*🌹🌹🌹 కన్నప్ప నాయనార్ 🌹🌹🌹*
*పుట్టతేనియ పెరతేనె పుట్టజున్ను తొఱ్ఱతేనియ గలవందు దోచితోచి*
*కాలిదులదులనై పిండి పోలెరాలు నట్టి నింజెట్లు గలవు నీకారగింప!!68!!*
*తేనెలలో varaities. ఇవన్నీ తెస్తాం. పైగా*
*నేరేడుపండులు నెలయూటి పండులు గొండమామిడి పండ్లు దొండపండ్లు*
*బాలపండులు నెమ్మిపండులు బరివెంక పండులు జెటిముటి పండ్ల గలివె*
*పండులు దొడివెంద పండ్లు దుమ్మికిపండ్లు జానపండులు గంగరేనుపండ్లు*
*వెలగపండులు బుల్లవెలగపండులు మోవిపండ్లు నంకెన పండ్లు బలుసు పండ్లు*
*బీరపండ్లును బిచ్చుక బీరపండ్లు గొమ్మిపండ్లీత పండ్లును గొంజిపండ్లు*
*మేడి పండ్లును మొదలుగా గూడిమాడి చెంచెతలు దెత్తురిత్తు విచ్చేయుమయ్య!!69!!*
*రకరకాల పండ్లు పెడతాం. అసలు ఎవరూ లేకపోతే ఏం తోస్తుందయ్యా. మన వికారాలు భగవంతుడికి ఉన్నాయని భావించి ప్రేమిచడం కూడా గొప్పదే. అలా ప్రేమించగలగాలి. ఇటుకీకాక అటుకీ కాక ఉన్నాం మనం.*
*ఇల్లో! ముంగిలియో! యనుంగు జెలులో! యీడైన చుట్టంబులో*
*యిల్లాలో కొడుకో! తరింపవశమేయే పోడుముల్లేక, మా*
*పల్లెంగోరిన వెల్లనుంగలవు తెప్పల్గాగ నీకిచ్చెదన్*
*జెల్లంబో! యిట నొంటినుండ కట వచ్చేయంగదే! లింగమా!!70!!*
*తరించాలంటే ఎవరో ఒకరు ఉండాలి కదా ఇంట్లో. ఇల్లో, ముంగిలో, పిల్లలో, చుట్టాలో ఎవరో ఉండాలి. ఏమీ లేకుండా ఒంటరిగా ఉన్నావు పాపం. నిన్ను ఇలా ఒంటరిగా చూస్తుంటే నాకేమీ తోచట్లేదు. మా పల్లెకొచ్చేయ్. కావలసినంత బోల్డు తోడు సందడే సందడి. ఇక్కడ ఒంటరిగా ఉండకు అని చెప్తూ ఉంటే ఆయన కదలకుండా ఊరుకున్నాడు. ఏం కదులుతాడండీ రాయి అని మనం అనుకుంటాం కానీ తిన్నడు అనుకోలేదు. ఈ శివుడు నామీద కోపంతో రావట్లేదు లేదా నామీద ఈయనకి నమ్మకం కలగలేదు. తనని నమ్మట్లేదు అనుకొని అంటున్నాడు.*
*నన్ను మన్నించెదవేని నీవిపుడు రా నావెంట రాకుండినన్*
*నిను నేబాసి చనంగనోప నిచటన్నీతోడిదే లోకమై*
*మనువాడంగను వాడనీకరుణ నీమౌనంబు చిత్తంబు*
*చ్చినచో మానదుగాని నిన్నిపుడు కస్తింబెట్ట నాకేటికిన్!!72!!*
*నువ్వు రాకపోతే నేను వెళ్ళిపోను. నేనూ ఇక్కడే ఉంటా. మొండిపట్టుతో కూర్చున్నాడు. నీతోడిదే లోకం అనుకొని ఇక్కడే ఉంటాను. నీ దయను చూస్తాను. మౌనం వదులు, పలకరించు అని నిన్ను విసిగించను. నీకెప్పుడు ఇష్టం అయితే అప్పుడు మౌనం మాను. అంతవరకూ నేను ఇక్కడే కూర్చుంటా.*
*మొదటిపరిచయంలోనే నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇక్కడే కూర్చుంటా అని ఆయనని చూస్తూ కూర్చున్నాడు. తదేకంగా ప్రేమగా చూస్తూ నిమురుతూ కూర్చున్నాడు. ఆ కూర్చోవడం ఎలా ఉందంటే*
*‘సంపెంగ తావిబ్రుంగుడైన భృంగంబు తెఱంగున నున్నయవసరంబునం*
*సంపెంగ పువ్వులోకి వెళ్ళిపోయిన తుమ్మెదలాగా అయిపోయాడు. తుమ్మెద సంపెంగ పువ్వులోకి వెళ్తే అక్కడినుంచి మరొక పువ్వు మీదకి వెళ్ళదు. ఎంతవరకూ అంటే అది ఆస్వాదిస్తూ అక్కడే మరణిస్తుంది. లౌకికాస్వాదనలు కాదు శివాస్వాదనలో పడి అక్కడే ఉండిపోయాడు.*
*ఈవిధంగా ఉంటూ ఉంటే తెల్లవారిపోయింది. వాళ్ళందరూ లేచారు. యువరాజు కనబడట్లేదు అని చూశారు. ఆయనని విడిచిపెట్టి వెళ్తే రాజుగారు ఏం చేస్తారో? అంటూ వెతుక్కుంటూ వెతుక్కుంటూ తిన్నడు ఉన్న చోటికి వచ్చారు. రారా వెళ్ళిపోదాం. నిన్ను చూస్తుంటే పిచ్చివాడిలా ఉన్నావు. పద వెళ్దాం. నువ్వు రాకపోతే మీనాన్న ఎక్కడ ఉన్నాడు అని మమ్మల్ని అడుగుతాడు. పద వెళ్దాం అని వాళ్ళు గట్టిగా అడిగితే కొంతసేపటికి వీళ్ళని చూసి*
*ఈ లింగము లో బ్రాణము గాలము*
*గడదాక నోడగట్టిన దూలం*
*బైలంకెనుండజేసితి నేలాతుందుడుకు?*
*పల్లెకేగుడు మీరల్!!80!!*
*చివరివరకూ నేను ఇక ఈయనతోనే. ఓడలో కట్టిన దూలంలాగా నాప్రాణం ఈయనతో కట్టేశాను. అయితే నేను పల్లెకు రాను ఇక్కడే ఉంటాను అనను. ఈయన వస్తే వస్తాను.*
*నావెంటనితడు వచ్చిన నేవచ్చెద మిమ్ముగూడి యిప్పుడు లేదా*
*యేవంక నభవుడుండిన నావంకనె తోడునీడయై వసియింతున్!!81!!*
*ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను. అంత ఎక్కువ అయిపోయాడా నీకు? అవును. ఈయన తప్ప నాకు ఏదీ ఎక్కువ కాదు.*
*నాకుం జుట్టము దల్లిదండ్రులు జెలుల్ నాథుండు నీ దైవమే*
*మీకిచ్చో బనిలేదు కస్తిపడగా మీపల్లెకుం బొండు కా*
*రాకూరంబులు సేసినం గదలి నే రానిచ్చటం బ్రాణముల్*
*పోకార్తుం తుదినాదు వేలుపునకై బొంక న్నిజంబింతయున్!!82!!*
*అలాగని మిమ్మల్ని ఇక్కడ ఉండమని నేను చెప్పను. మీరు పొండి. ఎక్కువ బలవంత పెడితే ఇక్కడే ప్రాణం వదిలేస్తాను. ఏమాత్రం అబద్ధమాడట్లేదు. నిజం చెప్తున్నా పొండి అని వాళ్ళ మాట వినిపించుకోకుండా ఆ శివుడిని చూస్తూ కూర్చున్నాడు. ఇంక లాభం లేదనుకొని వీళ్ళు వెళ్ళిపోయారు.*
*ఆ తర్వాత శివుడిని చూస్తూ నేను ఇలా చూస్తూ కూర్చుంటే శివుడి ఆకలి తీర్చేవాళ్ళెవరు? పాపం ఈయనని ఇన్నాళ్ళూ కనిపెట్టుకొనే వాళ్ళు లేరు. మరి నేను దొరికిన దానికి ఫలితం కనబడాలి కదా ఈయనకి. కనుక ఈయనకి ఆహారం పెట్టాలి. సమయమైపోయింది.*
*ఎన్నాళ్ళనుండియో పస్తున్నాడీ యడవిలోన నొంటి మహేశుం*
*డిన్నెగులు మాన్పవలదా కన్నారంగనిన బంటుగల ఫలమనుచున్!!85!!*
*ఎన్నాళ్ళనుంచీ పస్తున్నాడో పాపం పెట్టేవాళ్ళు లేక? శివునికి కావలసింది ఇదే. తెలివితేటలు కాదు. మూఢత్వం అయితే అవవచ్చు కానీ అర్పణ బుద్ధి. వెంటనే స్వామివారికి నమస్కారం చేసి మంచి భోజనం తెస్తాను ఉండు అని వెళ్ళి చక్కగా మంచి బలిసినటువంటి అడవిపందిని వేటాడి దాని మాంసాన్ని బాగా కాల్చి దానిలో వేయవలసిన పదార్థాలు ఛక్కగా కలిపి దొప్పలో పట్టుకొని వస్తున్నాడు. ఆ వస్తున్న తిన్నడు ఎంత అందంగా ఉన్నాడో చూద్దాం.*
*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*
No comments:
Post a Comment