Thursday, October 10, 2024

 ద్రౌపది స్వయంవరంలో 'సూతపుత్రుడు' అని, సూతపుత్రుడికి తన వరమాల పొందే యోగ్యత లేదని ద్రౌపది కర్ణుడిని అవమానించింది. అసలు కర్ణుడు సూతపుత్రుడు అని తెలిసికూడా అతడిని ద్రౌపది స్వయంవరానికి ఎందుకు ఆహ్వానించారు? ఆహ్వానించి అవమానించడం సబబు కాదు కదా!

ఈ ప్రశ్నచాల లోతైనది , పైకి కనిపించినంత సులభంగా జవాబు చెప్పడానికి వీలు కానిది.సబబు అవునా , కాదా అని కాదు మీరు అడుగుతున్నది. సబబు కాదు అని నమ్ముతూ ఏకీభవిస్తారా, లేదా అని ప్రశ్నిస్తున్నారు. సబబని నమ్మించడం కష్టమే, అలాగా అని సబబు కాదనీ చెప్పలేము.

ఈ క్రింది విషయాలు పరిశీలిద్దాము

1 . ఆహ్వానం పంపితే కర్ణుడు వచ్చాడా? ఆహ్వానం లేకుండా వచ్చాడా? ఆహ్వానం అవసరమా?

స్వయంవర ఆహ్వానం అంటే , మా అమ్మాయికి స్వయంవరం నిశ్చయించాము ఫలానా సమయంలో రావలసింది అని. ద్రౌపదిని పెళ్లాడదలిచిన వాళ్ళు మాత్రమే కాక , ఆ స్వయంవరం వేడుక చూడదలచిన వాళ్ళు కూడా రావచ్చు. బ్రాహ్మణులకు ఆహ్వానం కూడా అక్కర లేదు. ఎక్కడెక్కడి వారు రావచ్చు. రాజులందరూ , మిత్రులూ , శత్రువులూ కూడా కలుస్తారు అక్కడ. వీరులకు ఆహ్వానం అక్కర లేదు. ఉదాహరణకు అవంతి రాజకుమారి మిత్రవింద స్వయంవరానికి ఆమె అన్నదమ్ములు విందానువిందులు , దుర్యోధనుడి మిత్రులు , కృష్ణుడికి ఆహ్వానం పంపలేదు. కృష్ణుడే , మిత్రవింద మనసుని తన చెల్లెలు సుభద్ర ద్వారా తెలుసుకుని , స్వయంవరానికి వెళ్లి ఆమెను రథంలో ఎక్కించుకుని వచ్చేసాడు. అడ్డు వచ్చిన వీరులను వెంట వచ్చిన అర్జునుడు ఓడించి సహాయం చేసాడు. అందుచేత ఆహ్వానం పంపి, తీరా వచ్చాక అవమానం చేశారా అన్న ప్రశ్న ఉదయించదు.

ఒకవేళ ఆహ్వానం పంపకున్నా కర్ణుడు వచ్చి ఉంటే అవమానం చెయ్యచ్చా, అది సబబా అంటే , అది కూడా సబబు కాదు.ఆహ్వానం పంపకున్నా వచ్చిన అతిధులను అవమానం చేయరాదు. కర్ణుడిని , సభ నిర్వాహకులు అవమానం చేయలేదు. సముచితమయిన ఆసనం ఇచ్చి గౌరవించారు. అందరు రాజులను పరిచయం చేసినట్లే కర్ణుడిని కూడా పరిచయం చేశారు.

2 . స్వయంవర నియమాలు ఏమిటి?

స్వయంవర నియమాలను ధృష్టద్యుమ్నుడు అందరికీ వివరించి , చివరగా ఇలా అంటాడు. " ..... ఈ గొప్ప పని ఎవడు చేస్తాడో ,కులం, రూపం, బలం కలిగిన ఆ వ్యక్తికీ నా చెల్లెలు భార్య అవుతుంది.నేను అబద్ధం చెప్పను."

