Monday, November 23, 2026

🌹దాంపత్యం🌹

 🌹దాంపత్యం🌹

అప్పుడే పూజ ముగించుకుని హల్ లో కొచ్చి కుర్చీలో కూర్చున్నాను, టిఫెన్ పెట్టమంటారా అత్తయ్యగారు అన్న లహరి మాటలకు, 
ఆ పెట్టమ్మా అన్నాను
తను ప్లేట్ లో మూడు ఇడ్లీలు కొబ్బరి పచ్చడి తీసుకుని వచ్చి నా ముందు పెట్టి తినండి అత్తయ్య అంటూ వంటింట్లోకి వెళ్ళింది,
ఎందుకో ఉదయం నుండి లహరి కాస్త మూడిగా వుంది. అప్పుడప్పుడు చెంగుతో కళ్ళు తుడుచుకోవడం గమనించాను, 
లహరి చాలా మంచి పిల్ల నెమ్మదస్తురాలు. మాకు దూరపు బంధువు, మా అబ్బాయి అజయ్ కి తనకు పెళ్ళి అయి ఆరు సంవత్సరాలు కావస్తోంది, ఇద్దరు పిల్లలు పాప, బాబు.
తను మాఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి మాలో ఎంతో కలిసిపోయింది, మేము కూడా తనని మా అమ్మాయిలాగే చూసుకుంటాము.
నాకు ఒక అమ్మాయి అబ్బాయి, అమ్మాయి పేరు శ్రీ లత పెళ్ళి అయి భర్త పిల్లలతో తన కాపురం తను చక్కగా చేసుకుంటోంది. అబ్బాయి అజయ్ సాఫ్టువేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు, మా అబ్బాయికి కూడా ఇద్దరు పిల్లలు ఒక పాప, ఒక బాబు.
మావారు బ్యాంక్ ఎంప్లాయ్ గా రిటైర్ అయ్యారు. రెండు సంవత్సరాల క్రితం కాలం చేశారు.

ఇప్పుడు నేను మా అబ్బాయి, కోడలు, పిల్లలతో వుంటున్నాను, 
దేవుడి దయవల్ల చెప్పుకోతగ్గ ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. ఈ వయసులో అందరికీ వుండే మామూలు షుగర్, బీపీ సమస్యలు మాత్రమే,
కాలం ప్రశాంతంగా గడిచిపోతోంది, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా నా పని నేను చేసుకోవడం, వీలైతే నా చేతనైన సహాయం లహరికు చేయడం, లేదంటే కృష్ణా, రామా అనుకోవడం, ఇదీ నా దినచర్య.

ఎందుకో ఉదయం నుండి లహరి మొహంలో ఏదో బాధ, ఈరోజే కాదు. గత కొద్ది రోజులుగా ఈ విషయాన్ని గమనిస్తున్నాను.
మెల్లగా లేచి వంటింట్లోకి అడుగు పెట్టాను, లహరి వంటిల్లు సర్థుతోంది
లహరీ అని పిలిచాను
ఎంటత్తయ్య ఏదైనా కావాలా ? అంటూ అడిగింది.
ఏమీ లేదు కానీ, ఒకసారి ఇలా రా అంటూ తన చేతిని పట్టుకుని హల్ లోకి తీసుకుని వచ్చి సోఫాలో కూర్చుని
నేను నిన్ను ఒక మాట అడుగుతాను చేస్తావా ? అని అడిగాను, అడగండి అత్తయ్య అని బదులు చెప్పింది.
నేను కొద్దిరోజులుగా నిన్ను గమనిస్తున్నాను, నువ్వు ఏదో బాధ పడుతున్నట్లు అనిపిస్తోంది, మొహంలో ఏదో దిగులు కనపడుతోంది, 
విషయం ఏమిటో నాకు చెప్తే నేను నీకు ఏదైనా సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను, నేను  ఎప్పుడూ నిన్ను నా బిడ్డగానే చూసాను , నీకు అభ్యంతరం లేక పోతే చెప్పు సరేనా అన్నాను, అంతే ఒక్కసారి నన్ను పట్టుకుని భోరున ఏడిచేసింది. ఒక్క క్షణం కంగారు పడ్డాను, అంతలో సర్దుకుని మెల్లగా తన వీపు నిమురుతూ వుండిపోయాను. కాసేపటికి తను కాస్త కుదుట పడింది, తన కళ్ళ నీళ్ళు తుడుస్తూ ఇప్పుడు చెప్పు అసలు ఏమిటి సంగతి అని అడిగాను
లహరి మెల్లగా చెప్పడం మొదలు పెట్టింది,

ఏమిటో అత్తయ్యా  ఈమధ్య మీ అబ్బాయి నాతో అస్సలు మాట్లాడటం లేదు, నాతో కాస్త సమయం కూడా గడపడం లేదు, ఎంతసేపటికీ ఆయన ఆఫీసు, ఆయన పనులు, ఆయన ఫ్రెండ్స్, లేదంటే ఫోన్, 
ఉదయం లేవగానే వాకింగ్, తరవాత న్యూస్, తరవాత స్నానం, టిఫెన్ ఆఫీస్ కి బయలుదేరి వెళ్ళి పోవడం, సాయంత్రం ఇంటికి రాగానే మళ్లీ  ఫ్రెండ్స్, లేదంటే ఫోన్ మళ్ళీ తినడం పడుకోవడం ఇంతే నేను ఏదైనా మాట్లాడాలి అనుకున్నా అలిసి పోయాను. నిద్ర వస్తోంది అనో, లేదా విసుక్కోవడం చేస్తున్నారు. నన్ను ఒక మనిషిగానే గుర్తించడం లేదు ఎంతసేపటికి ఆయనకు అన్నీ అమర్చిపెట్టే ఒక  మిషన్ లాగా చూస్తున్నారు, 
ఇంట్లో వున్న ప్రాణం లేని వస్తువులకు నాకు తేడా ఏమీ కనిపించడం లేదు అత్తయ్యా, నేను కూడా ఒక మనిషినే కదా ఎంతకని సహించను అంటూ కన్నీరు పెట్టుకుంది,
నేను ఒక నిట్టూర్పు విడిచాను మళ్ళీ నన్ను నేను లహిరిలో చూస్తున్నట్లు అనిపించింది,
ఊరుకో లహరి అన్నీ సర్దుకుంటాయి. నువ్వు ధైర్యంగా వుండు అని చెప్పాను, తను సరే అత్తయ్య అని కళ్ళు తుడుచుకుని వెళ్ళి పోయింది తరవాత చాలా సేపు ఆలోచిస్తూ కూర్చున్నాను,

