూస్తూ భయంగా అరిచాను. అయినా దేవరాజ్‌లో ఏ రియాక్షనూ లేదు.
‘‘ఏయ్‌ కిరణ్‌... భయపడకు. నీకేమీ కాదని చెబుతున్నాను కదా’’ అని చిరాగ్గా అన్నారెవరో.
మాటలు వినబడుతున్నాయిగానీ, ఎవరు మాట్లాడుతున్నారో తెలియకపోవడంతో నా భయం ఇంకా పెరిగింది. మళ్ళీ గాలి నన్ను తాకింది. ఈసారి అది విసురుగా లేదు...
చల్లగా సుతారంగా హాయిగొలిపేలా ఉంది.
‘‘భయపడకు. నేను గాలిని. నీ కొత్త నేస్తాన్ని’’ అంటూ ఎవరో మెల్లగా మాట్లాడటం వినిపించింది. షాక్‌ తిన్నాను.
‘‘గాలా..!’’ అన్నాను ఆశ్చర్యంగా.
‘‘అవును గాలినే’’ అంటూ సమాధానం వచ్చింది.
‘‘గాలి మాట్లాడుతుందా? నేను నమ్మను. నువ్వు దెయ్యానివో భూతానివో లేదా ఆత్మవో అయి ఉంటావు’’ అన్నాను కొంత ధైర్యం తెచ్చుకొని. చిన్నగా నవ్వు వినిపించింది.
‘‘నేను కాదు, నువ్వే ఆత్మవి’’ అంటూ మళ్ళీ నవ్వు వినిపించింది. నాకు కోపం వచ్చింది. దాంతో కొంత ధైర్యమూ వచ్చింది.
‘‘నేను ఆత్మనేమిటి? నిక్షేపంలా బతికున్న వారినెవర్నయినా ఆత్మ అంటారా?’’ అంటూ విసుగ్గా అరిచాను.
‘‘నా మాట నమ్మవు కదా, సరే... పద’’ అంటూ గాలి నన్ను మా ఇంటివైపు తోసింది. దాంతో ఇంట్లోకి వచ్చి పడ్డాను.
ఇంట్లో అమ్మా నాన్నా ఒక మూలన కూర్చుని ఏడుస్తున్నారు. అక్కలిద్దరూ బిక్కుబిక్కుమంటూ వాళ్ళనే చూస్తున్నారు. చాలాసేపట్నుంచి ఏడుస్తున్నారు కాబోలు అందరి కళ్ళూ ఎర్రబడి, ఉబ్బిపోయి ఉన్నాయి. పిన్నీ, బాబాయీ అమ్మా నాన్నలను ఓదారుస్తున్నారు. అమ్మ కాస్త తేరుకుందిగానీ, నాన్న అలా ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళెందుకు ఏడుస్తున్నారో అర్థంకాలేదు. అలా తికమకపడుతుండగా నా దృష్టి వాళ్ళ పక్కనే ఉన్న ఒక స్టూల్‌పై పడింది. దానిమీద దండ వేసిన నా ఫొటో ఉంది. షాక్‌తో నా బుర్ర గిర్రున తిరిగింది.
‘మై గాడ్‌... నేను చచ్చిపోయానా?’ అని మనసులో అనుకుంటున్న మాటలు తెలిసిపోయినట్లున్నాయి. గాలి మళ్ళీ మాట్లాడింది.
‘‘నేను చెబితే నమ్మలేదు కదా... ఇప్పుడు ఒప్పుకుంటావా నువ్వే ఆత్మవని?’’ అంటూ ప్రశ్నించింది.
‘‘ఒప్పుకుంటాను. మరి నేను ఎలా చనిపోయాను... నీకేమైనా తెలుసా?’’ అని అడిగాను ఏడుస్తూ.
‘‘ఓ... నీకు గుర్తులేదా? నిన్న నీ స్నేహితులతో స్విమ్మింగ్‌పూల్‌కి వెళ్ళావు కదా... వాళ్ళు నీకు ఈత నేర్పుదామని ప్రయత్నిస్తుండగా, నువ్వు నీటిలో మునిగి చనిపోయావు’’ అని అంటుంటే, నాకు ఆ సంఘటన గుర్తువచ్చింది. నీటిలో మునిగిపోతూ ఊపిరి ఆడక కొట్టుకోవడం వరకూ గుర్తుంది.
ఆ తర్వాత ఏమైందో ఇప్పుడే తెలిసింది.
‘అయ్యో, పదేళ్ళకే నాకు నూరేళ్ళు నిండిపోయాయా?’ అనుకుంటూ బాధపడ్డాను.

