Monday, November 23, 2026

 [11/16, 13:06] +91 90404 36395: *✍🏽నేటి కథ ✍🏻*


*మోసం చేసిన మోసం*

ఒక పిల్లల కోడి, తన చిట్టి పొట్టి కోడి పిల్లలను వెంట బెట్టుకొని చెత్తకుప్పల మీద తిరుగుతూ పురుగులను ఏరుకొని తింటూ వుంది. కోడిని, కోడిపిల్లలను చూడగానే, ఆ పక్కనే కలుగులో వున్న పాముకు నోరూరింది. ఎలాగైనా ఓ కోడి పిల్లను మింగాలనుకుంది. తల్లి కోడి చూస్తూ వుండగా, పిల్ల కోడిని పట్టుకుంటే, తల్లి కోడి వాడి ముక్కుతో తన కళ్ళు పొడిచేస్తుందని పాముకు తెలుసు!

అందు కోసం ఏదైనా ఎత్తు వేయాలని అనుకొని, చచ్చిన దానిలాగ ఓ పక్కగా పడుకుంది. పాము! పాము అంటే ఇంకా భయం ఎరుగని కోడి పిల్లలు ఇటూ అటూ తిరుగుతూ, ఆ పాము మీద నుంచి ఈ పక్కకూ, ఆ పక్కకూ గెంతుతూ వున్నా పాము కదలకుండా, మెదలకుండా పడుకునే వుంది.

పాము మీద నుంచి గెంతుతూవున్న పిల్లలను చూసి కోడి భయపడింది. కదలకుండా వున్న ఆ పామును చూసి, అది చచ్చి పడి వుందని అనుకొని, తల్లికోడి పక్కగా పోయింది. ఇంతలో చీకటి పడుతూ వుండడం వల్ల, పిల్లలను వెంట బెట్టుకొని తల్లి కోడి వెళ్ళి పోయింది. అయితే వెనుక బడిన ఓ కోడి పిల్లను నోట కరచుకొని, పాము చరచరా పారిపోయింది!

తన ఎత్తు బాగా పని చేసిందని సంతోషించింది పాము. మరునాడు కూడా మరో కోడి పిల్లను తినవచ్చునని, అదే చోటున చచ్చినట్టుగా పడుకుంది కోడి పిల్లలు అటు వచ్చే సమయానికి!

పురుగులను ఏరుకొని తింటూ, కోడి, కోడిపిల్లలు మామూలుగా అటు వచ్చాయి. తల్లికోడి, అచట పడి వున్న పామును చూసింది. "నిన్నటి నుంచీ ఇలాగే పడి వుంది. చచ్చిపోయిందో ఏమో, చూద్దామని", పాము దగ్గరగా వచ్చి ముక్కుతో దానిని దొర్లించింది. పాము వెల్లికిలాపడినా కదల లేదు, మెదల లేదు. కోడి పిల్లలు అటూ ఇటూ తిరుగుతూ పక్కగా వెళ్ళి పోయాయి. ఇంతలో రివ్వున ఓ గద్ద, బాణంలా దూసుకు వచ్చి ఆ పామును తన్నుకు పోయింది!

