Wednesday, October 25, 2023

అసలైన దీపం....‘దీపం దర్శయామి' అన్న ఉపచారం వచ్చినప్పుడు దీపకాంతిలో.....

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *భగవంతుడు జ్యోతి స్వరూపుడు. ఏ భగవన్నామావళిని మనం గమనించినా… పరంజ్యోతియే నమః, జ్యోతిస్వరూపాయై నమః అని ఉండడాన్ని చూడవచ్చు. తాను ప్రకాశిస్తూ అన్నింటినీ ప్రకాశింపజేసే రూపం ఏదో అదే జ్యోతి. అదే భగవంతుడు. వెలుగులకు వెలుగు, సమస్త లోకాలను కాంతిమయం చేయగలిగేవాడు ఆయనే.* 
💖 *భగవంతుడు మన లోపలే ఉంటాడు. పూజానంతరం మనంచెప్పుకునే ‘మంత్రపుష్పం’ ఆయన అనేక జ్వాలల సమాహారమని వర్ణిస్తుంది. “హృదయక్షేత్రంలో పరమాత్మ జ్యోతిలా వెలుగుతుంటాడు” అంటుంది. ఉపాసనామార్గంలో తన లోపలికి తానే వెళ్ల గలిగితే ఆ జ్యోతి తానే అని తెలుస్తుంది.*
❤️ *అలా తెలుసుకోగలగడమే మనిషి జన్మకు సార్థకం. ఇదే మనిషి జన్మకు ప్రధానమైన లక్ష్యం కావాలి. లోపల ఉన్న వస్తువే తాను అనే విషయాన్ని అవగాహన చేసుకుని అక్కడే స్థిరంగా ఉండగలిగితే అప్పుడు ఈశ్వరతత్త్వం అర్ధమౌతుంది. తద్వారా మోక్షం సిద్ధిస్తుంది. అందుకే “దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకో” అని చెప్పారు.*
💕 *శరీరంలోపల ఈశ్వరప్రకాశం ఉండి శరీరం పనిచేస్తుండగానే శాస్త్రాన్నీ, గురువునూ ఆధారంగా చేసుకుని భగవన్మార్గంలో ప్రయాణించి పరమాత్మతత్త్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి.*
💓 *”నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే జానామీతి తమేవ భాంత మనుభాత్యేతత్సమస్తం జగత్ తస్మె శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే”అన్నారు శంకరాచార్యులు.*
💞 *~కొన్ని రంధ్రాలున్న కుండలో దీపాన్ని వెలిగిస్తే ఆ దీపకాంతి అన్నివైపులకూ ప్రసరించి కాంతిని వెదజల్లుతుంది. అదే విధంగా మన శరీరంలోని జ్ఞానజ్యోతి జ్ఞానేంద్రియాల ద్వారా ప్రకాశిస్తుంటే మనం అన్నింటినీ తెలుసుకోగలుగుతున్నాం.  లోపల ఉన్న పరంజ్యోతిని తెలుసుకునేందుకు ఆధారభూతమైనది బయట మనం వెలిగించే దీపం. ఈ దీపం సహాయంతో లోపలి దీపాన్ని తెలుసుకోవాలి. బయటి దీపాన్నిగురువుగా భావించాలి.*

💖 *గర్భగుళ్లో ఎప్పుడూ కేవలం ఒక్క నూనె దీపమే వెలుగుతూ ఉంటుంది. ఆ దీపం సాయంతోనే ఆలయంలోపలి పరమాత్మను చూడగలుగుతాం. అదే విధంగా హృదయంలోని పరమాత్మను కూడా జ్ఞానజ్యోతి ద్వారా దర్శించగలగాలి. అంటే ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తుంది. “అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ" అన్నారు కదా. బయట వెతికితే కనిపించదు. ఆర్తితో, ఏకాగ్రతతో లోపలే శోధించాలి. అప్పుడే పరమేశ్వర దర్శనం లభిస్తుంది.*
💕 *దీపంవెలిగించి పూజచేసే సమయంలో ‘దీపం దర్శయామి' అన్న ఉపచారం వచ్చినప్పుడు దీపకాంతిలో పరమాత్మ పాదాలను దర్శించాలి. అంటే దీపాన్ని దేవుని పాదాల చెంత ఉంచి అక్కడనుంచి పాదాలు దర్శించమని కాదు. అలా మనోనేత్రంతో దర్శించగలగాలి. ఉజ్జ్వలమైన దీపకాంతిలో అంతకంటే తేజోమయమైన దైవం పాదాలు ప్రకాశిస్తుంటే ఆ కాంతిని మనం చూడగలగాలి.*
💓 *~అలా చూడటం సాధారణ దీపాలతో సాధ్యం కాదు. ఎవ్వరూ వెలిగించనవసరం లేకుండా వెలిగే సూర్యభగవానుడే అసలైన దీపం. అందుకే…’సూర్యే మధ్యది హిః’ అంటాం. నిజమైన దీపం… ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్నాడు ఆదిత్యుడే.* 
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕 *~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment