Thursday, June 25, 2020

పత్రం పుష్పం ఫలంతోయమ్

పత్రం పుష్పం ఫలంతోయమ్


చాలా పేదరాలైన ఒక వృద్ధురాలు పరమాచార్య స్వామివారిపై పరమ భక్తితో తనకున్న అత్యంత అల్పమైన ధనంతో పొదుపుగా జీవనం సాగిస్తోంది. వేదవిహితమైన పరమ ధార్మిక జీవనం గడుపుతూ, నిజమైన భక్తురాలిగా రోజులు గడుపుతోంది. ఆమె ప్రతీరోజూ పరమాచార్య స్వామివారు ఉపయోగించే స్థలాలను శుభ్రపరచి, రంగవల్లులతో అలంకరించి దీపం వెలిగించేది. ఆమె మొత్తం ఆస్తి కేవలం రెండు చీరలు అంటే. మూడవది కొనగలిగే ఆర్థిక స్థితి కూడా లేదు.
స్వామివారి భక్తుడోకసారి చాలా పెద్ద మొత్తంలో బియ్యము, బెల్లము సమర్పించాడు. అది సరైన విధంగా ఉపయోగించాలి కదా? అందుకే స్వామివారు ఈమెను ఎంచుకున్నారు.
“కాంచీపురంలో ఉన్న ప్రతీ చీమలపుట్ట వద్దకు వెళ్ళి, అందులో వీటిని కొద్దిగా వెయ్య”మని స్వామివారు ఆజ్ఞాపించారు.


ఆమె విధేయత ఎటువంటిదో అందరికీ తెలుసు. మొత్తం కాంచీపురం అంతా తిరిగి, ఎన్నో పుట్టలను వెతికి పట్టుకుని అందులోకి బియ్యము, బెల్లము వేసింది. ఇది చూడడానికి చిన్న విషయంలా కనిపించినా అన్నీ పుట్టలను కనుక్కోవడం చాలా కష్టం. మహాస్వామి వారి అనుగ్రహంతో ఈ పని పూర్తిచెయ్యగానే, స్వామివారామెకు పెద్ద వత్తుల దండ, నూనె డబ్బా ఇచ్చి, “దీన్ని చిన్న చిన్న దీపపు వొత్తులుగా కత్తిరించి, ప్రతీ దేవాలయానికి వెళ్ళి, నీకు ఎన్ని వీలైతే అన్నీ దీపాలను వెలిగించు. రోజూ రెండు మూడు దేవాలయాలకు వెళ్లగలితే చాలు” అని ఆజ్ఞాపించారు.


స్వామివారి నుండి మరొక్క ఆదేశం వచ్చింది. ఆ వృద్ధురాలు వినగానే ఎంతో సంతోషంతోషించింది. స్వామివారి ఆజ్ఞానుసారం రోజూ వీలైనన్ని దేవాలయాలకు వెళ్ళి కొద్దిరోజుల్లోనే ఇచ్చిన పనిని పూర్తిచేసింది. ఆ విషయం స్వామివారికి చెప్పెటప్పుడు తన ఆనందానికి అవధులు లేవు.


అందరికీ తెలిసినట్టు, స్వామివారు ఏమి చేసినా దానికొక బలమైన కారణం ఉన్నట్టు, ఈవిడతో ఈ పనులు చేయించడంలో కూడా ఏదో కారణం ఉండిఉంటుంది.
ఒకరోజు శ్రీమఠానికి పెద్ద డాబు దర్పంతో ఒక ధనిక వ్యక్తి వచ్చాడు. అతను వచ్చిన క్షణం నుండి తన సంపదను ప్రదర్శించడం, నిర్లక్ష్య ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. తన గురించి తాను గొప్పగా భావిస్తూ, సంస్కార హీనుడిగా ప్రవర్తిస్తున్నాడు. అహంకారం తొణికిసలాడుతున్న మాటలతో, “నేను సహస్ర భోజనం (వెయ్యిమందికి అన్నదానం) చేసి ఇక్కడకు వచ్చాను. అంతేకాదు, లక్ష దీపాలను వెలిగించాను” అని చెప్పాడు.


ఆ ధనవంతుని అహంకారము, గర్వము స్వామివారికి తెలుసు. మంచి పనులు చేసి వాటి గురించి గొప్పగా చెప్పుకుంటే దాని ఫలితం ఉండదు. అటువంటి చర్యలవల్ల కలిగిన మంచి అంతా శూన్యమైపోయి, ఆ పుణ్యాన్ని పొందే అర్హతను కోల్పోతాడు. ఇదే విషయాన్ని ఈ వ్యక్తి వినయంతో, భక్తిగా చెప్పివుంటే స్వామివారు చాలా సంతోషించేవారు. కానీ ఇతను అహంకారంతో మాట్లాడాడు. దాంతో స్వామివారు వెంటనే విషయం మార్చాలని మాట్లాడడం మొదలుపెట్టారు.
“ఇక్కడ ఒక వృద్ధురాలు ఉంది. ఆమె కూడా లక్ష భోజనాలు చేసింది. అంతేకాక లక్షల దీపాలను కూడా వెలిగించింది” అని ఆ ధనికునికి చెప్పారు స్వామివారు.


తను చెప్పిన విషయం స్వామివారు ఏమీ వినకుండానే తంలాంటి పనులు చేసిన ఒక వృద్ధురాలు గురించి చెబుతున్నారు స్వామివారు అని ధనవంతుడు ఆలోచనలో పడ్డాడు. అంతేకాక ఆమె తనకంటే ఢంవంతురాలెమో అని కూడా ఆలోచన చేస్తున్నాడు. ఆమె గురించి ఇంకాస్త తెలుసుకోవాలన్న కుతూహలం కూడా హెచ్చింది.
అప్పుడు స్వామివారు ఇతని ఆలోచనలను తెలుసుకుని ఆమెను అక్కడకు పిలిపించారు. “అంతటి పుణ్యకార్యాలు చేసిన వ్యక్తి ఈవిడే” అని ఆమె గురించి చెప్పారు స్వామివారు. చిరిగిన చీరలో ఉన్న ఆ వృద్ధురాలిని చూసి ఆ ధనవంతుడు నిశ్చేష్టుడయ్యాడు. నుదుటన పెట్టుకున్న తెల్లని వీభూతిరేఖలు ఆమె నిర్మలమైన స్వచ్చమైన మనస్సుకు సంకేతంలా ఉన్నాయి.

తరువాత స్వామివారు మాట్లాడనారంబించారు.
“భగవంతుడు అన్నీ జీవరాశులలోనూ ఉన్నాడు. బ్రహ్మ నుండి చీమ దాకా అన్నిటిలో పరమాత్మ ఉన్నాడు. మనుషుల్లో కూడా ఉన్నాడు. నువు వెయ్యి మందికి అన్నం పెట్టావు. కానీ ఈ వృద్ధురాలు లక్షల లక్షల ప్రాణుల ఆకలి తీర్చింది. ఒక దేవాలయంలో లక్ష దీపాలను వెలిగించడానికి కావాల్సిన సంభారాలు ఇచ్చావెమో నువ్వు. కానీ ఈమె ఎంతో భక్తితో విధేయతతో ఎన్నో దేవాలయాలకు వెళ్ళి, స్వయంగా ప్రమిదలను తెచ్చి, నూనె పోసి, వత్తి పెట్టి, తన చేతులతో దీపాలను వెలిగించింది”.
స్వామివారు చెప్పడం ఆపగానే, తన తప్పును గ్రహించి మౌనంగా నిలబడున్నాడు. స్వామివారి ఎదుట అలా అహంకరించి మాట్లాడడం తప్పు అని తెలుసుకున్నాడు. సత్యం గ్రహించగానే ఇతర భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వీలుగా పక్కకు తప్పుకున్నాడు.


తల్లి కంటే అధికంగా కరుణను కురిపించే స్వామివారు, తప్పు గ్రహించిన ఆ ధనవంతుడిని పిలిచి, దగ్గరగా కూర్చోబెట్టుకుని మాట్లాడి ప్రాసాదం ఇచ్చి పంపారు. మంచి పనులు చేసినప్పుడు అహంకరించకుండా వినయంగా ఎలా ఉండాలో ఆరోజు నేర్చుకున్నాడు.
అవును భక్తితో కేవలం ఒక్క బిల్వదళాన్ని అర్పించినా చాలు, పరమేశ్వరుడైన పరమాచార్య స్వామివారు ప్రేమతో స్వీకరిస్తారు.


--- “శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా మహిమై” పత్రిక నుండి

🙏🏼🙏🏼🙏🏼

Source - whatsapp sandesam

No comments:

Post a Comment