"పామును చంపిన వాడా! దానిని బోర్లా పడెయ్యకు, వెల్లకిలా పడేయ్" అని సామెత! మామూలుగా పడుకుని వున్న పామును సాధారణంగా, గద్ద తన్నుకు పోదు. వెల్లకిలా పడి వుంటేనే, చచ్చిందని తన్నుకుపోతుంది. కోడి పిల్లలను తినాలని దొంగ ఎత్తు వేసిన పాముకు, దాని దొంగ ఎత్తే దాని చావుకు కారణమైంది!
[11/16, 13:22] +91 90404 36395: *అత్తా కోడళ్ళ కథ (జానపద హాస్య కథ)* - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
**************************
      ఒకూర్లో ఒక అత్త వుండేది. ఆమెకు కోడలంటే అస్సలు పడేది కాదు. చీటికీ మాటికీ ఆమెను తిడతా కొడతా ఏడిపించేది. ఒకరోజు అత్త తన ఇంటి పెరట్లో ఒక బీరగింజ నాటింది. కొద్ది రోజులకే అది బాగా పెరిగి పెద్దదై కుప్పలు తెప్పలుగా కాయలు కాయసాగింది...
కోడలికి ఆ బీరకాయలు తెంపుకోని మంచిగా కూర చేసుకొని తినాలని ఎంతో ఆశ. కానీ అత్తేమో ఆ కాయలన్నీ తెంపి తానొక్కతే వండుకోని బాగా తినేది. మిగిలితే ఎదురింటోళ్ళకు, పక్కింటోళ్ళకు ఇచ్చేదేగానీ కోడలికి మాత్రం ఒక్క ముక్క కూడా పెట్టేది కాదు.
ఒక రోజు వాళ్ళింటికి అత్త చిన్న తమ్ముడు వచ్చి "ఆకా... అకా...  ఈ వారం నా కూతురి పెళ్ళి. నువ్వు తప్పకుండా మా వూరికి రావాల" అని పట్టుపట్టినాడు. సరేనని అత్త తమ్మునితోబాటు పెళ్ళికి పోయింది. అంతే... అత్త అట్లా బైటికి పోవడం ఆలస్యం, కోడలు సంబరంగా వురుక్కుంటా పెరట్లోకి పోయి బీరకాయలన్నీ తెంపి కూర వండుకోని బాగా తిని, తీగ మొత్తం పీకి దిబ్బలో పడేసింది.
నాలుగు రోజుల తర్వాత అత్త వచ్చి చూస్తే ఇంగేముంది తీగా లేదు, కాయలూ లేవు. ఇదంతా కోడలు పనేనని గ్రహించిన అత్తకు ఆమె మీద పీకల దాకా కోపమొచ్చింది. రాత్రి కోడలు అన్నం తిని నిద్రపోగానే ఓ పెద్దకర్ర తీసుకోనాచ్చి ఆమె నెత్తిన ఒక్కటేసింది. అంతే ఆ దెబ్బకు కోడలు కళ్ళు తిరిగి స్పృహ తప్పి అచ్చం శవం మాదిరి పడిపోయింది. ఎంత కదిపినా లెయ్యలేదు. అది చూసి కోడలు చచ్చిపోయిందని అనుకోనింది అత్త.
అంతలో ఆమె కొడుకు పొలం నుండి ఇంటికి వచ్చినాడు. వెంటనే అత్త దొంగ ఏడుపు ఏడుస్తా "రేయ్! నీ పెండ్లానికి ఏమయిందో ఏమో... ఎంత పిల్చినా పలకడం లేదు. పో! పోయి చూడుపో" అనింది. దాంతో వాడు పోయి పెండ్లాన్ని అటూ యిటూ కుదిపినాడు. గట్టిగా పిలిచినాడు.
ఆమె స్పృహలో లేదు కదా. అందుకే ఏమీ మాట్లాడ లేదు. దాంతో వాడు కూడా పెండ్లాం చచ్చిపోయిందని అనుకున్నాడు.
ఇద్దరూ శవాన్ని తీసుకోని చీకట్లోనే శ్మశానానికి పోయినారు. దాన్ని కట్టెల మీద పడుకో బెట్టి అంటిద్దామని చూస్తే అగ్గిపెట్టె లేదు. దాంతో అత్త "రేయ్! నువ్వు ఇంటికాడికి పోయి అగ్గిపెట్టె తీసుకోని రాపో" అని కొడుక్కి
చెప్పింది. దానికి వాడు "నాకొక్కనికే చీకట్లో పోవాలంటే భయం. నువ్వు కూడా తోడుగా రా" అన్నాడు. సరేనని ఆమె కొడుకుతో పాటు వూళ్ళోకి పోయింది.
వాళ్ళట్లా వూళ్ళోకి పోయిన కాసేపటికే కోడలికి స్పృహ వచ్చింది. లేచి చూస్తే ఇంకేముంది... శ్మశానంలో కట్టెల మీదుంది. ఆమెకు జరిగిందంతా అర్ధమై నెమ్మదిగా లేచి పక్కనే పడున్న తుమ్మమొద్దుకు తన తెల్లచీర సగం చించి కట్టి, దానిని కట్టెల మీద పెట్టింది. తానేమో పక్కనే వున్న చింతచెట్టు మీదకు ఎక్కి ఏం జరుగుతుందా అని చూడసాగింది. కాసేపటికి అగ్గిపెట్టె తీసుకోని కొడుకుతో అక్కడికొచ్చింది అత్త. చీకటి కదా సరిగా కనబడక తుమ్మ మొద్దునే కోడలనుకోని నిప్పు పెట్టింది. బాగా మంట అంటుకోని, కాలి బూడిదైపోగానే వాళ్ళు తిరిగి వెళ్ళిపోయినారు.
కోడలు చింతచెట్టు దిగుదామనుకుంటుండగానే నలుగురు దొంగలు అక్కడికి వచ్చినారు. వాళ్ళు చింతచెట్టు కిందనే కూర్చుని చుట్టుపక్కల వూళ్ళలో ఎత్తుకొచ్చిన బంగారం, రత్నాలు, వజ్రాలు, నగలు కుప్పలు కుప్పలుగా పోసి ఎవరి భాగం వాళ్ళు పంచుకోసాగినారు. ఇదంతా పైనుండి చూస్తా వున్న కోడలు ఎట్లాగైనా సరే ఆ బంగారం కొట్టేయాలనుకోని 'ఓ' అని దయ్యం మాదిరి భయంకరంగా అరుస్తా దభీమని వాళ్ళ మీదకు దుంకింది. అంతే నలుగురు దొంగలు అదిరిపడినారు. చూస్తే యింకేముంది తెల్లచీరతో, జుట్టంతా విరబోసుకుని 'ఓ' అని ఊగుతా వుంది. వాళ్ళు వచ్చింది దయ్యమేననుకోని భయంతో గజగజా వణుకుతా ఎక్కడివక్కడ వదిలేసి తలో దిక్కు పారిపోయినారు. కోడలు బంగారమంతా మూటగట్టుకోని సంబరంగా ఇంటికి పోయింది. తలుపులేమో మూసి వున్నాయి. దాంతో 'అత్తా! అత్తా!" అని పిలుస్తా తలుపు కొట్టసాగింది. ఎవరబ్బా అని లేచి తలుపు తెరిచిన అత్తకు ఎదురుగా కోడలు కనబడేసరికి ఇది దయ్యమై నన్ను పీక్కుతినడానికే వచ్చిందనుకోని భయపడి అక్కడికక్కడే గుండె పగిలి దభీమని కిందపడి చచ్చిపోయింది. పెండ్లాన్ని చూసి మొగుడు గజగజా వణుకుతా వుంటే ఆమె జరిగినదంతా చెప్పింది. వాడు “అలాగా" అని సంబరపడినాడు. ఆమె తెచ్చిన బంగారంతో పదంతస్తుల మిద్దె కట్టుకోని హాయిగా బతకసాగినారు.
**************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
**************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
[11/16, 13:22] +91 89192 91603: # ***మా అమ్మ కళ్లద్దాలు***

