*☘️వేదమూర్తుల స్తుతులు☘️*
*(20 వ భాగము)*
*భౌతికజగత్తు కేవలము తాత్కాలికముగా ప్రకటమైనదని అనడము అది. మిథ్యయని గాని లేదా దాని మూలము మిథ్య యని గాని చెప్పడము కాదు. దాని మూలము సత్యము కనుక ఆ ప్రకటము కూడ సత్యమే అవుతుంది. కాని దానిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనిషి తప్పకుండా తెలిసికోవాలి. మట్టికుండ ఉపమానాన్ని ఇక్కడ తిరిగి చెప్పుకోవచ్చును. మట్టినుండి తయారు చేయబడిన కుండ తాత్కాలికమైనదే. కాని దానిని సరియైన ప్రయోజనానికి వాడినపుడు అది మిధ్య కాబోదు. బుద్ధిమంతుడైన వ్యక్తి తాత్కాలికమైన మట్టికుండము ఉపయోగించుకునే విధమును ఎరిగి ఉన్నట్లుగా, వైష్ణవ తత్త్వవేత్తలు ఈ తాత్కాలికమైన భౌతికజగత్తును ఉపయోగించుకునే పద్ధతిని చక్కగా ఎరిగి ఉంటారు. మట్టికుండను తప్పు ప్రయోజనానికి ఉపయోగించినపుడు అది మిథ్య అవుతుంది. అదేవిధముగా మానవదేహాన్ని లేదా భౌతికజగత్తును ఇంద్రియభోగానికి ఉపయోగించినపుడు అది* *మిథ్య అవుతుంది. కాని మానవదేహాన్ని, భౌతికసృష్టిని భగవత్సేవ కొరకు వినియోగిస్తే వాటి కలాపాలు ఎన్నడు మిథ్య కాబోవు... మానవజన్మను, భౌతికదేహాన్ని కించిత్తైనా భగవత్చేనకు వినియోగిస్తే అది మనిషిని ఘోరమైన ప్రమాదము నుండి కాపాడుతుంది అని భగవద్గీతలో ధ్రువపరుప బడింది. కనుక యుక్తముగా ఉపయోగించినపుడు భగవంతుని నుండి ఉత్పన్నమయ్యే ఉన్నతశక్తి గాని, న్యూసశక్తులు గాని మిథ్య కాబోవు.*
*ఇక కాన్యుకర్మల విషయానికి వస్తే అవి కేవలము ఇంద్రియభోగముపై ఆధారపడినట్టివి. కనుక భక్తియోగములో పురోగమించిన వ్యక్తి వాటిని చేపట్టడు. సకామకర్మఫలాలు మనిషిని ఉన్నతలోకాలకు చేరుస్తాయి. కాని భగవద్గీతలో చెప్పబడినట్లు స్వర్గలోకములో పుణ్యఫలాలు నశించగానే జీవులు తిరిగి మర్త్య లోకానికి వచ్చి మళ్ళీ ఉన్నతలోకప్రాప్తికై యత్నిస్తారు. రాకపోకల కష్టమే వారికి ఫలముగా లభిస్తుంది. అది ప్రస్తుతము లౌకిక శాస్త్రజ్ఞులు చంద్రలోకానికి వెళ్ళి తిరిగి రావడంతోనే తమ కాలాన్ని వ్యర్థపరచడము వంటిది అవుతుంది. కామ్యకర్మలలో నెలకొనినవారిని వేదమూర్తులు "అంధ పరంపర" (వైదిక అనుష్ఠానాలను గ్రుడ్డిగా పాటించేవారు) అని వర్ణించారు. అటువంటి అనుష్ఠానాలు వేదాలలో చెప్పబడినప్పటికిని అవి బుద్ధిమంతుల కొరకు ఉద్దేశించబడినవి కావు. భౌతికభోగము పట్ల