Tuesday, July 1, 2025

 శీర్షిక : 
మసకేసిన సంధ్యా సమయం

బెల్లంకొండ భవానీకుమారి
(ఇది నా స్వీయ రచన )


"హలో"
ఉలిక్కిపడి ప్రక్కకు చూసింది వైదేహి.
ప్రక్కనే కూర్చుని  ఉన్నాడొకాయన. 70 -75  మధ్య వయసు ఉండవచ్చు. చూడగానే ఆహార్యం బట్టి బాగా చదువుకున్న వాడిలా కనిపించాడు. డ్రెస్సింగ్ కూడా చాలా నీటుగా వున్నది. మెళ్ళో టై అతనికి మరింత హుందాతనం తెచ్చిపెట్టింది. చిరునవ్వుతో ఆయన కేసి చూసింది. 
"స్టూడెంట్ వా "ఏం చదువుతున్నావు ?అడిగాడాయన.
బి.టెక్ ఫైనల్ ఇయర్ అండీ, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీలోనండి  "మర్యాదగా చెప్పినఁది వైదేహి.
ఏ బ్రాంచ్ ?
సాధారణంగా అపరిచితులతో ఎక్కువ మాట్లాడదు వైదేహి‌. కానీ ప్రక్కన కూర్చున్న పెద్దమనిషి ఎంతో సౌమ్యంగా, హైలీ ఎడ్యుకేటెడ్ గా అనిపించటంతో చెప్పింది.

"నన్నెప్పుడూ క్యాంపస్ లో చూడలేదా ?" అన్నాడాయన చిరునవ్వుతో.

"లేదండీ, మీరు ప్రొఫసర్ అనుకుంటా, కానీ రిటైర్ అయి వుంటారు, గెస్ట్ ఫ్యాకల్టీనా " కుతూహలంగా అడిగింది.

ఆమె అలా అడగటానికి కారణం వుంది. ఆయనకు ఈజీగా డెబ్బయి దాటి వుండవచ్చు. అందుకే అలా అడిగింది. నవ్వుతూ మాట్లాడుతున్న ఆయన మొహంలో హఠాత్తుగా మార్పు వచ్చింది. నేను ప్రొఫసర్ లా కనిపిస్తున్నానా నీకు,
అన్నాడు చాలా కోపంగా.

బిత్తరపోయింది వైదేహి, ఆయన ఆమె మొహం కేసి చూస్తూ నేను ఒస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ క్యాంపస్ లోనే సివిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లోనే వున్నాను, నువ్వు నన్నెప్పుడూ చూడలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా వుంది. నువ్వు అదే బ్రాంచ్ కదా" అన్నాడు ఆయన ఆశ్చర్యంగా.

మతి పోయినట్టయింది వైదేహికి. ఈయన కూడా ఫైనల్ ఇయర్ లో వున్నాడంటాడేమిటి ?"ఆశ్చర్యపోతూ మరేమీ మాట్లాడలేకపోయింది.

ఇంతలో నలభై ఏళ్ళు వున్న ఒక యువకుడు, అతని వెంటే అతని తల్లి కామోసు  వచ్చారు.

"నాన్నా, ఇంటికి వెల్దాము  పదండి, డ్రైవర్ రమణ ఎన్నిసార్లు ఇంటికెళదాము అంటే మీరు రానంటున్నారట, పదండి నాన్నా , ఇంటికెళదాము" అన్నాడు ఎంతో సౌమ్యంగా, బ్రతిమిలాడుతున్నట్టుగా. . 

ఆయన అతని చేతిని విదిలించి కొట్టాడు. ఎవరు నువ్వు ? ఫైనల్ ఇయర్ చదువుతున్న నన్ను పట్టుకుని "నాన్నా అంటావేమిటి ? ఒక పక్క కాలేజీ టైం అవుతోంది, ఎలా వెళ్ళాలా అని నేను చూస్తుంటే" అన్నారు కోపంగా.

ఇంతలో ఆ రమణ అన్న అతను వచ్చాడు. ఆ కొడుకు, డ్రైవర్ చాలాసేపు ఆయనను బ్రతిమిలాడి, మొత్తానికి కార్ ఎక్కించారు.

ఆయన భార్య బెంచీమీద అలసటగా కూలబడినట్టుగా కూర్చున్నది. ఆవిడ కూడా చదుకున్న ఆవిడలానే వున్నారు.  
మామ్, మీరేమీ అనుకోనంటే ఒక మాట అడుగుతాను" అన్నది వైదేహి.
.
ఆయన మీకు ఇంజనీరింగ్ చదువుతున్నానని చెప్పారు కదూ" అన్నదావిడ.
 