గొప్పవాడు

ఆపకుండా ఏడుస్తున్న నాన్నను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. ‘నాన్నకు నా మీద ఇంత ప్రేముందా?’ ఇది నేనెన్నడూ ఊహించని విషయం. ‘స్ట్రిక్ట్‌ మిలటరీ డిసిప్లిన్‌తో హిట్లర్‌లా ఉండే మా నాన్నేనా ఇలా చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నది?’ అనుకోగానే నా మనసెంతో విలవిలలాడింది. నాకు ఊహ తెలిసి నాన్నెప్పుడూ నాతోగానీ అక్కలతోగానీ అమ్మతోగానీ ప్రేమగా మాట్లాడటం చూడలేదు. ఆయన ప్రేమనంతా మనసులోనే దాచేసుకుంటున్నారని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇన్నాళ్లూ నాన్నను అపార్థం చేసుకున్నందుకు చాలా బాధపడ్డాను. ‘ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం?’ అనుకోగానే మనసంతా చేదుగా అయిపోయింది. నాన్నను ఓదార్చాలనీ ఆయన కన్నీరు తుడవాలనీ నేను చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. నిరాశగా వెనుదిరిగాను.
‘‘పద, అలా తిరిగొద్దాం. నీ మనసు తేలిక అవుతుంది’’ అంది నా కొత్త నేస్తం. నా ప్రమేయం ఏమీ లేకుండా గాలిలో తేలిపోయాను. ఎక్కడికెళ్తున్నామో తెలియలేదు. అడగాలని కూడా అనిపించలేదు. దాదాపు మూడు కిలోమీటర్లు ప్రయాణించి, ఒక ఇంట్లో దిగాను గాలితో. ఇల్లు కాదది... పెద్ద భవంతి.
డైరెక్ట్‌గా లోపలి హాల్లోకి వెళ్ళాం. అక్కడ దేవరాజ్‌ వినయంగా చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. అతన్నెప్పుడూ అలా చూడలేదు. అతనికి ఎదురుగా సోఫాలో కూర్చుని దర్జాగా కాళ్లు ఊపుతున్న పెద్దమనిషి ఒకడు కనిపించాడు.
‘‘ఎవరితను? దేవరాజ్‌ ఎందుకిలా పిల్లిలా అయిపోయాడు?’’ అని ప్రశ్నించాను కనబడని గాలిని. వెంటనే సమాధానం వచ్చింది.
‘‘అతని పైఅధికారి ఎస్పీ దామోదర్‌’’ అంటూ.
‘ఓహో... ఈ ఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌ కన్నా గొప్పవాడన్నమాట’ అనుకున్నాను.
‘‘అయితే, డాక్టర్‌ సంజీవ్‌ అపాయింట్‌మెంట్‌ దొరకలేదా... ఏం, అంత బిజీ డాక్టరా?
నా గురించి చెప్పలేదా?’’ అంటున్న దామోదర్‌ మాటల్లో దర్పం తొంగిచూస్తోంది.
‘‘ఆ డాక్టర్‌ ఎవరనుకుంటున్నారు...మనమంటే భయపడడానికి? ఆయన ఐజీ గారి అల్లుడు’’ అని వినయంగానే అన్నాడు. ఆ మాటలు విన్న దామోదర్‌కి బుర్ర గిర్రున తిరిగినట్లుంది.
‘‘ఐజీ అంటే చాలా పెద్ద పోలీస్‌ అధికారి’’ అని గాలి చెబితే, ‘‘ఆయన ఎస్పీకన్నా గొప్పవాడన్నమాట.
నాకు అతన్ని చూడాలని ఉంది, చూపిస్తావా?’’ అంటూ ఆశగా అడిగాను.
‘‘ఓ... దానికేం భాగ్యం?’’ అంటూ నన్ను ఎత్తుకుని పరుగు తీసింది గాలి. పావుగంట తర్వాత ఐజీ బంగళాకు వెళ్ళాం. ఇంద్రభవనంలా ఉంది ఆ బంగళా.
‘‘ఇదేమిటి... ఇక్కడ ఇన్ని కార్లున్నాయి.

గొప్పవాడు

ఐజీ ఇంట్లో ఎంతమంది ఉంటారేమిటి?’’ అని అడిగాను కుతూహలంగా.
‘‘నాకూ అదే అనుమానం వచ్చింది. ఇక్కడ ఇన్ని కార్లు ఉండే అవకాశమే లేదే, ఎందుకిన్ని కార్లున్నాయి ఇక్కడ? ఓ... ఇక్కడి కార్లలో సగం ఇన్‌కమ్‌టాక్స్‌ వాళ్ళవే. ఏదో రైడ్‌ జరుగుతున్నట్లుంది. లోపలికెళ్ళి చూద్దాం పద’’ అంది గాలి.
‘‘అదిగో అక్కడ తెల్లబట్టలేసుకుని మొహం మాడ్చుకొని ఉన్నాడే... అతనే ఐజీ ప్రకాశరావు’’ అని చెప్పగానే అటు చూశాను కుతూహలంగా.
‘‘ఇదేమిటి? ఇతను ఎస్పీకన్నా డాబుగా దర్జాగా ఉంటాడనుకున్నాను. మా స్కూల్లో అటెండర్‌కన్నా వినయంగా నిల్చున్నాడేమిటి?’’ అంటూ ఆశ్చర్యంగా అడిగాను.
‘‘నువ్వు ఊహించింది కరెక్టే. మామూలు రోజుల్లో అయితే అతని గర్వానికి అంతుండేది కాదు. ఇప్పుడు ఇన్‌కమ్‌టాక్స్‌ ఆఫీసర్ల వలలో చిక్కాడు. అక్రమంగా బోలెడు డబ్బు సంపాదించి ఇలా దొరికిపోయాడు’’ అని గాలి అంటుండగా, ఎవరూ చూడకుండా ఐజీ, కమిషనర్‌ కాళ్ళమీదపడి బతిమాలుతున్నాడు.
‘ఓర్నీ... ఐజీయే గొప్పవాడనుకుంటే, ఈ కమిషనర్‌ ఇంకా గొప్పవాడన్నమాట’ అనుకున్నాను.
ఐజీ ఎంత బతిమాలినా ఫలితం లేదు. చకచకా పని పూర్తిచేసుకుని బయల్దేరాడు కమిషనర్‌. గాలి నన్ను కమిషనర్‌ కార్లో కూర్చోబెట్టింది. ఎందుకని నేను అడగలేదు. నాకు పనేమీలేదు కదా, ఇదొక కాలక్షేపంలా ఉంది.
ఊహించని విధంగా మేము కమిషనర్‌తోపాటు సీఎం ఛాంబర్‌లోకి ప్రవేశించాం. కమిషనర్‌కి ముఖ్యమంత్రి దగ్గర బాగా పరపతి ఉన్నట్లుంది.
ఏ అడ్డూ లేకుండా అతను సీఎంను తొందరగానే కలవగలిగాడు.
‘‘సో... మీ మొదటి అడుగే జయప్రదం అయిందన్నమాట. కంగ్రాచ్యులేషన్స్‌. నల్లడబ్బు బాగా దొరికినట్లుంది? ప్రకాశరావు ఎంత నీతిపరుడిలా నటించేవాడు! ఈ రోజుల్లో ఎవరినీ నమ్మలేం. ఇదే స్ఫూర్తితో ముందుకు దూసుకుపోండి. ఇంకా పెద్ద అవినీతి తిమింగలాలను పట్టాలి మనం’’ అని సీఎం ప్రశంసిస్తుంటే కమిషనర్‌ వినయంగా నమస్కరిస్తున్నాడు థాంక్స్‌ చెబుతూ.
‘సీఎం అందరికన్నా గొప్పవాడన్నమాట’ అనుకున్నాను. సీఎం, కమిషనర్‌ ఏవో విషయాలు మాట్లాడుకుంటుంటే ‘ఇక బయల్దేరుదాం’ అని గాలితో చెబుదామనే లోపల ‘‘ఏమైంది? నిన్న పార్వతీశం మాస్టారు రాలేదా? ఆయనెప్పుడూ మానేయలేదు కదా? ఏమైందో కనుక్కున్నారా?’’ అంటూ సీఎం అడుగుతుంటే కంగుతిన్నాను. మా నాన్న పేరు కూడా పార్వతీశమే.
‘‘వాళ్ళ అబ్బాయి ఈతకని వెళ్ళి ప్రమాదవశాత్తూ చనిపోయాడట. అందుకే...’’ సెక్రటరీ ఆ వాక్యం పూర్తిచేయకుండానే ‘‘వ్వాట్‌?’’
అంటూ అప్రయత్నంగా పైకి లేచాడు సీఎం. దాంతో కమిషనర్‌ కూడా గాభరాపడుతూ లేచినిలబడి, ‘‘ఎవరు సార్‌, ఈ మాస్టారు?’’
అని అడిగాడు కుతూహలంగా.
‘‘పార్వతీశం గారు నాకు చదువు చెప్పిన రామేశం మాస్టారి అబ్బాయి. ఆ మాస్టారివల్లే నేను బాగా చదువుకుని ఈ స్థాయి కొచ్చాను. మా అబ్బాయి ‘హరి’ చదువులో వెనకబడితే ఎంత మంచి టీచర్లతో కోచింగ్‌ ఇప్పించినా ఫలితం లేకపోయింది. పార్వతీశం మాస్టారి పాఠాలు మాత్రం వాడి బుర్రకెక్కాయి. ఆయన ఎంత గొప్పవాడంటే... ఏనాడూ... ప్రతిఫలంగా నా దగ్గరనుంచి నయా పైసా తీసుకోలేదు. ఏరోజూ నా పరపతిని వాడుకోలేదు. ‘అన్ని దానాలకన్నా విద్యాదానం గొప్పది. విద్యను అమ్ముకోకూడదు’ అనేవారు. తను నా కొడుక్కి ట్యూషన్‌ చెబుతున్నట్లు కనీసం తన భార్యకు కూడా చెప్పకుండా దాచారు. ఆ విషయం తెలిస్తే ఆమెగానీ ఆమె బంధువులుగానీ నా పరపతిని వాడుకుంటారేమోనని ఆయన భయం. సెక్రటరీ గారూ... పదండి మనం వెంటనే మాస్టారింటికి వెళ్ళాలి’’ అంటూ హడావిడి పడుతుంటే, నాకు ఏడుపు ఆగలేదు. పశ్చాత్తాపంతో నేను కుమిలి కుమిలి ఏడుస్తుంటే, గాలి నన్ను ఓదార్చినట్లు, నా చుట్టూ అలుముకుంది.
‘‘నీకు ఈ విషయం తెలియాలనే ఇంత వరకూ తీసుకొచ్చాను. నీకిప్పుడు అర్థమైంది కదా, గొప్పవారెవరో? ఇంతకాలం నీకు మీ నాన్న గొప్పతనం తెలియలేదు కదా. నీ తెలివితేటలకు ఇన్నాళ్ళూ గర్వపడుతున్నావు కదా- అవి నీకు ఎలా వచ్చాయి? మీ నాన్న జీన్స్‌ నుంచీ మీ నాన్న నీకు చెప్పిన చదువునుంచీ ఆయన నీకిచ్చిన ట్రైనింగ్‌ నుంచీ... కాదంటావా?’’ అని అడిగితే ఏడుస్తూ తలూపాను.
‘‘బహుశా, మీ నాన్న గొప్పతనం నువ్వు తెలుసుకోవడానికే దేముడు నిన్ను ఇంతవరకూ ఆత్మగా ఉంచాడు. ఆ పని అయిపోయింది కదా, నువ్విప్పుడు శాశ్వతంగా విశ్వంలో కలిసిపోతావు. త్వరలోనే మరో జన్మ ఎత్తుతావు. మరి, వచ్చే జన్మలో ఏమవ్వాలని కోరుకుంటావు?’’ అని అడగ్గానే, క్షణం కూడా ఆలోచించకుండా ‘‘టీచర్‌’’ అన్నాను.

(వృత్తే దైవంగా భావించే ఉపాధ్యాయులందరికీ ఈ కథ అంకితం)

Source - Whatsapp Message

No comments:

Post a Comment