అమితానురక్తులైన వారు ఉన్నతలోకప్రాప్తి అవకాశముచే మోహితులై అట్టి అనుష్ఠానాలను చేపడతారు. కాని గుర్వాశ్రయములో యథార్థ దృష్టి కలిగిన బుద్ధిమంతులు కామ్యకర్మలను చేపట్టక దివ్యమైన భగవత్సేవలో నెలకొంటారు. అభక్తులగు వ్యక్తులు లౌకిక కారణాల కొరకు వైదిక అనుష్ఠానాలను చేపట్టి ఆ విధముగా భ్రాంతులౌతారు. దీనికి ఒక చక్కని ఉపమానాన్ని ఈ విధంగా చెప్పుకోవచ్చును. కోటి రూపాయల కరెన్సీ నోట్లను కలిగియున్న బుద్ధిమంతుడు. దానిని వాడుకోకుండ ఊరకనే పట్టుకొని ఉండిపోడు. కరెన్సీ నోట్లంటే కేవలము కాగితాలేనని అతనికి బాగా తెలుసు. అతడు కోటిరూపాయల కరెన్సీని కలిగి ఉన్నాడంటే నిజానికి కేవలము కాగితాల కట్టలను పట్టుకున్నాడనే అర్ధము.*
*కాని దానిని అతడు ఏదేని ప్రయోజనానికి వాడితే లాభపడతాడు. అదేవిధంగా ఈ భౌతికజగత్తు కూడ కాగితము లాగానే మిథ్యయే కావచ్చును. అయినా దానికొక ప్రయోజనమున్నది. కరెన్సీ నోట్లు కేవలము కాగితములేయైనా ప్రభుత్వముచే విడుదల చేయబడినాయి కనుక పూర్తి విలువను కలిగి ఉంటాయి. అదేవిధంగా భౌతికజగత్తు మిథ్యయో, తాత్కాలికమో అయినా భగవంతుని నుండే ఉద్భవించింది కనుక పూర్తి విలువను కలిగి ఉంటుంది. వైష్ణవ తత్త్వవేత్తలు ఈ భౌతిక జగత్తు యొక్క పూర్తి విలువను గుర్తించి దానిని ఏ విధంగా సద్వినియోగపరచాలో ఎరిగి ఉంటారు. కాగా మాయావాద తత్త్వవేత్తలు ఆ విధముగా చేయడంలో విఫలురౌతారు. కరెన్సీ నోటును సాధారణ కాగితమని పొరబడి దానిని పారవేసి ధనమును ఉపయోగించుకోలేని వారిని వారు పోలుతారు. అందుకే భౌతికజగత్తును భగవత్సేవకు సాధనమని గుర్తింపక దానిని మిథ్య యని త్రోసిపుచ్చితే అట్టి వైరాగ్యానికి విలువే లేదని శ్రీల రూపగోస్వామి ప్రకటించారు... భగవత్సేవలో ఈ భౌతికజగత్తు యొక్క విలువను ఎరిగిన వ్యక్తి భౌతికజగత్తు పట్ల అనాసక్తుడై యుండి దానిని స్వీయేంద్రియభోగానికై స్వీకరించనపుడు నిజమైన వైరాగ్యవంతుడు అవుతాడు. ఈ భౌతిక జగత్తు భగవన్మాయ విస్తారము. కనుక అది సత్యమైనదే. సర్పము, త్రాడు ఉపమానముతో జగత్తు మిథ్యయని ఒకప్పుడు చెప్పబడినా అది మిథ్య కానేకాదు.*
