Friday, September 17, 2021

మనల్ని కని పెంచిన తల్లి దండ్రుల గురించి...

✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

👌మనల్ని కని పెంచిన తల్లి దండ్రుల గురించి ఎన్నో మార్లు ఎన్నో కథనాలను వ్రాసాను కానీ ఎంత రాసినా ఏమి రాసినా ఒక్కొక్క సంఘటనను చూసి నప్పుడల్లా గుండె తరుక్కు పోతుంది. మొన్న ఈమధ్య ఒక బంధువు ఇంటికి వెళ్లి నప్పుడు నాకు కనిపించిన ఒక సంఘటన నన్ను కలచి వేసింది. అది మీ ముందుకు తీసుకు వస్తున్నాను ఒకసారి సావధానంగా చదవాలని కోరుకుంటూ..👌

ఈమధ్య మా అమ్మాయి పెళ్ళి కుదిరింది. అందులో భాగంగా నిశ్చితార్థం కార్యక్రమాన్ని జరిపిస్తూ తెలిసిన బంధువులను, స్నేహితులను పిలిచే క్రమంలో మా నాన్నగారి ఒక పాత శిష్యుడు ఒకాయనను పిలవడానికి వారింటికి వెళ్ళాను. బైక్ ఆపి గేటు ముందుకు వెళ్ళగానే ఒక బోర్డు పెట్టిఉంది. అది చదివేలోపే భౌ భౌ మంటూ భయంకరంగా అరుస్తూ ఒక పెద్ద కుక్క అమాంతం నా పైన దుమికి నట్లుగా వచ్చి గేటు అవతల నుండి చెవులు చిల్లులు పడేలా ఒకటే అరుస్తూ ఉంది. ఇంతలో ఒక అబ్బాయి పరుగు పరుగున వచ్చి ఏయ్ టైగర్ మన అంకులేరా అంటూ దాని మెడకు ఉన్న ఖరీదైన బెల్టును పట్టుకొని లోపలికి లాక్కెల్లాడు. గేటు తీసుకుని కాంపౌండ్ లోకి ఎంటర్ అయిన నాకు ఒక మూల సిమెంట్ బ్రిక్స్ తో కట్టుబడి ఉన్న ఒక షెడ్డు కనిపించింది. అది ఆ కుక్కని ఉంచడం కోసం కట్టించారేమో అనుకుంటూ హాల్లో కి ఎంటర్ అయ్యాను.

నాకు ఆ అబ్బాయి ఖరీదైన సోఫాను చూపించి మీరు కూర్చోండి, నాన్నగారిని పిలుస్తాను అంటూ కుక్కని ఎదురుగా ఉన్న బెడ్రూంలోకి లాక్కొని వెళ్ళాడు. ఆ రూమ్ తలుపు తెరుచు కోగానే అందులో నుండి సుగంధ పరిమళాలను వెదజల్లుతూ ఉన్న ఫారిన్ రూం స్ప్రే వాసనలు నా ముక్కు పుటాలను తాకాయి. హిమాలయ పర్వతాల నుండి వెలువడినట్లుగా ఉన్న ఏసీ హిమ వాయువులు నా శరీరాన్ని తాకుతూ హలో అంటూ నన్ను పలకరించాయి. బెడ్రూం చాలా ఖరీదైన వస్తువులతో అలంకరించ బడిఉంది. ఖరీదైన పరుపు పైన ఒక అమ్మాయి పడుకుని వుంది. ఆ కుక్క వెళ్లి ఆ అమ్మాయి పైన పడి దొర్లుతూ, పొర్లుతూ ఆ అమ్మాయి ముఖాన్ని మొత్తంగా నాకడం మొదలు పెట్టింది. ఆ అమ్మాయి అదేదో ఫేస్ మసాజ్ జరుగు తున్నట్లుగా భావిస్తూ తన్మయత్వంతో మురిసి పోతున్నది.

