అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-434.
4️⃣3️⃣4️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
*భగవద్గీత*
(సరళమైన తెలుగులో)
*18. మోక్ష సన్యాస యోగము*
(పదునెనిమిదవ అధ్యాయము)
_________________________```
ఇది గీతలో ఆఖరు అధ్యాయము. ఈ అధ్యాయములో పరమాత్మ మోక్షము, సన్యాసము వీటి గురించి వివరిస్తున్నాడు. అందుకే దీనిని మోక్ష, సన్యాస, యోగము అని పేరు. దీనికి ఒక విధంగా అర్థం చెప్పుకోవచ్చు. మోక్షము కావాలి అని అనుకోవడం కూడా ఒక కోరిక. సాత్వికమైన కోరిక. ఆ కోరిక కూడా వదిలిపెట్టాలి. పూర్తిగా నిర్గుణత్వము పొందాలి. పరమాత్మ నిర్గుణులు కాబట్టి, నిర్గుణత్వము పొందిన వారే పరమాత్మను చేరుకోగలరు.
భగవద్గీత మొదటి అధ్యాయములో ఈ గీత, ఎవరు, ఎవరికి, ఏ సందర్భములో, ఏ కారణంచేత, ఏ ప్రకారంగా, చెప్పవలసివచ్చింది అనే విషయం తెలియజేసారు. రెండవ అధ్యాయంలో ఈ గీతలో ఏయే విషయములు చెప్పబడ్డాయి అనే విషయ సూచిక ఇవ్వబడింది. మూడు నుండి 15 వ అధ్యాయము వరకు గీత చెప్పబడింది, 16, 17 అధ్యాయాలలో గీతలో చెప్పబడిన కొన్ని పదాలకు వివరణ అనుబంధాలుగా ఇవ్వబడ్డాయి. 18వ అధ్యాయములో గీతలో చెప్పబడిన విషయాలన్నీ సంగ్రహంగా (సమ్మరీగా) ఇవ్వబడ్డాయి. గీత యొక్క సారం అంతా ఈ 18వ అధ్యాయంలో చెప్పబడింది.
అంతే కాకుండా, ఈ భగవద్గీతలో వ్యాసులవారు కర్మ భక్తి, జ్ఞానయోగముల గురించి, జీవుడు, పరమాత్మ, జీవుడు పరమాత్మలో ఎలా ఐక్యం అవుతాడు అనే వాటి గురించి, మానవ ప్రయత్నము, పరమాత్మ అనుగ్రహము, ఆ అనుగ్రహం కావాలంటే మనం చేయాల్సిన క్రియలు, మొదలగు వాటిగురించి తెలియజేసారు. తరువాత ఓం తత్సత్ అనే మహా వాక్యం గురించి వివరించారు. మానవ ప్రయత్నం, దైవానుగ్రహము, ఈ రెండు కావాలంటే మానవ విలువలు పాటించడం వీటి గురించి కూడా తెలియజేసారు. ఈ ఆఖరు అధ్యాయంలో పైన చెప్పబడిన వాటి గురించి మరలా ఒకసారి సంగ్రహంగా తెలియజేసారు. ఈ అధ్యాయం అర్జునుడు కృష్ణుడికి వేసే ప్రశ్నతో ఆరంభం అవుతుంది.```
*అర్జున ఉవాచ:*
*1. వ శ్లోకము:*
*”సన్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్l*
*త్యాగస్య చ హృషీకేశ! పృథక్కేశి నిషూదనll”*
“ఇక్కడ అర్జునుడు "ఓ హృషీకేశా!" అని సంబోధించి ఇలా అడుగుతున్నాడు. హృషీకములు అంటే ఇంద్రియములకు అధిపతి అయినవాడా! "కేశి నిషూదన!" కేశి అనే రాక్షసుని చంపిన వాడా! కృష్ణా! నువ్వు సన్యాసము, త్యాగము అనే రెండు మాటలు చెప్పావు కదా. అవేమిటి? వాటి అర్థం ఏమిటి? వాటి తత్వములు ఏమిటి? వాటిని ఎవరు, ఎప్పుడు, ఎలా ఆచరించాలి? ఈ విషయాలు కూడా చెప్పు అని అడిగాడు అర్జునుడు.
```
ఈ రెండు విషయాలు కృష్ణుడు అర్జునుడికి ఇదివరకే చెప్పి ఉన్నాడు. ఈ రెండు విషయాలే కాకుండా ఇంకా ఎన్నోవిషయాలు చెప్పాడు. కాని అర్జునుడు ఈ రెండు మాటల అర్థాల గురించి మాత్రమే అడిగాడు. అంటే అర్జునుడికి మొదటి నుండి యుద్ధం మానేయాలని కోరిక బలంగా ఉంది. యుద్ధం మానేసి వెనక్కు తిరిగి పోవాలి. అంటే తన క్షత్రియ ధర్మాన్ని త్యాగం చేయాలి. వదిలిపెట్టాలి. ఇదే అర్జునుడి మనసులో గాఢంగా పాతుకుపోయిన విషయం. అందుకని ఈ రెండు విషయాల గురించి మాత్రమే మరలా అర్జునుడు అడిగాడు. అర్జునుడి అంతర్యం గ్రహించిన కృష్ణుడు ఈ రెండు విషయాలే కాకుండా, తాను చెప్పిన ఆధ్యాత్మిక విషయాలు అన్నీ ఈ అధ్యాయంలో ఒకసారి పునశ్చరణ చేసాడు. అంటే మరలా గీతను అంతా సంగ్రహంగా చెప్పాడు.```
(ఈ రోజుల్లో కూడా సంసార బాధలు, కుటుంబ బాధలు తట్టుకోలేక, బంధాలు, అనుబంధాలు తెంచుకొని ఇల్లు వదిలి పారిపోయిన వాళ్లు ఉన్నారు. అప్పుల బాధలు పడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ల గురించి వింటున్నాము. లేకపోతే ఐపి పెట్టి కనపడకుండాపోవడం చేస్తున్నారు. అంటే కష్టాలను ఎదుర్కోడం మానేసి, పిరికిపందల్లా తమ కష్టాల నుండి సుదూర తీరాలకు పారిపోతున్నారు. ప్రస్తుతం అర్జునుని విషాదం నేటి సంసార బాధలకు ప్రతీక. అందుకే అర్జునుడు ఈ విషాదము నుండి పారిపోవాలని మనసులో గాఢంగా నమ్ముకున్నాడు. కాబట్టి కృష్ణుని ఈ రెండు విషయాలు మాత్రమే అడిగాడు.)
ఈ శ్లోకంలో వ్యాసుల వారు మూడు సంబోధనలు వాడారు.
1. మహాబాహో అంటే గొప్పవైన భుజములు కలవాడా!
2. హృషీకేశ! ఇంద్రియములకు అధిపతి అయినవాడా!
3. కేశి నిషూదన! కేశి అనే రాక్షసుని చంపిన వాడా! అర్జునుడు అడిగిన ప్రశ్నలకు అర్ధం ఈ మూడు సంబోధనలలోనే ఇమిడ్చాడు వ్యాసులవారు.
```
మహాబాహో! అంటే కేవలం బాహుబలం, పరాక్రమము ఉంటే ప్రయోజనం లేదు. మనోబలం కూడా ఉండాలి. ఆ మనోబలంతో ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి. అప్పుడు ఏ విషాదము ఉండదు. సన్యాసముతో పని లేదు. ఏ త్యాగము చేయనవసరం లేదు. నీవు నీ లోపల ఉన్న ఇంద్రియములు అనే శత్రువులను జయించకుండా విషాదం పొందితే ప్రయోజనం లేదు. అన్నిటి కన్నా ముందు నీలో ఉన్న అహంకారము, అవివేకము అనే రాక్షసుని జయించు. అప్పుడు నీ కర్తవ్యము నీకు బోధపడుతుంది. అందరినీ నీవే చంపుతానని అహంకరించకు. వీళ్లంతా వారి వారి పూర్వజన్మలలో చేసుకున్న కర్మలను బట్టి ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు మరణించడం తప్పదు. అందరూ నీ చేత చంపబడతారు అనే అజ్ఞానం వదిలిపెట్టు. నీవు కేవలం నిమిత్తమాత్రుడవు. అనే విషయాలను ఈ సంబోధనల ద్వారా సూచించారు వ్యాసులవారు.✍️```
(సశేషం)
🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం,
(రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment