Friday, June 19, 2020

మనిషిని మనసు తో అనుసంధానం చేయ గలది ధ్యానం ఒక్కటే.

మనిషిని మనసు తో అనుసంధానం చేయ గలది ధ్యానం ఒక్కటే.

ధ్యాన సాగరం లో ఉన్నప్పుడు మాత్రమే నిజమైన నేను ఏంటో నాకు తెలుస్తుంది. – శ్రీ చిన్మయి.
ప్రార్ధించడం అంటే మీరు భగవంతునితో మాట్లాడడం,ధ్యానం అంటే మీతో మీరు మాట్లాడడం.

ధ్యానం, భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసిన అద్భుతమైన విద్య. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శరీరం ఆరోగ్యాంగా ఉండడానికి వ్యాయామం ఎంత అవసరమో మనసు ఆరోగ్యాంగా ఉంచడానికి ధ్యానం కూడా అంతే అవసరం. ధ్యానం అనేది ఏ మతానికి సంబంధించినది కాదు, కానీ ధ్యానం ప్రతి మతంలోనూ భాగంగానే ఉంటుంది. మనం శారీరకంగా ఎంత ధృడంగా ఉన్నా కూడా మానసిక బలం చాలా అవసరం. మీ మనసు ఎలా ఆలొచిస్తే మీ జీవితం ఆలాగే ముందుకు సాగుతుంది. మన మనసులోని ఆలోచనలే మన జీవితాన్ని నిర్ణయిస్తున్నాయి. ఆ ఆలోచనలకు మనం బంధీ కాకుండా ఉండాలంటే. మనకు ఉన్న అత్యుత్తమ మార్గం ధ్యానం. నిశ్చలంగా మరియు ఏకాగ్రతతో ఉన్నపుడు, ఒక వ్యక్తి తనలోని ఆత్మను వీక్షించగలడని బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది. మీ ఆత్మను మీరు వీక్షించడమంటే మిమ్మల్ని మీరు పూర్తిగా తెలుసుకున్నట్టే.

ధ్యానం కేవలం ఆధ్యాత్మికమే కాదు : భగవంతుణ్ణి చేరుకోవడానికి ధ్యానం మార్గమయినా, ధ్యానం కేవలం భగవంతుణ్ణి చేరుకోవడానికి మాత్రమే కాదు. మనల్ని మనం తెలుసుకోవడానికి. ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుంది. మనల్ని మనం మార్చుకోవడానికి దోహదం చేస్తుంది. సమకాలీన ప్రపంచం లో చాలా మంది వ్యక్తులు ఒత్తిడి, ఆందోళన,నిరాశ మరియు బాధ లాంటి ఎన్నో మానసికమైన అంశాలతో బాధపడుతున్నారు. ఇలాంటి మానసిక బాధలను తగ్గించడానికి ధ్యానం చాలా వరకు ఉపయోగపడుతుంది. మనసులోకి చెడు ఆలోచనలు రాకుండా నిలువరించడానికి కూడా దోహదం చేస్తుంది. చేస్తున్న పని మీద ఏకాగ్రత సాధించడానికి ఆలోచనలు నియంత్రించడానికి ధ్యానం విశేషంగా ఉపయోగపడుతుంది. జ్ఞాపక శక్తిని పెంచడానికి కూడా తోడ్పడుతుంది.
ధ్యానం మీ మనసుకు నాలుక లాంటిది. మీ ఆత్మకు భాషలాంటిది.

మీ జీవితంలో ఆందోళనను జయించాలంటే, ఈ క్షణంలో జీవించండి, ఈ శ్వాసలో జీవించండి -అమిత్ రామ్.

అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో, మనిషిలో సమూలమైన పరివర్తన కలగక పోతే ఈ యుద్ధాలు, ఈ హింసాకాండ, ఈ విధ్వంసము ఇట్లాగే కొనసాగుతూ ఉంటాయి. – జిడ్డు కృష్ణమూర్తి.

ధ్యానం ఎలా చెయ్యాలి?

ధ్యానం చాలా సులువైన ప్రక్రియ. అదే సమయం లో ధ్యానం కష్టమైన ప్రక్రియ కూడా ధ్యానం చేయడానికి ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. గాలి బాగా వచ్చే ప్రదేశమైతే ఇంకా మంచిది. ధ్యానానికి పద్మాసనం లో గానీ లేదా సాధారణంగా బాసపీట వేసుకుని గానీ కూర్చోవచ్చు. వెన్నెముక నిటారుగా ఉండేటట్లు చూసుకోవాలి. తల కొద్దిగా పైకెత్తి ఉండాలి. రెండు చేతులు తొడలమీద ఉంచుతూ అర చేతులు ఆకాశం వైపు ఉండేలా చూసుకోవాలి. నెమ్మదిగా శ్వాసను గమనిస్తూ ఉండాలి. దృష్టిని రెండు కనుబొమ్మల మధ్య కేంద్రికరించాలి. మన శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. మనసులోకి ఏ విధమైన ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. ఏ ఆలోచనలు లేకుండా శ్వాసపైన దృష్టి పెట్టడమే చాల కష్టమైన అంశం. మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఆలోచనలు నెమ్మదిగా. ఒక్కొక్కటిగా వదిలించు కుంటూ శ్వాస మీద మాత్రమే కేంద్రికరించాలి. ఒక సారి ధ్యానం చెయ్యడానికి కూర్చున్నపుడు. కనీసం 12 నిమిషాల పాటు ధ్యాన సాగరం నుంచి లేవకూడదు. 12 నిమిషాల పాటు ఏ ఆలోచనలు లేకుండా శ్వాసమీదనే ద్యాస ఉంచాలి. ఇలా రోజుకు రెండు సార్లు 48 రోజుల పాటు చేయడం వలన. మీలో గణనీయమైన మార్పులు సాధ్యపడతాయి.

ఒక వ్యక్తి ధ్యాన సాగరం లోకి వెళ్లి మళ్ళి సాధారణ స్థితికి చేరుకున్నప్పుడు. అతను ముందు ఉన్న వ్యక్తి కాదు ఖచ్చితంగా అతనిలో మార్పు కలుగుతుంది. – భాంతి హెనిపోలా గుణరత్న.

ధ్యానం రోజు ఒకే సమయం లో చేయాలని నియమం ఏమి లేదు. ధ్యానం చేయడానికి ఏ సమయమైన అనుకూలమే. అలాగే మీకు ధ్యానం చేయడం అలవాటు అయితే మీరు ఏ ప్రదేశాలలోనైనా ధ్యానం చేయగలరు. మీరు ప్రయాణిస్తూ వున్నా కూడా మీరు ధ్యానం చెయ్యగలరు. ఇలాంటి ధ్యానం చేయగల స్థితికి రావడానికి కొంచం ఎక్కువ సమయమే పడుతుంది. కానీ అది అందరికీ సాధ్యమైన విషయమే. 24 గంటలు కలిగిన రోజులో 24 నిముషాలు మనకోసం మనం కేటాయించుకోగలిగితే నిజంగా మన జీవితంలో గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది.

No comments:

Post a Comment