ఒకానొక మథుర స్వప్నం
జగమంత కుటుంబం!
వారణాశి వెంకట విజయలక్ష్మి! (ఇది ఒకప్పటి పాత కథే, ఇప్పటి కొత్త మిత్రులకోసం,)
కోయిల. కుహుకుహులు, .రామచిలకల రాగాలు ఆవుదూడల అంబాలు, వాచ్మాన్ నర్సయ్య పిల్లాడి క్యార్ క్యార్ లు ఆఇంటి
పెద్దలకి మేలుకొలుపులు.. పొద్దున ఐదో గంటనుండే! స్నాన సంధ్యలయ్యి, దేవుడికి పంచపూజ చేసి.
ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టి ఇద్దరూ ప్రసాదం తీసుకున్నారు. పాలేరు వెంకన్న పిండుకొచ్చిన
చిక్కనిపాలతో ఘుమఘుమలాడే కాఫీ
తాగుతూ వర్ధని, వాసుదేవరావు నరసయ్య భార్య వేసిన చుక్కల ముగ్గులు చూస్తూ, చుట్టూ తమ తోటలోనించి వచ్చే కీలకిలారావాలు వింటూ, నిన్న కొయ్యగా మిగిలిన మల్లె, జాజుల జావళీలు ఆస్వాదిస్తూ ఉగాది వేకువ ఆనందాన్ని పంచుకుంటున్నారు! అమెరికాలోఉన్న ఇద్దరు ఆడపిల్లలు, మగపిల్లవాడు పండగ శుభాకాక్షలు చెప్పగా వాళ్లకి ఆశీస్సులనిచ్చి ఇంక పనులకు లేచారు.
"వర్ధనీ! వంట అయిందా... నేనేమన్నా ఓ చెయ్యి.వెయ్యాలా? భర్త ఆడిగిందానికి,
"మహప్రభో! మీరు సాయం చెయ్యాల్సినంత ముసలితనం ఇంకా రాలేదులేండి... ఇదిగో ఈ పులుసులో తిరగమాత పెడితే, నేనూ వచ్చి కూర్చుంటా పూజకి."
ఈలోపల వాసుదేవరావు, కోసిన పూలకి కాడలు తియ్యాలిసుంటే తీసి.. వేటికవి విడివిడిగా అమర్చి అన్నీ రెడీగా పెట్టి, జపం చేసుకున్నారు!
మిరప్పండు రంగుకి నిండు ఆకుపచ్చ జరీ అంచు చీర
కాశా పోసి కట్టుకున్నది వర్దని. చేతినిండాబంగారు గాజులు, మధ్యలో ఎరుపు, ఆకుపచ్చ మట్టిగాజులు, నుదుటిన మామిడి చిగురు కుంకుముతో
కాసంత బొట్టు, కళ్ళనిండా కాటుక, పెద్ద ముడిలో ఓ చామంతి, ఓ ఎర్రమందార పువ్వు, పచ్చని పాదాలకి గోరింటాకుతో పెట్టిన పారాణి,.. దానిమీదకి జీరాడుతూ
పట్టాలు,. కడియాలు... పూజ చెయ్యడానికి భర్త పక్కన కూర్చుంటే, అమ్మవారు, తనకి తానే పూజ చేసుకుంటుందేమో అన్నట్లుగా ఉన్నది.! వాసుదేవరావు గారు కూడా పట్టు పంచె కట్టుకుని,
నుదుటిన విభూది రేఖలు, బొట్టుతో అపర శివుడే.! సా అంబ శివులు పూజ చేస్తున్నారు... షోడశోపచారాలతో పూజచేసి, విష్ణు సహస్ర నామం చదివి, షడ్రసోపేతమైన భోజనం నివేదన చేసి...ఇద్దరూ కలిసి త్యాగరాజ కీర్తనలు రెండు పాడాక,
వర్ధని మంగళహారతి పాడింది!
..........
