Thursday, October 10, 2024

*******ఇంతకి అసలు మాయా అంటే ఏమిటి?

 🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
అటుపై  అంతిమముగా దశేంద్రియాల నిగ్రహశక్తిని పొంది...జితేంద్రియుడై బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అయినారు.
ఇంతకి అసలు మాయా అంటే ఏమిటి? ఒక దానిమీద కోరిక, మోహము, వ్యామోహము  కలిగించటమే మాయా అవుతుంది. ఉదాహరణకి యుక్తవయస్సులో  ప్రేమ పొందాలనే కోరిక కలిగి ప్రేమలో పడతారు. ఆ ప్రేమికుడు/ ప్రేమికురాలి మీద మొదటిలో ప్రేమ కలుగుతుంది. కొన్నాళ్ళకి ఈ ప్రేమ కాస్త ఆమె/ అతడి మీద మోహము గా మారుతుంది. అంటే ఆమె/ అతను చూడకుండా ఉండలేని స్థితి. మాట్లాడకుండా ఉండలేని స్థితి మోహము అన్నమాట.ఇది కాస్త కొన్నాళ్ళకి బాగా ముదిరి వ్యామోహంగా మారుతోంది. అనగా ఆమె/ అతను ఇక మీద కనిపించక పోతే ఉండలేని స్థితి. వాళ్ళు చనిపోతే బ్రతకలేని స్థితి. వాళ్లను క్షణము కూడా వదల లేని స్థితి. వాళ్లు లేకపోతే ఉండలేని స్థితికి చేరుకోవడమే వ్యామోహం అవుతుంది. నిజానికి వీరిద్దరి మధ్య ఇలాంటి భావాలు కలిగించేవి మానవ శరీరంలోని దశేంద్రియాలే కదా. అనగా పంచ జ్ఞానేంద్రియాలు కన్ను, ముక్కు, చర్మము, చెవి, నాలుక అలాగే పంచ కర్మేంద్రియాలు అనగా చూచుట, వాసన, స్పర్శ, వినుట, రుచి కదా. ఇవి చేసే పనుల వలన మనము మాయాలో పడుతున్నాము అంటే అమ్మాయి /అబ్బాయి మీద మనకి ప్రేమ మోహము వ్యామోహం కలగటానికి ఇవే కారకాలు అన్నమాట. అనగా అబ్బాయి/ అమ్మాయి అందముగా కనిపించేటట్లుగా కన్ను చేస్తే… అందమైన భావాలు పలికించేటట్లుగా నాలుక చేస్తే…. వివిధ రకాల స్పర్శ భావాలు చర్మం చేస్తే…. కవ్వింపు మాటలు వినే టట్లుగా చెవులు చేస్తే ….శరీరాల మీద పూసుకున్న సుగంధ వాసనలు మన మనస్సులను లయ తప్పేటట్లు గా ముక్కు చేస్తోంది. ఈ దశేంద్రియాలు ఈ ప్రేమ విషయంలో ఇలా ఉంటే మిగతా విషయాలలో ఎలా ఉంటాయో దైవానికే తెలియాలి కదా. అంటే అరిష్వర్గాలు అనగా కామం,క్రోధం,లోభం,మధం,మోహం,మాత్సర్యం ఇవి కలుగచేస్తాయి. ఇవి పని చేయడమే ప్రకృతి ధర్మం. కష్టాలకు నాంది పలికించడమే వీటి పని అన్నమాట. కష్టాలలో పడాలో వద్ధో నిర్ణయించుకోవటం మన పని అన్నమాట.
అంటే దశేంద్రియాలు అన్ని విషయాల్లో వాటి పనులు అవి చేస్తాయి. వాటిని నిగ్రహించుకుని నిలబడి ఉండటమే మాయాను ఎదిరించటం అవుతుంది. అనగా ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి అన్నమాట. అనగా ప్రేమికులు గాకుండా ఇంద్రియ నిగ్రహము కలిగి ఉంటే వీరిద్దరి మధ్య ప్రేమ, మోహము, వ్యామోహం ఉండదు కదా. మనస్సు దెబ్బతినదు కదా. మనస్సుకి గాయాలు ఉండవు కదా. అవమానాలు అనుమానాలు ఉండవు గదా. కేవలము క్షణిక ప్రేమ మాయాకి లోనై ఐదు నిమిషాలు శారీరక సుఖానికి గురై ఖర్మకాలి విడిపోతే మనస్సు పడే నరకయాతన నరకంలో కూడా అలాంటి శిక్ష ఉండదు. ఒకవేళ పెళ్లి చేసుకున్న కూడా సుఖముగా ఉంటారని ఖచ్చితము లేదు. అనుమానాలు, అవమానాలు ,మనస్పర్ధలు, గొడవలు ఏర్పడతాయి. పోనీ పెళ్లి చేసుకోక పోయినా సుఖముగా ఉంటారా అంటే ఉండలేరు. వేర్వేరు పెళ్లిళ్లు చేసుకుని పాతివ్రత్య ధర్మమును గంగపాలు చేసి మాజీ ప్రేమికుడి/ ప్రియురాలు తో అక్రమ సంబంధాలు కొనసాగిస్తారు. వివాహ జీవితం దాంపత్య జీవితం నాశనం చేసుకుని విడాకులు తీసుకుని పిల్లలని అనాధలు చేస్తున్నారు. అంటే వ్యామోహం స్థాయికి దిగజా రుతున్నారు అన్నమాట. వీటి అన్నిటికీ కారణం మన మనస్సే కదా. దానికున్న దశేంద్రియాలే కదా. వీటిని ఆదిలోనే నిగ్రహించి ఉంటే మనస్సుకి ఈ ప్రేమ గోల నరకయాతనలు ఉండేవి కావు కదా. ఆదిలోనే నిగ్రహించుకోవటం మాయాను తొలగించుకోవటం అన్నమాట. ఆనాడే ఇంద్రియ నిగ్రహముతో మనస్సుతో వివేక బుద్ధితో నిశ్చలజ్ఞానముతో ఆలోచించుకొని పెళ్లి వయస్సు వచ్చేదాకా నిగ్రహముతో ప్రేమ వివాహము లేదా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొని సుఖపడే అవకాశమును మనము తెలిసీ తెలియని వయస్సులో చేసే తప్పు వలన మనశ్శాంతిని కోల్పోవటమే మాయా అవుతుంది. ఈ తప్పు చేయకుండా ఎంతో నిగ్రహంతో ఉండి దానిని దాటి పోవటమే మాయా దాటటం అవుతుంది.
అంటే సాధకుడు కూడా దేనియందు కోరిక మోహము వ్యామోహము చెందకుండా ఇంద్రియ నిగ్రహముతో అనగా వివిధ చక్రాలలో చూపించే వివిధ రకాల మాయలు సాధన శక్తులు యోగ శక్తులు యోగ మాయలకు లోనుగాకుండా ఉంటే మాయా మయం అవుతుంది. వాటికి లోనుఅవ్వటమే మాయా సహితము అవుతుంది. వాటికి బలి కాకుండా నిగ్రహముతో ఉండటమే మాయా రహితం అవుతుంది. జ్ఞానము ఉంటే మాయా మాయం అవుతుంది. ఈ లెక్కన చూస్తే మన ఇంద్రియాలు చూపించే వాటికి స్పందించకుండా పట్టించుకోకుండా నిశ్చల స్థితిలో ఉంటే అదే ఇంద్రియ నిగ్రహం అవుతుంది. ఇలాంటి నిగ్రహం ఉన్న వారిని జితేంద్రియుడు అంటారు. అనగా ఇంద్రియాలను జయించిన వాడు అన్నమాట. వీరిని మనము నామరూప దైవాలుగా పూజిస్తున్నాము అన్నమాట. కానీ నిజానికి దశేంద్రియాలు జయించిన వారు ఎవరు ఈ లోకంలో లేరు. కేవలం వాటిని తమ అదుపులో ఉంచుకున్నారు అంతే. జయించటం అంటే వాటిని గూర్చి ఆలోచించకుండా ఉండటము అన్నమాట. ఆదియోగి అయిన పరమేశ్వరుడు కూడా ఒక సందర్భంలో కామ విషయంలో బోల్తాపడినాడు. ఏకముగా ఈయన మన్మధుని భస్మము చేసిననూ కూడా కామమును జయించలేక పోయినాడు. అమ్మవారి కామ మాయను దాటినాడు గాని విష్ణుమూర్తి యొక్క జగన్మోహిని కామమాయని దాటలేకపోయినాడు కదా అంటే ఈ లెక్కన ఈ విశ్వములో బలహీనత లేని బలవంతుడు లేనట్లే కదా.