అంటే ఏమన్న మాట?

బలం అన్నది ఒక్కటే ఆ పరీక్షలో తేలేది. కులం అన్నది నిర్ధారితం. రూపం అన్నది ద్రౌపది , ఆమె తరఫు వారు అభ్యంతర పెట్టరానిదయి ఉండాలి.

ఆ తరువాత జరిగే వర్ణనలో కూడా , ' రూపం, బలం, కులం, శీలం, దానం, యోవనం మొదలయిన దర్పాలతో రాజులు ఆమెకొరకు పోటీ పడ్డారు అని ఉంటుంది.

3 . మరి కర్ణుడిని ఎందుకు పరిచయం చేశారు?

వచ్చిన రాజులందరినీ పరిచయం చేసాడు. బలరాముడు, కృష్ణుడు, సాత్యకితో సహా. జరాసంధుడు, శల్యుడు కొడుకులతో సహా వచ్చారు. వారు గెలిచినా వారే చేసుకోవాలని లేదు. గెలుచుకున్నాక మళ్ళీ వారిలో ఎవరు చేసుకోవాలి అన్నది వారు నిశ్చయం చేసుకోవాలి, దానికి వధువు తరఫు వారు సమ్మతించాలి అనుకుంటాను, తర్వాత కథ నడిచిన తీరు బట్టి అలాగ అర్ధం అవుతుంది.అర్జునుడు గెలిచినా , నేను చేసుకోను అన్నల పెళ్లి కానిదే అన్నాడు. నువ్వు గెలిచావు కాబట్టి నువ్వే చేసుకు తీరాలి అనలేదు ద్రుపదుడు.మీలో ఎవరు చేసుకున్న సమ్మతమే అన్నాడు ద్రుపదుడు. అవీ ఆనాటి క్షత్రియ సంప్రదాయాలు.

కర్ణుడిని ఎలా పరిచయం చేసాడో చూద్దాము. " దుర్యోధనుడు, దుశ్శాసనుడు, .......................మరెందరో ధృతరాష్ట్ర

కుమారులు , కర్ణునితో కలిసి, నీ కోసం వచ్చారు" . కర్ణుడు నీ కోసం వచ్చాడు అనలేదు , ఎందుకని?

4 . కర్ణుడు విల్లు ఎక్కు పెట్టడం సబబా?

సబబు మాట వచ్చింది కాబట్టి , ఒక ప్రశ్న కూడా వస్తుంది. మొత్తం అక్కడున్న రాజకులంలో కర్ణుడు తప్ప అందరూ క్షత్రియ వంశజులే. ధృష్టద్యుమ్నుడు ముందే చెప్పాడు నియమాలు. బలం, రూపం, కులం మూడూ ఉండాలని. కర్ణుడు ఛేదించడం ద్వారా బలం నిరూపించుకోగలడు.అద్భుతమయిన రూపం అతనిది. సూర్యుని తేజస్సు. కానీ అతను , తనను తాను క్షత్రియుడని చెప్పుకునే వీలు లేదు. ఎందుకని కర్ణుడు ప్రయత్నించా లనుకున్నాడు? తాను గెలిచినా ఆ ప్రశ్న వస్తుంది కదా?

5 . ద్రౌపది ఏమంది, ఎప్పుడంది?

కర్ణుడు మిగిలిన రాజులనేకమంది విల్లునెక్కుపెట్టలేకపోవడం చూసి, వెంటనే ఆ ధనుస్సును ఎక్కుపెట్టి బాణాలు సంధించాడు. ఇంకా లక్ష్యాన్ని భేదించడం జరుగ లేదు. కర్ణుడు తప్పక లక్ష్యాన్ని భేదిస్తాడు అని అందరూ అనుకున్నారు.

ఆ సమయంలో ద్రౌపది పెద్దగా ( చిన్నగా అంటే వినపడదుగా ) ," నాహం వరయామి సూతం" ( నేను సూతుని వరించను) అన్నది.

భేదించిన వరకూ ఆగలేదు. తన మనసులో మాట , అన్నగారి నియమాలను గుర్తు చెయ్యడానికి అతడి కులం గుర్తు చేసింది. నేను కర్ణుడిని చేసుకోను అనలేదు, తనకి ఆ స్వాతంత్య్రం లేదు. జరాసంధుడిని అనలేదు, శిశుపాలుడిని అనలేదు , దుర్యోధనుడిని అనలేదు. కర్ణుడిని ఎందుకు అన్నదీ అంటే నియమాలు ఒప్పుకోవు, తనకీ నియమభంగం చేసి చేసుకోవలసిన అగత్యమూ లేదు.

6 . కర్ణుడి స్పందన ఏమిటి? మిత్రుడు దుర్యోధనుడి స్పందన ఏమిటి? మిగిలిన సభాసదుల స్పందన ఏమిటి? ఎవరన్నా అది బేసబబు అన్నారా? ఎందుకు అనలేదు ?

కర్ణుడి స్పందన: కోపంతో నవ్వాడు. సూర్యుడి వైపు చూసాడు. ధనుస్సు వదిలేసాడు. సభనుండి బయటకు పోలేదు. తిరిగి తన స్థానంలోకి వెళ్లి కూర్చున్నాడని భావించాలి. అతడు ఎవరినీ నిందించలేదు. సూర్యుడి కేసి చూడడంలో అతడు ఎవర్ని నిందించాడో అనిపిస్తోంది. కోపానికిi కారణం ఊహించుకోవచ్చు. నవ్వింది ఎందుకు? తనమీద తనకే నవ్వు.వెళ్లకుండా ఉండాల్సింది అనుకుంటున్నాడు అనిపిస్తుంది.

మిత్రుడికి అవమానం జరిగిందని దుర్యోధనుడు భావించాడా? మనకు తెలియదు. తరువాత తాను కూడా వెళ్లి భంగపడ్డాడు. మిగిలిన క్షత్రియులెవరూ ఈ విషయం పట్టించుకోకుండా కార్యక్రమాన్ని కొనసాగించారు. అదే ఆమోదమా? అదే క్షత్రియులు ద్రౌపదిని ఒక బ్రాహ్మణుడు గెలుచుకుంటే ఏకమయ్యి యుద్ధం చేశారు. కర్ణుడి అవమానం వారికి పట్టలేదు. ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు కూడా ద్రౌపదిది తప్పు అనలేదు. వారే అనేవారేమో, ద్రౌపది అనకుంటే అనిపిస్తుంది. వారి మనసులోని మాటే ద్రౌపది పలికింది.

7 వారెవ్వరికి బేసబబు అని అనిపించంది మనకెందుకు సబబా అని ప్రశ్న ఉత్పన్నమవుతోంది?

వారు బతికిన సమాజం వేరు. వారు ఎంచుకున్న జీవిత, వివాహ విధానాలు వేరు. మనం బతుకుతున్న సమాజం వేరు.

ఇప్పుడు కూడా కులవివక్ష ఉన్నది కాబట్టి ఈ మాత్రమయినా అర్ధం చేసుకోగలం. ఇంకొక వంద ఏళ్ళకి భారతం చదివితే ( అప్పటికి ఈ కులాలు అన్నవి పూర్తిగా లేకుండా పోతే) , ఇంకా ఎక్కువగా బేసబబు అనిపిస్తుంది. అంతే కాదు ఆ స్వయంవర నియమాలు, వధువుకు తన వరుడిని ఎంచుకొనే స్వాతంత్య్రం లేకపోవడం హాస్యాస్పదంగా కనిపిస్తాయి. ఇప్పటికే ద్రౌపదిని ఆమె అనుమతి లేకుండా అయిదుగురికిచ్చి పెళ్లి చేసారని వ్యాసాలూ, కధలూ , నవలలు వచ్చాయి, వస్తున్నాయి.

భారతాన్ని స్త్రీవాదంతోను, మానవతావాదం తోను, సామ్యవాదం తోను , కులవాదంతోను, వైజ్ఞానిక ధోరణిలోనూ పరిశీలిస్తే అసంగతమయిన విషయాలు కోకోల్లలుగా కనిపిస్తాయి. భారతాన్ని చూడవలసిన విమర్శనా దృక్పథం అది కాదేమో!

8 .ఇంతకీ ఇలాగె జరిగిందా?

లేదంటున్నారు చాలామంది. ఒకవేళ జరిగితే సబబా అన్నదానికి నేను సమాధానమిచ్చాను. అసలు జరగకపోతేనో?అప్పుడు జవాబు ఇలా ఉంటుంది.

ఆ నాటి క్షత్రియులు మంచి సంస్కార హృదయులు. సూతులకు కూడ పరాక్రమం ప్రదర్శించి స్వయంంవరంలో పాల్గొనే అవకాశం ఉంది కర్ణుడిని ద్రౌపది ఏమీ అనలేదు. అతడికి పూర్తి వీలు కల్పించారు. అతడే లక్ష్యం బేధించలేక విఫలుడయినాడు. ద్రౌపది ఆలా ఎప్పుడూ అనలేదు.

అన్ని సంస్కృత ప్రతులనూ పరిశోధనాత్మక దృష్టితో పరిశీలించిన భండార్కర్ ఇన్స్టిట్యూట్ వారు ద్రౌపది అటువంటి మాట అనలేదని తేల్చి చెప్పారు. మన కవిత్రయ భారతం లో కూడా కర్ణుడు వెంట్రుక వాసిలో భేదించలేకపోయాడనే ఉంది.

9 . ఏది నిజం, దేనిని నమ్మమంటారు?

నాహం వరయామి అని ద్రౌపది అంటే దానిని మార్చేశారని నమ్మేవారు ఉన్నారు. దానిని తరవాత చేర్చారని నమ్మేవారు ఉన్నారు. వీటి మీద పెద్ద పెద్ద చర్చలే జరిగాయి. మీరు ఏది నమ్ముతారన్నది మీ ఇష్టం.

ఒకానొక జెఫ్రీ ఆర్చర్ కధలో , కధకి నాలుగు ముగింపులు ఇస్తాడు. నాలుగూ బాగానే ఉంటాయి. తెలుగులో కూడా ఈ ప్రయోగం జరిగినట్టు గుర్తు. సమయానికి సరిగ్గా గుర్తు రావటం లేదు. ఎవరయినా సూచించవచ్చు. ఇక్కడ ముగింపులో కాక మధ్యలోనే పలు రకాలుగా ద్రౌపది స్వయంవర ఘట్టం వర్ణించబడటం జరిగింది. ఇందులో ఏదో ఒకటి మాత్రమే వ్యాసుడు వ్రాసినది. మిగిలినవి అపర వ్యాసులు వ్రాసారు. అందువల్ల ఇక నిర్ణయం మన నమ్మకం మీదనే ఆధారపడుతుంది. లేదంటే ఆ వాదప్రతివాదాలను మీరు స్వయంగా చదివి నిగ్గు తేల్చుకోవాలి. లేదా ఎవరో ఒకరిని నమ్మాలి.

10 . ఇంతకీ సబబా, బేసబబా జవాబు చెబుతారా?

ముందే చెప్పాను , ఇది అంత సులువయిన జవాబు ఇవ్వగలిగిన ప్రశ్న కాదని. ఆవిడ అలా అని ఉండకపోతే సబబా కాదా అన్న సమస్య. ఉత్పన్నం కాదు.అని ఉంటే ఆ కాలానికి ఆవిడ నిర్ణయాన్ని సబబు కాదని అనలేము. ఎవరూ ఆ కాలంలో అనలేదు కనుక.ఆనక మీ ఇష్టం.

ధన్యవాదాలు.

No comments:

Post a Comment