Thursday, June 25, 2020

ఏది విలునవైనది?

ఏది విలునవైనది?
🕉️🌞🌎🏵️🌼🚩

ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడి పాండిత్యం గురించి చాలా దూరదూరాల వరకు కీర్తి వ్యాపించింది. ఒకసారి ఆ దేశపు రాజు అతడిని ఆహ్వానించాడు. చర్చ చివరలో అతడితో అన్నాడు-“అయ్యా నీవు జ్ఞానివి. విద్యావంతుడవు. కానీ నీ కొడుకు ఇంత మూర్ఖుడేంటి? అతడిని కూడా కాస్త చదివించు. అతడికి బంగారము వెండి మధ్యలో ఏది విలువైనదో కూడా తెలియదు.”
అంతవరకు చెప్పి ఆ రాజు పెద్దగా నవ్వాడు. బ్రాహ్మణుడు ఆ మాటకు చాలా బాధపడ్డాడు. ఇంటికి వచ్చి తన కొడుకును అడిగాడు- “బంగారము వెండి ఈ రెంటిలో ఏది విలువైనది?” అని.
“బంగారము” ఒక క్షణం కూడా ఆలోచించకుండా అతని కొడుకు సమాధానం చెప్పాడు.
“నీ సమాధానం సరైనదే. మరి రాజు ఎందుకు ఇట్లా అన్నాడు? అందరి ఎదుట నన్ను పరిహసించాడు.”
అది విని అతడి కొడుకుకు విషయం మొత్తం అర్థం అయింది. అతడు అన్నాడు- “రాజు ఈ ఊరికి దగ్గరలో ఒక సభను నిర్వహిస్తాడు. గొప్పగా పేరుపొందిన వారంతా అక్కడ భాగం గ్రహిస్తారు. ఆ సదస్సు నేను బడికి పోయే దారిలో వస్తుంది. అతడు నన్ను చూడగానే వెంటనే పిలుస్తాడు. ఒక చేతిలో బంగారు నాణేన్ని, మరొక చేతిలో వెండి నాణేన్ని పట్టుకుంటాడు. ‘రెంటిలో ఎక్కువ విలువైనదానిని తీసుకో.’ అంటాడు. అప్పుడు నేను వెండి నాణేన్ని తీసుకుంటాను. అందరూ గట్టిగా నవ్వుతారు. వారికి వినోదం కలుగుతుంది. ఈ విధంగా ప్రతి రోజు జరుగుతుంది.”
“అయితే నీవు బంగారు నాణాన్ని ఎందుకు తీసుకోవు? జన సభలో నన్ను నిన్ను అవమానం పాలు ఎందుకు చేస్తావు?”
అప్పుడు ఆ బాలుడు నవ్వాడు. తండ్రిని చేయి పట్టుకొని ఇంటి లోపలకు తీసుకొని వెళ్ళాడు. అల్మారాలోని ఒక పెట్టెను తెరిచి చూపించాడు. దాని నిండా వెండి నాణాలు ఉన్నాయి. అది చూసి బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపోయాడు.
అప్పుడు అతడి కొడుకు ఇలా అన్నాడు- “తండ్రీ, ఏ రోజైతే నేను బంగారు నాణాన్ని తీసుకుంటానో అప్పుడు ఈ ఆట పూర్తవుతుంది. ఒకవేళ వారు నన్ను తెలివిలేని వాడిగా భావించి నవ్వితే నవ్వనివ్వండి. నేను వివేకవంతుడిని అని వారికి చూపిస్తే నాకేంటి లాభం? నేను మీ పుత్రుడిని. అందువల్ల తెలివితో పనిచేస్తాను. నిజంగా మూర్ఖుడిని అయితే అది వేరు. మూర్ఖుడిగా భావింపబడేది వేరు. బంగారం వంటి అవకాశం కోసం ఎదురు చూడటం కన్నా ప్రతి అవకాశాన్ని బంగారం లాగా మార్చుకోవటం నయం.” కనుక నిజమైన జ్ఞాని ఇతరులకోసం కాకుండా తనకోసం అవకాశాలు ఉపయోగించుకుంటాడు*

🕉️🌞🌎🏵️🌼🚩

Source - whatsapp sandesam

No comments:

Post a Comment