అమ్మకు వయసు మీద పడింది. ఆమె చేతులు కొద్దిగా వణికేవి. మోకాళ్లు నొప్పి పెట్టేవి. కళ్ల చూపు కూడా మందగించింది. ఆమె తరచూ తన కళ్లద్దాలను ఎక్కడో ఒకచోట పెట్టి మర్చిపోయేది. ఒక్కోసారి భోజనం చేసే బల్ల మీద, మరొకసారి పూజ గదిలో, ఇంకోసారి తన చీర కొంగులోనే పెట్టుకుని వెతుక్కునేది.

ప్రతి ఉదయం ఒకే విధంగా మొదలయ్యేది.

*“నా కళ్లద్దాలు ఎక్కడున్నాయమ్మా?”* అని ఆమె మృదువుగా, కొంత ఆందోళనతో అడిగేది. ప్రతి ఉదయం నా భార్య పెద్దగా నిట్టూర్చేది.

*“ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు. ఆవిడ వల్ల ఇల్లంతా గందరగోళంగా తయారవుతోంది.”*

నేను పైకి నవ్వినట్లు నటించేవాడిని. కానీ లోలోపల నాకు కూడా చిరాకు కలిగేది.

ఒకరోజు అమ్మ టీ తయారు చేస్తుండగా, ఆమె చేతిలోని స్టీల్ గ్లాసు జారిపోయింది. అది నేలపై శబ్దం చేస్తూ దొర్లింది. టీ కింద ఒలికి, నేలపై గోధుమ రంగు మరకలా వ్యాపించింది.

నా భార్య గట్టిగా అరిచింది.

*“సరిగ్గా కనిపించనప్పుడు ఇలాగే జరుగుతుంది! కాస్త జాగ్రత్తగా ఉండలేరా?”*

నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అందరి ముందూ అమ్మపై కోపంతో అరిచాను.

*“మీరు ఎప్పుడూ ఏదో ఒక సమస్య సృష్టిస్తూనే ఉంటారు. మీ కళ్లద్దాలను సరిగ్గా పెట్టుకోలేరా? సరిగ్గా కనిపించకపోతే వస్తువులను ముట్టుకోవడం ఎందుకు?”*

అమ్మ కదలకుండా నిలబడిపోయింది. వంటగది అరుగు అంచును పట్టుకుని నిల్చుంది. ఆమె కళ్లలో నీళ్లు నిండాయి. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మౌనంగా తన గదిలోకి వెళ్లిపోయింది.

