Saturday, September 6, 2025

 214 వ భాగం 
🕉️ అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18 
శ్లోకము 2

ఆర్జయిత్వా$ఖిలానర్థాన్ 
భోగానాప్నోతి పుష్కలాన్|
నహి సర్వపరిత్యాగం అంతరేణ సుఖీభవత్||

అసంఖ్యాకమైన వస్తువులను ఆర్జించి పుష్కలంగా సుఖ భోగాలను అనుభవించవచ్చును. వీటి అన్నిటిని త్యజిస్తేనే తప్ప నిజమైన ఆనందం లభించదు.

ఈ శ్లోకాన్ని చదవగానే పరస్పర విరుద్ధ భావాలు గోచరిస్తాయి. మొదటి పాదములో ఎంత ఎక్కువగా వస్తువులను సంపాదించితే అంతగా సుఖ భోగాలను అనుభవించని స్పష్టముగా తెలుస్తుంది. వెనువెంటనే వాటన్నిటినీ త్యజిస్తేనే నిజమైన ఆనందం లభిస్తుందని చెబుతున్నారు. సుఖ అనుభవానికి ఆనందానికి గల తేడా తెలియకపోవడం చేతనే ఈ వైరుధ్యము కనిపిస్తుంది. ప్రతి మనిషి కోరుకునేది ఆనందాన్ని అయితే ఆనందాన్ని పొందటానికి విష భోగాలను అనుభవించడమే మార్గంగా అందరూ భావిస్తున్నారు. సాధనాలుగా ఉపయోగపడే సుఖానుభవాలను సాధింపవలసిన లక్ష్యమైనా ఆనందంగా సాధారణంగా అందరూ పొరపడుతూ ఉంటారు.

ఇంద్రియాలు వాటికి అనుకూలమైన వస్తువు సాంగత్యంలో తాత్కాలికమైన సుఖాలను అనుభవిస్తున్నాయని అందరూ ఒప్పుకుంటారు. అయితే నిజానికి మనిషికి కావలసింది శాశ్వతము పూర్ణము అయిన ఆనందమే గాని తాత్కాలికమైన సుఖానుభవము కాదు. ఈ సుఖానుభవము కోసం ప్రయత్నాన్ని వ్యధని విడనాడినప్పుడే శాశ్వత ఆనందానికి మార్గం గోచరిస్తుంది. కోరికలు అలజడిని అశాంతిని సృష్టిస్తాయి. అలజడి చెందిన మనసు విచార ఆవృతం అవుతుంది. కోరికలను విడువగలిగితే ఆలోచనల అలజడి తగ్గుతుంది. అలా శాంతించిన మనసే ఆనందానికి ఆటపట్టు. ఈ విధంగా కోరికలు తగ్గే కొలది అశాంతి తగ్గుతుంది .అశాంతి తగ్గిన కొద్ది ఆనందం పెరుగుతుంది. తక్కువ కోరికలు, తక్కువ అశాంతి, ఎక్కువ ఆనందం. కాబట్టి కోరికలు లేని స్థితి ఆలోచన రహితస్థితి .అదే అనంత ఆనంద నిలయమైన ఆత్మానుభూతి.

సర్వ విషయాలు వస్తువులు అదృశ్యమైన సుషుప్తి లో అందరికీ ఆనందం ఉంది .నిజానికి ఏ ఆనందమైన అనుభవింపబడేటప్పుడు వస్తువు ఉనికి గుర్తింపు ఉండదు. కేవలం ఆనంద మాత్రమే ఉంటుంది, ఇదే ఆత్మ స్వభావము.🙏🙏🙏  

No comments:

Post a Comment