*_మూడు చిక్కు ప్రశ్నలు_*
_(సారంగ వెబ్ మ్యాగజైన్ లో వచ్చిన విదేశీ జానపద హాస్య కథ)_
==================
_డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212_
**************************
*ఒక రాజు దగ్గర ముగ్గురు సేవకులు ఉండేవాళ్ళు.*
*ఒకతను గుర్రాల కాపరి. రాజ కుటుంబానికి చెందిన గుర్రాలను జాగ్రత్తగా చూసుకుంటూ, పిలిచిన మరుక్షణమే వాటిని సిద్ధంచేసి రాజుముందు నిలిపేవాడు.*
*ఇంకొకతను వేటలో నేర్పరి. రాజు వేటకు వెళ్లేటప్పుడు సహాయంగా ఉండేవాడు. రాజు ఆదమరచి ఉన్నప్పుడు ఏ జంతువులు మీదపడి దాడి చేయకుండా కంటికి రెప్పలా చూసుకునేవాడు.*
*మూడవవాడు వంటవాడు. రాజుకు ఎప్పుడు ఏ సమయానికి ఏం కావాలో అడగకముందే అన్నీ తయారుచేసి రాజు ముందు చాలా రుచిగా, శుచిగా ఉంచేవాడు.*
*వాళ్ళు చాలాకాలంగా రాజు వద్ద పనిచేస్తున్నారు. పిల్లలు పెరిగి పెద్దగ అవుతున్నారు. ఖర్చులు పెరుగుతున్నాయి కానీ జీతాలు పెరగడం లేదు. దాంతో సేవకులు ముగ్గురూ కలసి ఒకరోజు రాజు దగ్గరికి పోయి తమ పరిస్థితి అంతా వివరించారు.*
*రాజు చాలా మంచివాడు కావడంతో "మీరు ఎంతో కాలంగా నాకు నమ్మకస్తులు. నన్ను నా కుటుంబాన్ని అంటిపెట్టుకున్న వాళ్ళు. మీ బాగోగులను చూసుకోవలసిన బాధ్యత నాపై ఉంది" అంటూ జీతం పెంచడమేకాక "చూడండి... నేను మిమ్మల్ని మూడు ప్రశ్నలు అడుగుతాను. ఎవరైతే సరైన సమాధానం చెబుతారో వాళ్లకి మూడువేల బంగారు వరహాలు కానుకగా కూడా ఇస్తాను" అన్నాడు.*
*ముగ్గురు సంబరంగా 'సరే' అన్నారు. రాజు చిరునవ్వుతో మూడు ప్రశ్నలు వాళ్ల ముందు ఉంచాడు.*
*_1. ఈ లోకంలో అన్నిటికన్నా వేగంగా వెళ్ళేది ఏది?_*
*_2. ఈ లోకంలో అన్నింటికన్నా పెద్దది ఏది?_*
*_3. ఈ లోకంలో మనకు అన్నిటికంటే ఇష్టమైనది ఏది?_*
*ఈ మూడు ప్రశ్నలకు మూడు రోజుల్లో ఎవరైతే ముందుగా వచ్చి సరైన సమాధానం చెబుతారో వాళ్లకి మూడువేల బంగారు వరహాలు క్షణంలో కానుకగా ఇస్తా" అన్నాడు.*
*ఆ మాటలకు గుర్రాల కాపరి "రాజా... దీనికి మూడు రోజులు ఎందుకు. మూడు నిమిషాల్లోనే జవాబు చెప్పేస్తా" అన్నాడు.*
*రాజు 'సరే... చెప్పు' అన్నాడు.*
_వెంటనే ఆ గుర్రాల కాపరి "మహారాజా... ఈ లోకంలో అన్నిటికంటే వేగంగా వెళ్ళేది.. *మీరు ఎక్కే పంచకల్యాణి.* దానంత వేగంగా ప్రపంచంలో ఏదీ వెళ్ళలేదు._
_అలాగే అన్నిటికన్నా పెద్దది *మన గుర్రాల శాల.* దానంత పెద్దది చుట్టుపక్కల ఏడేడు పద్నాలుగు లోకాల్లోనూ ఎక్కడా ఉండదు._
_అలాగే చివరి ప్రశ్నకు సమాధానం. ఈ లోకంలో ఎవరికైనా సరే అన్నింటికన్నా ప్రియమైనది.. *వాళ్ల భార్య.* మహారాణికంటే ప్రియమైనది మీకు ఇంకేముంటుంది ప్రభూ" అన్నాడు తన తెలివికి తానే మురిసిపోతూ._
*ఆ జవాబులకు రాజు తల అడ్డంగా ఊపాడు.*
*దాంతో గుర్రాల కాపరి తల గోక్కుంటూ వెళ్లిపోయాడు.*
*తర్వాతరోజు పొద్దున్నే వేటగాడు రాజు దగ్గరికి పోయాడు. "రాజా... నిన్న రాత్రంతా కిందామీదాపడి బాగా ఆలోచించాను. మీ ప్రశ్నలకు సరైన సమాధానం తెలిసిపోయింది" అన్నాడు.*
*'సరే చెప్పు' అన్నాడు మహారాజు చిరునవ్వుతో.*
_"రాజా... ఈ లోకంలో అన్నిటికన్నా వేగంగా వెళ్ళేది.. *మీరు ఎక్కు పెట్టి విడిచే బాణం.* అన్నిటికన్నా లావైనది.. *అడవిలో తిరిగే ఏనుగు.* మీకు అన్నిటికన్నా ప్రియమైనది.. *వేట.* అందుకే వారానికోసారి అడవికి తప్పనిసరిగా వెళుతుంటారు" అన్నాడు._
*ఆ జవాబులకు రాజు తల అడ్డంగా ఊపాడు. దాంతో వేటగాడు నిరాశతో వెళ్లిపోయాడు. ఇక మిగిలింది వంటవాడు. వానికి ఎంత ఆలోచించినా సరియైన సమాధానాలు దొరకలేదు. దాంతో విచారంగా ఇంటిలో అటూయిటూ తిరగసాగాడు. అతనికి ఒక మెరుపుతీగ లాంటి తెలివైన కూతురు ఉంది. ఎలాంటి చిక్కు సమస్యకైనా సరే చిరునవ్వుతో చిటికలో జవాబిస్తుంది.*
*ఆమె వాళ్ల నాయనను చూసి "ఏం నాన్నా... ఏం జరిగింది. రెండురోజులుగా కంటినిండా నిద్రపోకుంటున్నావు. కడుపునిండా తినలేకుంటున్నావు. కుదురుగా ఒక చోట కూర్చోలేకుంటున్నావు" అని అడిగింది. దానికి అతను విచారంగా జరిగిందంతా చెప్పి "మూడువేల వరహాలు అంటే మాటలు కాదు కదా... ముచ్చటగా మూడంతస్తుల మేడ కట్టుకోవచ్చు. బంగారం లాంటి అవకాశం చేతికి అందినట్టే అంది జారిపోయేటట్టుంది. ఇప్పటికే ఇద్దరు ఓడిపోయారు. ఇక మిగిలింది నేనే. రేపటి వరకే గడువు" అన్నాడు.*
*ఆ పాప చిరునవ్వు నవ్వి "ఇంతకూ వాటికి సమాధానాలు ఏమనుకుంటా ఉన్నావో ముందుగా అవి చెప్పు చూద్దాం" అంది. అప్పుడు ఆ వంటవాడు "ఈ లోకంలో అన్నిటికన్నా వేగంగా వెళ్లేది వాసన. మూత తెరిచిన మరుక్షణం గుమ్మని అందరి ముక్కుపుటాలకు ఒక్కసారిగా సోకుతుంది. ఈ లోకంలో అన్నిటికన్నా లావైనది రాజు గారి వంటశాలలో ఉండే అన్నం పాత్ర. ఒకేసారి వంద మందికి అందులో అన్నం వండవచ్చు. అలాగే రాజుగారికి అన్నిటికన్నా ప్రియమైనది చేపల పులుసు. వారానికి ఒక్కసారైనా అడిగి మరీ చేయించుకుంటారు. అంతేకాదు ముఖ్యమైన అతిధులు ఎవరొచ్చినా సరే దాన్నే చేయమంటారు" అన్నాడు.*
*ఆ మాటలకు ఆ పాప ఫక్కుమని నవ్వింది. "నాన్నా... బావిలోని కప్పకు బావే ప్రపంచం అన్నట్టు మీరు ముగ్గురు మీ వృత్తికి సంబంధించిన విషయాలే జవాబుగా చెబుతా ఉన్నారు. ఇక్కడ రాజుగారు అడుగుతున్నది ఈ లోకంలో ఏది వేగవంతమైనది, ఏది లావయింది, ఏది ప్రియమైంది అనే కానీ మీ వంటశాలలోనో, గుర్రాలశాలలోనో, వేటాడే అడవిలోనో కాదు. మీ చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని గమనించండి. అప్పుడు సరియైన సమాధానం దొరుకుతుంది" అంటూ రహస్యంగా అతని చెవిలో జవాబులు చెప్పింది. వాటిని వినగానే ఆ వంటవాని మొహం ఆనందంతో వెలిగిపోయింది. కూతురి నుదుటిపై సంబరంగా ముద్దు పెట్టుకున్నాడు. తర్వాతరోజు పొద్దున్నే రాజు ముందుకు హుషారుగా హాజరయ్యాడు.*
_♦️"మహారాజా... ఈ లోకంలో అన్నిటికన్నా వేగంగా వెళ్లేది... *మనసు.* క్షణంలో అది ప్రపంచంలో ఏ మారుమూల ప్రదేశానికైనా వెళ్లగలదు._
_♦️ అలాగే అన్నిటికన్నా లావైనది... *భూమి.* ఈ భూమి కంటే లావైనది ఈ భూమిమీద మరొకటి ఉండలేదు కదా._
_♦️ అలాగే ఈ లోకంలో అందరికీ అన్నిటికన్నా ప్రియమైనది.. *నిద్ర.* అది రాకపోతే ఎంత ధనముండీ ఏమీ లాభం ఉండదు. అందరూ పిచ్చివాళ్లుగా మారిపోతారు" అన్నాడు._
*ఆ మాటలకు రాజు సంబరంగా _"శభాష్... ఇవి కదా సరియైన సమాధానాలు అంటే. చిక్కు ప్రశ్నలకు పసందైన జవాబులు చెప్పావు"_ అంటూ సంబరంగా చప్పట్లు కొట్టాడు. మూడువేల బంగారు వరహాలు వాని చేతిలో పెడుతూ "నిజం చెప్పు. నీ గురించి నీ తెలివితేటల గురించి నాకు తెలీదా... ఈ సమాధానాలు ఎవరి వద్ద తెలుసుకున్నావు" అన్నాడు.*
*ఆ వంటవాడు బిడియపడుతూ... _"మహారాజా మన్నించండి. ఇవన్నీ నా కూతురు చెప్పింది. ఆ పాప చాలా తెలివైనది. నూటికోటికో ఒక్కరుంటారు అలాంటివాళ్ళు"_ అన్నాడు.*
*రాజు ఆ మాటలకు ఆసక్తిగా _"అయితే ఖచ్చితంగా నీ కూతురి తెలివితేటలు పరీక్షించి అందరిముందు అంగరంగ వైభవంగా సత్కరించవలసిందే. రేపు ఉదయం పది గంటలకు రాజమహలకు రమ్మను. కాకపోతే మూడు షరతులు గుర్తుపెట్టుకో...*
*_🚩1. నీ కూతురు వచ్చేటప్పుడు బట్టలు వేసుకొని రాకూడదు అలాగని ఒంటిమీద బట్టలు లేకుండా కూడా రాకూడదు._*
*_🚩 2. నీ కూతురు ఇక్కడికి నడుచుకుంటూ రాకూడదు. అలాగని చెప్పి ఏ వాహనము ఎక్కి కూడా రాకూడదు._*
