అమ్మ మనసు వెన్న
రచన
కాలనాధభట్టవీరభద్రశాస్త్రి
హ్యూస్టన్ ..అమెరికా
** ** **
రెండేళ్ళ బాబు మారాం చేస్తున్నాడని తల్లి ఆయ్ అని గదమాయించింది. ఈసారి బాబు ఏడవడం మొదలుపెట్టాడు. నోరుమూస్తావాలేదా అని తల్లి మళ్ళీ గదిమింది. ఉహు! భాబు స్వరం హెచ్చించాడు. వళ్ళుమండింది తల్లికి. బాబు వీపుమీద ఒక్కటేసింది. దాంతో బాబు వెక్కెక్కి ఏడవసాగాడు. సోఫాలో కూర్చుని పేపరు చదువుతున్నాడు తండ్రి. పక్కనే ఆరేళ్ళ కొడుకు లెఖ్ఖలు చేసుకుంటున్నాడు. ఆ దృశ్యం చూసిన తల్లి కోపం ఆపుకోలేకపోయింది.
"ఇవతల వంట పనిలో సతమత అవుతున్నా. ఆ చంటాడుని పట్టించుకోవచ్చుగా అలా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోపోతే" అని మొగుడిమీద గయ్ మంది.
పేపరు మడిచి సోఫాలో పడేసి ఆరేళ్ళ పెద్ద కొడుకును పట్టుకొని కితకితలు పెట్టసాగాడు తండ్రి.
వాడు మెలికలు తిరిగిపోతూ పకపకా నవ్వుతున్నాడు. "నవ్వు ఆపుతావా లేదా" అంటూ ఇంకా కితకితలు పెట్టాడు తండ్రి.
"బాగుంది వరస! కితకితకలు పెట్తే నవ్వక ఏడుస్తాడా?" అని కసిరినట్టు అంది తల్లి.
"అవునుసుమా! నాకూ అదే అర్థం కావడంలేదు. నవ్వొద్దురా అని కితకితలు పెట్టినా ఈ వెధవ నవ్వడం మానలేదు. ఏడవొద్దని నువ్వు కొట్టినా చంటాడు ఏడుపు మానలేదు. ఏమిటో ఈవిచిత్రం"
అంటూ బాబు దగ్గరకి వెళ్ళి ఎత్తుకొని "నా బాబువి కదూ ఏడవకమ్మా! ఏం కావాలి" అని అడిగేసరికి బాబు వెక్కుతూనే "నాకు .... నాకు ...." అంటుండగా
"ఆగు, ముందు అమ్మ దగ్గరకు వెళ్ళి ముద్దు ఇచ్చిరా. ఆ తర్వాత నువ్వేంచెప్పినా వింటా" అన్నాడు తండ్రి .
బాబు తండ్రి చంక దిగి కూర తరుగుతున్న తల్లిదగ్గరకు వెళ్ళి తల్లిమొహంలోకి బెరుకుగా చూస్తూ బుగ్గమీద ముద్దు పెట్టాడు. ఆ తల్లి మనసు కరిగిపోయింది. బాబుని గుండెలకు హత్తుకొని "నా చేతులు విరిగిపోను! నిన్ను కొట్టానా నాన్నా!" అని ఈ బుగ్గమీద ఆ బుగ్గమీద ముద్దులవర్షం కురిపించింది.
భాబు తల్లి మెడ గట్టిగా వాటేసుకున్నాడు.
అవును గదమాయించినా లాలించినా...
అమ్మ అమ్మే
అమ్మ మనసు వెన్నే
** ** **
No comments:
Post a Comment