ఊర్లో ఉన్న పాత ఇల్లును అమ్మేసి ఈమధ్యనే కొత్తగా ఈ భవనాన్ని కట్టు కొన్నారు. అన్ని రకాల హంగులతో చాలా రిచ్ గా ఉంది. ఇంతలా ఎందుకు వర్ణిస్తున్నాను అంటే దానికి కారణం ఉంది. ఇంతలో మా నాన్నగారి శిష్యుడి కొడుకు ఎంతో హుందాగా గంభీరంగా స్టెప్స్ దిగుతూ ఏం బ్రదర్ బావున్నారా అంటూ వచ్చి నా ఎదురుగా సోఫాలో కూర్చుని.. టైగర్ అని కేకేశాడు. అంతే అంత పెద్ద కుక్క వచ్చి అతడి పైనెక్కి వడిలో కూర్చుని అతడి ముఖాన్ని, అతడి బట్టతలను నాకడం మొదలు పెట్టింది. ఏంటి బ్రదర్ గృహ ప్రవేశానికి రాలేదు అంటూనే ఏంటి విషయం అని అడిగాడు. విషయం చెప్పి మీ నాన్న గారిని, అమ్మగారిని పిలవండి అన్నాను. అతడు వెంటనే ముఖం తిప్పుకుని అసహ్యించుకుంటూ అదిగో ఆ బైట షెడ్డులో ఉన్నారు అంటూ లేచి లోపలికి వెళ్ళాడు.

అతడి భార్య ఖరీదైన నైటీలో, ఖరీదైన చెప్పులు వేసుకుని ఖరీదైన కప్పులో కాఫీ తీసుకొని బావున్నారా అంటూ కాఫీ అందించి వెళ్లి పోయింది. కప్పు పక్కన పెట్టేసి వెంటనే బయటకు వెళ్లి ఆ షెడ్డులోకి వెళ్లి చూడగా నా మనసు వికలమై పోయింది. కుక్కి పోయిన పాత నులక మంచంలో బక్కచిక్కి పోయి ఇరుక్కుపోయి నట్లుగా పడుకొని ఉన్నాడు ఆయన. ఆయనకు ఆయన భార్య కట్టెల పొయ్యి మీద గంజి కాచి ఆయన నోటికి అందించి తాగిస్తున్నది. ఆ షెడ్డులో ఒక మూల పొయ్యి, ఒక మూల జాలాడి ఒక మూల ఒక పాత ట్రంకు పెట్టె ఉన్నాయి. నన్ను చూసి ఆయన ఆనందంతో నవ్వుతూ లేవబోయాడు, నేను వారించి ఆమెతో అమ్మా ఏమిటి ఇదంతా ఏం జరిగింది అని అడిగాను.

ఆ ఇద్దరూ కన్నీళ్ళ పర్యంతం అవుతూ మా పేర్లతో ఉన్న ఆస్తులు పొలాలు, ఇల్లు, షాపు మొత్తం వాడు రాయించుకొని పొలము, పాత ఇల్లును అమ్మగా వచ్చిన కోట్ల రూపాయలతో ఈ భవనం కట్టుకొని మమ్మల్ని ముసలి వాసన వస్తుంది అంటూ, వాళ్ళు పెంచుకొనే కుక్కకు ఇస్తున్న విలువను కూడా మాకు ఇవ్వకుండా చివరకు మమ్మల్ని ఈ షెడ్డులో పడేశాడు అంటూ ఆమె ఏడుస్తూ చెబుతుంటే నాకు చెప్పలేని, పట్టరాని బాధ కలిగింది. చేసేదేమీలేక వారిని ఓదార్చి, విషయం చెప్పి బయటకు వచ్చి బండిలో వస్తూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళగా ఆయన ఊరు పక్కనే డామ్ కట్టడం వల్ల ఊరు మునిగి పోగా గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుతో మానాన్న గారి దగ్గరకు వచ్చి ఆయన సలహాతో ఇక్కడ వ్యాపారం మొదలు పెట్టాడు.

అదృష్టం కలిసి వచ్చి బాగా లాభాలు రాగా ఇల్లు, షాపు, పొలాలు కొన్నాడు. ఒక్కగానొక్క కొడుకును పువ్వుల్లో పెట్టుకుని, కాలు కింద పెడితే కందిపోతుందని నెత్తిన పెట్టుకొని ఎంతో అపురూపంగా పెంచారు. ఇప్పుడు అతగాడేమో మొత్తం ఆస్తి పాస్తులను స్వాధీనం చేసుకుని అపురూపంగా చూసుకో వలసిన తల్లిదండ్రులను చివరకు కాలితో తన్ని కుక్కలను ఉంచే షెడ్డులో పడవేసాడు. నెత్తిన పెట్టుకొని చూసుకో వలసిన తల్లిదండ్రుల స్థానంలో లక్షలు పెట్టి కొన్న 'కుక్కను ' నెత్తిన పెట్టుకొని దానితో నాకిచ్చుకొంటూ, తిరిగి దానికి నెలకు వేల రూపాయలను దానికి పెట్టే బిస్కెట్ల కోసం, మాసం కోసం, మందుల కోసం డబ్బులు ఖర్చు చేస్తూ, ఆ కుక్కకు ఇస్తున్న విలువను కూడా తనను కన్న తల్లిదండ్రులకు ఇవ్వకుండా వారిని నిర్లక్ష్యం చేస్తున్నాడు.

