*భక్తి, శరణాగతి ముఖ్యం!*
➖➖➖✍️
```
ఒక్కోసారి మనకు అర్ధం పర్దం లేని ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయ్.
పూజానియమాలు తెల్సుకోవడం మంచిదే, పూజలో దొర్లుతున్న తప్పులను సవరించుకోవడం మంచిదే కాని వాటికోసం పూజనే మానివేయడం తప్పు.
దేవుడు ఎంత కారుణ్య మూర్తో చూడండి...
భక్తకన్నప్ప పెట్టిన నైవేద్యం ఏమిటి..? జింక మాంసం..!
ఆయన భక్తితో పెట్టిన నైవేద్యం కాబట్టి దేవుడు స్వీకరించాడు. కాని దేవుడు “ఛీ నీచుడా...! నీకు ఏమి నైవేద్యంగా పెట్టాలో తెలియదు. నువ్వు స్నానం చేసావా ముందు. విభూది కూడా పెట్టుకోలేదు దూరం జరుగు!” అనలేదు.
పరమ సంతోషంతో స్వీకరించాడు.
ఇక్కడ అర్ధం చేస్కోవాల్సింది అందర్నీ జింక మాంసం పెట్టమని కాదు శివుడికి జింక మాంసం ఇష్టం అని కాదు.
నువ్వు భక్తితో ఏది పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడు అనేది గ్రహించండి.
గజేంద్రమోక్షం లో గజ రాజు ప్రాణం పోతున్న సమయంలో స్వామి వారిని పిలిస్తే వైకుంఠం నుండి పరుగెత్తుకుని మరీ వచ్చాడు.
పైగా తను నిత్యం ధరించే శంఖు చక్రాలను కూడా ధరించకుండా లక్ష్మిదేవికి కూడా చెప్పకుండా వచ్చి రక్షించాడు.
అంతే కాని ‘నీ చిన్నప్పటి నుంచి ఒకసారి కూడా పూజ చేయలేదు. ఈ ఆపద వేళలో మాత్రమే నీకు గుర్తుకు వచ్చానా.. నీ చావు నువ్వు చావు’ అనలేదు.
ఆపదలో ఉన్నవాణ్ణి ఆర్తితో పిలిచినవాడిని, నీవుదప్ప వేరెవరూ లేరని సంపూర్ణ శరణాగతుడవైతే అప్పుడు శ్రీహరి నిన్ను కాపాడటానికి ఏ రూపంలో ఐనా సరే, ఏ సమయంలో నైనా సరే వచ్చి కాపాడతాడు, అదే ఆయన నైజం.
*** *** ***
ద్రౌపతి వస్త్రాపహారణ వేళ నిండు సభలో రక్షించు వారెవరూ లేనప్పుడు ఇతరులెవ్వరు తనకు అండలేనప్పుడు ‘అన్నా శ్రీ కృష్ణా!’ అంటే వెంటనే వచ్చి వస్త్రాలు ఇచ్చి రక్షించాలేదా...?
తరువాత వస్తాను. అప్పటివరకు నన్ను తలచకు అని చెప్పలేదే. భక్తితో… “స్వామీ నీవే తప్ప నన్ను రక్షించేది ఎవరు” అని శరణు వేడితే తప్పకుండా ఏదో ఒక రూపం లో స్వామి పలుకుతాడు. ఇక్కడ మనకు కావలసింది సంపూర్ణ భక్తి మాత్రమే...!
పూజ చేసేటప్పుడు ఎన్ని వత్తులు వెయ్యాలి.. అవి ఏ దిక్కుకు తిప్పాలి. ఏ నూనెతో వెలిగించాలి అంటూ పూజ ప్రారంభంలోనే సవాలక్ష ప్రశ్నలతో మొదటిలోనే ఆగిపోతే,
ఎప్పుడు ప్రార్థించాలి, ఎప్పుడు శరణాగతుడవు కావాలి, అందుకే ఎప్పుడైనా ఒక్కటే గుర్తు పెట్టుకో.. స్వామికి కావాల్సింది భక్తి తప్ప హంగులూ ఆర్భాటాలు కావు.
ఏదైనా పూజలోనో వేరే ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు తప్పులు దొర్లితే “స్వామీ ఏదైనా తెలియక తప్పు చేస్తే క్షమించు తండ్రి!” అంటే ఆయన చిరునవ్వుతో మన్నిస్తాడు.
తెలిసి కూడా తప్పుచేసి దాచేద్దాం అనుకుంటూ చేసే పనులు మాత్రం చేయకూడదు, ఎందుకంటే సర్వవ్యాపితుడైన అతని ముందు ఏదీ దాయటం కుదరదు గాక కుదరదు.✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment