Tuesday, June 16, 2020

నాకు టైమ్ లేదు, నాకు టైమ్ సరిపోవటం లేదు అని అంటూంటారు. మరి వారందరూ అంటున్న ఆ టైమ్ దేనికి లేదు, ఎందుకు లేదు

🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘

👌ప్రస్తుతం ప్రతిఒక్కరూ నాకు టైమ్ లేదు, నాకు టైమ్ సరిపోవటం లేదు అని అంటూంటారు. మరి వారందరూ అంటున్న ఆ టైమ్ దేనికి లేదు, ఎందుకు లేదు. మరి ఆ కథా కమామీషు ఏమిటో ఒకసారి పరిశీలిద్దామా..👌

నేను పది రోజుల యోగ శిక్షణా తరగతులను నిర్వహిస్తూ ఉంటాను. ఉదయం 5 - 8 గంటల వరకు, సాయంత్రం 6 - 9 గంటల వరకు సంపూర్ణ యోగ శిక్షణా తరగతులు ఉంటాయి. నిజానికి ఆ సమయంలో శిక్షణకు వచ్చే వారికి వృత్తి పరంగా, వ్యాపార పరంగా ఎలాంటి అడ్డంకి ఉండదు. కానీ అయినా కూడా మాకు టైమ్ లేదంటూ క్లాసులకు రావడం లేదు. అరె బాబు ఇది మీ ఆనందం కోసం, మీ ఆరోగ్యం కోసం, మీ మానసిక ప్రశాంతత కోసం, మీ దీర్ఘఆయుస్సు కోసమే అని ఏంతో మొత్తుకొని చెప్పినా, అదేదో గురువు గారు క్లాసుల పేరుతో మా సర్వస్వాన్ని దోచుకు పోతాడేమో అని వారి అభిప్రాయం. ఇదంతా చూస్తున్న నాకు నేను చిన్నప్పుడు విన్న ఒక కథ గుర్తుకు వస్తున్నది. ఆ కథ కొంతమందిలో నైనా మార్పు తీసుకు వస్తుంది అని ఆశిస్తున్నాను.

మధురా నగరి అనే ఒక ఊరిలో చాలామంది వ్యాపారస్తులు ఉండేవారు. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాపారంలో నిష్టాతులు. అలా వారు వ్యాపారంలో కోట్లు సంపాదించి చాలామంది కోటీశ్వరులు అయ్యారు. అలా కోటీశ్వరులు అయిన వారు, వారి వద్ద ఎన్ని కోట్లు ధనముంటే వారి ఇంటిపైన అన్ని జెండాలను ఎగుర వేస్తూ ఉండేవారు. ఆ ఊరికి ఒకనాడు ఒక సాధు పుంగవుడు వచ్చాడు. ఆయన ఆ ఊరి ప్రజల ద్వారా ఆ జెండాల గురించి తెలుసుకొని అన్నింటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంటిని గుర్తించి, ఇంటిలోనికి ప్రవేశించాడు.

ఆ సమయంలో ఆ ఇంటి యజమాని సుబ్బారావు అరుగుమీదే కూర్చుని తన లెక్కల గుమాస్తా వివరిస్తున్న లెక్కల పద్దులు చూసు కొంటూ ఉన్నాడు. అతనికి అన్ని కోట్లు సంపాదించినా ఇంకా ఏదో సంపాదించాలి అనే కోరిక చావలేదు. ఆ కోరికే అతడిలో అంతులేని అశాంతిని నింపింది. అతడు ఈ సన్యాసి రావడాన్ని చూశాడు. ఈ సన్యాసి ఏదో నాలుగు మాటలు చెప్పి నా దగ్గర డబ్బులు గుంజడానికి వస్తున్నాడు కాబోలు ఈ దొంగ సన్యాసి "అని అనుకొంటూ, స్వామి! ఈ ఇంటి యజమాని వూళ్లో లేడు. కాబట్టి మీరింక దయచేయ వచ్చును అన్నాడు సన్యాసితో. ఆయనకు వెంటనే విషయం అంతా అర్థమయి పోయింది.

ఓహో అలాగా! పాపం నేను ఆయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే! పాపం అతడికి ప్రాప్తం లేదన్నమాట! అంటూ వెనుదిరిగాడు. అప్పుడు వెంటనే సుబ్బారావు ఆయన ముందుకు వచ్చి నేనే యజమానిని నన్ను అనుగ్రహించండి అని ఆయనను లోపలికి తీసుకొని వెళ్లాక ఆ సన్యాసి అతనికి ధర్మసూక్ష్మాల గురించి తెలియజేయడం ప్రారంభించాడు. కొద్దిసేపు విన్నాక సుబ్బారావు 'స్వామి! నా సమయం చాలా విలువైనది. నేనిలా వ్యర్థ ప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది. త్వరగా మీరు చేద్దామనుకున్న ఆ ఉపకారం ఏమిటో అనుగ్రహించండి అని తొందర పెట్టాడు.

అపుడా సన్యాసి యజమానితో ఇలా అన్నాడు. 'నీ ఆయుర్దాయం ఇక ఆరు సంవత్సరాలే ఉంది' అనగానే కోపమొచ్చిన సుబ్బారావు ఇదేనా మీరు చేస్తానన్న ఆ గొప్ప ఉపకారం? అన్నాడు సుబ్బారావు అసహనంగా. అందుకు సన్యాసి అతనికొక సూది ఇచ్చి 'ఇది చాలా మహిమగల సూది, దీనిని నీ దగ్గర భద్రంగా దాచి, నువ్వు చనిపోయిన తర్వాత ఈ సూదిని జాగ్రత్తగా నాకు తెచ్చి ఇవ్వాలి ' అన్నాడు. అంతే సుబ్బారావుకి కోపం తారాస్థాయికి చేరింది. 'నీకేమైనా మతి చలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని వచ్చి నీకెలా అందజేస్తాను ' అది ఎలా సాధ్యపడుతుంది అని అరిచాడు.

ఆ సాధుపుంగవుడు శాంతంగా చూడు 'నాయనా! మరణించాక ఈ సూదినే తీసుకొని పోలేని వాడివి ఈ ఇల్లు, నీవు సంపాదించిన లక్షలు, కోట్లను నీ వెంట నీవెలా తీసుకొని పోగలవు? అని ప్రశ్నించాడు. ఆ మాటలు సుబ్బారావును ఆలోచింప జేసాయి. అతడికి కొంత జ్ఞానోదయమైంది. ఆ సన్యాసి కాళ్లపై బడి 'స్వామీ! ఇప్పటి వరకూ ధన సంపాదనే ధ్యేయంగా కోట్లు గడించినా, అశాంతితో, అజ్ఞానంలో పడి కొట్టుమిట్టాడుతూ ఎంతో జీవితాన్ని వృధా చేసుకొన్నాను. ఇప్పటికి కళ్ళు తెరిచాను‌. నాకు ముక్తిని మోక్షాన్ని పొందే మార్గాన్ని తెలియ జేయమని వేడుకొన్నాడు.

అందుకు ఆయన ఇప్పటి వరకు నీవు ఎన్నో రకాలుగా అక్రమాలు చేసి కోట్లు గడించి కోట్ల పాపాలను సంపాదించు కొన్నావు. ఇక నుండైనా దానధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదించుకో ' అన్నాడు. వెంటనే సుబ్బారావు ఆ మరునాడు చాటింపు వేయించాడు. బీద కుటుంబం వారికి ఒక్కొక్కరికి ఒక వెయ్యి రూపాయలు పంచుతానని. ఇంకేం? మరునాడు బోలెడంత మంది వచ్చి సుబ్బారావు ఇంటి ముందు క్యూ కట్టారు. సుబ్బారావు తన గుమాస్తా నొకడిని గుమ్మం వద్ద కూర్చోబెట్టాడు. డబ్బు పట్టుకెళ్లే వాళ్ళు తన గురించి ఏమను కుంటున్నారో వ్రాసుకొని చివర్లో నాకు చెప్పాలి అన్నాడు. ఆరోజు ఉదయం నుండి సాయంకాలం దాకా సుబ్బారావు వచ్చిన వారందరికీ వెయ్యి రూపాయలు చొప్పున పంచాడు.

సాయంకాలం అందరూ వెళ్ళిపోయిన తర్వాత గుమాస్తాను పిలిచి ప్రజలు తన గురించి ఏమన్నారో, వారి అభిప్రాయాలు ఏమిటో చదవ మన్నాడు. గుమాస్తా చదవడం ప్రారంభించాడు.
1వ వాడు :- ఇంకో 2 వేలిస్తే వీడి సొమ్మేం పోయింది? పిసినారి పీనుగ వీడు! అన్నాడు
2 వ వాడు :- రోజూ నాటుసారా తాగలేక చస్తున్నాను. ఈరోజు ఫారెన్ మధ్యం బాటిల్ కొనడానికి సరిపడా డబ్బును ఇచ్చి ఉండొచ్చు కదా.
3 వ వాడు :- అయ్యో! దీనికి మరికొంత కలిపి ఇవ్వకూడదూ? నా కూతురికి ఓ నగను కొనుక్కొనే వాడిని కదా? ఇస్తే ఈడి గంటేమైనా పోతుందా.

సుబ్బారావు అంతటితో ఆపు అంటూ చెవులు మూసు కున్నాడు. చాలు చాలు చదవకు.. అని వెంటనే ఊరి బయట ఉన్న సాధు పుంగవుని వద్దకు పరుగెత్తాడు. స్వామీ, నేను ఈవిధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా నన్ను తిడుతూ, అసంతృప్తే వ్యక్తపరచారు తప్ప నన్ను ఎవరూ పొగడలేదు. నేను చేసిన దానం వలన ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది స్వామీ అంటూ వాపోయాడు.

సాధువు అతనిని ఓదార్చి 'బాధపడకు నాయనా! ఈసారి షడ్రసోపేతంగా భోజనాలు తయారు చేయించి అందరికీ మంచి భోజనాలు వడ్డించు' అని బోధించాడు. సుబ్బారావు సరేనని ఊరంతా తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్లీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్లీ తన గుమాస్తాతో అన్నం తిని పోతున్న ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండివంటలతో ఊరందరికీ కమ్మని భోజనాలు పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమాస్తాను పిల్చి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు.
1 వ వాడు :- అన్నదాతా సుఖీభవ! అన్నాడు.
2 వ వాడు :- ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్లయింది? బాబుగారు చల్లగా ఉండాలి అన్నాడు.
3 వ వాడు :- అమ్మయ్య ! ఆకలి చల్లారింది. అయ్యగారిని, ఆరి భార్యాబిడ్డలను, అందర్నీ దేవుడు చల్లగా చూడాలి.

దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరచారు. సుబ్బారావు అవి వింటూ ఆనందంతో పొంగి పోయాడు. కోట్లు సంపాదించి నపుడు కూడా అతడికి సంతృప్తి లభించలేదు. కానీ అన్నం తిన్నవారి ఆశీస్సులను విన్న ఈనాడు అతనికి పూర్తి ఆత్మసంతృప్తి లభించింది. అన్నదాన మహిమ ఎంతటి గొప్పదో అతడు ఈరోజు గుర్తించాడు. ఆరోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ సంపాదించిన కోట్ల డబ్బును ఖర్చు చేసి అనేక అన్నదాన సత్రాలను కట్టించి, పేదవారు క్షుద్భాధను తీరుస్తూ అతడు తన శేష జీవితాన్ని తరింపచేసు కొన్నాడు.

కాబట్టి మిత్రులారా ! మీ పూర్తి సమయాన్ని డబ్బు సంపాదించడానికే కాకుండా ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు కూడా కేటాయించండి. భగవంతుడు మనకు రోజుకు 24 గంటలు సమయాన్ని ఇచ్చాడు. అందులో డబ్బు సంపాదన కోసం 8 గంటలు వాడుకోండి. మరొక 8 గంటలు నిద్రకోసం కేటాయించుకోండి. ఇంకా మీకు మరొక 8 గంటల సమయం ఉంటుంది. అందులో నుండి మీ శారీరక ఆరోగ్యం కోసం 1 గంటను కేటాయించలేరా? మరి ఇంకా మిగిలిన ఆ 7 గంటలను మీరు దేనికోసం కేటాయించు కొంటారో ఒక్కసారి ఆలోచించండి. ఎంత సమయాన్ని వ్యర్ధం చేస్తున్నారో మీకే అర్థమవుతుంది.

🤘సర్వే జనా సుఖినోభవంతు🤘

👌ధర్మో రక్షతి రక్షతః 👌

For Every Action Equal &
Opposite Reaction

-రామభక్త గురూజీ ప్రొద్దుటూరు.
సెల్-8328170075.

No comments:

Post a Comment