*🍁సీతాకోక చిలుకకు ఎగరడమెలాగో మనం నేర్పనక్కరలేదు. చేపకు ఈత నేర్పనక్కరలేదు. కోయిలకు పాడటంలో సూచనలు ఇవ్వనక్కరలేదు. ప్రకృతితో మమేకమై జీవించే జీవులకు నేర్చుకునే బాధ లేదు. అవి సహజంగా వాటికి అబ్బుతాయి. నేర్చుకోవడం మాత్రం మనిషే చెయ్యాలి. చిన్న విషయంలోనూ ఎంతో నేర్చుకోవచ్చు. బొమ్మలు గీయడం, అందంగా వస్తువులను తీర్చిదిద్దడం, పాటలు పాడటం... ఎన్నో. కుండలు తయారు చేసేవాడు ఎంత నైపుణ్యంగా, శ్రద్ధగా, ఏకాగ్రతతో చేస్తాడో, అలా ప్రతి మనిషీ ఏదో ఒకటి నేర్చుకోవడంలో నిమగ్నం కావాలి. సంతోషం పొందాలి.*
*🍁నిజమైన ఆనందం ఇతరులను ఆనందింపజేయడంలో ఉంది. తనను తాను మరచి ఇతరుల బాధలు, సమస్యల గురించి నిత్యం ఆలోచించడంలో నిజమైన బాధ్యతాయుతమైన సంతోషంతో కూడిన ఆనందం ఉంది. ఆనందంగా బతకడం రాకపోతే మనిషి సాటిజీవులతో కలిసి మెలిసి సంతోషంగా బతకలేడు. ఆనందంతోనే అతడు ప్రకృతికి దగ్గర కాగలడు. ఆనందంతోనే తన అంతరంగంలో జ్యోతిస్సీమలను వెలిగించుకోగలడు!*
*🍁ఆనందరహస్యం తెలుసుకున్నవాడు నవ్వుతూ, నవ్విస్తూ ఉంటాడు. ఆ నవ్వు వెనక వేదాంతం అతడికి మాత్రమే తెలుసు. ఆనందాన్ని అపార్థం చేసుకున్నవాడే విషాదానికి లొంగిపోయి జీవితాన్ని బరువుగా మార్చుకుంటాడు.*
*🍁ఈ విశాల విశ్వంతో సరైన సంబంధాలు కొనసాగించాలంటే ఆనందమే పరమావధిగా, సంతోషమే ధ్యేయంగా జీవించాలి. ఆనందాన్ని ఒడిసిపట్టుకుని, తమ శరీరాల్లోకి మనసుల్లోకి ఆత్మలోకి వ్యాపింపజేసుకోవాలి. వాళ్లే బతుకు ఆహ్వానాన్ని అందుకోగలరు. ఆనందపు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మనమేమో మూసిన విషాదం తలుపులను బాదుతూ ఉంటాం.*
*🍁ఆనందం మన జన్మహక్కు. సంతోషంగా జీవించడం కోసం ఆనందరహస్యం తెలుసుకోవాలి. విషాదపు సమాచారాన్ని పోగేసుకుని, అందులో మునిగితేలకూడదు. నాచును తొలగిస్తే నిర్మలమైన నీరుంటుంది. తెల్లవారిన వెంటనే సూర్యుడు కనిపించడు. సమయం గడిస్తే, ఎదురుగా చూస్తే... తూర్పు దిశలో వెలుగులు విరజిమ్ముతాయి. సుప్రభాతమవుతుంది.*
*🍁ఆనందం కనుగొనలేని మనిషి బతుకును వృథాగా వెళ్లబుచ్చుతాడు. అసంతృప్తికి, కుంగుబాటుకు చిరునామాగా మారిపోతాడు. ఆనందంలో పుట్టి, ఆనందంలో బతికి, ఆనందంలోనే లయమవుతున్నాయి జీవులు అంటున్నాయి ఉపనిషత్తులు.*
*🍁ఆనందం మనలో ఉంది. ఆనందం మనతో ఉంది. దీనినే వేదాంతం సచ్చిదానందం అంటుంది.*
*🍁సత్యమైనది, చైతన్యరూపంలో ఆనందరూపంలో ఉంటుందని వెల్లడిస్తోంది.*
*🍁సత్యమార్గంలో ఆనందం వెతకాలి. నిత్యం హృదయంతో జీవిస్తూ పరోపకారం కోసమే ఈ శరీరమని ఎవరు గుర్తిస్తారో... వారే నిజమైన ఆనందం చవిచూడగలరు!*
No comments:
Post a Comment