*స్వాధిష్ఠాన చక్ర అనుభవాలు* - 2
మూలం : కపాల మోక్షం
అనుభవం, అనుభూతి : పవనానంద సరస్వతి
అక్టోబరు 22: ఈ రోజు విచిత్రంగా ఇతరులు కష్టాలు పడుతుంటే నాలో తెలియని వికృత ఆనందం కలుగుతుంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఏమో?
అక్టోబరు 25: ఈ రోజు నా వలన జీవహింస జరిగినది. బాధ కి బదులుగా ఆనందము వేస్తోంది. పావురాలు పట్టే వాడు, పావురాలు పడుతున్నపుడు నేను కళ్ళార చూస్తూన్నాను. అలా ఉండిపోయాను. అవి వాడికి దొరికి విలవిలలాడుతుంటే బాధ పడవలసిన చోట నాలో ఆనందం కలుగుతుంది. అసలు ఇది ఎక్కడికి దారి తీస్తుంది. నేను నా గురుదేవుడిని అడగాలి.
అక్టోబర్ 28: మా గురుదేవులుని అడిగితే “నాయనా! నువ్వు ఎప్పుడైతే ఈ స్వాధిష్టాన చక్రం జల సిద్ధి వచ్చినదో లేదో పరీక్షించినావో ఆనాటి నుండి ఈ చక్రం నెమ్మదినెమ్మదిగా బలహీన పడుతూ వస్తోంది. అది ఎప్పుడైతే బలహీనమైనదో ఆనాటినుండి నీకు మత్తు పానీయాలు, మత్తు పదార్థాల సేవనం ఆలోచనలు, సైకో తరహా లక్షణాలు నీలో ఏర్పడినాయి. ఇంకా బలహీనపడి ఉంటే నయం కాని వ్యాధులు, మూత్ర వ్యాధులు,మర్మాంగ వ్యాధులు, మానసిక వ్యాధులు కలుగుతాయి. కాబట్టి శలభాసనం, మార్జాలాసనం, మకరాసనం, భుజంగాసనం లాంటి ఆసనాలు వేస్తూ ఆరునెలలపాటు పెరుగన్నం తింటే ఈ చక్రం బలపడుతుంది” అని చెప్పటం జరిగినది. దానితో మరో ఆరు నెలల పాటు ఆయన చెప్పినట్లుగా చేసాను. అప్పుడు నాకు ధ్యానంలో ధన సంబంధ ఆలోచనలు, మత్తు పదార్థాల సేవనం ఆలోచనలు, మత్తు పానీయాలు సేవనం ఆలోచనలు తగ్గటం ఆరంభించి నాయి. ధ్యానం మీద తిరిగి ధ్యాస పెరిగినది.
జనవరి 10: ఈ రోజు నాకు హిమాలయాలలో దొరికే విష్ణు సాలిగ్రామం దొరికినది. దానిని పూజలో ఉంచాను.
జనవరి 30: ఈ రోజు నాకు కాశీక్షేత్రము నుండి లక్ష్మి గవ్వలు వచ్చినాయి. వీటితో గవ్వల ప్రశ్నలు వేయటం ఆరంభించాను.
ఫిబ్రవరి 18: ఈరోజు నాకు రామేశ్వర క్షేత్రములో నుండి లక్ష్మి శంఖం వచ్చినది. పూజలో ఉంచినాను.
మార్చి 2: ఈ రోజు నా ఇంటికి వెంకన్న స్వామి సహిత మహాలక్ష్మి విగ్రహ మూర్తి వచ్చినది. నవరాత్రి పూజలో,శ్రావణ మాస పూజలో,దీపావళి పూజలో లక్ష్మిపూజ చెయ్యడం ఆనవాయితీగా అయినది.
నవంబరు 10:ఈ రోజు దీపావళి. లక్ష్మి పూజ అయినది. విచిత్రంగా నాకు ధ్యానములో వైకుంఠములో ఉన్న లక్ష్మి నారాయణ మూర్తి సజీవ మూర్తిగా నన్ను ఆశీర్వదించినట్లుగా లీలగా అనిపించినది. ఆపై శూన్యములో అదృశ్యమైనారు.
....నేను స్వాధిష్ఠాన చక్రము మీద దృష్టి పెట్టి దాన్ని జాగృతి చేసుకోవాలని ధ్యానం చేస్తున్న కూడా తిరిగి మహాగణపతి స్వరూపం, ధ్యానమునందు తరచుగా ఇలా 41 రోజుల పాటు కనపడసాగింది. నాకు కారణమేమిటో తెలియరాలేదు. అంటే మూలాధార చక్ర సాధన ఇంకా పూర్తి కాలేదా ? అనే సందేహంలో సతమతమవుతుండగా ఒక రోజు ధ్యానంలో ఒక తెల్లని దివ్య మణి కనిపించసాగినది. ఇది ఏమిటి క్రొత్తగా? ఈ మణిని ఎక్కడ ఎప్పుడు కూడా చూడలేదు అనుకుంటూ... మా ధ్యానాలు వాడేమో శ్రీశైలంలో నేనేమో మా ఇంటిలో ధ్యానాలు చేస్తుంటే... ఇలా మణి దర్శనాలు రావడము ఆరంభమైనది. దీని సంకేతము ఏమిటో మాకు అర్ధము కాలేదు. కొన్ని రోజుల తర్వాత ఈ మణి లోపల మాకు కనిపించే మహా గణపతి ఉన్నట్లుగా అగుపించడము ఆరంభమైనది. వామ్మో!ఇది ఏమిటి? మణి మరియు గణపతి కలిస్తే వచ్చేది "గణపతి మణి" అంటే మనకి "గణపతిమణి" గూర్చి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నాడా?అసలు ఇంతవరకు శమంతక మణి, నాగ మణి, కౌస్తుభ మణి, రుద్ర మణి ఇలా వీటి గూర్చి పుస్తకాలలో చదివినట్లుగా గుర్తు. కాని ఎక్కడ గూడ ఈ గణపతిమణి గూర్చి చదివినట్లుగా లేదు అనుకుంటూ ధ్యానము చెయ్యడం ఈ గణపతిమణి రూపము కనపడటంతో దాని వెలుగులకి మా కళ్ళు మూసి ఉన్నా గూడ తట్టుకోలేకపోవడంతో ధ్యాన భంగమై కళ్ళు తెరవడము... ఈ మధ్య చాలా తరచుగా జరుగుతున్నది. ఇది ఇలా ఉండగా ఒక రోజు నా దగ్గరికి కాశీఖండము అనే పుస్తకము నా దగ్గరికి వచ్చింది. దాని మొదటి పేజీ తీయగానే దానిపైన మహా చింతామణి గణపతి అని ఉంది. దాని ఫోటో కూడా ఉంది.దానిని చూడగానే నాకు వెంటనే స్ఫురణ వచ్చి అంటే ఇన్నాళ్లు మనకి ధ్యానములో కనిపించేది గణపతి మణి కాదని చింతామణి గణపతి అన్నమాట. ఇది మీ ఇంట్లో ఉంటే అన్ని రకాల చింతలు తొలగిస్తాడు.అందుకే ఈ మణికి చింతామణి అనే పేరు వచ్చినట్లుగా మహాశివుడుకి ఉన్న అన్ని రకాల చింతలు "డుండి గణపతి" తీర్చటం వలన ఆయనకి చింతామణి గణపతిగా స్వయంగా మహా శివుడే నామకరణం చేసినట్లుగా ఈ పుస్తకములో చదవడము జరిగినది.
అంటే, మూలాధార చక్ర సాధన పరిసమాప్తి అయింది... అనటానికి సూచనగా చింతామణి గణపతి వస్తాడని మాకు అర్థమయింది. కానీ ఎలా? ఈ కాలంలో అది ఎక్కడ ఉంది? అది మాకు ఎలా వస్తుంది? అది తీసుకుంటే మాయలో పడతామా లేదా మాయ దాటుతామా? ఏమీ అర్ధం కాని స్థితి అన్నమాట. అక్కడ ఇదే పరిస్థితిలో శ్రీశైలంలో మా జిజ్ఞాసి కూడా ఉన్నాడు. వాడికి అది చింతామణి గణపతి అని తెలిసినది.
యోగ సాధనలో...ఆశ, భయము, ధనము, కాంత, స్పందన మహామాయలు వస్తాయని యోగులు తమ అనుభవాల ద్వారా లోకానికి తెలియ చేసినారు. ఇందులో మనవాడు అలాగే నేనుగూడ మాకు తెలియకుండా చింతామణి చూడాలని ఆశ నాకు ఉంటే దానిని ఎలాగైనా పొందాలని ఆశ వాడికి కలిగినది. మేము ఆశ, మాయలో కూడా ఉన్నామని గ్రహించలేని స్థితి అన్నమాట.ఇలా కొన్ని రోజుల తర్వాత మా వాడికి ధ్యానంలో చింతామణి ఎక్కడ ఉందో ఏ రూపంలో ఉందో కనపడ సాగింది. వెంటనే వాడు తనకి ధ్యానములో కనిపించిన చోటుకి వెళితే అక్కడ నల్లటి, తెల్లని,జేగురు శిలా శకలం కనపడినది.దానిని చూస్తుంటే కూర్చుని ఉన్న గణపతి ఆకారంగా ఉంది కానీ అది మణి లాగా మెరవడం లేదని మణికాంతులు లేవని నాకు టెలిపతి ద్వారా తెలియజేసినాడు జిజ్ఞాసి. నాకు దాంతో ఎలాగైనా దానిని ఒకసారైనా చూడాలని ఆశ కలిగినది. కానీ ఆ అవకాశమే లేదు. మేమిద్దరం కూడా మా సాధన పరిసమాప్తి అయ్యేదాకా ఒకరినొకరు ప్రత్యక్షంగా ఎదురు పడకూడదని అనుకున్నాము కదా......!
చింతామణి గణపతి అనుభవాలు :
జిజ్ఞాసికి దొరికిన శిలను వాడు పరీక్షలు చెయ్యటం మొదలు పెట్టినాడు. “నాకు ఆకలి వేస్తుంది నీవు నిజముగా చింతామణివి అయితే ఈ చింతను తొలగించు”... అనగానే ఎవరో భక్తుడు ఇక్కడికి వచ్చి చక్కెర పొంగలి ప్రసాదంగా ఇచ్చి వెళ్లినాడట. అయితే ఇప్పుడు “నాకు విపరీతమైన దాహం వేస్తోంది. దాని చింత తీర్చు” అనుకోగానే “స్వామి! నా దగ్గర మంచినీళ్లు డబ్బాలు మూడు దాకా ఉన్నాయి. అవి నాకు అవసరం లేదు. బరువు తగ్గుతుంది కదా. ఈ బాటిల్స్ తీసుకోండి” అంటూ ఒక యువకుడు వచ్చి వాటర్ బాటిల్స్ ఇచ్చాడట. ఈసారి ఇలా కాదనుకొని దుఃఖ చింత లేకుండా చెయ్యి చూద్ధాం అనుకున్నాడట. కొన్ని నిమిషాల తర్వాత ఎవరో పిలిచినట్లు ఒక సాధువు తన దగ్గరికి వచ్చి “స్వామి! మీరు కూడా సన్యాస దీక్ష లో ఉన్నారా? మంచిది. ఇంత చిన్నవయసులోనే దీక్ష తీసుకున్నారా? మంచిది. ఆశ మోహాలు ఛేదించి పరమాత్మ వైపు నడవాలని అనుకుంటున్నారు. మీలాంటి వారికి మాలాంటి వారికి చింతలు తప్పడం లేదు. ఆకలి దప్పికలు బాధలు ఉండనే ఉంటాయి. కానీ దుఃఖ బాధ కూడా ఉంటుంది. ఏమీ లేదు స్వామి! కొన్ని సంవత్సరాల నుండి నేను ఒకరితో కలిసి సాధన చేస్తున్నాను. రాత్రి వాడికి ఉన్నట్టుండి విపరీతమైన ఆయాసం వచ్చి గుండెనొప్పి అంటూ గుండె పట్టుకొని చనిపోయాడు. వాడిని అలా చాలా దగ్గరగా చూసిన వాడిని, వాడి చావును కూడా చూసే సరికి ఆపుకోలేని దుఃఖం వస్తుంది. అన్నీ వదిలేసిన మనకి దుఃఖం దేనికి స్వామి. దానిని కూడా వదిలేయాలి. స్వామి! వదిలేయాలి అంటూ వీరావేశముతో అతనికి చెప్పి దుఃఖమును జయించాలి... జయించాలి... దానికి చింత తొలగించుకోవాలి” అంటూ వెళ్ళిపోయాడట. మన వాడికి నోట మాట రాలేదట. వామ్మో! దీనిని ఏమి అడిగితే అది తీరుస్తుందని మనకున్న చింతలు తొలగిస్తుందని గ్రహించి దానికి నమస్కారాలు చేస్తూ “చింతామణి గణపతి! నన్ను క్షమించు. నీవు నా దగ్గరికి వచ్చి గంట కూడా కాలేదు. అంతలోనే నా మనస్సుకి ఎన్నో కోరిక చింతలు కల్గించావు. వాటిని తీర్చావు. అదే నీవు నా దగ్గర ఉంటే నా బ్రతుకు లేని పోని కోరికలతో గడిచిపోతుంది. నన్ను క్షమించు.నిన్ను భరించడం నా వల్ల కాదు. నేను కోరిక లేని వాడిలాగా మారాలని అనుకుంటున్నాను. నువ్వేమో కోరికలు తీర్చే వాడి లాగా ఉన్నావు. కోరిక లేని వాడికి కోరిక ఇచ్చే వాడితో ఏ పని ఉంటుంది. నువ్వు అవునా... కాదా... అని పరీక్షించినందుకు నన్ను క్షమించు. నువ్వు నాకు ఎక్కడ దర్శనమిచ్చినావో నిన్ను అక్కడే ఉంచుతాను అని దానిని తీసుకొని ఏ మాత్రం ఆలోచించకుండా యధాస్థానంలో పెడుతుండగా ... ఆ రాతి నుండి కొన్ని రకాలైన మెరుపు కాంతులు రావటం గమనించాడట.
దానిని దొరికిన చోట పెట్టి వెనుతిరిగి చూడకుండా ముందుకు సాగిపోయానని నాకు వివరాలు తెలియ చేసినాడు.
No comments:
Post a Comment