*వేదమూర్తులు తమ స్తుతులను కొనసాగించారు: "తాత్కాలికమైన ఆస్తిత్వము కారణంగా జగత్తు అల్పబుద్ధులగు జనులకు మిథ్యగా గోచరిస్తుంది." జగత్తు యొక్క ఈ తాత్కాలికమైన స్వభావాన్ని అదనుగా తీసికొని మాయావాద తత్త్వవేత్తలు ప్రపంచము మధ్యమునే తమ సిద్ధాంతాన్ని నిరూపించడానికి యత్నిస్తారు. వేదకథనము ననుసరించి సృష్టికి పూర్వము జగత్తు లేదు. విలయా నంతరము ఇది గోచరించదు. శూన్యవాదులు ఈ వేదకథనాన్ని అదనుగా తీసికొని ఈ జగత్తుకు మూలము కూడ శూన్యమేనని నిర్ణయిస్తారు. వేదవాక్కులు సృష్టి లయాలకు మూలాన్ని నిర్వచిస్తూ "యతో వా ఇమాని భూతాని జాయన్తో అతని నుండియే ఈ జగత్తు ఉద్భవించి, చివరకు ప్రళయము తరువాత అతని యందే లయిస్తుంది" అని పలికాయి. ఈ విషయమే వేదాంత సూత్రములలోను, శ్రీమద్భాగవతములోని ప్రథమాధ్యాయము నందలి ప్రథమశ్లోకములోను "జన్మాద్యస్య యతః - ఆతని నుండియే సమస్తము ఉద్భవించింది" అని వివరించ బడినది. జగత్తు పరమపురుషుని నుండే వచ్చిందని, విలయానంతరము అది అతనిలోనే కలిసిపోతుందని ఈ వేదవాక్కులన్నీ సూచిస్తున్నాయి. ఇదే సిద్ధాంతము భగవద్గీతలో ధ్రువపరుపబడింది: "జగత్తు ఉనికి లోనికి వచ్చి తిరిగి లయిస్తుంది. విలయానంతరము తిరిగి అది భగవంతునిలోనే లీనమౌతుంది." బహిరంగమాయ (బాహ్యశక్తి) అనబడే ఒకానొక శక్తి తాత్కాలిక స్వభావము కలదేయైనా భగవచ్ఛక్తియేనని, అందువలన అది మిథ్య కానేరదని ఈ వాక్యము కచ్చితముగా ధ్రువపరుస్తున్నది. అది కేవలము మిథ్యగా గోచరిస్తుంది. ప్రకృతికి ఆదిలో ఉనికి లేదు, విలయానంతరము అది ఉండబోదు కనుక మిథ్యయే అవుతుందని మాయావాద తత్త్వవేత్తలు అంటారు.*
*కాని మట్టికుండలు, మట్టిపాత్రల ఉపమానము . ద్వారా తెలుపబడిన వేదాభిప్రాయము ఏమంటే పరతత్త్వము యొక్క గౌణఫలము తాత్కాలికమైన ఉనికిని కలిగినప్పటికిని భగవచ్ఛక్తి శాశ్వతమై ఉంటుంది. మట్టికుండ లేదా మట్టి ముంత పగిలి లేదా రూపాంతరము చెంది పాత్రగానో, పళ్ళెముగానో మారినను దాని ఘటకద్రవ్యము, అంటే మట్టి మాత్రము ఒకటే అయి ఉంటుంది. జగత్తు యొక్క మూలతత్త్వము సర్వదా బ్రహ్మమే లేదా పరతత్త్వమే అయి యుంటుంది. కనుక జగత్తు మిథ్య యనెడి మాయావాద తత్త్వవేత్తల సిద్ధాంతము కేవలము మానసిక కల్పనమే అవుతుంది. జగత్తు క్షణభంగురమైనదని, తాత్కాలిక మైనదని అంటే దాని భావము అది మిథ్యయని కాదు. "ఏనాడును ఉనికి లేకపోయినను కేవలము పేరుకు ఉన్నట్టిది" అని మిథ్యకు నిర్వచనాన్ని చెప్పుకోవచ్చును. ఉదాహరణకు గుఱ్ఱం గుడ్డు లేదా కుందేటి కొమ్ము లేదా ఆకాశపుష్పము అనేవి కేవలము పేరుకే ఉన్నాయి. నిజానికి