Tuesday, July 1, 2025

 చుట్టరికం - ఒక వ్యాఖ్య-ఒక ప్రహసనం
రచన : కళ్యాణ్కళ్యాణ్ కిషోర్

వాట్శాపాలకీ, ఫోన్లకీ మునుపు, కాకి అరిచింది, దువ్వెన చెయ్యి జారింది, పొద్దున్నే అద్దం బద్దలయ్యింది, ఇవన్నీ చుట్టాలొస్తున్నారు అనడానికి సంకేతాలు. వీటిల్లో ఏది జరిగినా ఆరోజంతా ఎవరొస్తారా అని విపరీతమైన ఉత్సుకత ఉండేది. రిక్షానో, ఆటోనో ఇంటి ముందాగినట్టనిపిస్తే పెరటి గుమ్మం నుంచీ పది గుమ్మాలు తన్నుకుని వీధి వైపు పరిగెట్టి మరీ చూసొచ్చేయ్యాల్సిందే. చాలాసార్లు కాకులు రాకపోయినా కూడా చుట్టాలొచ్చేసేవారు. 

ఎవరైనా వచ్చేసాక ఉండే ఉత్సాహం కంటే ఎవరో వస్తారుట, అనే ఆత్రుత భలే ఉండేది. అలా అని చుట్టాలందరూ ఒకేలా ఉండరు కదా. తాతయ్య అనేవారు "పొద్దున్నే పట్టిన ముసురు, పొద్దోయాక వచ్చిన చుట్టం ఓహ పట్టాన కదలర్రా" అని. 
అంతే మరి, భోంచేసి వెళ్ళండి అంటే, మర్నాడు పొద్దున్న కాఫీ టిఫినీలు కానిచ్చి ఫస్టు బస్సుకు వెళ్తారని అర్థం. కొంత మంది చుట్టాలు వచ్చిన వారం రోజులుండి వెళ్లాకా కూడా ఆ చుట్టరికం ఏంటో అర్థమై చచ్చేది కాదు. మరీ దగ్గరి వాళ్లంతా అవతలి వీధిలోనో పక్కూళ్లోనో ఉండేవారు కాబట్టీ అన్నేసి రోజులుండే పరిస్థితి ఎలాగూ లేదు. 

అసలిప్పుడు ఆ భయాలు గానీ, ఎగ్జైట్మెంటు గానీ ఉండేడిస్తేగా. ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోకపోతే తలుపు కూడా తియ్యం. గేటెడ్ వాళ్లకైతే చెప్పక్కర్లేదు. అసలు రోజూ బయటికి వెళ్లి తిరిగి ఇంట్లోకి వెళ్లడానికి వాళ్లే నానా యాగీ చెయ్యాలి.

మాకైతే ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒక చుట్టాలుండేవారు. అన్నగాడు చుట్టాల పేరి, వచ్చిన వాళ్లతో కబుర్లన్నీ వాడు చెప్పే వాడు, అమ్మ వండి పడీసీ, ఇక వాళ్లతో కూర్చునేది. నాన్నా నేనూ ఇంచుమించు ఒక రకమే గానీ...నేను వచ్చిన చుట్టాలకి, ఏం పెట్టాలి వాళ్లు కాఫీలవీ తాగేసి వెళ్లిపోయే రకమా..మజ్జాన్నం మజ్జిగాన్నం పెట్టాలా, మావిడి పండెయ్యాలా వద్దా, పడుకోడాని పక్కబట్టలెలా అరేంజ్ చెయ్యాలీ, రెండ్రోజులుంటారా, రెండ్రోజుల్లో కదలకపోతే ఎలా కదిలించాలి.. లాంటి ప్రణాళికా రచనలన్నీ మన అకౌంటు.  ఇహ నాన్నైతే  కళ్లతోనే పలకరింపు, మరీ దగ్గరి వాళ్లైతే అదీ లేదు. 

ఇలానే...మా బాబాయి ఒడుగుకి పొలోమని ఎక్కడెక్కడి చుట్టాలూ దిగుతున్నారు. తాతయ్య వాళ్ళ ఏడుగురు అప్పచెల్లెళ్లు, వాళ్ల ఆడపడుచులు, అల్లుళ్లూ.. అబ్బో అదో ప్రవాహం నడుస్తోంది. 

రెండు పూల పూల ట్రంకు పెట్టెలేసుకుని ఒక మామ్మ గారు దిగారు. ఛాయాదేవికి తక్కువ నిర్మలమ్మకి ఎక్కువా ఉన్న ఆవిడకి ఒక డెబ్భై పైనే ఉంటాయి. దిగుతూనే ఒక పెట్టి చంకనేసుకుంటూ, ఇంకోటి పని వాణ్ణి తెచ్చీమని బెత్తాయించేసి..వీధిలోంచే అందర్నీ పలకరించుకుంటూ వచ్చింది. మా బామ్మకి ఉన్న ఏడుగురు ఆడపడుచుల్ని, వాళ్ల పిల్లల్నీ గుర్తుంచుకోవడమే పెద్ద ప్రహేళిక, ఇంకా వాళ్ల ఆడపడుచుల-ముసలి పడుచుల్ని ఎక్కడ గుర్తుపడుతుందీ..ఆహా అంటే ఓహో అని కాఫీలందించేసి, భోజనాలకి తోలేస్తోంది అందర్నీ.

 మధ్యాహ్నం భోంచేసి నడుం వాల్చిన ఆవిడ హటాత్తుగా "సుబ్బడు ఎక్కడున్నాడే పొద్దున్నుంచీ కనబళ్లేదూ..." అని అడిగింది పక్కనున్న ఇంకో శాంతకుమారిని. ఇదిగో వీడేకదా సుబ్బడు వటువు వీడేగా అని పక్కనే తుంగచాపమీద తుండుకట్టుకుని నిద్రపోతున్న పిల్లాణ్ణి చూపించి అందావిడ. 

"అదేవిషీ సుబ్బడి కొడుక్కి కదా ఒడుగు..." అని సాగదీసింది. 

"ఇంకే సుబ్బడు ఉన్నాడొదినా మనింట్లో ఒహడేగా" అని శాంతకుమారీ, "అదేవిషే..ఆ సుబ్బణ్ణి కాదూ అప్పట్లో నాకిద్దామనుకుని తప్పిపోయిందీ నాకెందుకు తెలీదూ" అని ట్రంకు పెట్టీ,  అప్పటివరకూ జారవేసిన నడుములు కొంచెం పైకెత్తి మరీ వాదించుకోవడం మొదలెట్టారు. 

ఈ కథంతా వింటూ..చెక్క వాలు కుర్చీలో పడుకుని, పొట్టమీద రేడియో పెట్టుకుని, వెలిగించని పచ్చి చుట్టని చప్పరిస్తున్న మా తాతయ్య...

"వదిన గారూ...మీరు  వాడపిల్లి వారి సుబ్బడి గురించేనా అడిగేదీ" అన్నారు. 

"ఆ... మరే అతనేగా" అందావిడ. 

"నాకు పొద్దున్నుంచే అనుమానం ఉందిలెండి. వాడపిల్లి సుబ్బన్న గారిది పక్కిల్లే, వాళ్లబ్బాయిదీ ఎల్లుండే ఒడుగు..మా వాడిది రేపు" అని చుట్ట మళ్లీ నోట్లో పెట్టేసుకుని రేడియో సౌండు కొంచెం పెంచుకుని మళ్లీ ధ్యానంలోకి వెళ్లిపోయారు. 

మళ్లీ కాఫీలవీ అయ్యాకా, ఆవిణ్ణీ, ట్రంకు పెట్టెల్నీ పక్కింటికి తరలించేరు తరువాత. 

మర్నాడు మా ఇంట్లో ఒడుక్కి మళ్లీ వచ్చింది కూడాను.

No comments:

Post a Comment