"మన పిల్లలింకా రాలేదే!" దొడ్లోకెళ్లి అటూ ఇటూచూస్తూ
అడుగుతున్న భర్త వైపు చూసి వర్ధని,
"భలేవారే ఇవాళ పండగని మనం ఎలా మన పిల్లలకోసం చూస్తున్నామో, అలాగే వాళ్ళూ ఇంకా రెక్కలు రాని వాళ్లకి బొజ్జ నింపి అప్పుడొస్తారు...అదుగో
మాటల్లోనే వచ్చేసారు. గబగబా బియ్యం తెచ్చి,
ఇద్దరూ కలిసి కీలకిల్లాడుతూ వచ్చిన పిచ్చుకల్కి, బియ్యం వేస్తూ 'అబ్బో ఇవాళ బుజ్జులు ఫ్రెండ్స్ ని కూడా తెచ్చాయి.. మరి పండక్కదా!' ఇద్దరూ అన్ని టినీ వీడియోల్లోకి, ఫోటోల్లోకి మాట్లాడుతూనే రికార్డ్ చేస్తున్నారు!
"అదిగో మన కొడుకులు కూడా వచ్చేసారు. ఇహనేమి.." "అన్నాలు తిందాముట్రా రామూ, గిరీ?"
" అలాగే నాన్నగారూ" ఇద్దరు వారాలబ్బాయిలూ, ఆ పుణ్యదంపతులకి నమస్కరించి, సజలాలయిన కళ్ళు తుడుచుకుంటుంటే వర్ధని, వాళ్ళిద్దర్నీ పొదువుకున్నది..."ఎందుకురా వెర్రి నాయన్లూ?"
"అమ్మా!.ఇవాళ్టికీ సరిగ్గా యాడాది... ఇంటిముందు స్పృహ తప్పి పడిపోయి ఉన్న మమ్మల్ని ఎవరు ఏమిటి అని ఆడక్కుండా చేరదీసి, ఆశ్రయం చూపించి, అన్నం పెట్టి , విద్య చెప్పిస్తూ ఆదుకుంటున్నారు...ఏమిచ్చి.రుణం తీర్చుకోగలం?"
"మీ మొహం మిమ్మల్నీ , మమ్మల్నీ అదుకునేవాడు ఆ భగవంతుడే." గూట్లో పెట్టినకొత్త బట్టల పాకెట్ తెచ్చి ఇద్దరికీ బట్టలిచ్చి కట్టుకు రమ్మంది.
"సరేలే పెద్ద పెద్ద మాటలు కాదు...బాగా చదవండి. నోరూ వాయి లేని నీ తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకో భడవా!" అంటూ వాసుదేవరావుగారు అన్నాలకి లేవదీశారు. వర్ధని చేసిన నవకాయ పిండివంటల్తో షడ్రసోపేతమైన భోజనం చేశాక..పెద్దవాళ్ళిద్దరూ ఓ చిన్న కునుకు తియ్యడానికి వెళ్లారు. బాగా అలవాటే అన్నట్లు రాము, రెండు కారియర్లలో అన్ని పదార్ధాలు విడిగా ఉంచినవి సర్దుకుని, గుడిదగ్గర ఉండే నారాయణులకి అన్నం తీసుకెళ్లాడు.
నిద్రలేచి వాసుదేవరావుగారు వర్ధని కాఫీలయ్యాక, ఆయన చదువుతూ, చెప్తుంటే భగవద్గీత 18 వ అధ్యాయం విన్నది వర్ధని. చుట్టపక్కల వాళ్ళు కొంతమంది వచ్చారు. వాళ్ళందరి కోసం చేసి ఉంచిన మైసూర్ పాక్, సాతాళించిన సెనగలు..కృషుడికి నివేదించి, అందరికీ పంచమని, పూలకోసం వచ్చిన ఆడపిల్లలకి పురమాయించింది.
దొడ్డినిండా విరగ పూసే పూలు రోజూ వచ్చి కోసుకు పోతారు ఆ పిల్లలంతా.
