Monday, October 30, 2023

అహంకారం వినాశహేతువు

 *అహంకారం వినాశహేతువు*
              

*యుద్ధాన్ని ఆపడానికి కృష్ణుడు చివరి ప్రయత్నంగా రాయబారానికి వచ్చి తను చెప్పదలచిన హితవు చెప్పాడు.* 

*అనంతరం అదే సభలో ఉన్న మహర్షి పరశురాముడు దుర్యోధనుడికి చేసిన హితబోధ సందర్భంలో వచ్చే కథ ఇది…*

*"నాయనా! దుర్యోధనా! నీకూ, నీ వారికీ సర్వప్రపంచానికీ మేలు కలిగే విషయం చెబుతున్నాను. ఆవేశపడకుండా సావధానంగా విను...*

*చాలా రోజుల క్రితం మాట. ‘దంభోద్భవుడు’ అనే పేరు గల రాజు ఉండేవాడు. ఆయన ఈ భూమండలం అంతటినీ పాలించేవాడు. భుజబలంలో, పరాక్రమంలో ఆయనకు సాటి వచ్చే వారు లేరు ఆ రోజుల్లో. అంతటి మహా యోధుడాయన.* 

*ఆయన రోజూ ఉదయం లేచి, కాలకృత్యాలు పూర్తి కాగానే బాగా అలంకరించుకుని రత్నకిరీటం ధరించి, కోడెత్రాచు వంటి కరవాలం చేతబట్టి సభాభవనానికి వచ్చి బంగారు సింహాసనాన్ని అధిష్టించేవాడు.*

*వంది మాగధులు ఆయన బల పరాక్రమాలను గానం చేస్తుంటే, కోరమీసం మెలితిప్పుతూ ఆనందించేవాడు.*

*అనంతరం, తన కొలువులో ఉన్న వారందరినీ చూస్తూ ‘భూలోకంలో నాతో ఎవడైనా యుద్ధం చేయగల మహావీరుడు ఉన్నాడా? గద, ఖడ్గ, ప్రాసాది ఆయుధాలతో కానీ, ఆగ్నేయ, వారుణ, వాయవ్యాది అస్త్రాలతో కానీ నన్ను ఎదుర్కోగల వీరుడుంటే చెప్పండి. అంతేకాదు.. మల్లయుద్ధం చేయగల వీరుడు కూడా ఉంటే చెప్పండి. వాడినీ క్షణంలో కడతేరుస్తాను.' అని గర్వంగా నవ్వుతూ భుజాలు ఎగుర వేసేవాడు.*

*ఆయన బలపరాక్రమాలు ఎరిగిన వారెవరూ ఆయనతో యుద్ధానికి దిగే వారు కాదు.*

*అలా, ఆ రాజు అహంకారం నానాటికీ పెరుగుతూ వచ్చింది. నా అంత వాడు లేడనే గర్వంతో ఆయన విర్రవీగుతూ తిరుగుతుండే వాడు. అటువంటి అహంకారం ఉన్న రాజుకు ఆయన అనుచరులు కూడా అటువంటి అవివేకులే దొరుకుతారు కదా! వారు రోజూ ఆయన బలపరాక్రమాలను పొగుడుతూ ఉండేవారు.*

*అలా ఉండగా,  ఒకనాడు, ఆయనను చూడటానికి సభా భవనానికి వచ్చిన దూరదేశీయులైన విప్రులు “మహారాజా! మీరు నిజంగా మహావీరులే. బలపరాక్రమ సంపన్నులే. అయితే, గంధమాదన పర్వతం మీద నర-నారాయణులని ఇద్దరు తీవ్ర నిష్టతో తపస్సు చేస్తున్నారు. వారిని జయించగల వీరులు మూడు లోకాలలో లేరని విన్నాము. తమకు కోరిక ఉంటే వారితో యుద్ధం చేయవచ్చు” అన్నారు.*

*ఆ మాట వినడంతోనే ఆయన ఆగ్రహంతో మండిపడ్డాడు. కత్తి ఝుళిపించి, నేల మీద పాదంతో గట్టినా తన్ని, 'ఎంత కావరం? నన్ను మించిన యోధులా.. వారు?' అంటూ సేనల్ని సన్నద్ధం చేసి ధనుర్బాణాలు తీసుకుని బయల్దేరాడు. అలా గంధమాదన పర్వతం చేరాడు.*

*ప్రశాంతంగా ఉన్న వనంలో వారు తపస్సు చేసుకుంటున్నారు. వారిని చూస్తూనే రాజు గారు తొడగొట్టి, యుద్ధానికి పిలిచి, నవ్వుతూ కోరమీసం మెలితిప్పాడు.*

*నర, నారాయణులు తమ ఆశ్రమానికి వచ్చిన మహారాజుకు అతిథి సత్కారాలు జరపబోయారు. మహారాజు ఆ అతిథి సత్కారాలను తిప్పికొట్టాడు.*

*'ఇవన్నీ అనవసరం. యుద్ధం.. యుద్ధం మాత్రమే కావాలి' అని అట్టహాసం చేశాడు.*

*అప్పుడు నర-నారాయణులు, “ఎవరితోనూ సంబంధం లేకుండా కళ్లు మూసుకుని ఈ ప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకునే మునులం మేం. మాతో యుద్ధం చేయాలనే కోరిక ఎందుకు కలిగింది మీకు?” అని ప్రశ్నించారు.*

*వారి మాటలు వినిపించుకోలేదు మహారాజు. “ఈ రోజు నాతో మీరు యుద్ధం చేయాల్సిందే” అని పట్టుబట్టాడు. అలా అంటూనే బాణం తొడుగుతుండగా, అది చూసిన నరుడు నవ్వుతూ, ఒక దర్బపుల్ల తీసి, “ఇదిగో! ఈ గడ్డిపరక నీ సేనను నిలువరిస్తుంది” అని                                    ఆ దర్భను వదిలాడు.*

*ఆ రాజు బాణ వర్షం కురిపించాడు. ఆ గడ్డిపరక అన్ని బాణాలనూ ముక్కలు ముక్కలు చేసింది.*

*ఈలోగా రాజు సైన్యంలోని వారందరూ ముక్కులూ, చెవులూ ఊడిపోయి రోదనలు చేయడం మొదలుపెట్టారు.* 

*రాజుకి ఇదంతా చూసి తల తిరిగిపోయింది. సేనలు పలాయనం చేస్తున్నాయి. అది చూసి రాజుకు గుండె జారింది. ఆయుధాలన్నీ కిందపెట్టి, తల వంచి నర-నారాయణుల పాదాల మీద వాలాడు రాజు. *

*“ఆర్యా!  నన్ను క్షమించి అనుగ్రహించండి. నా గర్వానికి ప్రాయశ్చిత్తం అయింది” అని దీనంగా ప్రార్థించాడు.*

*అప్పుడు, నర-నారాయణులు నవ్వుతూ, “మహారాజా! సిరిసంపదలు కలవారు పేదసాదలకు దాన ధర్మాలు చేసి గొప్పవారు కావాలి. అలాగే, బల పరాక్రమాలు ఉన్న వారు దుర్మార్గుల బారి నుంచి సజ్జనులను రక్షించడానికి తమ శక్తియుక్తులను వినియోగించాలి. అంతేగానీ, అహంకారంతో ఇలా తిరగరాదు. ఇరుగు పొరుగులకు ఉపకారం చేయని వాడి జన్మ వ్యర్థం” అన్నారు.*

*మహారాజు వారి బోధ విని, ఆనాటి నుంచి అహంకారం విడిచి, అందరి శ్రేయస్సునూ దృష్టిలో ఉంచుకుని తన సంపదలను బీదలకు దానం చేస్తూ, తన బలంతో దుర్మార్గులనూ, క్రూరులనూ శిక్షించి, న్యాయమార్గాన సజ్జన సేవ చేసి పేరు ప్రఖ్యాతులు పొందాడు.*

*కనుక దుర్యోధనా! అహంకారం, బల గర్వం ఎప్పుడూ పనికిరావు. అవి ఎవరికి ఉంటాయో వారినే నాశనం చేస్తాయి” అని చెప్పడం ముగించాడు పరశురాముడు.*
అరుణాచలశివ 🌹

నీతి:- మితిమీరిన గర్వంతో బలహీనులపై ప్రతాపం చూపించే రాజుకైనా పరాభవం, ఓటమి తప్పదు.🕉️🚩🕉️

No comments:

Post a Comment