Saturday, September 6, 2025

 212 వ భాగం 
🕉️ అష్టావక్ర గీత🕉️ 
అధ్యాయం 18

ఈ అధ్యాయము చేసే ఇంద్రజాలము మనలను అనంత ఆనందమయ స్థితిలోనికి తీసుకొని పోతుంది. ధ్యానానుకూలమైన మనసున్న ఏ సాధకుడైన సరే అష్టావక్రుడు చూపించే పవిత్రమైన అనుభవ సానిధ్యంలో మౌనంగా మిగిలి పోవలసిందే. ప్రత్యేక ప్రయోజనముతో పరస్పర విరుద్ధ భావాలుగా గోచరిస్తూ అందమైన కల్పనలేమో అని భ్రమ కోల్పోతూ అద్భుత భావ సౌందర్య గాంభిర్యాలతో మనలను ఆకర్షించి తమ వెంట తీసుకొని పోయే ఈ అధ్యాయంలోని శ్లోకాలు చివరగా మనలను మన ఊహకందని స్థితిలో అహంకార రహితంగా అద్భుతమైన ఆత్మానుభవ స్థితులను చేరుస్తాయి.

బ్రహ్మ నిష్టుడైన ఆత్మజ్ఞాని జీవితము మనఃస్థితి ముఖ్యంగా ఈ అధ్యాయంలో వర్ణించబడ్డాయి. ఇందులో ఇంద్రజాలమంతా వర్ణించిన పదాలలో కాక పద పదానికి మధ్య పదాలు సూచించే పదములో గర్భితమై ఉంది. గమ్యాన్ని చేరాలి అనే పట్టుదలతో దీక్షతో ధ్యాననిష్టలో ప్రయాణము చేసే ప్రయాణికులు ,ఈ శ్లోకాలు వాహనాలై జీవన గమ్యానికి ఆధ్యాత్మిక సాధన లక్ష్యానికి అనాయాసంగా చేర్చగలవు. మాటలు చెప్పలేనిది మనసు గ్రహించలేనిది అయిన మన స్వస్తితిలో నిష్టులను చేయగలవు.

ఈ అధ్యాయం అంతటా శ్లోకాలతో పయనించిన వారు గమ్యాన్ని చేరడంలో విఫలులైయిన రాబోయే కాలం అంతట సహజ సమాధి స్థితులై మన మధ్య జీవిస్తున్న మహర్షులపై భక్తి ప్రేమ గౌరవాలతో మౌనంగా నిలబడి తమ జీవన లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ మహాత్ముల అడుగుజాడలలో జీవించాలి అనుకుంటారు. ఆత్మ తత్వాన్ని "పూర్ణస్వరస విగ్రహ"... అని అంటారు. సర్వ రసాలు సంపూర్ణంగా మూర్తిభవించిన ఈ స్థితిని అందరూ కాంక్షిస్తూనే ఉన్నారు. అయినా లభించడం లేదంటే దృఢమైన నిర్ణయం లేకపోవడమే కారణం అని ఒప్పుకోవాలి.🙏🙏🙏

No comments:

Post a Comment