Wednesday, November 26, 2025

 *రమణ మహర్షి భగవాన్ స్మృతులు-14*
🪷

​రచన: గుడిపాటి వెంకట చలం


*వారణాసి సుబ్బలక్ష్మమ్మ -2*

*ఏది ఆత్మ?*

మర్నాడు మేము ఆశ్రమానికి వచ్చేటప్పటికి భగవాన్ భోజనం చేస్తున్నారు. భోజనమై భగవాన్ వచ్చి సోఫాపైన పడుకున్న తరువాత, మేమూ హాలులోకి వెళ్ళాం. శ్రీ భగవానుల వారు భగవద్గీతలోంచి శ్లోకం చదివి తెలుగులో రామయోగికి అర్ధం చెపుతున్నారు. వారిద్దరే తప్ప హాలులో ఎవరూ లేరు. అప్పుడు నేను పోయి భగవాన్ దగ్గర కూచుని, "స్వామీ, ఆత్మ అంటే అఖండాకాశమా, లేక అఖండాకాశాన్ని తెలుసుకునేది ఆత్మా?” అని అడిగినాను. 

దానికి శ్రీ భగవాన్ రామయోగిని చూసి "ఇక్కడే అందరికీ సంశయాలు వస్తాయి' అని, నాతో "ఇది ఆత్మా, అది ఆత్మా అనే సంశయరహితంగా, నివృత్తిగా వుండటమే ఆత్మ" అని చెప్పి నా వంకే చూస్తూ మౌనంగా వున్నారు. నేనూ వారినే చూస్తూ కూచున్నా. ఆ స్థితిలోనే నా మనసు లయించినది. నా సంశయం తీరిపోయినది. చాలాసార్లు ఆనాటి స్థితి నా జ్ఞాపకంకి వస్తూ వుంటుంది. అట్లా ఆ ఇంట్లోనే ఆ వూళ్ళో కాపరం వుండి, ప్రతిదినమూ స్వామి దర్శనానికి వచ్చిపోతూ వుండేవాళ్ళం. ఎవరో ఒకరు ఆయన్ని ప్రశ్నిస్తూ వుండేవారు. వాటికి భగవాన్ చెప్పే సమాధానాల్ని వింటూ వుండేదాన్ని.
📖

*వంట ఇంటి ప్రవేశం*

నాకు తత్వజ్ఞానం కలిగినా, వాసనాక్షయం కాలేదే అని చింతగా వుండేది. ఆశ్రమ వాసులు నన్ను వచ్చి ఆశ్రమంలో వుండమని చాలాసార్లు అడిగేవారు. కాని నాకు చాలా ఆచారం; అభ్యంతరంగా వుండేది.

ఒకరోజు భగవాన్ చెల్లెలు నాతో, "నేను శివరాత్రి తరువాత వూరికి వెడుతున్నాను. ఆశ్రమంలో వంటకు అవసరమైన రుబ్బడం మొదలైన పనులు స్వామివారే చెయ్యాల్సి వస్తుంది. ఆ పనులు మనమెవరమో చేసి పెడితే మంచిది. నువ్వు వచ్చి ఆ పనులు ముందు నాతో చేస్తూవుండు. నేను వూరికి వెళ్లిన తరువాత నీవే చూసుకో. శాంతమ్మ వంటచేస్తుంది, పై పనులు నువ్వు చెయ్యి" అని చెప్పింది.

నేను ఆశ్రమంలో చేరాను. ఆమె వూరికి వెళ్ళింది.

"భగవాన్ తో కలిసి వంటింట్లో పనులు చెయ్యడం చాలా ఆనందంగా వుండేది.
నాకు సరిగ్గా చేతగాని పనులన్నింటినీ ఎట్లా చెయ్యాలో భగవానే స్వయంగా చెప్పేవారు; తానే చేసి చూపేవారు.

పగలంతా ఆశ్రమంలో వుండి రాత్రులు అరుణాచలం దేవాలయం వద్ద ఒక అవ్వ ఇంట్లో నిద్రపోయేదాన్ని.

మనసు మరీ శుధ్ధంచేసే పదార్థాలు తినాలి; మనసుని అపరిశుభ్రం చేసే పదార్థాల్ని వర్ణించమని చెప్పేవారు శ్రీవారు. 

“ములక్కాడలు, ముల్లంగి మొదలైన కూరల్ని మీ బోంట్లు తినరు. మీరు స్త్రీలు; అబలలు; మీకు మనోబలం తక్కువ అని పెద్దలు ఆ నిబంధనల్ని పెట్టారు" అని చెప్పారు. 
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
శాంతమ్మ తను అంత కులాసాగా శ్రీవారితో కలిసి పనులు చేస్తున్నా, నాకు మా వూరికి వెళ్లాలని అనిపించేది. ఎందుకంటే, ఇక్కడ అంతా ఎక్కువ పని. పైగా ఆశ్రమంలో పనులు నా మడికీ ఆచారానికి సరిపడేవి కావు. అంతేకాక, నాకు నిదానంగా పని లేకుండా కూచుని ధ్యానం చేసుకోవాలని వుండేది. దానికి ఆశ్రమంలో తీరుబడే వుండేదికాదు. అందుకని నేను తెగించి మా వూరికి వెళ్ళి ఓ సంవత్సరం పాటు అక్కడే వుండిపోయినాను. అక్కడ పనిలేకండా, దినమంతా ధ్యానంలో గడిపేదాన్ని. కాని, ధ్యాస అంతా ఆశ్రమం మీదనే వుండేది. ఆశ్రమంలోనేనా, అంతటా భగవాన్ లేరా? అని మనసుకి యెంత సమాధానం చెప్పుకున్నా, నా మనసు నిలవలేదు.

ఆశ్రమంలో పనిచెయ్యకుండా, హాలులో సోఫా పైన కూచున్న భగవాన్ ఎదురుగా ఆయన సన్నిధిలో కూచోవాలని వుండేది. అది వీలులేదు గనక, మా వూళ్ళోనే వుండి ధ్యానం చేసుకుందామని ఎంత ప్రయత్నించి నా, నా మనసు ఆగదు. పని చేస్తూనో, ఎట్లానో భగవాన్ని చూస్తూ వుండాలనే కాంక్ష బలంగా లాగింది. అట్లాగే భగవాన్ కూడా నేను లేని సంగతిని తలుచుకుంటూనే వుండేవారు.
📖

*పునర్వసు పొంగలి*

నేను లేని కాలంలో ఓరోజు శాంతమ్మ పొంగలి చేస్తున్నది పునర్వసుకి. భగవాన్ శాంతమ్మని చూసి, "అక్కడ వున్నా, సుబ్బాలక్ష్మికి ఇవాళ పొంగలి చేశారో, లేదో అని అనిపిస్తూ వుంటుంది" అన్నారట.

పునర్వసు అంటే భగవాన్ జన్మనక్షత్రం.

ఇంకో పునర్వసునాడు- 'సుబ్బలక్ష్మి ఇవాళ వస్తుంది. పొంగలి చేసిపెట్టి వుంచండి" అన్నారు. ఆ రోజే నేను వచ్చాను ఆశ్రమానికి!
📖

*కట్టేసుకున్నారు*

ఈ విధంగా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి తనని విడవకుండా కట్టేసుకున్నారు భగవాన్ నాకెంతకీ పోవాలనే కాని, ఆయన ఇన్నేళ్ళూ నన్ను కదలనీయలేదు.

నా పైన ఆయనకి మార్జాల కిశోర న్యాయం.

ఆశ్రమానికి వచ్చానన్న మాటేగాని మళ్ళీ మా వూరు పోయి ధ్యానం చేసుకోవాలనే వుండేది. గట్టిగా పోవాలనుకుని చిన్న స్వాముల (భగవాన్ తమ్ముడు; ఆశ్రమానికి సర్వాధికారి) వారికి చెపితే వారు పోవడానికి వీల్లేదనేవారు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
"వీరితోనే ఏమిటి, సరాసరి భగవాన్ తో చెప్పి మనపాటికి వెళ్ళిపోదాం" అనుకుని, వచ్చి ఉదయాన నమస్కారం చేసి ఆయన అనుజ్ఞ అడుగుదామనుకుంటూ వుంటే, భగవాన్ తానే నన్ను పిలిచి "ఇదుగో- అరుణాచలాష్టకం తెలుగులో వున్నది; రాసుకో" అన్నారు.

