Monday, July 1, 2024

నేటి కథ ✍️* *కోయిల పాట కథ*

 *✍🏻 నేటి కథ ✍️*

*కోయిల పాట కథ*

ఓ ఊళ్లో ఒక పెద్దచెట్టుపై గూడు కట్టుకొని.. తల్లీకూతుళ్లు అయిన రెండు కోయిలలు నివసిస్తుండేవి. పిల్ల కోయిల ప్రతిరోజూ అడవికి వెళ్లి.. ఇప్పపువ్వును తీసుకువచ్చేది. తల్లి
కోయిల వృద్ధురాలు. పైగా అనారోగ్యం కారణంగా ఎక్కడికీ వెళ్లేదికాదు.
తాను తీసుకువచ్చిన ఇప్పపువ్వును తాము నివసిస్తున్న చెట్టు మొదట్లో
పోసి ఎండబెట్టేది పిల్ల కోయిల. ఆ పువ్వుకు తల్లిని కాపలాగా ఉండేది.
అయితే, తెంపినప్పుడు పెద్దగా ఉండే ఇప్పపువ్వు.. ఎండిపోతే చిన్నగా మారుతుందని పిల్ల కోయిలకు తెలియదు. ఒకరోజు ఎండబెట్టిన ఇప్ప
పువ్వును కుప్పగా చేసి చూస్తే.. కొంచెంగా అనిపించింది. వెంటనే పట్టరాని ఆవేశంతో తల్లిని పిలిచి.. "నిన్ను కాపలాగా ఉండమంటే ఏం చేస్తున్నావు.ఇందులోంచి సగం ఎవరో ఎత్తుకెళ్లి నట్టున్నారు. అయినా నాకు ఆ విషయం ఎందుకు చెప్పలేదు?'' అంటూ కేకలు వేసింది. తనకు ఏ పాపం తెలియదనీ, ఎవరూ ఎత్తుకెళ్ల
లేదని తల్లి కోయిల ఎంత చెప్పినా అది వినిపించుకోలేదు. పక్కనే
ఉన్న బండరాయిని
తీసి వృద్ధురాలైన తల్లి
తలపై వేసింది. తల్లి
స్థితికి దుఃఖించకుండా
విరగబడి నవ్వసాగింది.
ప్రాణాపాయస్థితిలో
ఉన్న ఆ వృద్ధ కోయిల
అది చూసి.."పాపాత్మురాలా!
నాశోకం చూసి, నాపై దయలేకుండా పగలబడి
నవ్వుతున్న నువ్వు.. నీ జీవితాంతం ఏడుస్తావు. నీ
ఏడుపు విని ప్రజలంతా కమ్మని రాగంగా తలచి
ఆనందంగా వింటారు" అని శపించి మరణించింది. తల్లి
మరణానంతరం ఎప్పటిలాగే రోజూ ఇప్పపువ్వును తెచ్చుకుంటూ.. చెట్టు
మొదట్లో మళ్లీ ఎండబెట్టేది పిల్ల కోయిల. కొద్ది రోజులకు మళ్లీ ఆ
ఇప్పపువ్వు ఎండిపోవటం గమనించింది. అప్పుడు అసలు సంగతి
తెలుసుకొని.. 'నా చేతులతో నాతల్లిని నేనే చంపుకొన్నానే!' అంటూ
కుమిలిపోయింది. అలా ఇప్పపువ్వు పూసే కాలం (ఎండకాలం) నుంచి
వర్షాకాలం పంటలు పండేవరకూ తన తల్లిని తలుచుకుని విపరీతంగా
ఏడుస్తూ (కూస్తూ) ఉంటుంది. తాను చేసిన పాపం వల్ల తన పిల్లలు
తనను కూడా చంపి.. ఎక్కడ ఆ పాపం మూటగట్టుకుంటాయోనని తన గుడ్లను కాకి గుడ్లలో కలిపేస్తుంది. అందుకే 'కోయిలకు గుడ్లు పెట్టడం
మాత్రమే తెలుసు.. పిల్లల్ని చేయడం రాదు!' అంటారు. ఆ గుడ్లను కాకి పొదిగి.. పిల్లల్ని చేస్తుంది. అందువల్లనే కోయిలకు తన తల్లి ఎవరో ఎప్పటికీ తెలియదు.

*•ఎం. ప్రణవి*
(పెద్దలు రాసిన పిల్లల కథలు నుంచి...)

No comments:

Post a Comment