Tuesday, September 2, 2025

 *రుక్మిణీ విజయం*

ఒకనాడు కృష్ణభగవానుడు పరమసంతోషంగా రుక్మిణీ దేవి మందిరంలోకి ప్రవేశించారు. అది అసురసంధ్య వేళ దాటిన కాలం.
 ఆ ఇల్లు కర్పూరము, అగరు మొదలయిన సువాసనలతో ఉన్నది. కృష్ణ పరమాత్మ ఆగమనమును తెలుసుకున్న రుక్మిణీదేవి గబగబా వెళ్లి ఆ పరిచారిక చేతిలో ఉన్న దండమును తాను తీసుకొని కృష్ణ పరమాత్మకి విసురుతోంది. 
కృష్ణుడు రుక్మిణి వంక చూసి పరమ ప్రసన్నుడై ఆమెతో 'రుక్మిణీ! నిన్ను చూస్తే చాలా పొరపాటు చేశావేమో అనిపిస్తున్నది. నేను ఐశ్వర్య హీనుడను, దరిద్రుడను. ఎక్కడో సముద్రగర్భంలో ఇల్లు కట్టుకున్న వాడిని. నీకు శిశుపాలుడి వంటి మహా ఐశ్వర్యవంతునితో వివాహం సిద్ధం చేశాడు నీ అన్న. నిష్కారణంగా అంత మంచి సంబంధం విడిచి పెట్టి ఏమీ చేతకాని వాడిని, పిరికివాడిని, సముద్ర గర్భంలో ఉన్నవాడిని, దరిద్రుడిని అయిన నన్ను నీవు చేపట్టేవేమో అనిపిస్తోంది. నీవు చేసిన పొరపాటును దిద్దుకోవాలని నీ మనసులో కోరిక ఉంటే అలాంటి అవకాశం కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈమాటలు వింటున్నప్పుడు రుక్మిణీ దేవి ముఖ కవళికలు మారిపోవడం ప్రారంభించాయి. ఒళ్ళంతా అదిరిపోయి స్పృహ తప్పి క్రింద పడిపోయింది. 
ఇన్ని మాటలు మాట్లాడిన కృష్ణుడు గబగబా రుక్మిణీ దేవి దగ్గరకు వెళ్ళి రెండు చేతులతో ఎత్తి ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఒళ్ళు చల్లబడడం కోసం ఒళ్ళంతా గంధమును రాశాడు. కళ్ళనుండి వెలువడే కన్నీటిని పన్నీటితో కడిగాడు. కర్పూర వాసనవచ్చే పలుకులు ఆమె చెవులలోకి ఊదాడు. ఆమె నేలమీద పడిపోయినప్పుడు ఆమె వేసుకున్న హారములన్నీ చిక్కుపడిపోయాయి. వాటి చిక్కులు విడదీసి గుండెల మీద చక్కగా వేశాడు. చెమట పట్టి కరిగిపోతున్న కుంకుమను చక్కగా దిద్ది చెమటనంతా తుడిచివేశాడు. తామర పువ్వురేకులతో చేసిన పెద్ద విసనకర్రను తెప్పించి దానితో విసిరాడు. అమ్మవారికి ఉపశాంతి కలిగేటట్లు ఆమె ప్రసన్న మయేటట్లు ప్రవర్తించి ఆవిడను తన ఒడిలో కూర్చోపెట్టుకుని అదేమిటి రుక్మిణీ నేను నీతో విరసోక్తులాడాను. 
ఆ మాటలకు నీవు ఇంత నొచ్చుకుని అలా పడిపోయావేమిటి’ అన్నాడు.
కృష్ణుడు ఇలా మాట్లాడవచ్చునా? అని అనుమానం రావచ్చు.
 కృష్ణుడు అలా మాట్లాడడానికి ఒక కారణం ఉన్నది. రుక్మిణీదేవి యందు చిన్న దోషం కలిగింది. 
*చిన్న దోషమును స్వామి సత్యభామ యందు భరిస్తాడు కానీ రుక్మిణీదేవియందు భరించడు.* 
రుక్మిణీ దేవికి కొద్దిపాటి అతిశయం వచ్చింది. ‘అష్టమహిషులలో నేను పట్టమహిషిని. కృష్ణ పరమాత్మ తప్పకుండ నా మందిరమునకు విచ్చేస్తూ ఉంటారు’ అని ఆమె మనస్సులో కొద్దిపాటి అహంకారం పొడసూపింది. యథార్థమునకు కృష్ణ పరమాత్మ పదహారు వేల ఎనిమిది మంది గోపికల ఇంట్లోనూ కూడా కనపడతాడు. ప్రతిరోజూ ఉంటాడు. అందరితోనూ క్రీడించినట్లు ఉంటాడు. ఆయన అస్ఖలిత బ్రహ్మచారి. అది మేధకు అందే విషయం కాదు. 
రుక్మిణీదేవికి కలిగిన చిన్న అతిశయం పెరిగి పెద్దదయి పోతే ఆవిడ ఉపద్రవమును తెచ్చుకుంటుంది. అలా తెచ్చుకోకూడదు. ఆవిడ లక్ష్మి అంశ. కారుణ్యమూర్తి అయి ఉండవలసిన తల్లి. ఈ అతిశయ భావనను ఆమెనుండి తీసివేస్తే ఆమె పరమ మంగళప్రదురాలిగా నిలబడుతుంది. అందుకు కృష్ణుడు ఆమెను దిద్దుబాటు చెయ్యాలని మాట్లాడిన మాట తప్ప,  ఆయన ఏదో కడుపులో పెట్టుకుని మాట్లాడిన మాట కాదు. కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి పట్ల ప్రవర్తించిన తీరు ఆమె అభ్యున్నతి కొరకు ప్రవర్తించిన ప్రవర్తన.
కృష్ణుని మాటలు విన్న అమ్మవారు చాలా అద్భుతమయిన విషయమును చెప్పింది. ‘కృష్ణా! మీరు చెప్పిన అన్నీ పరమ యదార్థములు. నేను చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని, మీకు మాత్రమే పత్నిని కావాలని పలవరించి పలవరించి మీకు భార్యనయ్యాను. *మీరు లోకులు అందరివలె ఉండేవారు కాదు. మీరు పరమాత్మ. అందుకే మిమ్మల్ని చేరుకున్నాను. ధనగర్వం కలిగిన ఐశ్వర్యవంతులెవరు నీకు చుట్టాలు కారు. తాము ఐశ్వర్యవంతులమనే గర్వం కలిగి మిగిలిన వారిని చిన్నచూపు చూసే వారు నీకు చుట్టాలు కారు. అన్నీ ఉన్నా అన్నిటినీ విడిచిపెట్టి ఈశ్వరుడే మాకు కావాలని భగవంతుని కోసమే జీవితం గడిపే పరమ భాగవతోత్తములకు చెందినవాడవు. పరబ్రహ్మ స్వరూపుడవు. నీ నడవడి ఒకరు అర్థం చేసుకోలేని రీతిలో ఉండేవాడవు. అన్నీ విడిచిపెట్టేసి ఒక్క ఈశ్వరునే చెయ్యి చాపి అడగడమే తప్ప, వేరొకరి దగ్గర చెయ్యి చాపనని అన్నవాడి దగ్గర చెయ్యి చాపేవాడివి.*
*సౌందర్య వంతులయిన కాంతలతో నీకు పని లేదు. నీకు బాహ్య సౌందర్యముతో పనిలేదు. నీకు కావలసినది అంతఃసౌందర్యము.* కృష్ణా, నీవు అన్న మాటలలోని చమత్కారమును నేను గ్రహించగలిగాను. ఇటువంటి వాడివి కాబట్టే నిన్ను చేరుకున్నాను. ఇంత తపస్సు చేసి నిన్ను పొందడానికి కారణం అదే. 
చాతక పక్షి వలె నా జన్మ ఉన్నంత కాలము నీ పాదములను సేవించే దానను తప్ప అన్యుల పక్కకి మనస్సు చేతకాని, వాక్కు చేతకాని, చేరేదానను కాను. నీవు ఇవ్వగలిగిన వరం ఉన్నట్లయితే నాకు దానిని ఇవ్వు’ అని అడిగింది. 
కృష్ణుడు ‘రుక్మిణీ! నీవు పరమ పతివ్రతవు. ఇప్పటి వరకు *కృష్ణ పరమాత్మ ఎవరి దగ్గరయినా నిలబడి తనను క్షమించమని అడిగిన సందర్భం లేదు. మొట్టమొదటి సారి రుక్మిణీ దేవి దగ్గర అడిగాడు. అనగా ఈశ్వరుడు తన కింకరుడిగా ఉండాలని కోరుకున్న వాని దగ్గర ఎలా ఉంటాడో చూడండి. ఈశ్వరుడు అంతవశుడు అవుతాడని తెలియజేస్తూ మిమ్మల్ని మీరు సంస్కరించుకోవలసిన విధానమును విరసోక్తిని రుక్మిణి పట్ల ప్రదర్శించినట్లుగా చూపించిన ఒక మహోత్కృష్టమయిన ఘట్టం ఈ ఘట్టం.*
 రుక్మిణీ దేవి కృష్ణుడిని వశం చేసుకుని తన వాడిని చేసుకుంది. ఇది రుక్మిణీ విజయం. దానిని మన విజయంగా మనం మార్చుకోవడంలో భాగవతం వినడం చేత మనం పొందవలసిన విజయము.

No comments:

Post a Comment