Sunday, May 25, 2025

 మనిషికి ఆలోచనలు ఉన్నాయి. భావనలు ఉన్నాయి. ఆనంద విషాదాలు ఉన్నాయి. కామ క్రోధాలు ఉన్నాయి ద్వేషాలు ఉన్నాయి. ప్రేమానురాగాలున్నాయి. కాబట్టి మనిషి ఏ పని లేకుండా ఉట్టిగా ఉండటం కుదరని పని. ఎవరు కూడా ఏ విధమైన కర్మాచరణ లేకుండా ఉండటం కుదరదు. ప్రకృతి నియమాలు అనుసరించే ప్రతి జీవి ఏదో ఒక కర్మ చేయక తప్పదు. కాబట్టి నిర వ్యాపారం గా కూర్చుని అన్నీ వదిలేయడం ఆధ్యాత్మికం కాదు. .అన్ని పనులు సక్రమంగా నిర్వహిస్తూ, సుళ్ళు తిరిగే ప్రవాహంలో కూడా తన ప్రత్యేక అస్తిత్వాన్ని నిలుపుకోవడం ఆధ్యాత్మికతలో ఉచ్చస్థితి. ఇది మానవుడు సాధించవలసిన విజయం.  మన ధర్మంలో గృహస్థాశ్రమం అన్ని ఆశ్రమాలలో ఉత్తమమైనదని నిర్ణయించారు. బాల్య దశలో వ్యక్తికి రక్షణ కావాలి ఆ రక్షణను సన్యాసులు సర్వాన్ని త్వదించిన వారు ఇవ్వరు. ఆ రక్షణను ఇచ్చేది గృహస్థులు మాత్రమే. యవ్వనంలో వ్యక్తికి మార్గదర్శనం కావాలి. తన కాళ్ళ మీద తన నిలబడేందుకు ఆసరా కావాలి. అది గృహస్తు మాత్రమే ఇవ్వగలడు. సమాజం నడవటానికి మానవజాతి అభివృద్ధి చెందటానికి సంతానాన్ని కనాలి. అది గృహస్తు బాధ్యతనే. ఇక సన్యాసులకు బిక్ష ఇవ్వడం దగ్గర నుండి వారి బోగోగులు చూడటము వారి అవసరాలు గుర్తించడం తీర్చడం గృహస్తులు మాత్రమే చేయగలరు. వార్థక్యంలో కూడా వ్యక్తికి నీడని ఇవ్వగలిగింది గృహస్థు.  దీన్నిబట్టి చూస్తే అర్థమవుతుంది సమాజానికి వెన్నుముక వంటి వాడు గృహస్తు.  కాబట్టి గృహస్తులు లేకపోతే సమాజం లేదని స్పష్టమవుతుంది అయితే ఇన్ని కార్యాలు సాధించి కర్తవ్యం నిర్వహించాలంటే గృహస్తుకి డబ్బు సంపాదించడం తప్పనిసరి కాబట్టి తన సంసారం గడపటానికి, పదిమందికి దానం చేసేందుకు, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు, సరిపడా ధనం సంపాదించడం కూడా వ్యక్తి నిర్దిష్ట కర్తవ్యాల్లో ఒకటి. మనం పరీక్షలు పాస్ కావాలి. ఇంటర్వ్యూలు గెలవాలి. మంచి ఉద్యోగాలు సంపాదించాలి. బాగా డబ్బు సంపాదించాలి. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించాలి. బిల్ గేట్స్ ని తలదన్నేలా ఎదగాలి కానీ అంతిమ లక్ష్యం కారాదు. ఇదే మన విజయానికి సంపూర్ణ స్వరూపం కాకూడదు. ఈ కోరికలు వెనుక వాంఛల వెనుక కర్తవ్యం పరాయణ భావన ఉండాలి. ఆధ్యాత్మిక భావన అంతర్లీనంగా ఉండాలి. వ్యక్తి తన సామాజిక బాధ్యతను గుర్తించి వ్యక్తిగత బాధ్యతలను అర్థం చేసుకుని వీటి మధ్య సమన్వయం సాధించాలి ఇది అసలు విజయం.

No comments:

Post a Comment