Monday, November 23, 2026

 సహజ స్వభావం

చీకటి ఎంత దట్టంగా ఉన్నా దీపం వెలుగును పంచడం మానదు; ప్రవాహానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా నది గమ్యం దిశగా తన ప్రయాణాన్ని ఆపదు. బాహ్య ప్రపంచపు ప్రతికూలతలకు లొంగక, జంకక మనోస్థైర్యంతో ముందుకు సాగే నిర్భయులే మహాపురుషులవుతారు. వారు గుర్తింపు కోసం ఆరాటపడకుండా తమ సహజ ధర్మాన్ని ప్రదర్శించి ఇతరుల జీవితాలను ప్రకాశమానం చేసే మహనీయులు.

ఈ సృష్టిలో ప్రతి జీవికీ, ప్రతి వస్తువుకూ ఒక నిర్దిష్టమైన సహజ గుణం ఉంటుంది. పరిస్థితులు మారినా, ఎదుటివారి ప్రవర్తన ఎలా ఉన్నా, తమ మూలధర్మాన్ని విడిచిపెట్టని వారి తత్వాన్ని మన ఇతిహాసాలే కాదు, నిత్య జీవిత దృష్టాంతాలు కూడా అద్భుతంగా ఆవిష్కరిస్తాయి. ఎన్నిసార్లు తనను రక్షించినా, తేలు సాధువును కుట్టడం మానలేదు. సాధువు రక్షించడమూ మానలేదు. మానవ జాతిని ఉద్ధరించేవారు అవరోధాలను లెక్కచేయరు, తమ లక్ష్యాన్ని వదలరని ఇలాంటి కథలు విశదీకరిస్తాయి.

అడవిలో ఒక పుష్పం వికసిస్తుంది. దాన్ని చూసేవారూ, అందాన్ని పొగిడేవారూ, సువాసనను ఆస్వాదించేవారూ ఎవరూ అక్కడ ఉండరు. అలాగని అది వికసించడం మానేస్తుందా? తన పరిమళాలను దాచుకుంటుందా? వికసించడం, పరిసరాలను పరిమళభరితం చేయడం దాని సహజ స్వభావం. ఇది నిష్కామ కర్మ లేదా ప్రతిఫలాపేక్ష లేని త్యాగానికి ప్రతీక. సమాజం మెచ్చుకుంటుందని, పదిమంది పొగుడుతారని చేసేది బాహ్యాడంబరం అవుతుంది. కానీ, ఏ ప్రతిఫలమూ ఆశించకుండా కేవలం తన కర్తవ్యంగా, మనస్ఫూర్తిగా చేసేదే నిజమైన సేవ. ఆ ఒంటరి పువ్వు లాంటిదే నిస్వార్థమైన మనసు ఉన్నవారి ప్రవర్తన. సంఘ సంస్కర్తలు, మహనీయుల జీవనయానాన్ని పరిశీలిస్తే ఇదే బోధపడుతుంది. సమాజంలో వేళ్లూనుకున్న మూఢనమ్మకాలు, అన్యాయాలు, అసమానతలను రూపుమాపడానికి ముందుకు వెళ్లిన సంస్కర్తలకు సమాజం నుంచి రాళ్ల దెబ్బలు, అవమానాలు, బహిష్కరణలే ఎదురయ్యాయి. అయినప్పటికీ వారు వెనకడుగు వేయలేదు. తమ మానవతా పరిమళాలను సమాజమనే వనంలో పరివ్యాపితం చేయకుండానూ ఉండలేదు. దేశ స్వాతంత్య్రమే ఆశయంగా పోరాడిన మహాత్ముడు ఎన్నిమార్లు జైలుకెళ్లారో మనకు తెలుసు. స్త్రీవిద్య, సంక్షేమానికి కంకణం కట్టుకున్నందుకు ఫులె దంపతులను వెలివేశారు. రోడ్డు మీద నడుస్తుంటే నానా మాటలూ అన్నారు, రాళ్లు రువ్వారు. రాజా రామ్మోహన్‌ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం, అంబేడ్కర్‌... ఎవరి జీవితకథ చూసినా సమాజం వాళ్లకు ఎన్ని పరీక్షలు పెట్టిందో తెలుస్తుంది. వాటిని ఎదుర్కొంటూనే తాము నమ్మిన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టారు. భావితరాల మీద తమదైన ముద్ర వేయగలిగారు. వారి గమ్యం కీర్తి ప్రతిష్ఠలు కాదు, జాతిని జాగృతం చేయడమే.

జీవితం అనేది నిరంతర నదీ ప్రవాహం. ఎందరు ఎన్నిసార్లు ఆటంకాలు సృష్టించినా, మంచితనాన్ని పరీక్షించినా, మనలోని సహజమైన కరుణా స్వభావాన్ని కోల్పోకూడదు. మానవీయ లక్షణాలను వీడకూడదు. అదే మానవ జన్మకు సార్థకత. అడవిలో ఒంటరిగా వికసించే పువ్వులా నిస్వార్థంగా జీవించడమే విశ్వంతో మమేకమయ్యే అమృత ప్రయాణం.

~సేకరణ ✍️

No comments:

Post a Comment