ఆ రాత్రి అమ్మ దగ్గుతున్న శబ్దం వినిపించింది. అయినా నేను ఆమె దగ్గరకు వెళ్లలేదు. నాలో నేనే ఇలా చెప్పుకున్నాను.

*“ఆమె బాగానే ఉంటుంది.”*

ఆ రోజు నుంచి అమ్మ బయటకు రావడం తగ్గించేసింది. టీ చేయడం మానేసింది. పూజ కోసం పూలు సర్దడం మానేసింది. కళ్లద్దాల కోసం అడగడం కూడా మానేసింది.

ఎవరికీ కనిపించకుండా, ఇంట్లో ఒక మూలన నిశ్శబ్దంగా కూర్చునేది. తన ఉనికి ఇతరులకు భారమని ఎవరో మాటలతో చెప్పకపోయినా, అర్థమైపోయిన మనిషిలా ఉండేది.

ఒక మధ్యాహ్నం, ఎవరికీ ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతో, లైట్ వేయకుండానే బాత్‌రూమ్‌కు వెళ్లడానికి ప్రయత్నించింది.

అంతే, కాలు జారి కిందపడిపోయింది. ఆమె కళ్లద్దాలు కిందపడి ముక్కలయ్యాయి. తలుపు చట్రానికి తల బలంగా తగిలింది.

మేము ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి, ఆమె మెదడుకు తీవ్ర గాయం అయిందని వైద్యులు చెప్పారు.

ఆమె ప్రాణాలతో బయటపడింది... కానీ మునుపటిలా మాత్రం ఎప్పటికీ కాలేకపోయింది.

మంచానికే పరిమితమైపోయింది. కళ్ళు తెరిచే ఉండేవి, కానీ వాటిలోని వెలుగు మసకబారిపోయింది.

కొన్ని నెలల్లోనే ఆమె మమ్మల్ని విడిచి వెళ్లిపోయింది.

అమ్మ అంత్యక్రియల రోజున, ఒకప్పుడు ఆమెపై నేను అరిచిన అదే వంటగదిలో నిలబడ్డాను. ఆ గదిలో అలుముకున్న నిశ్శబ్దం నా జీవితమంతటి కంటే భారంగా అనిపించింది.

కొంతకాలం తర్వాత మేము ఇంటికి మరమ్మతులు చేయించాము. కర్టెన్లు మార్చాము. ఫర్నిచర్ మార్చాము. నేలపై టైల్స్ కూడా మార్చించాము.

ఒకరోజు వడ్రంగి వచ్చి,

*“ఈ పాత చెక్క అరను తీసేయమంటారా? ఇది కొంచెం వదులుగా ఉంది”* అని అడిగాడు.

అది పూజ గది దగ్గర ఉన్న చెక్క అర. అమ్మ ఎప్పుడూ తన కళ్లద్దాలను అక్కడే పెట్టేది.

అమ్మమ్మతో ఎంతో అనుబంధం ఉన్న నా కూతురు వెంటనే,

*“వద్దు. దాన్ని తీసేయకండి”* అని చెప్పింది.

ఆమె లోపలికి వెళ్లి ఒక చిన్న సంచిని తీసుకొచ్చింది. అందులో అమ్మ పగిలిపోయిన కళ్లద్దాలు ఉన్నాయి. వాటి ఫ్రేమ్ వంగిపోయి ఉంది. అద్దాలు పగుళ్లతో ఉన్నాయి.

నా కూతురు వాటిని దగ్గరగా పట్టుకుని,

*“వాటిని అక్కడే ఉంచండి. అమ్మమ్మ ఎప్పుడూ అక్కడే పెట్టుకునేది”* అని చెప్పింది.

వడ్రంగి నవ్వుతూ,

*“అమ్మా, ఇక్కడ ఒక చిన్న గాజు పెట్టె తయారు చేద్దాం. ప్రదర్శన వస్తువులా అందంగా ఉంటుంది”* అన్నాడు.

అలా మా కొత్తగా అలంకరించిన ఇంట్లో ఒక చిన్న గాజు పెట్టె తయారైంది. అందులో అమ్మ పగిలిపోయిన కళ్లద్దాలను భద్రంగా ఉంచాము.

ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి దృష్టి ఆ పెట్టెపై పడేది. కొందరు ఆశ్చర్యంగా అడిగేవారు.

*“పగిలిపోయిన కళ్లద్దాలను అలంకరణ వస్తువులా ఎందుకు పెట్టుకున్నారు?”*

అప్పుడు నా కూతురు గర్వంగా సమాధానం చెప్పేది.

*“అవి మా అమ్మమ్మ కళ్లద్దాలు. వాటితోనే ఆమె ఈ ప్రపంచాన్ని చూసింది. వాటితోనే ఆమె మమ్మల్ని పెంచి పెద్ద చేసింది.”*

ఆ మాటలు విన్నవారు మౌనంగా ఉండిపోయేవారు. కొందరు కళ్లనీళ్లు తుడుచుకునేవారు.

కాలం గడిచింది. నాకు కూడా వయసు మీద పడింది. నా కంటి చూపు మందగించడం మొదలైంది. పేపర్‌లోని అక్షరాలు మసకగా కనిపించేవి. అమ్మలాగే నేను కూడా నా కళ్లద్దాల కోసం వెతకడం మొదలుపెట్టాను.

ఒకరోజు అవి కనిపించకపోవడంతో చిరాకుగా అరిచాను.

*“నా కళ్లద్దాలు ఎక్కడున్నాయి?”*

నా భార్య ఫోన్‌లో నుంచి తల పైకెత్తి కోపంగా చెప్పింది.

*“వాటిని సరిగ్గా పెట్టుకోవాలి కదా! ఇల్లంతా గందరగోళం చేయకండి!”*

ఆ మాటలు చెంపపై కొట్టినట్లుగా అనిపించాయి.

ఆమె మాటలు కఠినంగా ఉన్నందుకు కాదు. ఎన్నో సంవత్సరాల క్రితం నేను అమ్మతో అన్న మాటలే కాలం తిరిగి నాకు వినిపించినందుకు.

నేను నెమ్మదిగా పూజ గదిలోకి నడిచాను. అక్కడ ఉన్న గాజు పెట్టె ముందు నిలబడ్డాను.

అమ్మ పగిలిపోయిన కళ్లద్దాలు నిశ్శబ్దంగా అక్కడే ఉన్నాయి.

ఎన్నో సంవత్సరాల తర్వాత మొదటిసారిగా మనసులో అమ్మతో మాట్లాడాను.

*“అమ్మా... నన్ను క్షమించు.”*

అంతలో నా మనవడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. నా చేయి పట్టుకుని,

*“తాతయ్యా, మీ కళ్లద్దాలు ఇక్కడే ఉన్నాయి! మీరు తల మీద పెట్టుకున్నారు!”* అని చెప్పాడు.

అతను నవ్వాడు. తర్వాత నన్ను గంభీరంగా చూస్తూ,

*“తాతయ్యా, కళ్లద్దాలు లేకుండా నడవకండి, సరేనా? కిందపడిపోతారు”* అన్నాడు.

నా చేయి పట్టుకుని నెమ్మదిగా నన్ను నడిపించాడు.

నా కళ్లలో నీళ్లు తిరిగాయి. నేను బలహీనుడిని కాబట్టి కాదు. నిజమైన బలం అంటే ఏమిటో చివరికి అర్థమైందని.

ఆ సాయంత్రం నా మనవడు తన స్కూలు నోట్‌బుక్ తీసుకొచ్చాడు.

*“తాతయ్యా, డ్రాయింగ్‌లో నాకు పూర్తి మార్కులు వచ్చాయి!”* అని సంతోషంగా చెప్పాడు.

నేను ఆ పేజీ తెరిచి చూశాను.

అది మా పూజ గది దగ్గర ఉన్న చెక్క అర బొమ్మ. ఆ అరలో ఒక చిన్న గాజు పెట్టెను కూడా గీశాడు. ఆ పెట్టెలో పగిలిపోయిన కళ్లద్దాలను చిత్రించాడు.

దాని కింద తన చిన్నచిన్న అక్షరాలతో ఇలా రాశాడు:

**“వృద్ధుల కళ్లకూ గౌరవం అవసరం.”**

నన్ను నేను ఆపుకోలేకపోయాను. నా గదిలోకి వెళ్లి చిన్నపిల్లాడిలా ఏడ్చాను.

పెద్దగా కాదు.

ఎన్నో రోజులుగా మనసులో పేరుకుపోయిన అపరాధ భావన, చివరకు నిజాన్ని అంగీకరించినప్పుడు కరిగిపోయే వేళ వచ్చే ఏడుపు అది.

**జై హింద్! 🇮🇳**
forward message

No comments:

Post a Comment