2201E4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*సొగసు చూడతరమా!*
➖➖➖✍️
```
విశ్వామిత్రుడి వెంట శ్రీరామలక్ష్మణులు సిద్ధాశ్రమానికి వెళ్లి తాటకిని,సుబాహుణ్ని సంహరించారు. ముని తలపెట్టిన మోక్ష కామేష్టి యజ్ఞం సజావుగా ముగిసింది. విశ్వామిత్రుడి ఆనందానికి అవధులు లేవు. అక్కడ మిధిలానగరంలో మైథిలి వివాహం చేయడానికి జనకుడు స్వయంవరం నిర్వహిస్తున్న విషయం విశ్వామిత్రుడికి అప్పుడే తెలిసింది. శ్రీరామ లక్ష్మణులకు తాము మిథిలా నగరానికి వెళ్ళాల్సి ఉందని చెబుతాడు. ఆ ముగ్గురూ మిథిలకు చేరుకుంటారు. అక్కడి ప్రజలు విశ్వామిత్రుణ్ని, ఆయన వెంట నడుస్తున్న శ్రీరామలక్ష్మణులను విస్మయంగా గమనించసాగారు. ముఖ్యంగా శ్రీరాముడి సౌందర్య శోభ వారిని అబ్బురపాటుకు గురిచేసింది. వాల్మీకి రామాయణంలో వర్ణించినట్లు ఆయన రత్నదీపంగా భాసిస్తున్నాడు. ఆజానుబాహుడిగా కమల పత్రాక్షుడై ధనుర్భాణాలు ధరించి స్నిగ్ధ మోహనంగా కనిపించాడు. రాజసభలోకి రాగానే శ్రీరాముని చూసి జనకుడు దేవలోకం నుంచి దిగివచ్చినవాడిగా భావించాడట. దాశరథి ముఖంలో సౌశీల్యత గోచరించింది. ఆ సభలో ఉన్నవారందరినీ శ్రీరాముడిలోని నిర్భయత్వం యౌవనశోభ, సౌమ్యత చకితులను చేశాయి.
శివధనుస్సును శ్రీరాముడికి చూపించమని విశ్వామిత్రుడు కోరగానే జనకుడు ఆరువందల బలశాలురచేత దాన్ని సభలోకి తెప్పించాడు. ముని క్రీగంట సూచనతో శ్రీరాముడు ఆసనం దిగి ఆ ధనుస్సును ఎక్కుపెట్టగానే అది పెళ పెళ మంటూ విరిగింది. జనకుడు ఉత్కంఠతతో తమ్ముడు కుశధ్వజున్ని కౌగలించుకున్నాడు. ఆరు సద్గుణాలు ప్రస్ఫుటం అవుతున్న సంపూర్ణమైన _మానవుడు... ఇతడే సీతకు తగిన వరుడని జనకుడు వెనువెంటనే నిర్ణయించుకున్నాడని రామాయణం చెబుతోంది.
త్యాగరాజు సొగసు చూడ తరమా కృతి (కన్నడగౌళ)లో తన ఆరాధ్య దైవం శ్రీరాముడి అందచందాలను మనోహరంగా వర్ణించాడు. 'ఓ రామా నీ సొగసు... నీ సౌందర్యం ఎంత చూసినా తనివి తీరదే నీ వదనం ముచ్చట గొల్పుతూ అందానికి అది నివాసమైంది. దేవతలే అమర్చిన నీ పాదాలు అభయమిచ్చే దివ్య హస్తాలు. మన్మథుని మించిన రమణీయత (అమరార్చిత పద యుగమో అభయ ప్రదకర యుగమో) నన్ను ఆరాధనకు తొందర పెడుతున్నాయి... అని గారం చేశాడు. 'ఏరువుతో నిండిన పండులా నీ అధరాలు పొగడ పూవులతో నిండిన నీ వక్షస్థలం ధనుర్బాణాలతో నిండిన నీ పరాక్రమ సూచికలు... నీ నుదుటిపై ముంగురులు అందుకు తగిన చిరునవ్వు కన్నులందలి తళుకు (చిరునవ్వో ముంగురులో మరి కన్నుల తేటో) నాకు సంభ్రమం కలిగిస్తున్నాయి' అని ఆలపించిన కీర్తనా సుమనోహరమే.
సీతా రామ లక్ష్మణులు కైకేయి ఆజ్ఞపై అరణ్యవాసం చేసినప్పుడు దండకారణ్యంలోకి ప్రవేశించారు. అక్కడ మునులందరూ శ్రీరాముణ్ని దర్శించుకోవడానికి వచ్చారు. వారెప్పుడూ అరణ్యాలు విడిచి నగరాల్లోకి వెళ్లని ఋషులు. తొలిసారిగా శ్రీరాముని చూసినప్పుడు ఆకర్షణీయమైన రూపం గమనించి మాటలు రాక తడపడ్డారట. వాళ్ళందరూ శ్రీరాముడి నుంచి వేరుగా ఉండడం ఇష్టం లేక... ఆయన తదుపరి అవతారంలో ఆయనను సదా వెన్నంటి ఉండే గోపకన్యలుగా జన్మించడానికి అనుమతిని కోరారని జనసేనుడు రాసిన హరివంశ పురాణం చెబుతోంది. శ్రీరాముడు తన అందచందాలతో అందరి హృదయాలను దోచుకున్నవాడే కాక ఆయన మర్యాదా పురుషోత్తముడు. ఆ సుందర రాముడు అందరి మనసులలో సుగుణాభిరాముడయ్యాడు. అందుకే!✍️
-అప్పరుసు రమాకాంతరావు.
```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment