Wednesday, September 8, 2021

మానవ జీవిత పరమార్థం ఏంటంటే..

⚛⚛⚛⚛⚛⚛

🌸మానవ జీవిత పరమార్థం ఏంటంటే..🌸

🌺బాలస్తావత్‌ క్రీడాసక్తః
తరుణస్తావత్‌ తరుణీ సక్తః
వృద్ధస్తావత్‌ చింతాసక్తః
పరమే బ్రహ్మణి కో పినసక్తః🌺

ఈ దేహాన్ని గురించి, దాని యదార్థ తత్వాన్ని గురించి తెలుసుకోలేని సామాన్యులు జీవితాన్ని ఎలా గడిపి వ్యర్థం చేసుకుంటున్నారో ఆది శంకరులు తెలిపిన శ్లోకమిది. ‘మోహముద్గరం’గా పేరొందిన 31 శ్లోకాల ‘భజగోవిందం’లోని ఏడో శ్లోకం. మానవుడు.. బాల్యంలో ఆటపాటల మీద ఆసక్తితో ఉంటాడు. యౌవనంలో స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. వృద్ధాప్యంలో చింతలతో సతమతమౌతుంటాడు. అంతే తప్ప.. పరమోత్కృష్టమైన మానవ జన్మ లభించినా ఆ పరమాత్మ యందు ఆసక్తి చూపేవారెవరూ ఉండరుగదా అని దీని అర్థం. జీవుడు అనేక దేహాలను ధరిస్తూ, వదులుతూ ప్రయాణం చేస్తుంటాడు.

ఈ క్రమంలో మానవదేహం వచ్చినప్పుడు దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. మానవ జన్మ వచ్చినప్పుడు.. బుద్ధి ఉంటుంది. దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. అంటే బుద్ధిని భగవంతుని వైపునకు తిప్పాలి. అలా తిప్పకపోతే మానవ జీవితం వచ్చి కూడా.. సంపాదించుకోవడం, తినడం, నిద్రపోవడం, పిల్లలను కనడం, వారిని పోషించడం, కూడబెట్టడం, అనుభవించడం అనే కార్యాలలోనే మునిగిపోయి జంతువులాగా జీవిస్తే జీవితం వ్యర్థమవుతుంది. ఫలితంగా ఆ మనిషి ఇంకా అనేక జన్మలు ఎత్తాల్సి ఉంటుంది.

అయినా మానవుడు ఇహంలో ఉన్న అల్ప విషయాల్లోనే ఆనందాన్ని వెతుక్కుంటూ దుఃఖాలతో కూడిన తాత్కాలిక సుఖాలనిచ్చే విషయ వస్తువుల్లోనే సుఖాన్ని వెతుక్కుంటూ, నరక సదృశంగా ఉండే సంసార దుఃఖ సాగరంలోనే స్వర్గాన్ని వెతుక్కుంటూ అజ్ఞానంలోనే జీవితాన్ని గడుపుతున్నాడు. వీటన్నింటినీ మించిన శాశ్వత ఆనందం ఒకటి ఉన్నదని.. అది తనలోనే ఉన్నదని, అది అసలు తన స్వరూపమేనని తెలుసుకోలేక అజ్ఞానంతో జీవితమంతా పరుగులు పెడుతున్నాడు. ఇలా పరుగులు పెట్టే మానవుడి జీవితకాలం బాల్య, యవ్వన, వార్ధక్యాల్లో ఎలా వృథాగా గడిచిపోతుందో శంకరాచార్యులవారు ఈ శ్లోకం ద్వారా తెలిపారు.

జీవితమంతా ఇలా గడిచిపోతుంటే ఇక జీవితపరమార్థమైన మోక్షాన్ని అందుకోవడానికి కృషి చేసేదెప్పుడు? పరమాత్మను చేరుకునేదెప్పుడు? లౌకిక విషయాలకే పరిమితమైపోతే పారమార్థిక విషయాలకు చోటెక్కడ? మనిషిగా పుట్టినందుకు, భగవంతుడు వివేకాన్ని ఇచ్చినందుకు సాధించవలసింది ఇదేనా? కానే కాదు. బుద్ధిని పరమాత్మ వైపునకు మళ్లించి ఆయనపై ప్రేమానురాగాలు చూపించి ఆయనను స్మరిస్తూ కడకు ఆయన్ను అందుకోవడమే మానవ జీవిత పరమార్థం. అందుకే మనకు మానవ జన్మ లభించింది. పరమాత్మను అందుకుంటున్నామంటే దుఃఖాలతో, బాధలతో కూడిన ఈ సంసార జనన మరణ చక్రం నుండి తప్పించుకొని మనను మనం ఉద్ధరించుకొంటున్నామన్నమాట.

సర్వే జన సుఖినో భవంతు.

Source - Whatsapp Message

No comments:

Post a Comment