"అవునండీ  ఆయన వయసుని బట్టి రిటైర్ అయ్యి చాలాకాలం అయి వుండొచ్చు. మళ్ళీ గెస్ట్ ఫ్యాకల్టీగా చేస్తున్నారేమో అనుకున్నా. అదే విషయం నేను అంటే ఆయనగారికి చాలా కోపం వచ్చింది, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను అంటారేమిటి ?" కుతూహలంగా అడిగింది వైదేహి.

ఆవిడ నిట్టూర్చి చెప్పింది, ఆయన మా వారు. ది గ్రేట్ సివిల్ ఇంజనీర్ సి.వి  రావుగారు. ఆయన పేరు తెలియని ఇంజనీరింగ్ స్టూడెంట్ వుండరనుకుంటా.  ఎన్నో ప్రాజెక్ట్స్ డిజైన్ చేశారు. రిటైర్ అయ్యాక కూడా ప్రభుత్వం ఆయనను గౌరవ సలహాదారుగా  మూడేళ్ళ క్రితం వరకు పనిచేశారు.***

హఠాత్తుగా ఆయనలో మార్పు వచ్చింది. క్రొత్తలో మేము గమనించలేదు. కానీ, ఆయన ఈమధ్య జరిగిన విషయాలేవీ గుర్తుండకపోవటం, చెప్పిందే చెప్పటం, ఒకే రకమైన ప్రశ్నలు అదే పనిగా అడగటం, ఎవరి పేర్లూ గుర్తుండక పోవటం, అలా మొదలయ్యింది" అన్నాదావిడ దిగులుగా.
.
"అయ్యో, అంత గొప్ప ఇంజినీరు వారు, ఆయన ఇలా అయిపోవడమేమిటి" భాదగా అన్నది వైదేహి.

"కొత్తలో మాట్లాడుతున్నప్పుడు కొన్ని పదాలు గుర్తుకు రాక తడబడేవారు‌. అది పెద్దవయసు వస్తున్న కొద్దీ అలాంటివి మామూలే అనుకున్నాము" కొంచం ఆగి అన్నాదావిడ.

"ఓ రోజు నన్ను  "నువ్వెవరు, ఇలా వచ్చి నా ప్రక్కన పడుకున్నావేమిటి ?" అంటూ నన్ను  మంచం మీదనుండి తోసేశారు. నడుం విరిగినంత పనైంది. నాకు చాలా భయం వేసి, వెంటనే డాక్టర్ దగ్గిరకి తీసుకెళ్ళాము. 

రావుగారికి  "అల్జిమర్స్ అని నిర్ధారించారు. తానెవరో, ఎంత పేరు ప్రఖ్యాతులు గడించిన ఇంజినీర్ అని మర్చిపోయారు, తనకు "పద్మశ్రీ" వచ్చిందని మర్చిపోయారు. తన చిన్నప్పటి విషయాలు, కాలేజీ లైఫ్ కొంచం గుర్తు వుంది. పదే, పదే ఆ విషయాలే మాట్లాడుతూ వుంటారు. అప్పుడప్పుసూ ఇలా చక్కగా తయారై  చెప్పాపెట్టకుండా బయటకు, వెళ్ళిపోయి ఎటు వెళ్ళాలో తెలియక, ఇలా ఎక్కడబడితే అక్కడ కూర్చుండి పోతున్నారు. అందుకే ఆ రమణ అన్న అతన్ని వారికోసం, ఆయనని ప్రతి నిమిషం కనిపెట్టుకుని ఉండేలా మా అబ్బాయి ఏర్పాటు చేసాడు.

"మాకు ఇద్దరు పిల్లలు, అబ్బాయిని గుర్తు పట్టారు, అమ్మాయిని అసలే గుర్తు పట్టరు, నన్ను చూస్తే చాలా చికాకు పడతారు. 
మనవళ్ళనీ  మనవరాళ్ళనీ ఎంతో ముద్దు చేసేవారు, వాళ్ళు పుట్టినప్పుడు, తన హోదా, ఖ్యాతీ అన్నీ మర్చిపోయి, వాళ్ళని ఎత్తుకుని, ఎంతో సంతోషంగా ఆడించేవారు. పిల్లలికి గ్రాహ్యం తెలిసాక తాతగారిని ఎంతో గౌరవంతో చూసేవారు, కానీ ఆయన అందరి తాతలాగానే వాళ్ళతో ఆడుకోవటం, చదువు చెప్పటం చేసేవారు.

"మందులు వాడితే ప్రయోజనం లేదాండీ ? భాదగా అడిగింది వైదేహి.

"లేదమ్మా, దీనికి మందులు లేవు, ఒక్కోసారి తిన్నారో లేదో గుర్తు ఉండదు. ఒకసారి స్నానం చేసి టవల్ చుట్టుకుని హాల్లో కూర్చున్నారు, బట్టలు వేసుకోవడం మర్చిపోయారు‌. ఇంట్లో వున్న ఇద్దరు మనవళ్ళనీ తన స్వంత పిల్లల్నీ, బంధువులనీ అందర్నీ మర్చిపోయారు, ఎందుకో నేనంటే మండి పడతారు. దగ్గరికి రానివ్వరు, ఒక్క మా కోడలి మాట వింటారు. ఆమె పెడితేనే తింటారు, కానీ ఆమె ఎవరో మర్చిపోయారు. ఈ జబ్బుబారిన పడినవారిని విసుక్కోవటం, తిట్టడం, చేయకూడదు. ఆ వ్యాధి లక్షణాలు గుర్తించి, వాళ్ళని సహృదయంతో అర్ధం చేసుకుని, దయతో ఉండాలి. ఏ మాత్రం కఠినమైన మాటలతో భాదించినా, చాలా కృంగిపోతారు. కోడలు పని ఉండి బయటకు వెళితే, ఇంకెవరూ పెట్టినా తినరు, పాపం మా కోడలికి ఇదో పెద్ద ప్రాబ్లెమ్ అయిపొయింది, కానీ బంగారు తల్లి ఎంతో ఓపిగ్గా చూసుకుంటుంది  ఆయనని" అంటూ కళ్ళొత్తుకుంది." ఆవిడ భాదగా.

మీరంటే ఎందుకండీ కోపం ?" అడిగింది వైదేహి.

ఆమె నెమ్మదిగా అన్నది, "నిజంగా ఆయన ఉద్యోగరీత్యా చాలా బిజీగా ఉండేవారు కానీ ప్రేమమూర్తి అమ్మా, నన్ను చాలా అపురూపంగా చూసుకునేవారు, తాను ఉద్యోగరీత్యా ఎక్కడికి వెళ్లినా తన స్వంత ఖర్చులమీద మమ్మల్ని తీసుకెళ్లేవారు. పిల్లల్ని కూడా ఏనాడు అశ్రద్ధ చేయలేదు, మా అమ్మాయి నాన్నగారు నన్ను మర్చిపోవటమేమిటమ్మా అంటూ ఏడుస్తుంది అన్నారావిడ భాదగా.
 
వింటున్న వైదేహికి భాదా, భయము వేసింది. "ఈ వ్యాధి రాకుండా ఏమీ చేయలేమా మేడం....ఎందుకడుగుతానంటే మా నాన్నగారు కూడా త్వరలో రిటైర్ అవ్వబోతున్నారు, అందుకని అడుగుతున్నాను" అన్నది వైదేహి.

మనుషులెప్పుడూ పనీపాటా లేకుండా కూర్చోకూడదమ్మా. నలుగురితో కలవాలి, రిటైర్ అయినా చేతనయినంత మెదడుకి, శరీరానికి శ్రమ కల్పించుకోవాలి. పజిల్స్ సాల్వ్ చేయటం, సాహిత్యం చదవటం, మంచి వ్యాపకాలు నిర్దేశించుకోవటం, ప్రోటీన్ ఫుడ్, నట్స్ తీసుకుంటూ, మంచి జీవన శైలి ఏర్పరుచుకుంటే కొంతవరకు ఈ వ్యాధి బారిన పడకుండా తప్పించుకోవచ్చు అంటారు. కానీ రావుగారు ఏ రోజు కూడా ఏ విషయంలోనూ అశ్రద్ధ చూపేవారు కాదు. మూడేళ్ళ క్రితం వరకు చాలా బిజీ. ఎందుకు ఈ వ్యాధి అంత గొప్ప ప్రతిభాశాలికి వచ్చిందో మాకూ అర్ధం కాలేదు. ఇదొక neurological  ప్రాబ్లెమ్, మెదడులోని  కణాలు త్వరితగతిన మార్పు చెందుతాయని, మెమరీ లాస్ కలుగుతుందని  చెప్పారు డాక్టర్స్, కుటుంబంలో ఎవరికైనా ఇటువంటి హిస్టరీ ఉంటే మనమేమీ చేయలేము" అంటూ పైకి లేచారావిడ.

భారమైన మనసుతో ఆమె వెళ్ళిన వైపే చూస్తుండి పోయింది వైదేహి.  
 
(సమాప్తం )

No comments:

Post a Comment