Friday, October 11, 2024

 🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
అది విషము అని తెలిస్తే మన మనస్సు త్రాగమన్న తాగదు కదా. అదే మత్తు పానీయం అని మన మనస్సు అనుకుంటే అది వదలమన్నా వదలదు. కాబట్టి ఈ ప్రకృతి చూపించే దశ ఇంద్రియాల మాయాలు అన్ని కూడా విషముగానే మన మనస్సుకి చూపించగలిగితే ఏ మాయ కూడా మనల్ని ఏమీ చేయదు. ఎందుకంటే అమృతం సేవించిన దేవతలు కూడా ఎప్పుడో అప్పుడు మృత్యువాత పడతారు. అదే మహా కాల కూట విషమును సేవించిన నీలకంఠుడైన పరమేశ్వరుడు మాత్రం మృత్యుంజయుడు అయినట్లుగా మీరు కూడా ఈ దశ ఇంద్రియాల మాయలను జయించి జితేంద్రియుడు అవుతారని గ్రహించండి. అంతా మనలోనే ఉంది. అంతా మనస్సు లోనే ఉంది. మాయా సహితము లేదా మాయా రహితము అవటం అనేది మన చేతుల్లో మన చేతలలో ఉంది. ఇంద్రియ నిగ్రహము మాయా రహితము, ఇంద్రియ లోలత్వం మాయా సహితము అన్నమాట .
సాధన అనేది ఆగిపోవటం లేదా పూర్తి కావడం అనేది మీ చేతుల్లోనే మీ చేతలలో మీ మనస్సు బట్టి ఉంటుంది. అంతేగాని గ్రహాలు, దైవాలు, పరమాత్మ, గురువులు,యోగుల చేతులలో ఉండదని గ్రహించండి. కాకపోతే ప్రకృతి మాయాలకి మీ మనస్సు మాయాలో పడకుండ చూసుకోవటమే అసలు సిసలైన యోగసాధన అవుతుంది. ఈ సాధనను ఆది చక్రమునుండి అంతిమ చక్రం దాకా మీరు ఇంద్రియ నిగ్రహముతో ఉండి మోహము, వ్యామోహము, భయము, ఆశ, ఆనందము పడకుండా సాక్షి భూతంగా ఉండగలిగితే అదియే సంపూర్ణ యోగ సాధనను పరిసమాప్తి చేసుకున్న మోక్షగామి అవుతారు. కాకపోతే ప్రకృతి మాత మనమీద ఈ మాయాలు చూపించడానికి కారణం... మన ప్రారబ్ద కర్మలు కారణమని గ్రహించండి. ప్రారబ్ద కర్మ అంటే గత జన్మలలో చేసిన పాపము లేదా పుణ్య కర్మల ఫలితమే ప్రారబ్ద కర్మ అంటారు. ఏది ఎక్కువ ఉంటే అది ఫలితముగా ఈ జన్మలో మనము పొందుతాము అన్నమాట. గత జన్మలలో పాపాలు ఎక్కువ ఉంటే ఈ జన్మలో మనం మాయాలో పడతాము. అదే పుణ్యములు ఉంటే ఈ జన్మలో మాయా రహితము అవుతాము. ఇది ఎలా తెలుస్తుంది అంటే మన మనస్సు దేనియందైనా స్పందించిన అదే పనిగా ఆలోచించిన లేదా సంకల్పించుకున్న కూడా అది ప్రారబ్దకర్మ ఫలితమేనని గ్రహించండి. నిజానికి ఆదిలో మనకి శూన్యం నుండి 36 ప్రారబ్ద కర్మలు వచ్చినాయి. శూన్యం నుండి శూన్య బ్రహ్మగా మనము అవతరించి ఈ 36 కర్మలు చేయటానికి ఆది జన్మ ఎత్తడం జరిగినది. దానితో మరో 12 కర్మశేష కర్మలు తోడైనాయి అంటే
36 +12=48 ప్రారబ్ద కర్మలు ఏర్పడినాయి అన్నమాట. అందుకే ప్రతి 48వ జన్మ సాధన జన్మ లేదా యోగ జన్మ అని శాస్త్రవచనము.
ఈ 48వ జన్మలోనే జీవుడికి అన్ని రకాల కర్మలయందు వైరాగ్య భావాలు కలిగి మోక్షం పొందాలని ఆకాంక్ష మొదలవుతుంది. దాని కోసం తపనలు, పరి తపనలు, తాపత్రయం ఈ సాధన జన్మలో మనకి కలుగుతాయి. ఇవి ఉన్నాయి అంటే ప్రస్తుత జన్మ మనది 48 వ జన్మ అన్నమాట. అనగా ప్రారబ్ద కర్మను నివారించుకునే అవకాశం ఉన్న జన్మ అన్నమాట. కాకపోతే ఆదిలో ఈ ప్రారబ్ద కర్మలు 48 మాత్రమే కానీ అంతమునకు వచ్చేసరికి అవి కాస్త 48 లక్షల  ప్రారబ్ద కర్మలుగా మారినాయి. వీటికి అధిదేవతలుగా బాల త్రిపుర సుందరి దేవి గా ఆదిపరాశక్తి అనగా ప్రకృతి మాత ఉంటుంది. అనగా బాలగా 10లక్షలు, త్రిపుర గా 12 లక్షలు, సుందరిగా 15 లక్షలు, దేవిగా 11లక్షలు కర్మలు…. విశుద్ధ చక్రము వద్ద 10 లక్షలు అనగా ప్రకృతి గాను అలాగే ఆజ్ఞాచక్రము వద్ద 12 లక్షలు ప్రకృతి గాను అదే సహస్రార చక్రం వద్ద నుండి హృదయ చక్రం సుందరిగా 15 లక్షలు మూలప్రకృతిగా అలాగే బ్రహ్మరంధ్రము వద్ద దేవిగా పదకొండు లక్షలు ఆదిపరాశక్తి గా ఉండి మన యోగచక్రాలలో మన ప్రారబ్ధ కర్మలనే యోగమాయాగా మన దశేంద్రియాలకు చూపించడం జరుగుతుంది. సాధకుడు వీటిని గ్రహించి ఆయా కర్మ ఫలితాలను వారి పంచ గురువులైన మంత్ర, దీక్ష, సద్గురువువు, పరమ గురువు, ఆదిగురువులు వారి వారి ప్రారబ్ధ కర్మల బట్టి దైవిక వస్తువులు వీరికి కావలసిన వస్తువులు,జప శక్తి వారి చెడు గుణాలు ఇలా వారిని గురుదక్షిణ పేరిట అడిగి వారి ప్రారబ్ద కర్మలు నాశనం చేస్తారు. దానితో సాధకునికి ప్రకృతిమాత కలిగించే సాధన మాయాలు తొలుగుతాయి. సాధకుడు స్వయంగా వీటిని తొలగించుకోలేడు. దానికి ఈ పంచ గురువుల అనుగ్రహమును తప్పక పొందవలసి ఉంటుంది. అలాగే ఆయా గురువులు వచ్చి వారికి కావలసిన గురుదక్షిణను ఇవ్వగలిగిన మాత్రమే తమ సాధనను పరిసమాప్తి చేసుకోగలుగుతాడు అని నా స్వానుభవం ద్వారా తెలుసుకోవడం జరిగినది. ఎందుకంటే 48 లక్షల ప్రారబ్ద కర్మలు అనుభవించాలంటే సాధకుడు కోటి నలభై రెండు లక్షల 372 జన్మలు అది కూడా 48వ సాధన జన్మలు ఎత్తవలసి ఉంటుంది. అదే గురువులు అడిగిన గురుదక్షిణ మీరు సమర్పించారు అంటే 48 నిమిషాల నుండి 48 సంవత్సరాలలో ఈ 48 లక్షల ప్రారబ్ద కర్మలు నశించి కర్మరాహిత్యం పొంది కర్మశేషము లేని జన్మలు లేని మోక్షపధము పొందుతారు. సాక్షాత్తూ జగద్గురువైన శ్రీకృష్ణునిని తన గురువైన సాందీపమునికి గురుదక్షిణ క్రిందగా కుమారుడిని బ్రతికించి ఇవ్వటం జరిగిందని పురాణ వచనము గదా. మీరే ఆలోచించుకోండి. అంతెందుకు పరమాత్మ అయిన షిరిడి సాయి బాబా వారు తన సద్గురువువు గురుదక్షిణగా రెండు పైసలు అనగా శ్రద్ధ సబూరి ఇచ్చారని లోకవిదితమే కదా.

కాబట్టి 48వ సాధన జన్మ రావటం, మోక్షము పొందాలనే కోరిక కలగడం, గురువుల అనుగ్రహము పొందటం అనేది మన ప్రారబ్ద కర్మ ప్రదాత అయిన జగద్గురువైన ప్రకృతి మాత అనుగ్రహమును బట్టి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ గురుదక్షిణ పేరిట మీ ప్రారబ్ద కర్మలు నివారణ చేసుకున్నారో ఆనాటి నుండి మీ యోగసాధన అభివృద్ధి చెందుతుంది. కాకపోతే నిజ గురువులకే గురుదక్షిణ సమర్పిస్తేనే ఈ ఫలితము ఉంటుంది. అదే నకిలీ గురువులకి సమర్పిస్తే అంతటితో మీ సాధన ఆగిపోయి వారి పాప భారం కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయని గ్రహించండి. ఒక్కటి గుర్తుంచుకోండి. మీ మనస్సు దేనియందు మోహము, వ్యామోహము చెందుతుందో అది లేకపోతే ఉండలేని స్థితి పొందుతుందో అదియే మీ ప్రారబ్ద కర్మలు అవుతాయి. అలాగే మీ మనస్సుకి మీ నిజ గురువు ఎవరు నకిలీ గురువు ఎవరు గమనించి మీకు అంతరాత్మ గా మారి చెబుతుంది.అట్టి నిజ గురుదేవునికి ఆయన అడిగిన గురు దక్షిణ సమర్పించండి. ఆయా చక్ర ప్రారబ్ద కర్మను తొలగించుకొని ముందుకు కొనసాగించండి. ప్రారబ్ధ కర్మలు అంటే అర్హత యోగ్యతలను గ్రహించండి. ఐఏఎస్ కావాలంటే డిగ్రీ అర్హత ఉండాలి. అదే విధంగా ఐఏఎస్ ఇంటర్వ్యూ యోగ్యత ఉండాలి. ఒక ఐఏఎస్కే ఇలా ఉన్నప్పుడు మీకు ప్రకృతిమాత ఆధీనమై విశ్వాత్మ గా మారాలి అన్నప్పుడు
ఎన్ని అర్హతలు యోగ్యత ఉండాలో మీరే ఆలోచించుకోండి. ప్రారబ్ద కర్మలు అనేవి మన అర్హతను నిరూపించే యోగ పరీక్షలు అని గ్రహించండి. చిత్రం ఏమిటంటే ఈ 36 ప్రారబ్ద కర్మలు ఉన్న 36 కపాలాలు ధరించిన సదాశివమూర్తి నివసించే కైలాస పర్వతం పరిధి కూడా 48 కిలో మీటర్లు ఉండటం ప్రకృతి మాత చూపించే విచిత్రాలలో ఒకటి అన్నమాట.
అసలు ఈ మాయాలెందుకు...వాటిని తెలుసుకొని దాటడమెందుకు...నా బొంద...నా బూడిద అని మీలో కొందరికి అనిపించవచ్చును. దీనికి సమాధానము ఏమిటంటే ఒక తల్లి తన పిల్లవాడిని ఎల్లపుడు లాలించటానికి అవకాశముండదు గదా! వీడినే గాకుండా మిగిలిన పనులు లేదా ఇతర పిల్లకాయలను చూసుకొనే బాధ్యత ఈమెకి ఉంటుంది గదా! అపుడు వీడిని వదిలి పెట్టి వెళ్ళినపుడు మనవాడు ఏడుపు లంఘించుకుంటాడు గదా!అలాగని అమ్మ వీడి దగ్గర శాశ్వతముగా ఉండలేని పరిస్ధితి.అపుడపుడు అయ్య దగ్గరకి కూడ వెళ్ళాలి గదా!లేకపోతే ఆయన చిన్నపిల్లాడిలాగా గోల చేస్తాడు గదా! ఈ సమస్య పరిష్కారము కోసము పిల్లవాడికి తను లేకపోయిన ఏడ్వకుండా ఉండటానికి ఆడుకోవటానికి కొన్ని బొమ్మలు ఇచ్చి వెళ్ళుతుంది.ఈ బొమ్మల మాయాలో పడినవాడు అమ్మను మర్చిపోతాడు.ఇవి బొమ్మలు ...అమ్మకాదని తెలుసుకొన్నవాడు నిరంతరముగా అమ్మ తన దగ్గరికి వచ్చేదాకా ఏడుస్తూనే ఉంటాడు.చచ్చినట్లుగా అమ్మ ఎక్కడున్న వీడి కోసము రాక తప్పదు గదా! అలాగే మన బ్రహ్మరంధ్రము వద్ద ఉన్న ఆదిపరాశక్తి అమ్మ గూడ సాధన చేసే పిల్లవాడిని మరిపించటానికి మూలాధారచక్రము నుండి బ్రహ్మరంధ్రము దాకా చక్రమాయాల రూపములో,అరిష్వర్గాల రూపములో,వ్యసనాల రూపములో మాయాలు పెట్టినది.వీటి మాయాలో పడినవాడి దగ్గరకి అమ్మ వెళ్ళవలసిన పని ఉండదు గదా.ఎవడు అయితే ఇవి మాయాలని తెలుసుకొని వాటిని తన మనోఇంద్రియనిగ్రహశక్తితో దాటుకుంటాడో...వాడి దగ్గరకి అమ్మవారు వచ్చి వీడి సాధనను పరిసమాప్తి చేస్తుంది అన్నమాట.ఇలా అమ్మ పంచరూపాలలో అనగా భ్రమరి- బాలా- త్రిపుర- సుందరి- దేవి రూపాలలో అమ్మవారు వస్తుందని నా అనుభవాలే గాకుండా వివిధ యోగుల అనుభవాలలో అనగా ఉదా:ఈ గ్రంధములో చెప్పిన లాహిరి అనుభవాలు అలాగే తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి అలాగే కంచి మహా స్వామి వారి అనుభవాలు సాక్ష్యం నిలుస్తున్నాయి. వీరందరికి అమ్మవారు వీరి సాధన స్ధితిని బట్టి ఈ పంచరూపాలలో ఆయా రూపములో దర్శనమిచ్చి వారి సాధనను పరిసమాప్తి చేసినదని లోకవిదితమే కదా! మరి మీరు అమ్మవారు ఇచ్చే బొమ్మలలాంటి చక్రమాయలలో పడతారో...లేదా అమ్మవారు వచ్చేంత సాధన కోసము ఇంద్రియశక్తితో ఉండి అమ్మ వచ్చేదాకా సాధనను కొనసాగిస్తారో మీరే నిర్ణయించుకొండి.అమ్మగావాలా లేదా బొమ్మ గావాలా అనేది మీకున్న ఇంద్రియనిగ్రహమును బట్టి ఆధారపడి ఉంటుంది.బలహీనత లేని బలవంతుడు అలాగే మాయలో పడని సాధకుడు ఇంతవరకు సృష్టించపడలేదు.కాని మాయలలో పడి గూడ పైకి లేచి వచ్చి సాధనను ఇంద్రియనిగ్రహశక్తితో మాయలను దాటుకొనేవాడి కోసము జగత్ గురువుగా ప్రకృతిమాత అయిన ఆదిపరాశక్తి ఎదురుచూస్తుందని గ్రహించండి. ఇందుకు ఉదా: బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అలాగే యోగివేమన్న జీవిత చరిత్రలు నిలుస్తాయని తెలుసుకోండి.మాయాలో అందరు పడతారు.కాని కొద్దిమంది మాత్రమే ఆ మాయాల యందు మోహము,వ్యామోహము చెందకుండా ఇంద్రియ నిగ్రహశక్తితో ఆ మాయాలను దాటి మానవుడు కాస్తా మాధవుడు అవుతున్నాడు.అలాగే ఈ మాయాలలో పడి ఇంద్రియలోలత్వమునకి లోనై మానవుడు కాస్త సాధనను గంగపాలు చేసి వానరుడు అవుతున్నాడని గ్రహించండి.
గమనిక: ఒక్క విషయం. మనకు నిజ గురువులైన  మంత్ర గురువు, దీక్ష గురువు, సద్గురువువు,  పరమ గురువు (విశ్వ గురువు, జగద్గురువు) వచ్చినప్పుడు వారు మనల్ని గురుదక్షిణ అడుగుతారు.

దీని క్రింద ధనము, చెడు గుణాలు,అనుష్టాన జప సంఖ్య, నామ జప సంఖ్య,వారికి కావలసిన దైవిక వస్తువులు అడుగుతారని నా యోగ సాధన సహస్ర చక్ర స్థితిలోకి  వెళ్ళినప్పుడు నా స్వానుభవాలు అయ్యాయి.ఇక్కడ తప్పనిసరిగా ప్రతి సాధకుడు వారి గురువుకి గురుదక్షిణ ఇవ్వవలసి ఉంటుంది. లేదంటే అంతటితో యోగ సాధన పరిసమాప్తి అయినట్లేనని గుర్తించండి. వారు అడిగిన గురుదక్షిణ స్థాయిని బట్టి నీవు ఈ సాధన స్థాయి ఎక్కడ ఉందో అంచనా వేయవచ్చు. ధనము ఇవ్వలేకపోతే దానికి తగ్గ పరిహారాలు చెబుతారు. అవి కూడా ఇవ్వలేకపోతే ఆయన మీ సాధన స్థితి నుండి ఈ జన్మకి తప్పుకొని మరుజన్మ కోసం మీ సాధన స్థాయికి వచ్చిన తర్వాత వస్తారు. వారే రావాలని లేదు. వారి శిష్యులైన రావచ్చును. తస్మాత్ జాగ్రత్త. మీ నిజ గురువులకు  గురుదక్షిణ ఇచ్చే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని శోధించి వారి మీద నమ్మకం కలిగిన తరువాత వారికి గురుదక్షిణ ఇవ్వండి. ఒకవేళ నకిలీ గురువులు చేతుల్లో గురుదక్షిణ పేరుతో మోసపోయే ప్రమాదం అవకాశాలు ఉంటాయని గుర్తించండి.
అనగా మూలాధార చక్రము నుండి విశుద్ధి చక్రము వరకు మనకి 10 లక్షల కర్మలు, అలాగే ఆజ్ఞా చక్రం నుండి సహస్రార చక్రం వరకు 12 లక్షల సూక్ష్మ కర్మలు, అలాగే సహస్రార చక్రం నుండి హృదయ చక్రం వరకు 15 లక్షల కారణ  కర్మలు అలాగే హృదయ చక్రం నుండి బ్రహ్మరంధ్రము వరకు 8 లక్షల సంకల్ప కర్మలు అలాగే బ్రహ్మరంధ్రము వద్ద ఈ 44 లక్షల కర్మశేషము అనగా 3 లక్షల కర్మఫలాలుంటాయి! ఈలెక్కన మొత్తము 48లక్షల (10+12+15+8+3) కర్మలుంటాయని తెలిసింది. దీనికి నిదర్శనమే సహస్ర చక్ర అధిదేవత అయిన మహాదేవుడి నివాసమైన కైలాస పర్వత పరిక్రమణ అన్నమాట. మొదట ఈ పర్వత పరిక్రమణ 12 కిలోమీటర్లు ,తర్వాత 22 కిలోమీటర్లు ఉంటుంది. తర్వాత 14 కిలోమీటర్లు ఉంటుంది. అప్పుడు మనం చివరిదాకా వెళితే కైలాస పర్వతం పై అంచును దూరం నుండి దగ్గరగా చూడటం చూడగలము. నిజానికి మనం కైలాస పర్వతం పరిక్రమణ చేస్తే  పైదాకా పై అంచును వేరే పర్వతాల నుండి చూడవచ్చు.
ఎలా అయితే కైలాస పర్వత పరిక్రమణకు నలభై ఎనిమిది కిలోమీటర్లు ఉన్నాయో అలా మన సాధన పరిసమాప్తి అవడానికి 48 లక్షల కర్మలున్నాయి. అందుకే ప్రతి 48 వ జన్మ యోగజన్మ అవుతుందని శాస్త్రవచనము! వీటిని నాశనం చేయటానికి నిజ గురువులు గురుదక్షిణ అడిగి మన కర్మలు వారు తీసుకుని నాశనం చేస్తారు. ఇది నిజం అని అనడానికి నిదర్శనం షిరిడి సాయి బాబా వారు వారి గురువైన వెంకుసాకు గురు దక్షిణ రెండు పైసలు అడిగితే బాబా వారు శ్రద్ధ, నమ్మకం అనే గుణాలు సమర్పించారు.  వారి చరిత్రలో చూడవచ్చును. అలాగే శ్రీకృష్ణుడు గురువు కోరిక మీద తన కుమారుడికి జబ్బు నయం చేశాడు. వారి గ్రంథ పారాయణంలో తెలుస్తుంది. అలాగే టిబెట్ యోగి అయిన మిలారేపా తన గురువు ఆజ్ఞ మేరకు కట్టిన ఇళ్లను మూడు సార్లు పైగా పడగొట్టి మళ్ళీ కట్టి ఇచ్చాడని వారి చరిత్ర లో తెలుస్తుంది. అంటే నిజగురువు అయితే మాత్రం మీ నుండి ధనము ఆశించరు. ఒకవేళ ఆశించిన మీ దగ్గర లేకపోతే  మంత్ర నామ జప సంఖ్య ఇన్ని లక్షలు లేదా కోట్లు చేయమని లేదా మీలో ఉన్న చెడు గుణాలు సమర్పించమని లేదా నామకోటి పుస్తకాలు ఇన్ని రాయమని లేదా వారికి కావలసిన దైవిక వస్తువులు  అడిగి మరీ తెప్పించుకొని మీ చక్రాల స్థాయిలలో మీ ఈసాధన శక్తిని బట్టి  గురుదక్షిణ అడిగి 48 లక్షల కర్మలు నాశనం చేస్తారు.ఇలా నేను ఆజ్ఞా చక్రం లో నా సాధన ఉండగా మా గురువుగారు 10లక్షలు కావాలని అడిగారు. నా దగ్గర నయాపైసాలేదు.  అవి ఎందుకు అడుగుతున్నారో తెలియదు. ఇవ్వకపోతే ఆగ్రహానికి గురికాక తప్పదని భయంతో ఎంతోమందిని అప్పుగా డబ్బులు ఇవ్వమని అడిగితే ష్యూరిటీగా ఏదైనా పెడితే ఇస్తామని చెప్పి ఇవ్వకుండా తప్పించుకున్నారు. అప్పుడు ఇలా కాదని వారిని అడిగితే డబ్బులు లేకపోతే నీ జ్ఞాన శక్తితో మా కోసం సత్ గ్రంధాలు రచించి అందరికీ ఉచితంగా పంచమని ఆదేశించారు. నోట్లో నాలుక లేని నాకు గ్రంథాలు ఎలా రాయాలి అర్థం కాలేదు. అప్పుడు ఐదవ చక్రమైన విశుద్ధికి నా సాధన చేరుకునే సరికి  నా ఊహా శక్తి పెంపొంది మొదట “10 లక్షల” నివారణ కోసం “మంత్ర గురువు” దక్షిణ కోసం “యోగ దర్శనం”, రెండవ “12 లక్షల” నివారణ కోసం “దీక్ష గురువు” దక్షిణ కోసం “జాతక ప్రశ్న”, మూడవ “15 లక్షల కోసం” “సద్గురువువు దక్షిణ కోసం” “సంపూర్ణ గురు చరిత్ర” గ్రంథం రాయడం జరిగింది. ఇక చివరిదైన హృదయ చక్రం నుండి బ్రహ్మ రంధ్రం సాధనకై అక్కడ “8 లక్షల సంకల్ప కర్మల” నివారణ “పరమగురువు దక్షిణ” కోసం ఈ “కపాల మోక్షం” గ్రంథం రచించడం జరిగింది. ఇక మిగిలిన “3 లక్షల” కర్మశేషము “ఆదిగురువు” దక్షిణ కోసము "అంతర్వేదం" అను గ్రంథమును రచించడము జరిగి ఆపై మౌన:బ్రహ్మగా కాశిక్షేత్రము నందు లేదా అరుణాచల క్షేత్రమునందు నివాసము ఉండమని ఆజ్ఞనిచ్చారు! నిజానికి ఈ అధ్యాయ వివరాలు అన్నీ గూడ మా సాధన సమయములో మాకు కలిగిన ధ్యానానుభవాల దృష్ట్యా వీటిని ఒకచోట ఉంటే బాగుంటుందని సాధన ప్రారంభములోనే సాధకుడు తెలుసుకోవాలని ఇక్కడ వ్రాయడము జరిగినది!         

No comments:

Post a Comment