ఆరయ్యాక, స్నానం చేసి చక్కని తెల్లటి హ్యాండలూమ్
చీర కట్టుకుని, బొట్టూ కాటుక దిద్దుకుని, ముడి చుట్టూ మల్లెమాల పెట్టుకుని దీపారాధన చేసి వచ్చేప్పటికి, వాసుదేవరావు కూడా సాయం సంధ్య అయి కొత్త పంచ కట్టుకుని, పంచాంగ శ్రవణానికి కూర్చున్నారు. అంత పెద్ద హాలు ఆయిదు నిమిషాల్లో నిండిపోయింది.. మొదట్లో తామిద్దరే కూర్చుని చదువుకునే వాళ్ళు.... ఒకళ్ళనించి
ఒకళ్ళకి తెలిసి ఇలా చాలా మంది ఆయన చదివి చెప్పే తీరుకు ఆకర్షితులై వస్తున్నారు. ఆఖరలో శుభాశుభ ఫలితాల్ని జీవితంలో ఎలా తీసుకోవాలో తన మాటగా చెప్పి ముగించారు.
అందరూ తెచ్చిన పూలు దేవుడికి అలంకరించి,, పళ్ళు నివేదించి, వచ్చిన వాళ్ళ లో కొంతమంది పూనుకుని, వర్ధని చెప్పినట్లు పంచారు.
ముందు రోజు వర్దని వాకిలికి తోరణం కడుతుంటే , పక్క ఇంటి సుమ చెల్లెలు ఉమ 'ఎందుకాంటీ ఈ అవస్థ, హాయిగా పిల్లల దగ్గరకి వెళ్లచ్చు కదా!"అంటే
తాను సన్నగా నవ్వి ఊరుకుంటే సుమ" వాళ్ళు వెళ్ళరు.. ఆ తోరణం నేను కట్టనా.. ఊహు ఆవిడ ఇవ్వరు..."అన్నది..
పొద్దుట్నుంచీ వీళ్ళని, వీళ్ళ ఇంటికి వచ్చే వాళ్లను చూసి సాష్టాంగనమస్కారం చేసింది ఉమ..వాళ్ళు ఎందుకు ఎక్కడికీ వెళ్ళరో అర్ధమయ్యి!
తాము వాకిలికి కట్టిన తోరణం లాంటివాళ్ళమని చెప్తుంటుంది వర్ధని!
అమెరికాలో పిల్లలు ఉన్న తల్లిదండ్రులు, తమ బతుకులు గతుకుల రోడ్లు, అతుకుల బొంతలు అయ్యాయని ఎప్పుడూ బాధే! అనారోగ్యాలు కోరి తెచ్చుకుంటున్నారు దిగుళ్ళతో!
వర్ధని వాసుదేవరావులకిది నచ్చదు... 'మనం ఇక్కడుండా లని ఎలా అనుకున్నామో వాళ్ళు అక్కడుండాలనుకున్నారు.... అది వాళ్ళ ఛాయిస్.. మనల్ని వాళ్ళు అర్ధం చేసుకోవాలన్నట్లే మనం వాళ్ళని అర్ధం చేసుకోవాలి. నిజానికి మనంవాళ్లనే ఎక్కువగా అర్ధం చేసుకోవాలి..ఎందుకంటే వాళ్ళది వెలగాల్సిన దీపం, మనది కొడిగట్టిన దీపం' అని తరచుగా బాధపడే వాళ్లని ఓదారుస్తూ ఉంటారు!
......
రాత్రి ఎనిమిదయ్యింది. పిల్లలంతా అమెరికానించి వీడియో కాల్స్ చేశారు. తాము పొద్దుటినించీ. రికార్డు చేసిన సంబరం చూడాలని తెగ ఉత్సాహపడ్డారు. వాళ్లకెప్పుడూ అబ్బురమే అమ్మా నాన్నల్ని చూస్తే... ఎప్పుడూ జీవితం. గురించి కంప్లైంట్ లేకపోగా..."మేము ఒంటరిగా ఎందుకున్నామర్రా... ఏకాంత వాసం... మేమిద్దరం ఒకళ్లకొకళ్ళం ఉండనే ఉంటిమి... పైనించి చూశారుగా 'మాది జగమంత కుటుంబం!" రమ్మని పిల్చినప్పుడల్లా ఇదే సమాధానం. వాళ్ళకీ ఇంక అక్కడ బాగుండట్లేదుట... నెమ్మదిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు ఈ జగమంత కుటుంబంలో కలిసేందుకు!
,
No comments:
Post a Comment