Saturday, September 6, 2025

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ

             భక్తుడు :
భగవాన్! మీరు అస్తమించబోతున్నారు. ఈ జన్మలో నాకు రవ్వంత జ్ఞానం కూడా కలగలేదు. వచ్చే జన్మలో నా గతేమిటి ?
               మహర్షి :
ఎందువల్ల మనం ఈ జన్మలో కలుసుకున్నాము?

               భక్తుడు :
    నా పూర్వజన్మ పుణ్యం వల్ల.
                మహర్షి :
   మరి ఈ జన్మ పుణ్యం వల్ల, వచ్చే జన్మలో మనం కలుసుకోకుండా ఎట్లా ఉండగలం? భయపడకండి. నేను మీతో ఉంటాను.

  **

   ఓం నమో భగవతే శ్రీ రమణాయ

మహర్షి ఎప్పుడూ చెప్పులు వేసుకునే వారు కాదు. ఎంత ఎండైనా సరే వట్టి కాళ్లతో మెల్లగా నడిచి వెళ్ళేవారు. కాని తన వెంట వచ్చే భక్తులను "చెప్పులు వేసుకోమని, నీడకు వెళ్లండి" అని మాత్రం తొందర పెట్టేవారు మహర్షి.

  ఒక వేసవి కాలం మధ్యాహ్నం ఒంటిగంటకు మండే ఎండలో అరుణగిరి వైపు మెల్లగా నడిచి వెళుతున్నారు మహర్షి. పక్కనున్న భక్తుణ్ణి "పై పంచను కాళ్లకు చుట్టుకోమని, చెట్టు నీడకి పరిగెత్తి వెళ్లమని" తొందర పెట్టసాగారు మహర్షి.

  *

శారదా దేవి :

   పగ్గం భగవంతుని చేతులోవున్నా కొంత స్వతంత్రం కూడా మనకు ఇచ్చి ఉన్నారు. మంచీ, చెడ్డా రెండూ నీ ఎదుట ఉన్నాయి, నీకు కావాల్సిన దానిని తీసుకో. ఇందులోనే లోకక్రీడ జరుగుతున్నది.

  ఒకరు పాపం మాత్రం చేసుకుంటూ, మరొకరు పుణ్యం మాత్రం చేసుకుంటూపోతే లోకక్రీడ జరగదు. దాగుడుమూతల ఆటలో అమ్మను తాకగానే ఆట ఆగిపోతుంది. అందరూ తనను తాకడాన్ని అమ్మ ఇష్టపడదు. ఎవరూ తాకకుండా ఉండడమూ ఇష్టపడదు. రెండింటిలో ఏది జరిగినా ఆట ఆగిపోతుంది.

  *

   ఓం నమో భగవతే శ్రీ రమణాయ

ఒకరోజు మహర్షి భోజనానంతరం ప్రతిరోజు ప్రకారం కొండ ప్రక్కకు వెళ్తుండగా, ఆశ్రమం ప్రక్కనున్న మామిడి చెట్టు కాయలకై కొంతమంది బాలురు చెట్టు పైకి రాళ్లు రువ్వుతూ, కాయలతో పాటు ఆకులను, కొమ్మలు, రెమ్మలను రాలుస్తున్నారు.

అందుకు మహర్షి ఆ పిల్లలతో “మీకు కావలసింది కాయలు. అవి కోసుకోవటంలో తప్పులేదు. కాని అనవసరంగా కొమ్మలు, రెమ్మలు విరిచి, ఆకులు త్రుంచి, చెట్టుకెందుకు హింస కలుగు చేస్తారు?” అంటూ వారిని మందలించారు.

  *

క్రియాయోగము :

  దైవ సాక్షాత్కార సిద్ధికి తోడ్పడే శాస్త్రీయ ప్రక్రియ అయిన క్రియాయోగం, చివరికి అన్ని దేశాలకీ వ్యాపించి, అనంత పరమపిత అయిన పరమేశ్వరుణ్ణి గురించి మానవుడికి కలిగే వ్యక్తిగత అతీంద్రియ దర్శనం ద్వారా, దేశాల మధ్య సామరస్యం కలిగించడానికి తోడ్పడుతుంది.

No comments:

Post a Comment