Thursday, October 26, 2023

దేవుని లీల - జీవుని గోల

 దేవుని లీల - జీవుని గోల

 నది సముద్రం చేరగానే ప్రవాహం ఆగిపోయినట్లు
సద్గురు సన్నిధి చేరగానే వ్యవహారం ఆగిపోతుంది.
ఏదో పోగొట్టుకోవాలనిగానీ,
ఏదో పొందాలనిగానీ రెండూ ఉండవు.

బ్రతకాడానికి ఉపాయాలు దొరుకుతాయేమోనని వస్తారు చాలామంది ఇక్కడకి.
ఒక్క ఉపాయం కూడా దొరకదు.

(అహం)చావడానికి చాలా ఉపాయాలు దొరుకుతాయి...

అందుకు ఇష్టపడే వాళ్లే నిలుస్తారు ఇక్కడ.

దీపం పురుగు దీపానికి ఆకర్షింపబడి అందులో పడి నాశనమైనట్టు 

అలా గురుతత్త్వానికి ఆకర్షింపబడి, తనకు తానుగా కోల్పోవడానికి ఇష్టపడేవాళ్లే నిలుస్తారు ఇక్కడ.

* * *

ప్రపంచం అనేది అజ్ఞానజాతర.
ఆ గోల నుండి తప్పించుకోవడానికే గురుదర్శనం.

గురువు గడప వద్ద విడిచే చెప్పులు వద్దనే నిలిచిపోతుంది మాయ.

సద్గురు సన్నిధిలో ఉన్నంతసేపు ఆత్మస్వరూపంగానే ఉంటాం...
అలా నిశ్చలమనస్సుతో ఉంటాం...
ఇంకేమీ అవసరం లేనిస్థితిలో ఉంటాం...

తిరిగి చెప్పులు తొడుక్కోగానే మళ్లీ తగులుకుంటుంది ఆ సంసారపిశాచం. 

ప్రపంచానికి, పరమాత్మకు మధ్య వారధి
గురుదర్శనం...

వారధికి ఇవతల ఉండలేం...
వారధిపైనే ఉండలేం...
వారధిని దాటేసే సాహసమూ చేయలేకున్నాము...

మాయ - బ్రహ్మము ఇద్దరూ కలిసి ఆడే ఆటలో
 "షటిల్ కార్క్" లా ఉన్నాము...

వారికి క్రీడ.
మనకు పీడ.

వారికి లీల.
మనకు గోల.

తల(బుద్ధి) ఉన్నంతవఱకు తలరాత తప్పదు.
తలరాత ఉన్నంతవఱకు నా ఈ రాతలు తప్పవు.

పరమేశ్వరా! 
నా వద్ద నీవు మాట పడకూడదనుకుంటే-
గణేశుడికి లాగే...
తల(అజ్జానం) తీసి 
తల(జ్ఞానం) పెట్టు...
నీకు తెలిసిన విద్యే కదా...!

* * *

No comments:

Post a Comment