Friday, October 11, 2024

*****కామ మాయ

 🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
మూలం : కపాల మోక్షం

అనుభవం & అనుభూతి : 
శ్రీ పరమహంస పవనానంద


శీర్షిక : మూలాధార చక్ర ఆధీనము - జయము... 


సాధనలో, ధ్యానమునందు నాకు సువాసనలు సహజసిద్ధంగా వస్తూ ఉండే సరికి నా మనస్సుకి ఏదో తెలియని దివ్య మత్తు ఆవహించసాగినది. ఇంతలో నా ప్రమేయం లేకుండానే నేను నా చేతులతో అసంకల్పితంగా ముద్రలు వేయడం ఆరంభించాను. అలాగే ఆసనాలు వేయటం అనగా సిద్ధాసనం లేదా వజ్రాసనం వెయ్యడము జరిగేది. ఇదంతానేను తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా మన ప్రమేయం లేకుండా నాకు తెలియకుండా నా చేతులతో ముద్రలు వేయడం అలాగే నా శరీరం అసంకల్పితంగా ఆసనాలు వేయడం జరిగేది.  ఇలాంటి సమయంలో మహామాయ తన ప్రతాపం చూపించేది. ఈ చక్రంలో కామ మాయ ఉంటుందని తెలుసు. ఈ చక్రానికి అధిదైవము గణపతి అయితే అధిష్ఠాన దైవం ఇంద్రుడు.   ఇంతవరకు చక్ర జాగృతి, శుద్ధి మాత్రమే జరిగాయి. కానీ ఈ చక్ర మాయ దాటితేగాని, మూలాధార చక్రం ఆధీనము లోకి రాదని ఆలోచించి నా ధ్యానం ఆపకుండా కొనసాగిస్తున్నాను. ఇలా మూడు నెలల పైగా జరిగినది.    మ్రొక్కుబడి గా నా ధ్యానం చేసుకోవటం ఆపలేదు.  నచ్చలేదు.   నాకు అసంకల్పితంగా  ముద్రలు, ఆసనాలు వస్తూనే ఉన్నాయి. నా జీవితంలో ఈ సమయంలోనే ఒక స్త్రీ ప్రవేశించింది. ఆమెపై నా ఆలోచనలు ఎల్లప్పుడూ ఉండేవి. అయినా ఎక్కడ కూడా ఏమి ఆగడం లేదు. కానీ నా మనస్సు మాత్రం కామంపై ఆగిపోయినట్లుగా విపరీతంగా అనిపించేది. ఇలా మరో ఆరు నెలలు చూస్తుండగానే గడిచిపోయాయి. కానీ ఆమె ఆలోచనలు నన్ను దాటి వెళ్ళడం లేదు కదా! ఈ మాయను దాటి వెళ్లిపోవాలి.   ఒకవేళ ఈమె ఈ మూలాధార చక్ర కామ మాయ కాదు గదా! ఒకవేళ అది అయితే ఈ చక్రం ఆధీనం అవటం దేవుడెరుగు! దేనికి పనికిరాకుండా పోతాను.  ఈ మాయకే నేను లోబడినట్లయితే నేను ఆ స్త్రీ కే   అంకితమవుతాను. ఆమె మోహ, వ్యామోహంలలో నేను బంధీ అవుతాను. ఆమెపై ప్రేమ, మోహం ఉన్నంత వరకు నాకు బాధ్యతలు ఉంటాయి. నాలో నేను అంతః సంఘర్షణ పడుతున్నాను. ప్రస్తుతానికి నేను ఎవరి మోహంలో కూడా పడరాదు అని అనుకున్నొను. ఈలోగా మరో స్త్రీ నన్ను వలచింది. మాయ అంటే ఇదే కాబోలు. ఇలా ఎంతమందిని దాటాలి అని అర్థం కాలేదు. నిరంతరం ధ్యానాభ్యాసాలు చేస్తూ ఉన్నాను. నాకు ధ్యానంలో తెలిసిన వారివి తెలియని వారివి ఎవరివి కావాలన్న వారి రతి క్రీడా దృశ్యాలు ఏవో కనిపించేవి. మాయను దాటి వెళిపోతానని ప్రయత్నిస్తూ ఉంటే....ఇలాంటి అనుభవాలు రావడం మనస్సును కలచివేస్తోంది.   ఏమిటి ఇదంతా? ఉన్నది చాలక ఈ మాయ కూడా నా... అనుకుంటూ ఉండగా, కొన్నిసార్లు, ధ్యానములో నా ప్రమేయం లేకుండా నా ఉపస్తేంద్రియం పైకి లేచి నాభికి కొట్టుకొని అక్కడ కొద్దిసేపు ఉండిపోయేది. ఇలా అయితే నా పరిస్థితి పాతాళానికి పోయినట్లే. అయిపోయింది . నా జీవితం నాశనం అయిపోయినట్టే... అనుకుంటూ ఉండగా,  నా ధ్యాన భంగమై కళ్ళు తెరవడం జరిగేది. కానీ విచిత్రమేమిటంటే, ఈ చక్ర జాగృతికి అలాగే శుద్ధికి కేవలం ఒకటిన్నర సంవత్సరాలు మాత్రమే పడితే ఆధీనస్థితి కి వచ్చి అప్పుడే సుమారుగా 11నెలలు గావొస్తోంది.  నా పరిస్థితికి నాకు ఆగ్రహంతో పిచ్చిపట్టినట్లు అయింది. దానితో నాలో వచ్చిన తెలియని చెప్పుకోలేని వేడిని తగ్గించుకోవటానికి చన్నీటి స్నానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చేది. కానీ ధ్యానానికి కూర్చోగానే నా కోసం ఎదురుచూస్తున్నానని మాయ నా మీద కామ బాణాలు వేయడం, దాంతో నా ఉపస్తేంద్రియం నిద్రలేవటం అన్ని కూడా షరా మామూలుగానే నా ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి. మనలో రేతస్సు(వీర్యం) బయటకు రాకుండా ఈ స్థితిలోచాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే  మనిషి తట్టుకోలేనంత కామ ప్రకోప స్థితి పొందాల్సి ఉంటుందని నాకు అర్థం అయింది. కానీ ఏమి చేయాలి?ఎలా ఈ మాయలో పడకుండా ఉండాలో నాకు అర్థం కాలేదు. అసలు ఈ చక్రానికి అధిపతి అయిన గణపతికి ఈ కామానికి గల సంబంధం ఏమిటో అర్థం కాలేదు. అందుకే లక్ష్మీ గణపతి అన్నారు కదా. అంటే ఈయన ధన మాయ చూపించాలి కానీ కామ మాయ ఎందుకు చూపిస్తున్నాడో నాకు అర్థం కాలేదు. అపుడు నాకు విచిత్రముగా ఉచ్చిష్ట గణపతి శృంగార దృశ్యాలు ఉన్న విగ్రహమూర్తులు, చిత్ర పటములు నేను చూడటము జరిగినది. దానితో ఈ చక్ర కామమాయగా గణపతి ఉంటాడని గ్రహించాను!
నా పరిస్థితి ఇలా ఉంటే అరుణాచలంలో ఈ చక్ర ఆధీనము కోసం వెళ్లిన జిఙ్ఞాసి పరిస్థితి తల్చుకొని బాధ, ఆనందంతో కూడిన నవ్వు వచ్చింది.వాడు కూడా శ్రీశైలంలో ఈ చక్ర జాగృతి అలాగే కాశీక్షేత్రంలో ఈ చక్ర శుద్ధి చేసుకున్నాడు. త్వరలో ఈ చక్ర ఆధీనము కోసం అరుణాచలం వెళుతున్నాడని Telepathy ద్వారా చెప్పడం జరిగినది. తనకి ఈ చక్ర ఆధీనము అయిన తర్వాత తన అనుభవాలు అన్నీ కూడా చెబుతానని టెలిపతి ద్వారా సూచనలు పంపినాడు. చూడాలి మరి !  ఇలా కొంత కాలం గడిచింది. నా సాధన పట్టు విడవకుండా సాగుతోంది. మానవ నగ్న స్త్రీమూర్తులు కనిపించటం పోయి దేవత స్త్రీమూర్తులు కనబడి కవ్వించడం  ప్రారంభమైనది.

ఈసారి కామ దేవతలు మొదలైనారా? అంటే విశ్వామిత్రుడు ధ్యానం చేసే సమయంలో ఉండగా ఈ కామమాయలోనే మేనక రావడం ఆమె మోహ మహా మాయకి లోనై శకుంతల జన్మకి కారకుడైనాడు కదా ! ఆ తర్వాత 10 లక్షల సంవత్సరాల జపశక్తి నాశనమైనదని తెలుసుకొని వైరాగ్యం చెంది ఈసారి తీవ్రమైన ధ్యానం చేస్తుండగా మళ్ళీ కామమాయ వచ్చే సమయమునకు ఈసారి రంభ వచ్చేసరికి ఆయనకి కోపం వచ్చి ఆమెను శపించేసరికి మళ్లీ 10 లక్షల సంవత్సరాల జపశక్తి నాశనమైందని గుర్తుకురాగానే...  అంతటి జపశాలికే ఇంతటి పరీక్షలు ఉన్నాయని అనుకొన్నాను కానీ ఎప్పుడైతే మానవ స్త్రీ మూర్తులను దాటినానో ఆనాటి నుండి రతి క్రీడా దృశ్యాలు ఆరంభమయ్యాయి. వీటిని కూడా దాటేసరికి ఇప్పుడు దేవతల నగ్న దేవతలు దర్శనాలు ఆరంభమయ్యాయి.  ఇప్పుడు గాని నాకు కలలో కూడా వీర్యస్కలనం అయినా కూడా నా సాధన శక్తి అది కూడా ఎన్నో కోట్ల జన్మల నుంచి చేస్తూ వచ్చిన శక్తి గంగలో కలిసిపోయినట్లే. ఈ జన్మ ఇంతటితో సాధన ఆగిపోయినట్లే.మళ్ళీ ఆకలి కోసం జన్మ తప్పదు కదా అనుకుంటుండగా ధ్యానం  భంగమై అప్పుడు నిద్ర లేచాను. ఉవ్వెత్తున లేచిన నా ఉపస్తేంద్రియం ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ... పూజ గది నుండి నా గదిలోనికి వెళ్లి ఏడవటం తప్ప ఏమి చేయలేకపోయాను. ఇలా కొన్ని వారాలు గడిచేసరికి నా ధ్యానంలో నగ్న దేవతా స్త్రీలు,గంధర్వ స్త్రీలు,ప్రేతాత్మలు, కామ పిశాచాలు ఎవరికి వీలు పడితే వారు వరుసగా నన్ను కవ్వించడం  ప్రారంభించినారు. అసలు వీళ్ళతో ఎలా శృంగారం చేస్తామో అర్థం కాని స్థితిలో ఉన్నాను. ఈ మాయా శక్తిని నేను అధిగమించలేనా....ఇలా నా ఆలోచనలు సాగుతున్నాయి. ప్రణవ మంత్రం, ప్రణయంగా మారేసరికి విపరీతమైన దుఃఖం రాసాగింది. దాంతో ఏదో తెలియని దిగులు, విచారము దానితో పాటు ఎలాంటి పాపం కూడా తెలియని ఈ స్త్రీ మూర్తులను చూసేసరికి నాలో తెలియని భయం మొదలైంది. నిగ్రహం కోల్పోయి వాళ్ళతో ఎలా ఉంటానో నాకే అర్థం కాని స్థితి.  కామ దేవుడైన మన్మధుడు గుర్తుకు వచ్చేసరికి “స్వామీ! నా మీద ప్రయోగించిన మానవ, దేవత,రాక్షస, గంధర్వ,  పిశాచ స్త్రీ మూర్తులు కామ బాణాలు ఉపసంహరించు....! మానవమాత్రులమైన నా మీద దయ చూపించు! నన్ను కరుణించు! ఒకవేళ నేను ఈ మాయలో పడితే మళ్లీ ఈ సాధన స్థితికి రావాలంటే మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుందని నాకు తెలుసు. అలాగే మీకు తెలుసు. తెలిసి కూడా నన్ను ఎందుకు ఈ మాయలో పడ వేస్తావు? అంతగా అయితే ఈ చక్ర ఆధీనము అయిన తర్వాత నేను ఇంకా తట్టుకోలేకపోతే అప్పుడు నువ్వు చూపే  స్త్రీమూర్తిని వివాహం చేసుకుంటాను. ఒకవేళ, ఇప్పుడున్న స్థితిలో నేను కామ మాయలో పడితే పునర్జన్మలే నాకు మిగులుతాయి. నన్ను వదిలిపెట్టు. జనన మరణ చక్రం నుండి బయటపడాలని అనుకుంటున్నాను! నన్ను మళ్ళీ ఈ జనన మరణ చక్రంలో పడవేస్తే నీకు ఏమి మిగులుతుంది ?  నేను ఇప్పటికే ఎన్నో లక్షల జన్మల పాటు నేను ఈ కామ మాయను దాటలేక జన్మలు ఎత్తాను కదా! నాతో ఇలా ఆడుకున్నది చాలు. ఇకనైనా నన్ను కరుణించి ఈ జన్మ నాకు ఆఖరి జన్మ అయ్యేటట్లుగా చేయటం అనేది మీ చేతలలో నా చేతుల్లో ఉంది. అయిననూ ఆయన  కరుణించలేదు. కామ బాణాలతో నన్ను చంపడానికి సిద్ధపడే వాడిని చంపద్దు అంటే చంపకుండా ఊరుకుంటాడా ? ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు.
మన ప్రయత్నాలు మనం చెయ్యాలి అనుకుంటూ ధ్యానానికి కూర్చునేసరికి రక రకాల దృశ్యాలు అనుభవంలోకి రావడం, నాకు ధ్యాన స్థితి  భంగం కావటము జరగటంతో నేను బలవంతపు నిద్రలోకి జారుకోవడం జరిగినది. ఇది ఇలా ఉన్న రోజులలో ఒకసారి టీవీలో భక్త తుకారాం సినిమా నడుస్తుంది. అందులో తుకారాంను తన శరీర సొంపులతో కామ మాయలో పడ వేస్తానని ఒక నర్తకి శపథం చేయటం,ఆ తర్వాత ఆయనని తన ఇంటికి పాండురంగ పూజ చేయడానికి రమ్మని చెప్పడము ఆయన రావడం ఆమె ఈయనని కవ్విస్తూ పాట పాడటం అది పూర్తి అయిన తరువాత తుకారాం ఆమెతో అమ్మా అని సంబోధించి 80 సంవత్సరాల తర్వాత నీవు నిజం అనుకునే అందచందాలు ఎలా ఉంటాయో అని ఆయన తిరిగి పాట పాడేసరికి ఆమెకి అంతా అర్థమయ్యి ఆయన కాళ్ళమీద పడి క్షమించమని చెప్పి ప్రాయశ్చిత్తంగా పాండురంగ భక్తురాలిగా మారటం దృశ్యం చూసేసరికి నాలో ఏదో తెలియని ఆనందం వేసింది. ఈ సినిమాను ఈ దృశ్యం కోసం 20 సార్లు చూశాను. ఆ తర్వాత మహా శివరాత్రి నాడు పరమానందయ్య శిష్యుల కథ సినిమా రావటం అందులో హీరో తన ఇష్ట నర్తకి తో సుఖలాపాలు పూర్తి  అయ్యి ఉండగా మెలకువ వచ్చి “ఈ రోజు మహాశివరాత్రి. తను నిత్యం చేసే క్రమం తప్పని వేళ తప్పని శివారాధన గుర్తుకు రావటం ఆ గది తలుపులు బిగించి ఉండటం చేత సమయానికి శివలింగ మూర్తి ఎక్కడ కనిపించకపోయేసరికి తీవ్రమైన మనోవేదన చెందుతూ తను చేసిన పాడు పనికి బాధపడుతూ వుండగా అప్పటిదాకా ముగ్ధ మనోహరంగా కనిపించిన స్త్రీ మూర్తి యొక్క గుహ్య భాగము కాస్త కొండ మీద ఉన్న లింగమూర్తి గా కనపడేసరికి మనస్సు కుదుటపడి దానిని మహా శివ లింగమూర్తి గా భావించుకొని పూలతో ఆరాధన చేస్తూ మంత్రోచ్చారణ చేస్తూ ఉండగా ఈ పూజ మహా కైలాసము లోని కైలాసపతి పాదాల మీద పడుతూ ఉన్న దృశ్యం చూసేసరికి నాలో నాకే తెలియని మహదానందం వేసింది.ఏదో స్ఫురణ కలిగినది.

ఈ కామ మాయ ఉండబట్టి తల్లిదండ్రులకి మనము పుడుతున్నాము. అదే కన్నతల్లి మూడు నిమిషాల పాటు ఎలాంటి కామ ఉద్రేకానికి గురికాకపోతే ఎవరు కూడా మనల్ని కనే శక్తి ఉండదు కదా.అంటే ఇన్నాళ్ళు నేను చేస్తున్న తప్పు ఏమిటో అర్థమయ్యేసరికి మాయ మాయం అవ్వటం మొదలైంది. ఇప్పుడు రండి.  ఇప్పుడు ఎవరు వస్తారో ఏమి చేస్తారో చూద్దామని తీవ్ర ధ్యానములో ఉండేసరికి యధావిధిగా మొదట వివిధ రకాల స్త్రీ మూర్తులు కనిపించేసరికి వెంటనే వారితో “అమ్మా! మిమ్మల్ని నేను ఇంతవరకు అమ్మగా కాకుండా అమ్మాయి గా గుర్తించడం వలన నా మీద కామ బాణాలు వేసినారు. కానీ ఇప్పుడు నేను మీ బిడ్డను అయ్యాను కదా. బిడ్డ మీద ఎక్కడైనా తల్లికి కామము కలగదు కదా” అనగానే వారు అదృశ్యమయ్యారు. అంటే అప్పటిదాకా మహాశివుడికి శృంగార దేవతగా కనపడిన పార్వతి దేవి కాస్త తారా దేవిగా మారినప్పుడు ఆయనకే తన చనుబాలు పట్టించి తల్లిగా మారింది కదా !అంటే మనము కామత్వము గా చూస్తే భార్యగా అదే ఆమెలో దైవత్వం చూస్తే తల్లి గా కనబడుతుంది అనే నగ్నసత్యం నాకు తెలిసేసరికి ఆరు సంవత్సరములు పట్టినది. ఇక ఆనాటి నుండి అప్పటిదాకా ప్రణయ మంత్రం కాస్తా నెమ్మది నెమ్మదిగా ప్రణవ మంత్రంగా మారింది.ఈ స్త్రీ నగ్న తత్వమును ఛేదించటానికి మహాశివుడు కాపాలికుడుగా మారి నానా కష్టాలు పడినాడు అని గుర్తుకు వచ్చే సరికి ఎన్నో రోజుల తర్వాత ఆనందంతో కూడిన నిద్ర మత్తు ఆవహించింది. ఈ మూలాధార చక్రము ఇచ్చే కామమాయ ఛేదించినందుకుగాను అలాగే దానిని దాటినందుకు గాను నాకు కాణిపాకం నుండి తెల్ల జిల్లేడు వేళ్ళు అయినా స్వయంభువుగా వెలసిన శ్వేతార్క గణపతి రావడం జరిగినది.వీటితో పాటుగా ఆయన నిజ రూప విగ్రహమూర్తి, ఏనుగు తోక వెంట్రుకలు రావడం జరిగినది. 35 సంవత్సరముల పాటు ఒక తెల్ల జిల్లేడు చెట్టు బ్రతికితే వేళ్ళు గణపతి ఆకారంగా లేదా హనుమత్ ఆకారంగా మారతాయి.వీటినే స్వయంభూ శ్వేతార్క గణపతి అంటారు. ఇది మీ ఇంటికి వచ్చినది అంటే మీరు మీ సాధన స్థాయిలో మీ మూలాధార చక్ర ఆధీనమునకు కావలసిన సాధన ఆయన ఇస్తాడు. వారిని నిత్యపూజలో ఉంచి అర్చన చేస్తే సకల వాస్తు దోషాలు తొలగి సకల ఆటంకాలు తొలగిస్తాడు.అదే ఈయన మీద ధ్యానంలో కనిపించిన బీజాక్షరాలు(శుద్ధి సమయం )సహితము మంత్రముతో సిద్ధి పొందితే  మనకి భూచర సిద్ధి వస్తుంది. ఒక అంగుళం ఎత్తునుండి 30 అడుగుల ఎత్తు వరకు భూమి నుండి గాలిలో లేస్తారు (Levitation Power ) . అలాగే ఎప్పుడైనా మన కాళ్ళ మీద పెద్ద బండరాళ్ళు దొర్లినను మనకేమీ కాదట. కానీ నేను మాత్రము తీవ్ర ధ్యానంలో ఉండగా గోరు పరిమాణం అంత ఎత్తు గాలిలో ఉత్తేజము చెందుతూ మాయలు తొలగిపోయి గాలిలోకి ఎగిరిపోతే భయము వేయడంతో క్రిందకు వచ్చినాను. ఇంకా ఎప్పుడు ఈసిద్ధి  గురించి నేను ప్రయత్నించ లేదు. ఎందుకంటే ఈ మూలాధార చక్ర  మాయ లో ఉంటే మిగిలిన చక్రాలలోనికి నేను ప్రవేశించలేనని అనిపించి ఆపి వేశాను. ఇది చేసిన 21 రోజుల తరువాత కాణిపాకం నుండి నల్లటి రాతి విగ్రహమూర్తి కాణిపాకం వినాయకుడి లాగా మా ఇంటికి వచ్చారు. ఇక దానితో ఈ మూలాధార చక్ర సిద్ధ మాయను దాటటం జరిగినదని నాకు అర్థమైంది. మరో చక్రమైన స్వాధిష్ఠాన చక్రం కోసం తీవ్ర ధ్యానం చేయడం ప్రారంభించాను.
జిఙ్ఞాసి కి ఈ చక్రానుభవాలు
ఇక శ్రీశైలము,కాశి,అరుణాచల క్షేత్రములో తన మూలాధార చక్ర జాగృతి, శుద్ధి,ఆధీనము ఎలా చేసుకున్నాడో నా జిఙ్ఞాసి మాటలలోనే చూడండి. “ఓ మహాశయా! నాలో కుండలినీశక్తి జాగృతి అయిన తరువాత నాకు తీవ్ర ధ్యానం చేసే శక్తి లభించినది. ఏకధాటిగా 10 గంటల దాకా ధ్యానములో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటం జరిగినది. ఒకసారి శ్రీశైల క్షేత్రం లో ఉండగా నాకు ధ్యానం లో మొట్టమొదటి సారిగా స్వయంభూ గణపతి కనిపించారు. ఆయన ఏమి మాట్లాడడు. అలాగని ధ్యానంలో కనిపించకుండా ఉండడు.ఇది దేనికి సంకేతమో నాకు అర్థం కాలేదు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వీరావేశంతో ఉన్న నల్లని ఏనుగు కనపడసాగింది.నా మీదకి ఉగ్రంగా తొండమును ఎత్తి కుమ్మటానికి వచ్చినట్లుగా అనిపించడంతో కళ్ళు తెరిచేవాడిని.మళ్లీ కళ్ళు మూసుకోగానే ఇదే దృశ్యం కనిపించేది. క్రిందటి జన్మ లో ఎప్పుడైనా నేను ఏనుగును బాధ పెట్టడం జరిగి ఉంటుంది అనుకొని అలాగే ధ్యానం కొనసాగిస్తూ ఉండేవాడిని.ఒకసారి నేను తీవ్రమైన ధ్యానంలో ఉండగా నాకు మాగుడు వంటి దుర్వాసన నా ముక్కుల కి సోకడం మొదలైనది. కళ్ళు తెరిచి చూస్తే చుట్టుపక్కల ఏమీ ఉండేది కాదు. నాకు ఏమీ అర్థం అయినది కాదు.కానీ మళ్ళీ ధ్యానములో కూర్చోగానే ఇలాంటి తీవ్రమైన కంపు వాసన వచ్చేది. దానిని భరించలేక మూడు రోజులపాటు నాకు తీవ్రమైన వాంతులు అయినాయి.వాటితోనే నేను పోతానేమో అని అనిపించేది. ఎవరూ లేకుండానే ఎవరిని చూడకుండానే ఏమి జరగకుండానే ఏమి పొందకుండానే చచ్చిపోతానేమో అని తీవ్ర భయం వేసింది. ఇది జరిగిన రోజులలోనే అనుకుంటా. నాలో నాకే తెలియని తీవ్రమైన కామవాంఛ మొదలైనది. తరచుగా నిద్రలో నాకు తెలియకుండానే వీర్య స్కలనం జరిగేది.

దానితో నేను సిగ్గుతో బాధపడేవాడిని. రాను రాను నాకు ధ్యానము కామవాంఛ తప్ప వేరే స్మరణ ఉండేది కాదు. ఇంద్రియానికి మనస్సు లోబడి కోరికను ఎలాగైనా తీర్చుకోవాలని విపరీతంగా గోల చేసేది. ధ్యానములో నగ్న స్త్రీ దర్శనము సిగ్గుపడుతూ కనిపించటం ఆరంభమైనది. ఇలాంటి స్త్రీ మూర్తులు నేను చిన్నప్పుడు భౌతికముగా మా ఇంటి చుట్టు ఉన్న చూసిన వారే నాకు నగ్నంగా కనిపించి కవ్విస్తుంటే క్రమంగా నాకు ధ్యాన సమయం తగ్గుతూ ఈ కనిపించిన నగ్న స్త్రీల గురించి ఆలోచించటం ఎక్కువ అయినది. దాదాపుగా నా నిగ్రహం కోల్పోయి ప్రమాదస్థాయికి నేను చేరుకున్నానని నాకు అర్థమైనది. దానితో స్త్రీలను చూడాలంటే సిగ్గు భయం వేసి స్త్రీలే కనిపించని చోటుకి వెళ్లాలని శ్రీశైలం అడవుల్లో లోపల ఉండే చెంచుల గూడెమునకు వెళ్ళిపోయాను. అక్కడ నాలాంటి మనిషి ని చూడటం వాళ్లకి మొదటే కాబోలు ఆడ మగ అనే తేడా లేకుండా నా దగ్గరకి వచ్చి నన్ను వింత జంతువును చూసినట్లుగా చూసి నా వలన వారికి ఎలాంటి ప్రాణాపాయం ఉండదని గ్రహించుకొని నన్ను కూడా వారి గూడెం లోని ఒక గుడిసెలో ఉండటానికి అవకాశం ఇచ్చారు. అక్కడ కూడా యధావిధిగా ఒక గూడెపు నగ్న స్త్రీ నాకు ధ్యానములో కనిపించి కవ్వించి సైగ చేయడంతో నేను కళ్ళు తెరిచి ధ్యానం ఆపేసే వాడిని. నా ధ్యానం ఇంకా ముందుకు వెళ్లేది కాదు.అలాగని ఈ నగ్న స్త్రీ ఆలోచనలు ఉండకుండా పోయేవి కావు.
ఇలా ఎందుకు కన్పించి కవ్విస్తున్నారో నాకు అర్థమయ్యేది కాదు. తిరిగి ధ్యానానికి కూర్చోగానే నగ్న స్త్రీ దర్శనము దానితో నా ఇంద్రియము విజృంభించి నా ఇంద్రియం పైకి లేచి నాభికి కొట్టుకొని అక్కడ కొద్దిసేపు ఉండిపోయేది.దాంతో నాకు విపరీతమైన ఆవేశంతో పిచ్చిపట్టినట్లు గా అనిపించేది. ఏ పాపం తెలియని చెంచుస్త్రీలు కూడా నగ్నం గా కనిపించే సరికి నేను అక్కడే ఉంటే వారిలో ఎవరినో ఒకరిని ఏదో ఒకటి చేసి గాని ఊరుకోలేనని బలంగా అనిపించడంతో కాశి క్షేత్రంకు వెళ్ళి మరణం పొందాలని నిర్ణయించుకుని ఆ క్షేత్రమునకు వెళదామని అనుకుంటుండగా సుప్రభాత సేవ మొదలైనదని సూచనగా గుడిగంటలు మ్రోగే సరికి మల్లన్న సూచనగా భావించుకొని అక్కడి నుండి కాశీ క్షేత్రమునకు బయలుదేరినాను. నేను ఈ క్షేత్రమునకు చేరుకొని విశ్వనాధుని దర్శించుకుని శ్రీ త్రైలింగస్వామి మఠమునకు చేరుకొని నాకు కొత్తగా వచ్చిన నగ్న స్త్రీ దృశ్యాలు గూర్చి ఆయన విగ్రహనికి చెప్పి నన్ను రక్షించమని చెప్పి పంచగంగా ఘాట్ నందు ధ్యానం చేస్తుండగా ఇక్కడికి దగ్గరలోనే ఉన్న మణి కర్ణిక ఘాట్ లో అప్పుడే అక్కడికి స్త్రీ శవమూర్తి వచ్చినది. ఎందుకో అక్కడికి వెళ్లాలని దగ్గర ఉండి ఆమె దహన సంస్కారాలు చూడాలని బలముగా అనిపించినది. వెంటనే వెళ్లి చాలా దగ్గరగా ఆమె దహనసంస్కారాలు చూశాను. తడిసిన ఆమె శరీర భాగాలు చాలా స్ఫుష్టంగా  కనిపించేవి.జీవము లేని చూపులు, అందములేని శరీరము నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉన్న సమయములో దహనం చేయడం ఆరంభించారు. అప్పటిదాకా ఈ దేహము కాస్త విగత దేహముగా మారగానే బ్రతికున్నప్పుడు కామాగ్ని లోనూ చనిపోయినప్పుడు చితాగ్నిలోనూ తగలబడుతోంది కదా! అంటే ఈమె స్త్రీ అని పురుషుడని నగ్నం గా ఉన్నది అని అతను నగ్నంగా ఉన్నాడు అని భావము లేని స్థితికి తను వెళ్లాలని అంటే నగ్నత్వం నుండి దిగంబరత్వం వైపు ముందుకు వెళ్లాలని స్ఫురణకు రాగానే విశ్వనాథుడికి, శ్రీ త్రైలింగస్వామికి కృతజ్ఞతలు చెప్పి ధ్యానం చేస్తుండగా నగ్న స్త్రీలలో ఈ సారి కామము అలాగే నగ్నత్వం తగ్గి వారి స్థానంలో దిగంబరత్వం గా కనిపించసాగింది.ఇలా కొన్ని రోజులు ధ్యానంలో ఉండగా అక్కడికి సాధువులకు సాధకులకు కావలసిన బియ్యం ఇతర వంట సామాగ్రి వస్తువులను ఒక నడివయస్సు ఉన్నస్త్రీ మూర్తి ఇవ్వడం నేను గమనించాను.మా బోటి వారికి కి ఆమె చేస్తున్న సేవ గూర్చి ఆనందమేసింది. ఆమె నన్ను చూడగానే ఆమె మనస్సు చెదిరినట్లై ఆమె నేను ఏ యే ఘాట్ నందు ఎక్కడ ఉంటే పని పెట్టుకొని ఆ ఘాట్ కి వచ్చి అక్కడున్న సన్యాసులకు వస్తువులు ఇస్తున్న నెపంతో నన్ను కామవాంఛతో చూడటం చూసేది. దొరికే చిన్న అవకాశం కూడా మాయ వదులుకోలేదని నాకు అర్థమైంది.
ఇలా ఆమె చేస్తున్న సేవలు పూర్తిగా అప్పటికే నాకు తెలిసి ఉండటంతో నా మనస్సు ఆమెకు కృతజ్ఞతగా ఈ విధంగా ఆమెకు కామ కోరిక తీరిస్తే మంచిదే కదా! అని ఒక క్షణం నేను నా మనస్సు జారిపోయింది. వెంటనే అంతలో మణికర్ణికా ఘాట్ స్త్రీ దేహం  యొక్క అంతిమ సంస్కారం గుర్తుకు వచ్చినది. దానితో బ్రతికియున్న ఈ దేహమును మానసికంగా చర్మము ఒలిసి దర్శించి చూశాను. మాంసము, నెత్తురు,చీము, నరాలు,అంగాలు,మలము మూత్రమున్న భాగాలు … ఇవి అన్నియి లేని చివరికి మిగిలిపోయే ఆస్ధిపంజరమును దర్శించే సరికి నాలో ఆమె మీద ఉన్న కామోద్రేకం పూర్తిగా క్షణాలలో నశించిపోయింది. దానితో నా కోసం ఎదురు చూస్తున్న ఆ స్త్రీ మూర్తి వైపు తిరిగి “తల్లి! కామం తీర్చు కోవడం అనేది నా దృష్టిలో కేవలం సంతానోత్పత్తి కి మాత్రమే ఉపయోగించే విధి విధానము. అది నేను తల్లిదండ్రులు చేసే సృష్టి యఙ్ఞంగా భావిస్తాను. నాకు ఎన్నడూ నగ్నత్వం మాత్రం కనిపించదు. కేవలం దిగంబర తత్వము మాత్రమే అగుపించును.

అంటే దిక్కులనే వస్త్రములుగా ధరించి చూసేవాడు దిగంబరి అన్నమాట. అలాంటప్పుడు నాకు నగ్నత్వం కనిపించదు .బాహ్యంగా మీరు వస్త్రాలు తీసినప్పటికీ నాకు మీ చుట్టూ ఈ దిక్కులే వస్త్రాలు ధరించి నాకు అగుపించును. మంచికి చెడుకి కారణము "మనస్సు" అని గ్రహించి దానిని అదుపులో పెట్టుకునేవాడు దేవుడు. దానిని అదుపులో పెట్టుకో లేనివాడు జీవుడు అవుతాడు. మోక్షము ఉన్నచోట భోగాలుఉండవు. భోగాలు ఉన్నచోట మోక్షము ఉండదు. కాబట్టి నా చర్మమును వలిచి చూడండి. దుర్గంధ పూరితమైన శరీర భాగాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకో తల్లి. నీవు చేయాలనే తప్పు దేనితో చేస్తున్నావో గుర్తించండి. ఈ జీవము కాస్త శవమే కదా. ఇది "శవము" అయ్యే లోపల "శివము" అవ్వాలని ప్రయత్నంలో ఉండగా మీలాంటి మాయలో పడితే నా గతి అధోగతియే గదా”! ఏమనుకుందో ఏమో నాకు దండం పెట్టి మౌనంగా వెళ్ళి పోయింది.ఆ క్షణం నుండి నా శరీరములో ఏవో కర్మలు కూడా తొలగిపోతున్నాయి అని ఆలోచనలు సాగుతుండగా నేను నెమ్మదిగా గాలి లో ఒక అంగుళం ఎత్తు ఎగిరే సరికి నాకు ఆనందం వేసింది. అంటే తన మూలాధార చక్ర జాగృతి శుద్ధి మొదలై ఆధీన స్థితికి చేరుకున్నానని నాకు అర్థమై, కాశీ లో ఉంటే ఇలాంటి స్త్రీ మూర్తుల వల్ల ఎలాంటి ప్రమాదమూ లేకపోయినా వారు ఇచ్చే వస్తువుల సేకరణ వలన వారి కర్మలు తీసుకొని ఈతి బాధలు పడాల్సి వస్తుందని స్ఫురణకు రాగానే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాలి అనుకోగానే ఇంతలో అక్కడ ఉన్న కొంతమంది సాధువులు నా దగ్గరికి వచ్చి “స్వామి! మీరు ఆమెకి చేసిన హితబోధ విన్నాము. మీరు మూలాధార చక్ర ఆధీనంలో ఉన్నారనిమాకు అర్థమైనది. మీ లాంటి యువ సాధకులను చూసేసరికి మాకు తెలియని ఆనందం చేసినది. మేము అరుణాచలేశ్వరుని దర్శించుకోవటానికి వెళుతున్నాము. మీరు కూడా వస్తారా?” అనగానే విశ్వనాధుని ఆఙ్ఞగా భావించుకుని వారితో కలసి అరుణాచలం వెళ్ళినాను.


అక్కడికి వెళ్ళి అరుణాచలేశ్వర స్వామి ని దర్శించుకుని అవతల వైపు అడవిలాంటి ప్రాంతమునకు చేరుకొని ఏకాంతంగా ఒక రాతి మీద కూర్చొని ధ్యానం చేస్తుండగా “లే! లేరా! నా మీద కూర్చుని ఎలా ధ్యానం  చేస్తున్నావురా. ఇక్కడ నుండి పో !” అని ధ్వని వినబడింది. కళ్లు తెరిచి చూస్తే అక్కడ ఎవరూ కనిపించలేదు. అలాగే నేను ధ్యానం చేసుకునే రాతి మీద అంతవరకు ఎవరూ కూడా కూర్చోలేదు. ఏమోలే! నా ఆలాపన అనుకుని తిరిగి ధ్యానంలో ఉండగా మరల ఇవే మాటలు చాలా కటువుగా వినబడేసరికి “స్వామీ! మీరు ఎవరో నాకు తెలియదు.నేను మీ మీద ఎప్పుడు ఎలా ఎక్కడ కూర్చున్నానో తెలియదు. దయచేసి చెప్పండి” అనగానే “పిచ్చివాడా! నీవు కూర్చున్న రాతి మీద సూక్ష్మధారిగా ఇక్కడే కూర్చుని ధ్యానం చేస్తున్నాను.నువ్వు నన్ను చూడగలిగితే ఇక్కడికి ఎందుకు వస్తావు” అనగానే నేను దడాలున లేచి అప్పటి దాకా ఖాళీగా ఉన్న రాయి మీద సూక్ష్మధారి ధ్యానం  చేసుకుంటున్నారని నేను ఊహించనందుకు ఎంతో సిగ్గుతో బాధపడుతూ “నన్ను క్షమించండి” అనగానే, ఇక్కడికి ఎందుకు వచ్చావు?నువ్వు ఎవరివి అనగానే నేను వెంటనే “స్వామి! అది తెలుసుకుందామని… కామ మాయను కూడా దాటి ఇక్కడికి వచ్చాను” అనగానే గాలిలో లేద్దామని అనుకుంటున్నావా? అయితే నన్ను చూడు అంటూ ఉండగానే ఆ రాతి మీద స్థూల శరీరము జడదారి అయిన సాధువు కనిపించి గాలిలో లేవడము అతడు సుమారుగా 30 అడుగుల ఎత్తులో గాలిలో లేచిన తర్వాత నెమ్మది నెమ్మదిగా క్రిందకి దిగినాడు. అది చూసే సరికి నాకు ఆశ్చర్యం వేయగా “నువ్వు వస్తావని నాకు తెలుసు రా ! నేను నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను రా ! శ్రీశైల రత్న గణపయ్య నాకు ముందే చెప్పి ఏర్పాట్లు చేయించినాడు రా! నువ్వు ఎప్పుడైతే ఆయన తండ్రి చోటులో జయం పొందినావో నిన్ను చూసుకొమ్మని నన్ను పురమాయించాడు ! రా వెళ్దాం...” అంటూ... ఒక దివ్య జ్యోతి దారి చూపుతూ దట్టమైన అడవిలో కారు చీకటి ఉన్న చిన్నపాటి గుహలోకి వచ్చేసరికి ఆ కాంతి పుంజము కాస్త స్థూల శరీరధారిగా మారినది. అప్పుడు ఇక్కడికి 15 మంది దాకా సాధువులు వచ్చి నన్ను లోపలికి ఆహ్వానించి తీసుకుని వెళ్లి జామకాయలు,అరటి పండ్లు త్రాగడానికి నీళ్ళు ఇచ్చి మౌనముగా తమకేమీ పట్టనట్లుగా తిరిగి వారంతా ధ్యాన నిమగ్నులైనారు.ఆ వాటిని ప్రసాదంగా భావించి తీసుకొని ఆ తర్వాత నేను ధ్యానంలో కూర్చోగానే నా శరీరం నాకు తేలికగా అనిపించి గాలిలోనికి తేలిపోతానేమోననే అనుభూతి కలగటము
దానితో మళ్లీ ఏదో తెలియని భయం నన్ను ఆవహించటం జరగటంతో ధ్యానం భంగమైనది. 


ఇలా కొన్ని వారాలు జరిగిన పిమ్మట నా శరీరం ఒక అడుగు ఎత్తున గాలిలో తేలడము మళ్ళీ తిరిగి నేను ఎప్పుడైతే భయపడతానో అప్పుడు నెమ్మదిగా క్రిందకి రావడం జరిగినది.అక్కడున్న మిగిలిన వారంతా ఇది అంతా చూసి ఏమీ తెలియనట్లుగా అసలు ఏమీ జరగనట్లుగా ప్రవర్తించడం నాకు వింతగా అనిపించేది. ఇలా వారి సమక్షంలో 14 నెలల పాటు ఉండేసరికి నేను సుమారుగా పది అడుగుల ఎత్తు గాలిలో ఉండే వాడిని.కానీ నాకు మొదట ఆనందము వచ్చేది కానీ రాను రాను విసుగు అనిపించేది. ఎందుకంటే నా ప్రమేయం లేకుండా ధ్యానంలో కూర్చోగానే గాలిలో లేవటం జరుగుతుండేది.

కొన్నాళ్ల తర్వాత నా ధ్యానము లేకపోయినా నేను ఎవరితోనైనా చాలా తీవ్రంగా మాట్లాడుతుండగా నాలో ఉత్తేజం వచ్చి నా ప్రమేయం లేకుండా నేను వారితో మాట్లాడుతూ ఉండగానే గాలిలోనికి వెళుతుండేవాడిని.మళ్లీ కొన్ని క్షణాల తర్వాత నెమ్మదిగా క్రిందకి దిగడం జరిగేది. ఇది నాకు చాలా ఇబ్బందిగా,సిగ్గుగా చికాకుగా అనిపించింది. అనవసరముగా ఈ భూచర సిద్ధిని పొందినాను అని నాకు అనిపించింది. కానీ నా ప్రమేయం లేకుండా గాలిలో ఎగరడం చూసిన సూక్ష్మధారి నన్ను పిలిచి “నాయనా! నువ్వు మూల బంధము వేయటం నేర్చుకో... అప్పుడు నీ ప్రమేయం లేకుండా గాలిలోనికి ఎగరలేవు” అని చెప్పగానే కొన్ని నెలలపాటు ఈ ఆసనాలు వేసి సిద్ధి పొందటంతో కావాలి అనుకున్నప్పుడు గాలిలో ఎగరడం వచ్చినా కూడా, నాలో ఆనందం కలగలేదు. శాశ్వత ఆనందస్థితి పొందాలని ఆరాటపడుతున్నాను. నీ టెలిపతి ద్వారా నీ సాధన వివరాలు నాకు తెలుస్తున్నాయి. మీరు కూడా మూలాధార చక్రము ఆధీనము చేసుకొని నల్ల గణపయ్యను ఇంటికి పిలిపించుకొన్నావని తెలిసినది. మంచిది. తర్వాత నా స్వాధిష్ఠాన చక్రం అనుభవాలు త్వరలో మీకు తెలియజేస్తాను ఎందుకంటే, గాలిలో లేచే సమయం ఆసన్నమైంది” అంటూ తన టెలిపతి ముగించాడు. దానితో మేమిద్దరము కూడా స్వాధిష్ఠాన చక్రం జాగృతి, శుద్ధి, ఆధీనము గురించి రాబోవు అధ్యాయములలో చూడండి.  
===========================================
గమనిక: దయచేసి చక్ర జాగృతి అయ్యే సమయంలో వచ్చే గణపతి విగ్రహన్ని అలాగే చక్రం శుద్ధి సమయంలో వచ్చే గణపతిని అలాగే చక్ర ఆధీన మాయ దాటే సమయంలో వచ్చేగణపతిని ఎక్కడా కొనకండి.కొని మీరు తెచ్చుకున్న ఎలాంటి ఉపయోగం ఉండదు. అలాగే మీ బంధువులతో కావాలి అని చెప్పి తెప్పించుకున్న ఉపయోగం లేదు.లేదా ఎవరి దగ్గర నుండైనా దొంగతనము చేసినను ఎవరి దగ్గర నుండి తీసుకున్నను లేదా సేకరించిన ఉపయోగం లేదు. వాటంతట అవే మీ ఇంటికి రావాలి అది తెలిసిన వారితో లేదా తెలియని వారితో నైనా రావచ్చును.అవి వచ్చేదాకా నీకే తెలియకూడదు. అలానే అవి వచ్చేవి ధ్యానములో కనపడి ఫలానా రోజున వస్తున్నామని చెప్పి వస్తాయని గ్రహించండి.మీకు ధ్యానం లో కనిపించకుండా వచ్చిన వాటి వలన మీకు ఉపయోగము లేనట్లే. మీ టెలిపతి ద్వారా మీ భక్తి తరంగాలు కైలాసంలో ఉండే గణపతి దాకా వెళ్లాలి. అప్పుడు ఆయన మిమ్మల్ని గుర్తించి మీకు కావలసిన రూపాలలో మీకు ధ్యానంలో కనిపించినట్టుగానే వస్తాడు.చిన్న అంగుళముతో గణపతి పంచలోహ విగ్రహంతో మీ సాధన మొదలై పంచాయతనములోని గణపతిశిల, శేతార్కగణపతి, నల్లరాతి అరచేతి పరిమాణము ఉన్న విగ్రహం వచ్చే దాకా మూలాధార చక్రములో జాగృతి,శుద్ధి, ఆధీనము స్థితులలో మీరు ఉన్నట్లేగా భావించండి. ఇలా వచ్చిన విగ్రహములను దయచేసి ఎవరికీ ఇవ్వకండి. కేవలం మీ ఇంటి కుటుంబ సభ్యులకే అవి చెందాలని తెలుసుకోండి. ఒకవేళ మీకు వారసులు లేకపోతే వాటిని మీ మరణావస్థలో దగ్గరలో ఉన్న దేవాలయమునకు సమర్పించండి. అక్కడ వాటికి నిత్య దూప దీప నైవేద్యం పూజలు జరుగుతాయి. మా ఆవిడకి తన ధ్యానంలో తనకు సంబంధం లేని వాసనలు వస్తున్నాయి అనగానే ఈ చక్రంలో నాకు వచ్చిన దైవిక వస్తువులు ఇచ్చి పూజించుకోమని ఇవ్వటం జరిగినది.ఆమెను ఈ చక్ర సాధన పరిసమాప్తి చేసుకొమ్మని అనుజ్ఞ ఇవ్వటం జరిగినది.
అలాగే మన మూలధారచక్రము నందు మరియు మన ఆజ్ఞాచక్రము నందు గూడ శృంగార దృశ్యాలే మహామాయని గ్రహించండి.ఎందుకంటే ఈ రెండు చక్రాలు ఒకదానికొకటి అనుసంధానమై ఈ మాయలు చూపుతాయి. మూలధారచక్రములో మనకి ఈ శృంగార మాయ దృశ్యాలు కలలయందు,ధ్యానమునందు కనపడితే...అదే ఆజ్ఞాచక్రము నందు అయితే ఇలలో అనగా మానుష్యరూపేణ ప్రేతాత్మలు,శృంగార దేవతలు,గంధర్వులు,మోహిని,యక్షిణి,...ఇలా 13 రకాల జీవజాతులు ఇలలో కనపడి మనతో శృంగార మాయలో పడవెయ్యాలని విశ్వప్రయత్నాలు చేస్తాయని నేను గ్రహించాను!
అసలు నాకులాగా ఈ చక్రము నందు గణపతిదర్శనం అలాగే ఈ చక్ర దర్శనం ఎవరైన ధ్యానానుభవము పొందినారా అని పరిశోధన చేస్తే...నాకు శ్రీ శ్యామాలాహిరీ ధ్యానానుభవాలు ఉన్న పురాణపురుష యోగి రాజ శ్రీ శ్యామ చరణ లాహిరి పుస్తకము కనిపించినది. అందులో నాకు కనిపించిన ఈ చక్రానుభవాలు వారికిగూడ కలిగినాయని తెలుసుకొని నేను ఆనందము పొందినాను. నిజ సాక్ష్యం ఉంటేనే గదా మనకి కలిగే ధ్యానానుభవాల మీద అచంచల విశ్వాసము కలిగేది.
నా సాధన పరిసమాప్తి సమయములో
ఇలాగే నా సాధన పరిసమాప్తి సమయములో నేను కాశీ క్షేత్రమునకు వెళ్ళినపుడు నాకు అక్కడ అనగా కేధార్ ఘాట్ వద్ద ఒక 28 నుండి 30 సం!!రాల వయస్సు ఉన్న సాధకుడు కనిపించాడు. వాడిని చూడగానే నాకు సాధనకి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడని గ్రహించి వాడి దగ్గరకి వెళ్ళి"నువ్వు సాధన సమస్యతో బాధపడుతున్నావని” నాకు అర్ధమైంది.అనగానే దానికి వాడు వెంటనే “నాకు ఒక నిజ గురువు గావాలి” అన్నాడు.నేను వెంటనే “దేనికి” అన్నాడు.దానికి వాడు “నాకున్న ఉగ్రమైన కామమాయ సమస్యను తొలగించటానికి” అన్నాడు.అప్పటికి నాకు వీడి కధంతా అర్ధమై వాడితో “నాయన!ఇక్కడున్న మణికర్ణిక ఘాట్ యందు ఏమి చేస్తారు” అనగానే వాడు వెంటనే “చితాగ్నిలో శవదహనాలు చేస్తారు” అన్నాడు.అపుడు నేను వెంటనే “అయితే శవము అంటే” అనగానే దానికి వాడు “ప్రాణము

లేనిది” అన్నాడు. ఈ లెక్కన చూస్తే “కామప్రక్రియ వేటి మధ్య జరుగుతోంది” అనగానే “ప్రాణమున్న జీవుల మధ్య” అన్నాడు.దానికి నేను వెంటనే “శవాల మధ్య సంయోగము జరగదని అర్ధమవుతోంది గదా!ఇన్నాళ్ళు నీవు కామమును రెండు ప్రాణమున్న తోలుతిత్తులున్న శరీరాల మధ్య గానే చూశావు.అలాగే భావించావు.కాని నిజానికి ఈ మైధునము అనేది రెండు అస్ధిపంజరాల మధ్య జరుగుతోందని తెలుసుకో.ఈ తోలు తీసివేస్తే మిగిలేది అస్ధిపంజరాలే గదా.మరి వీటి మధ్య జరిగే సృష్టియజ్ఞం నీకు కామమాయ ఎలా అవుతుంది.జాగ్రత్తగా ఆలోచించు.మర్మము నీకే బోధపడుతుంది. పదార్ధ శరీరాలు దాటు. యదార్ధము నీకే తెలుస్తోంది.” అనగానే వాడు నాకు మౌనముగా నమస్కారము చేసి “నాకు ఈ జన్మ వృధాగాకుండా చేసినారని” ఆనందముగా చెపుతూ అక్కడనుండి...కామ మాయ నుండి తప్పుకొని...వెళ్ళిపోయాడు.         

No comments:

Post a Comment