ఏ రాత్రికో తీరుబడి అయినప్పుడు దాన్ని రాసుకోడం కొన్నాళ్ళు; తప్పులు దిద్దుకోడం కొన్నాళ్ళు; అర్ధం చెప్పించుకోడం కొన్నాళ్ళు వల్లెవేయడం కొన్నాళ్ళు. మావూరికి వెళ్ళడం పడేదికాదు. నేను ఊరు ఎప్పుడు వెళ్ళాలని నిశ్చయించుకొని అనుజ్ఞ కోసం వెళ్ళినా, ఏదో ఒకటి యిట్లాంటిదే జరిగి ప్రయాణం ఆగిపోయేది.

నాకు మాత్రం ధ్యానం లేకుండా పనులతోనే సరిపోతోందే అనే విచారం మనసులో వుండనే వుండేది.
📖

*భగవాన్ వివరణ*

ఒకనాడు భగవాన్ నాతో "నీకు సదా ధ్యానం మీదనే మనస్సు వున్నట్టుందే!" అన్నారు.

దానికి నేను “ఇక్కడ వంట పనులే కదా నాకు" అన్నాను.

దానికి భగవాన్ "ఏమి? ఈ కాలూ, చేయీ పనులు చేస్తూ వుండనీ; నువ్వు కాలూ, చెయ్యీ కాదుగా; ఏమీచెయ్యక తటస్థంగా వుండే వస్తువు నువ్వు, అది తెలీనంతసేపే కష్టం, అది తెలుసుకుంటే ఇంక కష్టమేమీ లేదు. ఈ దేహమే నువ్వనుకున్నంత కాలమూ రాగమూ, ద్వేషమూ వుంటాయి. పనీ కష్టంగానే కనబడుతుంది. ఈ దేహం నేను అనుకున్నంత కాలమూ, ఏ పనీ లేకుండా కూచుంటే మాత్రం మనసు ఊరుకుని నిలకడగా కూచుంటుందా? మనం నిద్రపోయేటప్పుడు గూడావూరుకోదే; కలలలో తిరుగుతూనే వుంటుంది కదా!" అన్నారు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
దానికి నేను "అవును స్వామీ! తాను దేహం కాదు అనుకోడం స్వామికి సులభం. మాకు మేము దేహమనుకోడం సులభం. మొన్న కలలో తాము ఈ సంగతే విశదం చేశారు. ఆ స్వప్న మేమిటంటే - మీరు ఆ మూల స్నానం చేస్తున్నారు. ఆవేళకే నేనువచ్చి దడి ఇవతల పప్పు రుబ్బుతున్నాను. మీరు 'ఎవరది?' అనడిగారు.

"నేను ఎవరని చెప్పను?" అన్నాను.

"ఆ చెప్పను వీలుకాని వస్తువే నువ్వు: మరవవద్దు' అని మీరు చెప్పారు. ఇదీ ఆ కల. అవును. ఆ వస్తువు మేమని మరవకుండా వుండడం మాకు కష్టం. శ్రీ భగవాన్లకు అన్నీ సులభం" అన్నాను నేను భగవాన్ తో.

దానికి వారు నవ్వి వూరికే నా వంక చూశారు. అదే నాకు ఉపదేశం అనుకున్నాను నేను.

నేను చాలాసార్లు ఉపవాసాలు చేస్తుండే దాన్ని కాని, అలా ఉపవాసాలు చెయ్యడం భగవాన్ దృష్టిలో అనవసరమన్నట్లు తోచేది నాకు. కాని, వేదాంత పుస్తకాలలో వేరు విధంగా వుండేది. విచార సంగ్రహమనే పుస్తకంలో- 'దేహపోషణ చేస్తూ వేదాంత విచారం చేసేవాడు, మొసలిని నమ్మి నది దాట చూచినట్టు' అని వుంది. 'ఇట్లా వుందేమి మరీ?' అని భగవాన్ని ప్రశ్నించాను ఓ రోజు.

దానికి శ్రీవారు - "అట్లా రాశారని, అన్నం తినవద్దు, నీళ్లు తాగవద్దు అని అర్ధంకాదు. శరీరానికి అనేక వుపద్రవము చేసేటట్లు వుపవాసాలు కాని, ఇంకేమీ కానీ చెయ్యకుండా మితంగా భోజనం చేసి, ధ్యాన నిష్ఠకి భంగం లేకుండా సంప్రాప్తమైన ఆహారం తీసుకుని లక్ష్యమంతా ధ్యానం మీద వుంచమని అర్ధం" అని చెప్పారు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment