Monday, October 16, 2023

బద్దకమే అసలు శత్రువు . ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం.

 బద్దకమే అసలు శత్రువు . ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం.

భీమవరంలో ఉండే వెంకన్న పొలంలో సొంతంగా వ్యవసాయం చేసి పంటలు  పండిస్తూ బ్రతికేవాడు. వాళ్ళకి ఎదిగిన కొడుకున్నాడు. పేరు సోము. అతడికి బద్ధకం ఎక్కువ. ఒకసారి వెంకన్న బంధువులు తీర్ధయాత్రలకు వెళుతూ అతడినీ  వారితో యాత్రలకు  రమ్మన్నారు.  ‘ఇలాంటి సమయంలో  నెల రోజులు లేకపోతే మా పొలంలో వరి చేను పోతుంది.  పంటని కోతలు కోయించి కుప్పలు పెట్టాలి’  అన్నాడు వెంకన్న.  దానికి వాళ్ళు  “మీ అబ్బాయి సోముకి అప్పచెప్పు. అతడికీ పని నేర్పినట్టవుతుంది. మాతో వచ్చావంటే మీ భార్యాభర్తలకు ఏ  కష్టం కలగకుండా బాగా చూసుకుంటాం.  మాలాంటి మంచి తోడు మళ్ళీ నీకు   దొరకదు” అని చెప్పడంతో  ఆలోచనలో పడ్డాడు వెంకన్న. వాళ్ళ మాటలు ఆలకించిన సోము ,  ముందుకు వచ్చి పొలం పనులు తాను చేయిస్తాననడంతో భార్యతో కలసి  బంధువులతో యాత్రలకి  వెళ్ళాడు వెంకన్న. 

వెంకన్న చెప్పినట్టు  ఒకటి రెండు సార్లు పొలంకి వెళ్ళాడు  సోము.  పొలమంతా చూసాక  ‘వరి చేను గింజలింకా పక్వానికి రాలేదు, మరో పది రోజులాగాలి’  అనుకున్నాడు. కొన్నాళ్ళాగి  కోతలు చెయ్యొచ్చని అనుకున్నాడు. తరువాత బద్ధకంతో పొలానికి వెళ్ళడం మానేసాడు. ఇరవై రోజుల తరువాత వరి చేను  కోయించలేదేమని పక్క పొలం యజమానులు అడిగినప్పుడు గుర్తొచ్చి పొలానికి వెళ్ళాడు సోము. వెంటనే కూలీలు కుదరలేదు. ఒక్కడి వల్ల అంత పని జరగదు. పొరుగుర్లో అడిగి ఐదు రోజుల తరువాత కూలీలను తీసుకొని  పొలానికి వెళ్లాడు. వాళ్లంతో కొడవళ్ళతో కోతలు మొదలెట్టేసరికి పైరు బాగా పండిపోవడం వల్ల ధాన్యపు గింజలన్నీ నేల రాలిపోయాయి. వెంకన్న యాత్రల నుండి ఊళ్లోకి వచ్చి అటునుండటే  పొలానికి వెళ్ళి, అక్కడి . పరిస్థితి చూసి  గుండెలు బాదుకున్నాడు.  “అనుకున్నంతా అయింది. సోముని  నమ్మి  తప్పు చేసాను . యాత్రలకు  వెళ్లక పోయినా బావుండేది” అని బాధపడ్డాడు. సోము బద్ధకం వల్ల జరిగిన నష్టానికి నోటికొచ్చినట్టు కొడుకుని తిట్టాడు.    

మరోసారి వాళ్లక్క కూతురు పెళ్లి పనుల  సాయానికి  వెళ్ళాడు వెంకన్న.  వెళ్ళే ముందు  సోముతో “పొలంలో చెనగ కాయల  పంట ఉంది . రోజూ చూసి వస్తుండు. పశువులు మేయకుండా కాపలా కాయు. చేను కోతలకింకా  సమయముంది” అని జాగ్రత్తలు చెప్పాడు వెంకన్న. వరుసగా వారం రోజులు పొలానికి వెళ్లొచ్చిన సోముకి వరి పంట విషయంలో చేసిన తప్పు గుర్తొచ్చింది. ఈ సారి అలా కాకూడదని కూలీలను పిలిచి  చెనగ చేను కోయించాడు. కుప్పలు వేయించాడు. తండ్రి వచ్చి మెచ్చుకుంటాడనుకున్నాడు.     

ఇరవై రోజుల తరువాత ఇంటికి వచ్చిన  వెంకన్న చెనగ చేను చూడడానికి వెళ్ళాడు. ఇంకేముంది? చేను  కుప్పలు కనబడ్డాయి. కొన్ని కాయలు తీసి చూసాడు. వాటి లోపలి గింజలింకా గట్టిపడలేదు. మరొక పది రోజులాగితే బాగుణ్ణు కానీ ఆగకుండా ముందే   కోయించాడు సోము. అలాంటి గింజలకు  ధర పలకదని, మళ్లీ నష్టం తప్పదని బాధపడ్డాడు వెంకన్న. ఇంటికి చేరాక సోముని పిలిచి  “ నీవల్ల నష్టమే వస్తోంది నాకు.  ఎప్పుడు బాగుపడతావు?” అని కోప్పడ్డాడు. “నేనే పని చేసినా తప్పు పడతావు. ఇలా అయితే  ఏ పనీ చెయ్యను” అని బదులిచ్చాడు సోము.  
వాళ్ళిద్దరి మధ్య మాటకిమాట పెరిగి  పెద్దదయింది.

ఆ దారిన వెళుతూ వాళ్ళ మాటలు విన్నారు ఉపాధ్యాయుడు ఈశ్వరయ్య. వాళ్ళని కలసి విషయం   తెలుసుకున్నాడు.  “వీడి వల్ల ఎప్పుడూ నష్టం జరుగుతోంది” అంటూ సోము బద్ధకం గురించి వివరంగా  చెప్పాడు వెంకన్న. మీ కొడుక్కి బద్ధకం వల్ల వచ్చే కష్టాలు, నష్టాలు తెలిసినట్టు లేదు. నేనొకసారి మాట్లాడతాను” అని ఆయన అనడంతో సరేనన్నాడు వెంకన్న.  

 సోముతో “మనకి ఎన్నో విధాలా నష్టం కలిగించేది  బద్ధకం. బద్ధకస్తులు అనుకున్నది సాధించలేరు. మనిషికి అసలు శత్రువు ఎవరో కాదు .. బద్ధకమే” అంటూ  మొదలుపెట్టాడు ఈశ్వరయ్య.
నేను బద్ధకాన్ని వదిలెయ్యాలనుకుంటాను. కానీ నా వల్ల కావడం లేదు. ఏం చేయాలి”అనడిగాడు సోము.  

“ నీలో బద్ధకం పోవాలంటే చలాకీగా ఉండేందుకు ప్రయత్నించాలి. నీకొక ఉదాహరణ  చెబుతాను. అది విన్నావంటే … చేసే పని పట్ల ఎంత శ్రద్ధగా ఉండాలో తెలుస్తుంది. మీరు కోళ్ళని  పెంచుతారు కదా. నువ్వెప్పుడైనా గుడ్డుని  కనిపెట్టుకుని తల్లి కోడి  ఎలా పొదుగుతుందో చూసావా?” అనడిగారు ఈశ్వరయ్య. మీరే చెప్పండి.. నాకు తెలియదు” అని సోము చెప్పడంతో ఆయన కొనసాగించారు. 
“గుడ్డుని చాలా జాగ్రత్తగా కనిపెడుతుంది తల్లి కోడి. గుడ్డు లోపలి పదార్థం   కోడి పిల్లగా మారి ముక్కుతో చేసే శబ్దం కోసం ఓపికగా ఎదురు చూస్తుంది. లోపలి పిల్ల  ఎప్పుడైతే  ముక్కుతో పొడుస్తుందో అప్పుడే తల్లి కోడి బయటి నుండి గుడ్డు పెంకుని పగలగొట్టి పిల్లకి  దారి ఇస్తుంది. ఒకవేళ ముందుగానే బయటి నుండి పెంకుని పగలగొట్టినట్టైతే  రూపం పోసుకోని ఆ పిల్ల లోపలే చనిపోతుంది.  చెనగ పంట విషయంలో జరిగిందదే. గింజ ఏర్పడకముందే కోయించావు” అని ఈశ్వరయ్య చెప్పగానే ఆశ్చర్యపోయాడు సోము. 
“అలా కాకుండా కోడిపిల్ల తయారైన తరువాత కూడా తల్లి కోడి ఆలస్యం చేయదు. వెంటనే బయటకు రప్పిస్తుంది. కానీ వరిచేను విషయంలో నువ్వలా చేయలేదు. చాలా ఆలస్యం చేయడం  వలన గింజలు రాలిపోయాయి” అని చెప్పారు ఈశ్వరయ్య. 

“ నా  తప్పు తెలిసింది” అన్నాడు  సోము విచారంగా. అర్ధమైంది కదా.  పిల్లని బతికించుకోవడం కోసం తల్లి కోడి  ఎంతో శ్రద్ధ, ఓపికతో  ఎదురు చూసేటప్పుడు,  మనం కూడా పని చేసేటప్పుడు  అంతే శ్రద్ధగా ఉండాలి. బాధ్యతగా పూర్తి చేయాలి. వ్యవసాయమైనా, వ్యాపారమైనా  శ్రద్ధ చూపినప్పుడే ఆదాయం దక్కుతుంది. విద్యార్థులైతే  ప్రణాళిక వేసుకుని మరీ చదివితే అభివృద్ధిలోకి వస్తారు” అని ఈశ్వరయ్య చెప్పగానే సోము తలూపాడు. సోము క్రమేపీ బద్ధకం వదిలించుకున్నాడు

No comments:

Post a Comment