చూశారా మిత్రులారా! తల్లిదండ్రులు మన కోసం మన సంతోషాల కోసం వారి జీవితాలనే దారపోసి మనల్ని పెంచి ప్రయోజకులని చేస్తారు. మనం కూడా చిన్నతనంలో అమ్మ, నాన్నలతో ఎంతో సరదాగా మన జీవితాన్ని గడుపు తాము. నవమాసాలు మోసి మనల్ని కన్న తల్లిని, మనల్ని పెంచి విద్యాబుద్ధులు నేర్పి మన జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపెట్టిన తండ్రిని మనం ఎలా చూసుకోవాలి. వారిని ఎంతో ప్రేమించాలి, ఎంతగానో గౌరవించాలి, మరెంతగానో సేవించాలి, వారిని భగవంతుడి ప్రతిరూపాలుగా భావించి ఆరాధించాలి.. కానీ అలాంటి వారిని మరచి, వృద్ధాప్యంలో వారిని దూరంగా పెడుతూ ఎంతో బాధపెడు తున్నారు. నిన్నమొన్నటి దాక మనం ప్రేమించిన గౌరవించిన తల్లిదండ్రుల ఉనికినే గుర్తించలేక పోవడం మన ఎదురుగా ఉన్నా లేనట్టు ప్రవర్తించడం వంటి ఆ నిర్లక్ష్యమే మన పెద్దలను బాధిస్తుంది వారిని కుంగదిస్తుంది. తల్లిదండ్రులు ఎన్నడూ మనల్ని భారం అనుకోరు, మరి మనం వారిని, వారి వృద్ధాప్యంలో మనకు వారు భారం అని ఎందుకు అనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి.

మన తల్లిదండ్రులు మనల్ని తమకు రాచ మర్యాదలు చేయాలని ఆశించడంలేదు. వారు విలాస వంతమైన, వైభోగ వంతమైన జీవితాన్ని మననుండి కోరుకోవడం లేదు. అమ్మా, నాన్న అంటూ ప్రేమగా పలకరిస్తే అదే తమకు భోగవంతమైన భాగ్యమని అనుకుంటారు. ఉదయాన్నే చిరునవ్వల గుడ్ మార్నింగ్, మధ్యానం భోజనం చేసారా అన్న ఒక చిన్న పలకరింపు, నీరసంగా కనిపిస్తే ఆరోగ్యం ఎలా ఉంది అన్న ఒకే ఒక చిన్న పరామర్శ చేస్తూ ఉంటే, అదే వారికి కొండంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలా వారికి ఎలాంటి డబ్బు ఖర్చు చేయవలసి అవసరం లేని రవ్వంత ప్రేమని అందివ్వండి. దానితో వారిలోని అభద్రతా భావం తొలగిపోతుంది. అలా వారిలోని ఒంటరి తనాన్ని దూరం చేయండి. వారి మనసుల్లో మమకారం నింపాలి కానీ ఎందుకు బతికి ఉన్నామా అనే భావన మాత్రం వారి మనసుల్లోకి రానివ్వకండి.

వృద్ధాప్యంలో తల్లిదండ్రులు మనకి పిల్లల లాంటి వారు, వారిని మనం అనుక్షణం కంటికి రెప్పలా కాపాడు కొంటూ ఉండాలి. మనం.. మనం కన్న మన పిల్లల సుఖసంతోషాల కోసం మనల్ని నెత్తిన పెట్టుకొని పెంచిన మన పెద్దల్ని మరవడం ఎంత వరకు భావ్యమో, అది ఎంత వరకు న్యాయమో ఒకసారి ఆలోచించండి. మన ఉన్నతికి, అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన వారి కోసం మనం ఏం చేయాలో, ఏం చేయగలమో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ! మనల్ని కనీ పెంచి పెద్ద చేసి మనల్ని ఇంత ఉన్నత స్థాయికి చేర్చిన ఆ దేవతా మూర్తులైన మన తల్లిదండ్రుల గురించి మీరు తప్పకుండా ఉన్నతంగా ఆలోచిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ.. శుభం భూయాత్..👌

🤘లోకాసమస్తా సుఖినోభవన్తు🤘

🤘సర్వే జనా సుఖినోభవంతు🤘

👌ధర్మో రక్షతి రక్షతః 👌

For Every Action Equal &
Opposite Reaction

రామభక్త గురూజీ ప్రొద్దుటూరు
సెల్ - 8328170075.

Source - Whatsapp Message

No comments:

Post a Comment