గుఱ్ఱం గుడ్డు గాని, కుందేటి కొమ్ము గాని, ఆకాశంలో పూసే పువ్వులు గాని లేనే లేవు. ఈ వస్తువులన్నీ పేరుకు మాత్రమే లేదా ఊహలో మాత్రమే ఉన్నవి గాని నిజంగా కనిపించవు. అటువంటి వాటినే మిథ్యయని పిలువవచ్చును. కాని ప్రకటమై, తిరిగి లయించి... పోయే తాత్కాలిక స్వభావమును కలిగియున్నందున ఈ భౌతిక జగత్తును వైష్ణవుడు మిథ్య యని భావించడు.*
*వేదమూర్తులు తమ స్తుతులను కొనసాగిస్తూ చెప్పినదేమంటే పరమాత్ముడు, జీవుడు అనే రెండు పక్షలు ఒకే వృక్షముపై కూర్చున్నట్లుగా ఒకే దేహములో ఆసీనులై ఉన్నప్పటికిని ఎట్టి పరిస్థితిలోనూ సమానులు కాబోరు. ఈ రెండు పక్షులు మిత్రులుగా ఆసీనులై ఉన్నప్పటికిని సమానులు కారని వేదాలలో చెప్పబడింది. ఒక పక్షి కేవలము సాక్షిగా ఉన్నది. ఆ పక్షియే పరమాత్ముడు. ఇంకొక పక్షి వృక్షఫలాలను ఆరగిస్తున్నది. అది జీవాత్మ. జగత్తు ప్రకటమైనపుడు జీవాత్మ పూర్వకర్మానుసారము వివిధ రూపాలలో ప్రకటమౌతుంది. స్వరూప విస్మృతి కారణంగా జీవాత్మ ప్రకృతిచే ఒసగబడిన ఒకానొక రూపముతోనే తాదాత్మ్యము చెందుతుంది. భౌతికరూపాన్ని పొందిన తరువాత జీవుడు త్రిగుణాలకు లోనై తద్రీతిగా వర్తిస్తూ భౌతికజగత్తులో కొనసాగుతాడు. అటువంటి అజ్ఞానముతో కప్పబడి నపుడు అతని సహజమైన విభూతులు దాదాపుగా కనుమరుగు అవుతాయి. కాని పరమాత్ముడు లేదా భగవంతుడు భౌతికజగత్తులో ప్రకటమై నపుడును అతని విభూతులు నశించవు. ఆతడు ఈ భౌతికజగత్తు క్లేశాలకు అతీతునిగా ఉంటూ తన సకల విభూతులను, సిద్ధులను పరిపూర్ణముగా కలిగి ఉంటాడు. బద్ధ జీవుడు భౌతికజగత్తులో కప్పబడతాడు. కాగా పరమాత్ముడు లేదా భగవంతుడు పాము కుబుసాన్ని విడిచినట్లు ఏమాత్రము ప్రభావితుడు కాకుండ జగత్తును దూరంగా విడిచి పెడతాడు. పరమాత్మునికి, బద్ధజీవునికి భేదమేమంటే పరమాత్ముడు లేదా దేవాదిదేవుడు షడైశ్వర్యములు, అష్టసిద్ధులు, అష్టగుణాలు అనే తన సహజ విభూతులను సర్వదా కలిగి ఉంటాడు.*
💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦
*"వేదమూర్తుల స్తుతులు" అను దశమస్కంధములోని భక్తివేదాంతభాష్యము ఇంకా వుంది*
💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦
*☘️\!/సర్వం శ్రీకృష్ణార్పణమస్తు\!/☘️*
*┈┉┅━❀꧁ హరే కృష్ణ ꧂❀━┅┉┈*
*SPIRITUAL SEEKERS*
🍁🦚🍁 🙏🕉️🙏 🍁🦚🍁
No comments:
Post a Comment