Tuesday, July 1, 2025

 *సొంతం... సొమ్ము... స్వామీ...*

*పరమాత్మని చేరుకోవడమే యోగం. ఇది ప్రతివారు అవగాహన ఉన్నా, లేకున్నా అనే మాట. అనుకునే మాట. జీవితానికి లక్ష్యం పరమాత్మని చేరుకోవడమే అని ఎవరైనా అంటారు. చేరుకోగలరా... చేరుకుంటారా... అనేది ప్రక్కన పెడితే... మన సంస్కృతి అలా అలవాటు చేసింది... పరమాత్మయే మనకి లక్ష్యం... ఆ లక్ష్యానికి ఎంతదూరం ఉన్నాం... అనేది తరువాత సంగతి... ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక యోగాలు ఉన్నాయి...*

*యోగము అంటే ఉపాయము. సాధన... ఇది ఒక అర్థము. యోగానికి ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. ప్రస్తుతం తీసుకోవలసిన అర్థం మాత్రం ఉపాయము. పరమాత్మని చేరుకోవడం అనేది లక్ష్యము. దానిని ఉపేయము అంటారు. దానిని చేరడానికి ఏది సాధనమో దానిని యోగము అంటారు. గీతలో పరమాత్మ అన్ని యోగాల గురించి వివరించారు.*

*ఎన్ని యోగాలు చెప్పినప్పటకీ... అవన్ని మూడు యోగాలలో వచ్చి చేరతాయి.*
1. *కర్మ యోగము.*
2. *భక్తి యోగము.*
3. *జ్ఞాన యోగము.*
*ఇది కాక మరొక యోగం చెప్పబడింది దాన్ని ధ్యానయోగం అని చెప్పుకోవచ్చు. దీనినే యోగశాస్త్రం అని ప్రత్యేకంగా అధ్యయనం చేస్తారు. అది పతంజలి అందించిన రాజయోగం అని చెప్పబడేది. దీనిని ఆత్మసంయమయోగము అనే ధ్యానయోగము క్రింద నిర్వచించుకోవాలి.*

*స్వామినాథ పరిపాలయాశుమాం... స్వామి అని అందర్ని అంటుంటాం. యోగులని మహాత్ములని స్వామీ అని పిలుస్తాం. ఎందరిని స్వామి అని పిలిచినా స్వామి శబ్దం నామకరణంగా సుబ్రహ్మణ్యుడి దగ్గరే ఉంది. ఇంకెవరకి స్వామి అని నామకరణంగా లేదు. భావపరంగా స్వామి అని అంటాం కాని స్వతసిద్ధంగా స్వామి అని సుబ్రహ్మణ్యుడికే ఉంది.*

*అమరకోశంలో అమరసింహుడు సుబ్రహ్మణ్య నామాలు చెప్తూ "దేవసేనపతిః శ్శూరః స్వామీ గజముఖానుజః" అన్నారు. కనుక ఆయనకు స్వామి, నాథ రెండు శబ్దాలు ఉన్నాయి. నాథుడు అంటే ప్రభువు. స్వం అనే భావం ఎవరిదో అతడు స్వామి. స్వం అంటే నాది. తనది అనే భావం. స్వామి అంటే ఈ ప్రపంచమంతా ఆయనదే అన్నారు. సమస్త విశ్వం ఆయనదే. దేవసేనలన్నిటికి దిక్కులేనప్పుడు మీకు నేనున్నానని తనదిగా చేసుకొని వారిని నడిపించాడు. వాళ్ళందరిని స్వం భావంతో దగ్గరకి తీసుకొన్నాడు కనుక స్వామి. ఒకరిని మనం స్వామీ అని పిలచామంటే అర్థం ఇంక నాకంటూ అహంకారం లేదు నేను నీవాడు. నువ్వే నన్ను చూసుకో... అని చెప్పడం. స్వామి అనే మాటలోనే లొంగిపోవడమ్ ఉంది.*

*అన్నమయ్య వేంకటేశ్వరుని కీర్తిసూ నీవు నా సొమ్మవు నేను నీ సొమ్మును అంటాడు. స్వం అనే భావాన్నే తెలుగులో సొమ్ము అన్నారు. దాన్నే సొంతం అంటాం. సొంతం - సొమ్ము - స్వామీ. ఆయనకి మనం సొంతమంటే అప్పుడు స్వామి అయ్యాడు. ఆయన సొమ్ము మనం అయినప్పుడు ఆయన ఇష్టానుసారం నడిపించుకొంటాడు. మనకి ఆయన సొమ్ము అంటే మన సంపద ఆయనే. సుబ్రహ్మణ్య భక్తులలో అగ్రగణ్యుడైన ముత్తుస్వామిదీక్షితులవారు స్వామినాథ పరిపాలయాశుమాం అని సుబ్రహ్మణ్యుడిని కీర్తించారు. కంచి మహాస్వామివారు కూడా స్వామి అనే శబ్దం సుబ్రహ్మణ్యుడికే వర్తిస్తుందని చెప్పారు...*

*┈━❀꧁ఓం శం శరవణభ꧂❀━┈*
         *SPIRITUAL SEEKERS*
📿🦚📿 🙏🕉️🙏 📿🦚📿

No comments:

Post a Comment