Monday, June 29, 2020

స్వర్గీయ ప్రధాని పీ వీ నరసింహారావు గారి జన్మదినం సందర్భంగా

(స్వర్గీయ ప్రధాని పీ వీ నరసింహారావు గారి జన్మదినం సందర్భంగా)

కోటిరత్నాల వీణలో ఒక భారత రత్న

కొందరు పుట్టుకతో గొప్పవాళ్ళు. కొందరు గొప్పతనం సంపాదిస్తారు. మరి కొందరికి గొప్పతనం ఆపాదించ బడుతుంది. అయితే వీటన్నిటికీ అతీతంగా ఎనిమిది పదులు దాటిన జీవితంలో గొప్ప అన్న పదం దగ్గరకు చేరనివ్వకుండా కూడా ఈ నేల మీద నడిచిన కొద్దిమందిలో నువ్వుంటావు. ఎవరూ చెప్పకుండానే వర్షించే మేఘంలా, ఎవరి ప్రమేయం లేకుండానే ప్రవహించే నదిలా, నిశ్శబ్ద ఆనందాన్ని అనుభవిస్తూ పాలిచ్చే గోవులా, తలలు వంచి చేతులకు పళ్ళను అందించే తరువులా ఈ జాతికి, ఈ నేలకు, ఈ దేశానికి నువ్వు చాలా ఇచ్చావు. పద్నాలుగు భాషలు నేర్చినా అనవసరంగా ఒక్క పదం కూడా పలకని నిన్ను చూసి విసుక్కున్న విలేఖరులు ఉన్నారు. అస్మదీయులు తస్మదీయులు అన్న భేదం లేకుండా ఉన్న నీ జీవన సరళి చూసి నిరాశ పడ్డ అభిలాషులు ఉన్నారు. అరకొర బలంతో ఉన్న నీవు ఏ సమస్య రాకుండా ఐదేళ్లు ఈ దేశాన్ని నడిపిస్తే చాలు అనుకున్న శ్రేయోభిలాషులు ఉన్నారు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తూ, ఒక యోగిలా, ఋషిలా, మౌనిలా ప్రపంచంలో నే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని నువ్వు నడిపిన తీరు నభూతో నభవిష్యతి.

ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. లాలకృష్ణ అద్వానీ గారు వెక్కి వెక్కి ఏడవటం ఆకాశవాణిలో విన్నాను. ఆకాశంలో ఈ ఏడు రోజులు మబ్బులు కమ్ముకోవటం కళ్లారా చూసాను. ఒక మహావృక్షం నేలకు ఒరిగిపోయినప్పుడు భూమి కంపించటం మామూలే అంటే చలించి పోయారు కోట్లాది మంది. మళ్ళీ సెక్యూరిటీ గార్డులుగా సిక్కులనే ఎందుకు పెట్టారు అని ఇంటర్వ్యూ చేస్తున్న రష్యన్ ఉస్తినోవ్ అడిగితే "శతాబ్దాలుగా ఈ దేశం ఎన్నో దురాక్రమణలకు గురి అవుతూనే ఉంది. దండెత్తి వచ్చిన వాళ్ళందర్నీ ఈ దేశం అక్కున చేర్చుకుంది. అది ఈ నేల ప్రత్యేకత" అంటూ సమాధానం ఇచ్చిన రాజీవ్ గాంధీ ఆకాశమంత ఎత్తు కనిపించారు. అలాంటి గొప్ప నేపథ్యంలో, అలాంటి విషాద సమయంలో రాజీవ్ గాంధీ నిన్ను అప్పుడే ప్రారంభించిన మానవ వనరుల శాఖకు మంత్రిని చేస్తే అందరు అంత ప్రాముఖ్యత లేదు అని పెదవి విరిచారు. అయితే నిన్ను అంతగా ఇష్టపడే రాజీవ్ గాంధీ అలా ఎందుకు చేస్తారు అని ప్రతి రోజూ నాగపూర్ నుండి వచ్చే హితవాద పత్రిక చదువుతూ ఉండే వాడిని. అప్పుడు తెలిసింది. రాజీవ్ గాంధీ ఈ దేశ ముఖ చిత్రం మార్చాలని ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు అని. అందరూ అన్ని సమస్యలకు కారణం ఈ దేశ జనాభా అంటే అదే దేశ జనాభాను ఉత్పాదక శక్తిలా మార్చాలని అనుకున్నారని. అందుకు నిన్ను ముఖ చిత్రం గీసే చిత్రకారుడిలా ఎంచుకున్నారని.

వందేళ్ల వృద్ధ పార్టీలో అరవయ్యేళ్ళ వృద్ధుడు ఈ దేశ మానవ వనరులను బలీయం చేయడాన్ని ప్రతి రోజూ గమనించాను. అనతి కాలంలోనే ఈ దశను మార్చే ఒక దిశ నిర్ధారణ అయ్యింది. ఇక నా దేశం కొత్త బంగారు లోకాన్ని చూస్తుందని కలలు కంటున్న సమయంలో ఉరుములు మెరుపులు వచ్చి, తుఫానుగా మారి అప్పుడే కాయలు కాయటం మొదలు పెట్టిన మరో వృక్షాన్ని సమూలంగా పెకలించటం చూసాను. అస్తవ్యస్త భారత రాజకీయ చిత్రం మళ్ళీ కళ్ళ ముందుకు వచ్చింది. బహుశా చిత్రించిన ముఖ చిత్రం గుండెల్లో పెట్టుకున్న నీ అవసరం ఈ దేశం గుర్తించి ఉంటుంది. అందుకే రాజీవ్ కూడా చనిపోయాక, ఎన్నికల్లో పార్టీ ముందున్నా నువ్వు ఓడిపోయాక, ఎవరు పట్టించుకుంటారు అనుకుని హైదరాబాద్ వచ్చేయాలని బట్టలు సర్దుకున్న సమయంలో పిలుపు వచ్చింది. ఈ దేశ తొమ్మిదో ప్రధాన మంత్రిగా నీ ప్రయాణం మొదలయ్యింది.

ఒళ్ళు పులకించింది. ఈ దేశాన్ని నీ చేతుల్లో పెట్టటానికి రాజీవ్ వెళ్లి పోయి ఉంటారు అనుకున్నాను. నువ్వు చిత్రించిన ముఖ చిత్రం బయటకు తీసి ధూళి తుడిచావు. ఏడు పదులు దాటిన నువ్వు కంప్యూటర్ ముందు కూర్చుని ఈ దేశ భవిష్య ప్రణాళికలు తయారు చేస్తుంటే తెలుగు వాడిగా గాలిలో తేలాను. ఇవ్వటం నేర్చుకున్న గొప్ప వాళ్ళు కొందరైనా ఉన్న ఆ కాలంలో ఎక్కడో ఉన్న మన్మోహన్ సింగ్ గారిని తీసుకు వచ్చి ఆర్థిక మంత్రిని చేసి నడిపించావు. ప్రపంచం నివ్వెర పోయినట్టుగా, ఈ దేశానికి అంతవరకు అసలు సరిపడదు అనుకున్న ఒక కొత్త ఆర్థిక దిశను చూపించావు. తొలి బడ్జెట్ ప్రవేశించిన రోజూ దేశమంతా చప్పట్లు కొట్టింది. ఎవరికీ ఏమి తెలియదు. అయితే ఏదో కొత్తగా జరుగుతోంది, ఇక ముందు ఈ బ్రతుకులు ఇలా ఉండవు అని అందరూ నమ్మారు. అప్పటికే దివాళా తీసి బంగారు నిల్వలు కూడా ప్రపంచ బ్యాంకు దగ్గర తాకట్టు పెట్టి నత్త నడక నడుస్తున్న దేశానికి తొలి బడ్జెట్ ఊపిరి ఇచ్చింది

ఒక వైపు అరకొర బలంతో ప్రధాని అయినందున కుడి ఎడమల మధ్య నలిగిపోతూ ఉన్న నిన్ను చూసి అందరూ నవ్వుకున్నారు. ఆ బలహీనతే బలంగా మారిందని వాళ్లకు తెలియదు. ఐదేళ్ళలో ఆరేడు సార్లు అవిశ్వాస తీర్మానం ఎదుర్కొని ఒకసారి కుడి చేయి అందుకున్నావు. ఒకసారి ఎడమ చేయి అందుకున్నావు. ప్రయాణం కొనసాగించావు . అప్పుడప్పుడు రెండు చేతులూ చప్పట్లు కొట్టాయి. మరోవైపు ఇందిరగాంధీ చేయించిన బ్లూ స్టార్ ఆపరేషన్ లో బయటకు వచ్చి పంజాబ్ మొత్తం అంటువ్యాధిలా ప్రాకిన ఖలిస్థాన్ క్రిములను ఊరు ఊరు దిగ్బంధం చేసి ఏరి పారేసావు. మరో వైపు న్యూక్లియర్ పరీక్షలకు అబ్దుల్ కలాం ను పిలిపించి అన్ని సిద్ధం చేసి తరువాత రాబోయే అటల్ చేతులకు అందించావు. ప్రశాంతమైన రాజకీయ ఆర్ధిక సామాజిక వాతావరణం మళ్ళీ నెలకొంది. దివాళా తీసిన దేశం ప్రపంచం ఇటువైపు చూసేలా మారింది.

నువ్వు నడిపిన ఈ ఐదేళ్లు కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది. అస్సాం అందంగా ఉంది. పంజాబ్ మోకరిల్లింది. ప్రతి ఆదివారం వాక్సినేషన్ ఉండేది. సూరత్ లో వచ్చిన ప్లేగ్ వ్యాధి దేశమంతా ఆరోగ్యంగా ఉంది. ఉద్యమాలు లేవు. వేర్పాటు వాదం లేదు. రాజకీయ దళారులకు, ఆర్ధిక చీకటి బజార్లకు అస్సలు పని లేదు. కొత్త గాలి దేశమంతా ఆవరించింది. కొత్త చిగుర్లు చెట్లకు మాత్రమే కాకుండా జీవితాల్లో కనిపించాయి.

తెలుగు వాళ్ళు గర్వించదగ్గ వేయిపడగలు దేశం గుర్తించాలని సహస్రఫన్ గా హిందీలో చూపించావు. విశ్వనాథ సత్యనారాయణ గారి ఖ్యాతి మరింత పెంచావు. ఇప్పటికి ఉత్తరభారత్ నిన్ను ప్రధానమంత్రిగా కంటే కూడా ఈ కోణంలో ఎక్కువగా ఆరాధిస్తుంది.

ఐదేళ్లు నడవలేవని భావించిన వాళ్ళు నీ పరుగు చూసి, రాజకీయ దుమారం లేపి నీ పై బురద చల్లేందుకు దేశం నలుమూలలా వేదికలు ఏర్పాటు చేసి తరువాత ఎన్నికల్లో అయితే గెలిచారు కానీ నీ పెదవి నుండి ఒక్క అక్షరం పలికించ లేకపోయారు. విచిత్రం ఏంటంటే నువ్వు పిరికి వానిలా పారిపోలేదు. వాళ్ళందరి అంతిమ ప్రయాణము చూసాక మాత్రమే నువ్వు ప్రశాంతంగా స్వర్గారోహణ చేసావు. సత్యమేవ జయతే అన్న మాటలు వాళ్ళు చూసి ఉంటారు. చదివి ఉంటారు. నువ్వు మాత్రం అర్థం చేసుకున్నావు.

ఇప్పుడు మనిషికో కంప్యూటర్ ఉంది చేతికో మొబైల్ ఉంది. ఇంటింటికి ఉద్యోగం ఉంది. ప్రపంచాన్ని నడిపించే మానవ వనరులు మన సొంతం. పేరు పొందిన గొప్ప టెక్నాలజీ సంస్థల్లో నిర్ణయాధికారం మనదే. అణువును విభజించిన మనిషిని అణువు విడదీస్తుంది అనుకునే రోజుల్లో, తీరాన మెరుస్తున్న ఇసుక రేణువు ఈ ప్రపంచపు జీవన వేణువయ్యిందని అనుకునేలా ఈ ప్రపంచం ఇప్పుడు మారింది. వేల మైళ్ళ రహదారులున్నాయి. ఆకాశం నిండా విమానాలున్నాయి. ఉదయం అల్పాహారం ఢిల్లీలో చేసి, మధ్యాన్నం భోజనం కు కేరళ వెళ్లి అన్ని పనులు ముగించుకుని రాత్రి బస హైదరాబాద్ లో చేసుకునే వీలు ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచం గుప్పెట్లో ఉంది. ఇవన్నీ మూడు దశాబ్దాల కిందట నువ్వు రంగులద్దిన ముఖ చిత్రం లోని హావ భావాలు. నువ్వు కల గన్న భారత దేశ కొత్త రూపు రేఖలు. ఇప్పుడు తినడానికి తిండి ఉంది. కట్టేందుకు బట్ట ఉంది. ఉండేందుకు ఇల్లు కూడా ఉంది. నువ్వు లేవన్న ఆ ఒక్క చేదు నిజం తప్ప అన్ని ఉన్నాయి. అన్నిట్లో నీ ప్రతిబింబం ఉంది. అందుకే కోటి రత్నాల వీణ అని అందరూ అంటుంటే ..."భారత రత్న" అని నాకు వినిపిస్తుంది.

కొట్నాన సింహాచలం నాయుడు
28.06.2020

Source - whatsapp sandesam

No comments:

Post a Comment