Saturday, September 6, 2025

 213 వ భాగం 
🕉️ అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18 
శ్లోకము 1

యస్య బోధోదయే తావత్ స్వప్నవద్బవతి భ్రమః|
తస్మై సుఖైక రూపాయ నమః శాంతాయ తేజసే||

నిత్య ఆనంద శాంత 
తెజోవిరాజితమైన ఆత్మ తత్వానికి నమస్సులు. ఆ ఆత్మ జ్ఞానము లభిస్తే మనకుండే అజ్ఞాన జనిత భ్రమాజ్ఞానమంతా స్వప్నము వలె అదృశ్యమైపోతుంది.

శాస్త్రాన్ని బుద్ధితో చదివి అర్థం చేసుకున్నంత మాత్రాన ధ్యాన మార్గంలో మనసు నిలబడదు. సత్యాన్వేషణలో మన సమగ్ర వ్యక్తిత్వమంతా పనిచేసినప్పుడే ధ్యానం మొదలవుతుంది. మత ధర్మానుసారమైన బాహ్య వేషధారణ కర్మలు శరీరానికి చెందినవి. ప్రధానమైన భక్తి గౌరవాలు మానసికమైనవి. మన లక్ష్యాన్ని మార్గాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం బుద్ధికి చెందిన ధర్మం. ధ్యానం సాధ్యం కావటానికి మన వ్యక్తిత్వములోని ఈ మూడు భాగాలు సమానంగా సహకరించాలి. ఇది సమగ్ర వ్యక్తిత్వంతో సాధన చెయ్యటం అనబడుతుంది. బ్రహ్మనిష్ఠుడైన అష్టావక్ర మహర్షి అద్వయము అచింత్యము అయిన ఆత్మ తత్వము గురించి చెప్పబోతున్నప్పుడు కూడా ఆ ఆత్మతత్వానికి నమస్సులు అర్పిస్తూ మొదలు పెట్టడంలో గల అంతరార్థం ఇదే... సాధకుడు సమగ్ర వ్యక్తిత్వముతో సాధన చేసినప్పుడే ధ్యానం సాధ్యమవుతుందని ఆత్మకు నమస్సులు అర్పించడంలో స్పష్టం చేస్తున్నారు. తనలోని ఆత్మకు తానే అయిన ఆత్మకు తాను ప్రణామము చేస్తూ శిష్యుడికి మార్గదర్శకులు అవుతున్నారు.

చైతన్య స్థానము భావన రూపమైన సమస్త జగత్తుకు అధిష్టానముగా ఇక్కడ సూచించబడినది. ఆ అధిష్టానాన్ని గుర్తించిన తక్షణమే అద్యాస అయిన జగత్తు అదృశ్యమైపోతుంది. తాడును గుర్తించిన తక్షణమే పాము దృశ్యము అంతరించిపోతుంది. స్తంభమును గుర్తించగానే భూతం అదృశ్యమైతుంది. ఆత్మను గుర్తించడంలో అహంకారము, అహంకార కల్పనా దృశ్యాలు అంతర్హితం అయి తీరుతాయి. చూస్తూ ఉన్న భ్రమను నిజంగా తలపోయటమే అభ్యాస అనబడుతుంది. సత్యాసత్యాలలో తేడాలు గుర్తించకపోవడమే అధ్యాస అని అర్థం.

ఇక్కడ యోగ వాసిష్టంలో ఒక శ్లోకంలో వివేకానికి నమస్సులు అర్పించడం గుర్తుకు వస్తుంది.
ఓ వివేకమా నీకు ఇవే నా 
నమోవాకాలు. నా మనసుకు ప్రభల శత్రువు అయిన భ్రమాజ్ఞానాన్ని అంతము చేయగలిగావు. ఈ భ్రమే ఇన్నాళ్లు ఇది నేను, ఇది వచ్చింది, ఇది నాది అనుకున్నట్లు చేయగలిగింది. నీవలననే భ్రమను పోగొట్టుకొని నిత్య శాంత మనసుతో హాయిగా నిశ్చలంగా ఉండగలుగుతున్నాను. వివేకమా స్వీకరించు నా నమస్సులు.🙏🙏🙏

No comments:

Post a Comment