కాకపోతే వీళ్ళు తమ బలహీనతలను దాటినారు. మానవులు మాత్రము తమకున్న బలహీనతలు దాటలేక వానరులు అవుతున్నారు. అదే దాటిన మానవులు కాస్త మాధవులు అవుతారు అన్నమాట. అంతెందుకు. కంచి పీఠాధిపతి అయిన చంద్రశేఖర సరస్వతి స్వామి వారికి తోట కూర అంటే ఇష్టమని ఏర్పడినది. అది ఉంటే ఆయన ఆహారమును సంతృప్తిగా తినటం అది లేకపోతే ఏదో తెలియని వెలితి భోజనము ముగించటం ఆయనకు భోజనము పెట్టిన వంటవాడు గమనించాడు. దానితో ప్రతిరోజు ఈయన ఆహారంలో తోటకూర ఉండేటట్లుగా చూసుకునేవాడు. కానీ ఒకానొక సమయంలో వీరికి ఈ ఆకు కూర ఎక్కడ దొరకలేదు. దానితో ఆ రోజు వడ్డనలో తోటకూర పదార్థము రాలేదు. కారణం తెలుసుకున్న స్వామి వారు వెంటనే గోశాలకి వెళ్లి తన నాలుకమీద ఆవుపేడతో శుద్ధి చేసుకుని “ఇన్నాళ్లు ఈ నాలుక తెలియని రుచిని ఇచ్చే తోటకూర మీద మోహము పెంచుకుంది. దాని కోసము నీవు నానా తిప్పలు పడుతున్నావు కాబట్టి ఇన్నాళ్లుగా ఈ నాలుక చేసిన ఈ పాప కార్యము శుద్ధి చేసుకోవటానికి ఆవుపేడతో శుద్ధి చేసుకోవాల్సి వచ్చినది” అని చెప్పి ఆశ్రమానికి వెళ్ళిపోయినారు. యధావిధిగా కొన్ని రోజుల తరువాత భోజనములో తోటకూర పదార్థం వచ్చినా కూడా ఇదివరకటిలాగా దానియందు మోహము చెందకుండా అన్ని పదార్థాలు గానే దీనిని చూడటం సాక్షి భూతముగా తినటం చేసినారు అన్నమాట. అంటే అతి చిన్న విషయమైన తోటకూర విషయములోనే ఈయన ఎంతో శ్రద్ధ తీసుకున్నారు కాబట్టే ఆయన మనకి మహాస్వామి అయినారు. చిన్న పామునైనా కూడా పెద్ద కర్రతో కొట్టాలి కదా. అలాగే చిన్న కోరిక మీద కూడా దాని యందు నిగ్రహము కలిగి ఉండాలి అన్న మాట. నిగ్రహము లేకపోతే విగ్రహం కాలేవు. అనగా పూజింపబడలేవు అన్న మాట. అనగా విగ్రహము ఉంటే నిగ్రహము వస్తుంది. కోరికలు అనుభవించాలి కానీ వాటి యందు మోహము, వ్యామోహము ఉండకూడదు. అవి లేకపోతే ఉండలేని స్థితిలోనికి మనము మన మనస్సు వెళ్ళ కుండా చూసుకోవాలి అన్నమాట. అవి ఉన్నా లేకపోయినా ఒకే విధముగా సమదృష్టితో సమానముగా వాటితో ఉండేవాడే ఇంద్రియనిగ్రహము పొందినవాడు అన్నమాట. అనగా జితేంద్రియుడు అన్నమాట. ఇంద్రియాలను జయించలేము కానీ అదుపులో ఉంచుకోవచ్చు కదా. మీకు చుక్కకూర ఇష్టమే కానీ కావలసినప్పుడల్లా దొరికినప్పుడల్లా తినండి. అంతేగాని అది లేకపోతే ఉండలేని స్థితికి వెళ్ళకండి. అది ఉన్నా లేకపోయినా తృప్తిగా ఉంటే ఆ పదార్థ మాయా దాటినట్లే. ఒకరకముగా చెప్పాలంటే దశ ఇంద్రియాలు చూపించే మాయలు అనేవి వ్యసనాలు లాంటివి అన్నమాట. అలా అలవాటు పడితే అవే అవసరాలుగా మారతాయి అన్నమాట. అలాగే ఇంద్రియ మాయాలకి గురి అయితే అవే అవసర మాయాలుగా మారుతాయి. దానితో ఇంద్రియ నిగ్రహం కోల్పోయి మాధవుడివి కాస్త వానరుడివి  అవుతావు. అదే ఇంద్రియ నిగ్రహము కలిగి ఉంటే మానవుడివి కాస్త మాధవుడువి అవుతావు. తద్వారా నిగ్రహం కాస్త విగ్రహ మూర్తి అయ్యి లోక పూజ్యుడవు అవుతావు. నిజానికి అన్నిటియందు ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండటమే సాధన పరిసమాప్తి అవుతుంది. అదియే మోక్షం అవుతుంది. మోక్షమంటే దేనికి స్పందించకుండా, దేనికి సంకల్పించ కుండా, దేని గురించి ఆలోచించకుండా, నిశ్చల స్థితిలో ఉండటమే. అనగా దశ ఇంద్రియములు చూపించే దశ మాయలు తమ అదుపు ఆజ్ఞలో ఉంచుకోవటమే పరమ ప్రశాంత స్థితి పొందటం అన్నమాట. ఇదియే జీవన్ముక్తి .ఇదియే మోక్షపథము అని గ్రహించండి.
సాధకుడు కూడా తన ఆది చక్రం అయిన మూలాధార చక్రము నుండి మొదలై అంతిమ చక్రమైన బ్రహ్మరంధ్రము దాక చూపించే అన్ని రకాల మాయలు మర్మాలు శక్తులకు దేనికి కూడా స్పందించకుండా దేని గురించి ఆలోచించకుండా దేని గురించి సంకల్పించు కోకుండా నిలబడగలిగితే అదే ఇంద్రియనిగ్రహంతో స్థిర మనస్సుగా స్థిర ఏకాగ్రతతో స్థిరబుద్ధి జ్ఞానముతో ఉండగలిగితే వారి సాధన పరిసమాప్తి అయినట్లే. లేదంటే ఏ చక్రము వద్దనైనా ఆగిపోతే సాధన అసంపూర్తిగా ఆగిపోయినట్లే. అనగా ఏ చక్ర మాయాలోనైనా మోహము, వ్యామోహము చెందితే అంతటితో వాడి కర్మ ముగిసినట్లే కదా. కాకపోతే అందరూ మాయాలో పడతారు. మాయలు దాటుకుని రావాలి అన్నమాట. ఉదాహరణకు మూలాధార చక్రము నందు మనకి కామ మాయా వస్తుంది. 8 సంవత్సరాల వయస్సు నుండి మొదలై 80 సంవత్సరాల వయస్సు వారి మీద దైవాల మీద ప్రేతాత్మల మీద దేవతల సేవకుల మీద ఇలా 13 రకాల జీవ జాతుల మీద ఈ చక్ర మాయా అయిన కామ మాయ చూపించడం జరుగుతుంది. అనగా నగ్న దేహములతో మొదలై రతిక్రీడల దాకా తీసుకొని వెళుతుంది. కానీ వీటిని సాధకుడు కేవలం సాక్షిభూతంగా ఒక శృంగార సినిమా చూసినట్లుగా చూడగలిగితే ఇంద్రియనిగ్రహము పొందటం అవుతుంది. లేదంటే వీరి నగ్న దేహ సౌందర్య మాయలో పెడితే ప్రేమ మోహ వ్యామోహాలు పొందితే ఈ నగ్న దేహంతో వాడి ముందు సాక్షాత్కారమై వాటి రతి క్రీడలో కాలము అంతా గడిపి అధో గతి పొందుతాడు. నిగ్రహము అనేది సాధకుడు చేతిలోనే ఉంటుంది కదా. అంటే సాధన అనేది పూర్తి చేయాలని లేదా ఆగిపోవాలి అన్నది వాడిచేతిలోనే ఉంటుంది కదా. దేనికి మోహము, వ్యామోహము చెందకుండా ఉండగలిగే ఇంద్రియనిగ్రహము మన మనస్సుకి రావాలి. మన మనస్సు మన మాట వినే స్థితికి సాధకుడు తెచ్చుకోవాలి. దానికి సాధన చేసుకోవాలి. అనగా దానికి ఏది మాయో ఏది మర్మమో తెలిసేటట్లుగా చేయాలి.             

No comments:

Post a Comment