Tuesday, January 28, 2020

కర్తవ్యం

కర్తవ్యం

🌹మనం ధనానికి దాసులం అయితే, దైవానికి క్రమంగా దూరం అయిపోతున్నట్టు.

బొట్టు బొట్టుగా ఆగకుండా పడే నీటితో కుండ నిండుతుంది. అందులోని నీరు స్వచ్ఛంగా ఉంటుంది.

అలాగే జ్ఞానం, ధనం, పుణ్యం పోగు చేయడానికి కూడా అలాంటి మార్గమే అనుస రించాలి.

ధనవంతునిగా అయ్యేందుకు కాకుండా, ఆనందంగా జీవించడానికి ప్రయత్నించాలి.

ధనం నుంచి గుణం రాదు. కానీ, సద్గుణాలు అలవర్చుకుంటే ధనంతో పాటు తనకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి.

మనం సంపాదించిన డబ్బును మనం శాసించగలిగితే మనం నిజమైన శ్రీమంతులం. కానీ, మన ధనం మనల్ని శాసిస్తుంటే, మనం ధనానికి దాసులం. అప్పుడు మనకు తెలియకుండానే దైవానికి దూరం అవుతున్నట్టు లెక్క.

కష్టాలు, విఘ్నాలు మనసును బలహీనపరుస్తుంటాయి.

వాటి నుంచి ఎలా బయటపడాలి?

మనం ఎప్పుడూ విజయాన్నే కోరుకోవడం వల్ల బాధకు లోనవుతున్నాం.

కష్టాలు, విఘ్నాలు కొందరికే పరిమితం కాదు. అవి అందరినీ ఏదో సమయంలో పలకరిస్తూనే ఉంటాయి. బాధైనా, కోపమైనా మితంగానే ఉంటాయి.

ఎవరికైనా రోజూ కష్టాలే ఉండవు. కాకపోతే వాటినే ఎక్కువగా గుర్తుంచుకుని బాధపడు తుండటం వల్ల ముందుకు వెళ్లలేకపోతుంటాం.

మనకు లభించిన సంతోషాలను మనం గుర్తుంచు కోవడం లేదు. లేదా అత్యాశ వల్ల పట్టించుకోవడం లేదు.


మన విధానం ఎలా ఉండాలో తెలియ చెప్పడమే అవతార పురుషుల ఆంతర్యం.

శ్రీరాముడు, హనుమంతుడు కూడా సీతాదేవి విష యంలో అంతులేని బాధను అనుభవించారు. ఆమె కనిపించలేదని హనుమంతుడు చనిపోవాలని కూడా అనుకున్నాడు.

కష్టాలు, విఘ్నాలను తట్టుకోవడంలోనే మన మనో నిగ్రహం తెలుస్తుంది.

శ్రీరాముడు సీతాదేవి కోసం దు:ఖించాడే తప్ప అలాగే చింతిస్తూ కూర్చుండి పోలేదు.

అంత బాధలోనూ తన కర్తవ్యాన్ని విస్మరించనంత ధీరత్వంతో ఉన్నాడు.

విజయం కోసం ఆయన వెంపర్లాడలేదు. కేవలం ధర్మంగా తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు. అదే మనకు సద్బోధ.

అందుకే మనం వదలాల్సింది.. కర్తవ్యాలను కాదు. మన కర్మలను వదులుతూ జీవన గమనాన్ని కొనసాగించాలి. 🌹

No comments:

Post a Comment