*_🚩 3. నీ కూతురు వచ్చేటప్పుడు నాకు ఒక బహుమతి తెచ్చి ఇవ్వాలి అలాగని ఆ బహుమతి నాకు ఇచ్చినట్టు కూడా ఉండకూడదు" అని చెప్పాడు._*
*ఆ మాటలకు వంటవాని మొహం పాలిపోయింది. "ఇవెక్కడి షరతులురా నాయనా... ఈ రాజు ఏలికేస్తే కాలికి, కాలికేస్తే ఏలికి వేసేటట్లు ఉన్నాడే" అనుకొని విచారంగా ఇంటికి వచ్చాడు.*
*జరిగిందంతా తెలుసుకున్న కూతురు "నాన్నా... ఇందులో బాధపడాల్సింది, భయపడాల్సింది ఏమీ లేదు. మనసుంటే మార్గాలు వెయ్యి ఉంటాయి. మీరు నాకు వంద వరహాలు ఇవ్వండి చాలు అంతా నేను చూసుకుంటాను" అంది చిరునవ్వుతో. వంటవాడు ఆమె చేతిలో వంద వరహాలు పెట్టాడు. ఆమె బజారుకుపోయి ఒక చేపలు పట్టే వల, ఒక మేకపోతు, రెండు పావురాలు కొనుక్కొని ఇంటికి వచ్చింది.*
*💠తర్వాతరోజు పొద్దున్నే ఆ అమ్మాయి స్నానం చేసి బట్టల బదులుగా తన ఒంటిమీద మొత్తం చేపలు పట్టే వల చుట్టుకుంది. దాంతో ఒంటిమీద బట్టలు వేసుకున్నట్టూ లేదు. అలాగని ఒళ్లంతా వల చుట్టుకోవడంతో ఒళ్ళు కొంచెం కూడా కనపడకుండా బట్టలు వేసుకున్నట్టే నిండుగా ఉంది.*
*💠మేకపోతు మీద ఎక్కి రాజమహులకు బయలుదేరింది. కానీ మేకపోతు ఎత్తుగా లేకపోవడం వల్ల ఆమె కాళ్ళు నేల మీద తగులుతూ ఉన్నాయి. కాళ్లతో నెట్టుకుంటూ పోసాగింది. చూస్తే ఆమె నడిచీ రావడం లేదు. అలాగని దానిమీద పూర్తిగా ఎక్కీ రావడం లేదు.*
*💠రాజభవనంలోకి రాగానే మహారాజుకు నమస్కరించి "రాజా మీకోసం ఒక అందమైన బహుమతి తెచ్చాను. తీసుకోండి" అంటూ రెండు పావురాలు తీసి రాజు ముందు ఉంచింది. వాటిని రాజు అందుకోబోయేంతలో అవి అలా పెట్టిన మరుక్షణంలోనే సర్రున అక్కడినుంచి గాలిలో ఎగిరిపోయాయి. దాంతో ఆమె రాజుకు బహుమతి ఇచ్చినట్లే ఉంది, అలాగని ఇవ్వలేదు కూడా...!*
*రాజు ఆ అమ్మాయి తెలివితేటలు చూసి చాలా ఆశ్చర్యపోయాడు. "శభాష్ పాపా... తికమకపెట్టి చికాకు పరిచే చిక్కు ప్రశ్నలకు, ముచ్చట గొలిపే చక్కనైన సమాధానాలు అద్భుతంగా ఇచ్చావు. ఏ రాజైనా సరే రాజ్యాన్ని ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా చక్కగా పరిపాలించాలంటే నీలాంటి సలహాదారులు ఉండాలి" అంటూ ఆమెను ఘనంగా సన్మానించడమే కాకుండా ముఖ్య సలహాదారుగా కూడా నియమించుకున్నాడు.*
************************ ----------------------
*_{ఇది సేకరణే... ఎలా ఉంది..?: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}_*
No comments:
Post a Comment