Thursday, October 10, 2024

 *శ్లో॥ తేజః క్షమా ధృతిః శౌచం  
అద్రో హో నాతి మానితా।  
భవంతి సంపదం దైవీం  
అభిజాతస్య భారత!॥*

తా॥ తేజస్సు, ఓర్పు, పట్టుదల,శుచిత్వం, ద్రోహచింతన లేకపోవటం, అభిమాన రాహిత్యం.

దైవీసంపదలో పుట్టినవారి లక్షణాలు ఇవి. లేదా - పుట్టిన ప్రతివానికి ఇవే దైవీసంపద అవుతున్నాయి. 

తేజః.....

ఇదొక గొప్ప దైవీసంపద. ఇది నేర్చుకుంటే వచ్చేదికాదు. గురువు చూపిన మార్గంలో శ్రద్ధతో సాధన చేస్తే తనంతట తానుగా లభించే తేజస్సు ఇది. దీనినే బ్రహ్మతేజస్సు అంటారు. 

ఇది చక్కగా మేకప్ చేసుకుంటేనో, ఆకర్షణీయమైన డ్రస్ వేస్తేనో, ఆభరణాలు ధరిస్తేనో, బొట్లు పెట్టుకుంటేనో వచ్చేది కాదు. ఇలా చేస్తే అందం, ఆకర్షణ పెరగవచ్చు గాని తేజస్సు రాదు. ఈ బ్రహ్మతేజస్సు శ్రద్ధగా శాస్త్ర శ్రవణం చేయటం వల్లను, జపధ్యానాది సాధనలు చేయటం వల్లను, తపస్సు వల్లను, యోగం వల్లను లభిస్తుంది. వారి కంటి చూపులో జ్ఞానజ్యోతి కనిపిస్తుంది. వారిలో ఒక పరిపూర్ణత, సంతృప్తి, శాంతి కనిపిస్తాయి.  

మహాత్ముల చిత్ర పఠాలలో వారి తలచుట్టూ ఒక తేజో వలయం ఉంటుంది. అది వారి దివ్యతేజస్సుకు సూచన. దానిని 'అరా' అంటారు. ఇది కంటికి కనిపించదు. దీనిని ఫోటో తీసే కిర్లియన్ ఫోటోగ్రఫీ అనేది రష్యాలో ఉన్నదంటారు. దీనిని గ్రహించలేని వారు పైపై వేషాలకే మోస పోతుంటారు. ఈ తేజస్సు దైవీసంపద.

No comments:

Post a Comment