పక్కరోజు ఆదివారం అజయ్ ఇంట్లోనే ఉన్నాడు, ఉదయం టిఫిన్లు అన్నీ అయ్యాక అజయ్ రూమ్ వద్దకు వెళ్ళి అజయ్ నీతో కొంచెం మాట్లాడాలి అన్నాను, 
ఏమిటమ్మా ఏదైనా ముఖ్యమైన విషయమా ? అని అడిగాడు, 
అవును అన్నాను సరే  రామ్మా కూర్చో అన్నాడు, ఇక్కడ కాదు పైన మేడ మీదకి వెళదాం అన్నాను, తను నా వైపు ఆలోచనగా చూసి సరే పద అన్నాడు ఇద్దరం మేడ పైకి వెళ్ళాము, 
ఇద్దరం అక్కడ వున్న కుర్చీల్లో కూర్చున్నాక ఆ ఇప్పుడు చెప్పమ్మా ఏమిటి విషయం అన్నాడు.
నేను మెల్లగా మొదలు పెట్టాను.
చూడు అజయ్ 
ఒక ఆడపిల్ల పెళ్ళి పేరుతో పుట్టిన ఇంటినీ తన కన్నవాళ్ళను, తన వారిని అందరినీ వదిలి భర్త అనే ఒక్క బంధాన్ని నమ్ముకుని అత్తగారి ఇంట్లో అడుగు పెడుతుంది.
తన చుట్టూ ఎన్ని బంధాలు వున్నా  భర్త ప్రేమ, భర్త తోడు ఎక్కువగా కోరుకుంటుంది, భర్త అన్ని విషయాలను తనతో పంచుకోవాలని, తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తిగా తను వుండాలి అని కోరుకుంటుంది అది తన హక్కు, అలా జరగనప్పుడు మానసికంగా బాధ పడుతుంది, వొంటరి తన్నాని ఫీల్ అవుతుంది.
నీకు తెలుసో లేదో మీ నాన్నని నేను పెళ్ళి చేసుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు నా వయసు పంతొమ్మిది యేండ్లు. తెలిసీ తెలియని వయసు, ఇంక నీకు అంతా మీ ఆయనే అని పెద్దవాళ్ళు చెప్తే అదే నిజం అనుకుని ఆయనే నా సర్వస్వం అనుకుని వచ్చాను,
మీకు తెలుసుగా మీ నాన్నగారిది పెద్ద కుటుంబం, నేను ఇంట్లో అడుగు పెట్టే నాటికి ఇంట్లో మీ తాతయ్య, నానమ్మ, ఇద్దరు అత్తలు, మీ బాబాయ్, ఇంత మంది వుడేవాళ్ళం.
కోడలిగా అడుగు పెట్టిన నాటినుండి బాధత్యలు మోయడమే అలవాటు అయిపొయింది, 
ఇంటి కోడలిగా నేను, ఇంటి పెద్ద కొడుకుగా మీ నాన్న అన్ని భాద్యతలు సక్రమంగా నిర్వర్తించాము, 
నిన్ను, అక్కని చక్కగా పెంచాము, మీకు చేయవలసినవన్నీ చేసాము, 
నాకు కూడా మీ నాన్న తిండికి గుడ్డలూ ఏ లోటూ చేయలేదు కానీ ... కానీ...నేను ఆయన దగ్గర ఎదురు చూసిన ప్రేమ ఆదరణ నాకు మీ నాన్న దగ్గరినుండి దొరకలేదు, అంత మందిలో వుండి  కూడా వొంటరితనాన్ని అనుభవించాను, ఎప్పుడు చూసినా ఆయన పనులు, ఆయన సంతోషం, ఆయన స్నేహితులు, ఆయన కాలక్షేపం తప్ప ఏరోజూ నా గురించి ఆలోచించలేదు. నేను కూడా ఒక మనిషినని నాకు కూడా ఒక మనసు వుంటుంది అని, దానికీ కొన్ని ఆశలు ఇష్టాలు వుంటాయి అని ఆయన ఏనాడూ ఆలోచించ లేదు, ఏ రోజూ ఆయన తన భావాలను నాతో  పంచుకోలేదు. నా భావాలను తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు, భార్యా భర్తలుగా కలిసి  వున్నాము ఆన్న మాటే కానీ ఏనాడూ కలిసి జీవించలేదు, బాగా చూసుకోవడం అంటే తిండి,గుడ్డ ఇవ్వడం కాదు. మనసు తెలుసుకుని ప్రవర్తించడం,
ఏదో బాధ గొంతుకు అడ్డం పడడంతో కాస్త ఆగాను. మెల్లగా సర్దుకుని చూడు అజయ్ ప్రతి భార్య తన భర్త నుండి, ప్రతి భర్త తన భార్యనుండి ముఖ్యం గా కోరుకునేది ప్రేమ, ఆప్యాయత, కాస్త సమయం, ఇవి దొరక నప్పుడు జీవితం నిరాశగా నిస్సారంగా మారుతుంది.
వొంటరితనం వెంటాడుతుంది, 
నువ్వు తెలివైన వాడివి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఎందుకు మాట్లాడుతున్నానో ఈపాటికి నీకు అర్థం అయివుంటుంది అనుకుంటున్నాను, 
ఒక్కసారి భార్యా భర్తలు మానసికంగా దూరం అయితే ఆ దూరాన్ని ఎవరూ దగ్గర చేయలేరు,
ఎదుటివారు నీ ప్రేమను కోరుకుంటున్నప్పుడు నీవు ఆ ప్రేమను అందించ లేకపోతే , అదే ప్రేమను నీవు కోరుకున్నప్పుడు నీకు ఆ ప్రేమను అందించే స్థితిలో అవతలి వారు వుండక పోవచ్చు. అప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం అవుతుంది, అర్థం అయిందా అన్నాను,
తల వంచుకుని కూర్చున్న అజయ్ నా వంక చూసాడు ఆ కళ్ళలో కన్నీటి తడి,
నా రెండు చేతులు పట్టుకుని క్షమించమ్మా, నాకే తెలియకుండా చాలా పెద్ద తప్పు చేశాను. లహరిని చాలా బాధ పెట్టాను అన్నాడు, 
నేను చిన్నగా నవ్వాను 
నాకు తెలుసురా అజయ్ నా పెంపకం మీద నాకు నమ్మకం వుంది అయినా నువ్వు కూడా ఒక మగవాడి వేగా అందుకే కాస్త కంగారు పడ్డాను అన్నాను, 
ఇదరం తేలిక పడ్డ మనసులతో కిందికి వచ్చాము

ఆ తరువాత నేను నా కోడలు లహరి మొహంలో సంతోషం తప్ప బాధ, దిగులు ఏనాడూ చూడలేదు.

          శుభం

రచన
కోడూరి మాధవి
24-2-24

No comments:

Post a Comment