*రమణ మహర్షి భగవాన్ స్మృతులు-13*
🪷
రచన: గుడిపాటి వెంకట చలం
*వారణాసి సుబ్బలక్ష్మమ్మ -1*
నాకు పదహారేళ్ళప్పుడే భర్త పోయినాడు. నా భర్తగారి వల్లనే నేను కృష్ణ మంత్రోపదేశం పొందాను. నేను నా తల్లిగారి వద్దనే ఉండేదాన్ని. ఆమె భక్తురాలు. ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనలోనే వుండేవారామె. మేమిద్దరమూ కావేరి పుష్కరాలకి వెళ్ళి తిరిగివస్తూ, దోవలో అరుణాచలేశ్వరుడి దర్శనానికై తిరువన్నామలై వచ్చాం. ఒక సత్రంలో దిగాం. అక్కడ ఒక రెడ్డి అబ్బాయి, మాతో "ఒక అబ్బాయి, స్వామి వచ్చి పదేళ్ళయింది. ఆయన ఆ కొండమీద ఉంటున్నారు. ఆయన దర్శనం చెయ్యండి" అని చెప్పి వెళ్ళాడు.
మా తల్లికి పుణ్యక్షేత్రాలకి వెళ్ళడం ప్రీతి. అంతకన్న ముఖ్యం సాధు సందర్శనం. మేము కొండమీదికి వెళ్ళి స్వామిని చూడాలని నిశ్చయించుకున్నాం. మాతో నెల్లూరు నుంచి వచ్చిన రెడ్ల స్త్రీలు కూడా కొందరు వున్నారు. మర్నాడు కొండమీదికి వెళ్ళి అక్కడే వంటలు చేసుకొని స్వామి వారిని దర్శించాలని అనుకున్నాం. సామాన్లు తీసుకొని కొండమీది మలపాల తీర్థం దగ్గరకి చేరుకున్నాం. కొండమీదనే మధ్యలో వుంది ఆ చెరువు. అక్కడ వండుకుని తిని, పడుకుని మధ్యాహ్నం మూడింటికి స్వామి వారిని వెతుక్కుంటూ వెళ్లాం. ఆయన విరూపాక్ష గుహలో వుంటున్నారు అప్పుడు. ఆ గుహకి ఇటూ అటూ దూరంగా కొందరు సాధువులు ఎవరో తిరుగుతున్నారు మేము వెళ్ళి చూసేటప్పటికి.
విరూపాక్ష గుహ వాకిటికి పక్కన అరుగు మీద, ఏదో ఆసనము మీద, పద్మాసనం వేసుకొని చిన్ముద్రలో కూచుని వున్నారు, ఈ రమణ మహర్షులవారు. ఆయన్ను అలా చూడగానే నాకు ఆయన సాక్షాత్తు ఆ ఆకారంలో వున్న అరుణాచలేశ్వరుడే, మనలను కడతేర్చను మహత్ప్రకాశమానం గా దర్శనమిచ్చారనిపించింది.
📖
*ప్రథమ దర్శనం*
అప్పుడు ఆయనకు ముప్పై ఏళ్ళు ఉంటాయి. మెరుగుపెట్టిన బంగారమల్లే ఆయన దేహం వెలుగుతోంది. కమల రేకుల మల్లే ఈమూల నుంచి ఆ మూలకి ఉన్నాయి ఆయన నేత్రాలు. ఏమీ కదలకుండా ప్రతిమ మల్లే కూచుని ఉన్నారు. నేను చిన్నదాన్ని, ఏమీ ఎరుగనిదాన్ని. ఆయన్ని చూస్తూ అట్లాగే నిలబడ్డాను. అందరమూ ఆయనకి నమస్కరించాం. అందరివంకా ఆయన ఒక్కసారి తేరిపార చూశారు. అటువంక ఇంకా యెత్తుగా, మా తలలపైన అరుణాచల శిఖరం, మాకు కిందగా పర్వతపాదంలోనే అరుణేశ్వరాలయ - శిఖరాలు, వాటి చుట్టూ కొంచెంగా మాకు వినవచ్చే జనులు సందడి, స్వామివారి చుట్టూ నిశ్శబ్దం.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
మాతో వచ్చినవారిలో ఒకామె, తన కోడలికి సంతానం కావాలని స్వామితో స్వయంగా చెప్పుకోవాలనుకుంది. ఇంకొక ఆమె, "ఆయన యెంతో యెత్తున వున్నారు. వారికి ఇట్లాంటివి ఏవీ పట్టవు” అన్నది. కాని ఆ అత్తగారు మాత్రం ఆశ వదలక స్వామివార్ని అడగమని మా తల్లిగారిని బతిమాలింది. మా తల్లిగారు స్వామివారికి తన మిత్రురాలి కోర్కెను విన్నవించారు. ఆయన విని, ఒక చిరునవ్వు నవ్వి, తన దోసెటతో ఆకాశానికి చూపారు. అంటే, “ఆ విషయం ఆ పరాత్పరుడి ఇచ్చ" అన్నట్లు మేము అర్థం చేసుకున్నాం.
అక్కడితో వారి శలవు తీసుకుని, ఆ రాత్రికే మా వూరు నెల్లూరు వెళ్ళాం. ఆనాటి నా దర్శనానికి ఆనాడు నా మనసులో ఏ ప్రాముఖ్యతా లేదు. జీవితం శాశ్వతంగా ఆ పాదాల అర్పణం కాబోతోందనే ఎలాంటి అనుమానమూ నాకు కలగలేదు.
📖
*ద్వితీయ దర్శనం*
మేము కాశీకి వెళ్ళిన తొమ్మిది నెలలకి మా తల్లిగారు కాలధర్మం పొందారు. నేను ఇంటికి వచ్చి కృష్ణ జపం చేసుకుంటూ వున్నాను. నా ముప్ఫై ఒకటో ఏట కొంతమందితో కలిసి రామేశ్వర యాత్రకు వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో, అరుణాచలానికి వచ్చాను. శ్రీఅరుణాచలేశ్వరుల దర్శనం చేసుకొని, సత్రంలో వంట చేసుకొని భోజనానంతరం శ్రీ రమణులవారి విషయమై విచారించగా వారి ఆశ్రమము అప్పుడు కొండకింద పాలితీర్ధం పక్కన ఉన్నదనీ, తల్లిగారిని అక్కడ సమాధి చేసినారనీ, ప్రస్తుతం మహర్షిగారు అక్కడే వుంటున్నారనీ తెలిసింది.
నిద్రపోయి లేచి మధ్యాహ్నం నాతో వచ్చిన వారితో కలిసి ఆయన ఆశ్రమానికి వెళ్ళాను. ముందు తల్లిగారి సమాధిని చూశాం. దాని పైన ఓ పూరి కట్టడం వుంది. దాని పక్కన వంటకు ఓ పూరి కట్టడం దాని పక్కన ఒక పెంకుటి హాలు. దానిలోనే రమణులు ఒక సోఫాపైన కూచుని వున్నారు. నేలమీద ఒక పదిమంది భక్తులు నిశ్శబ్దంగా కూచుని ఉన్నారు. మేమున్నూ వెళ్ళి ఓ పక్కగా పది నిమిషాలు కూచున్నాం. తరువాత లేచి, నేను ఆయన దగ్గరగా వెళ్ళి, శలవుతీసుకొని వస్తానని చెప్పి నమస్కరించి వచ్చేశాను.
నేను నా వూరికి వచ్చిన తరువాత, సదా ధ్యానంగా వుండడానికి సదుపాయం వెతుక్కుంటున్నాను. కాని ఏ తలపులూ లేకుండా నిలకడగా వుండడం చాలా కష్టంగా వుండేది. ఏదో ఒక పెద్ద దగ్గరికి పోయి, సేవ చేసుకుంటూ వుండాలనే తలపు మాత్రం లేదు.
ఇట్టా ఓ సంవత్సరం పొట్టేపాలెం రామ మందిరంలో ఉన్నాను. నన్ను ఆదరిస్తున్న రెడ్లు కొంతమంది అరవిందయోగి దర్శనార్ధం వెడుతున్నారు. వారి ఆడవాళ్ళు నన్ను కూడా తమ వెంట రమ్మని బలవంతం చేసి, పుదుచ్చేరిలో అరవిందయోగి దర్శనానికి తీసుకొనివెళ్ళారు. వారి దర్శనానికి వెళ్ళిన వారు వారి పాదాలనూ “మదర్” పాదాలనూ తాకి నమస్కారం చెయ్యాలిట. బ్రాహ్మలకే గాని నమస్కరించడం నాకు అలవాటులేదు. ఇదెట్లాగా అనుకుంటూ వారిని సమీపించేట ప్పటికి తెలిసింది ఆసారి "మదర్” ఉత్తరువు ప్రకారం స్త్రీలు బయట గుమ్మం ముందరే నమస్కరించుకుని వెళ్ళాలనీ, లోపలికి వెళ్ళగూడదనీ.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఆ రెడ్ల కుటుంబం పుదుచ్చేరిలో వారం రోజులు వుంటారు. ఈలోపల నేను ఓసారి అరుణాచలం వచ్చివెడితే బావుంటుందని వచ్చాను. తిరిగి మహర్షి వారిని హాలులో సందర్శించి, మధ్యాహ్నం నించి సాయంత్రం వరకూ ఆయన సమక్షంలోనే వుండి, మర్నాడు గిరి ప్రదక్షిణం చేసుకొని కాళహస్తికి బైలుదేరి వెళ్ళాను.
ఆ వూళ్ళో మఠంలో నిద్రపోతూ వుండగా నాకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో నాకు తెలిసిన శాస్త్రిగారు కనపడి, "నీవు పుదుచ్చేరి యెందుకు పోయినావు? తిరువన్నామలై పోయినది సరి. శ్రీ రమణ మహర్షులవారిని నమ్ముకో. వారు నిన్ను కడతేర్చి రక్షిస్తారు. వారు శ్రీ రామావతారం, కృష్ణావతారం, వారు సర్వజ్ఞమూర్తి" అని చెప్పినారు.
అంతవరకు నాకు వీలైన వెంటనే కాశీకి పోయి నా జీవితం అక్కడే గడపవలెనని వుద్దేశం. కాని ఆ స్వప్నం వచ్చిన తరువాత, నేను చేస్తున్న ధ్యానం విషయమై శ్రీ రమణ మహర్షులవారిని అడిగి కొంత తెలుసుకుని, ఇంకా ఆయన ఏమైనా చెపితే, అవి కూడా తెలుసుకుని, ఓ నెల్లాళ్లుండి, కార్తీకదీపం చూసుకుని కాశీకి పోవాలనుకున్నాను. ఆ ప్రకారమే కార్తీకమాసం రాగానే నెల్లూరులో నా మిత్రురాలు కొండ్రాజు పార్వతమ్మను తీసుకుని అరుణాచలం వచ్చాను.
మేమిద్దరమూ, అరుణాచలేశ్వరాలయం దగ్గర ఇల్లు అద్దెకు తీసుకుని కాపురంపెట్టాం. ఆ రోజే కలకండా, ముంత మామిడిపప్పూ తీసుకుని శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చి, అక్కడున్న చిన్న బల్లమీద పెట్టి, నమస్కారం చేసి నిలబడి ఉన్నాం. ఇంతలో అక్కడే పడుకుని వున్న గోవు లక్ష్మి వచ్చి మేము తెచ్చినవన్నీ తింటోంది. భగవాన్, వారి సేవా పరుడు మాధవస్వామీ ఇదంతా చూస్తూ వున్నారు. ఆ ఆవుని తరమకూడదు కాబోలని మేమూ వూరికే వున్నాం. కొంచెం చూసి నేను, "ఆవునించి వాటిని తీయండి” అన్నాను మాధవస్వామితో. ఆయన "ఆ నైవేద్యం మీరు లక్ష్మికే ఇచ్చారనుకున్నాను” అన్నారు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment