Saturday, November 1, 2025

 🕉️అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18 
శ్లోకము 53

శ్లో॥ విలసన్తి మహోభోగైః విశన్తి గిరిగహ్వరాన్ |

నిరస్త కల్పానా ధీరా అబద్ధా ముక్త బుద్ధయః || 

మనోబుద్ధులలోని భావాల తాదాత్మ్యంనుండి విడివడి తన్ను తాను ఆత్మగా గుర్తించిన జ్ఞానులు సంతోషంగా సరదాగా అప్పుడప్పుడు మనో బుద్ధులతో ప్రపంచంలో వ్యవహరిస్తారు. మరొకప్పుడు పర్వత గుహలలో ధ్యానమగ్నులై ఉండనూగలరు.

జీవన్ముక్తులనుభవించే ముక్తస్థితిని, వారి ఆనందాన్ని, సుఖంగా పరి పూర్ణతృప్తితో వారు జీవించే విధానాన్నీ గానం చెయ్యడానికే అష్టావక్ర మహర్షి ఈ అధ్యాయాన్ని అంకితం చేసినారు. జ్ఞాని ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు అతని దృక్పథం ఎలా ఉండేదీ, బాహ్యవిషయాలకు అతడేవిధంగా స్పందించేదీ ఇక్కడ వర్ణిస్తున్నారు.

పరిపూర్ణుడయిన అట్టి మహాత్ముడు అహంకార రహితుడు, మనో బుద్ధులను అధిగమించినవాడు, కాబట్టి అతనిలో బాహ్య విషయాలపట్ల, వాటి 'ఉనికి వైఖరిపట్ల, ఊహాకల్పనలు ఎంతమాత్రమూ ఉండవు. మనఃకల్పనలు లేకపోవడంతో అతని మనస్సు సదా శాంతంగా ఉంటుంది. అహంకార వర్ణితుడయిన అతని బుద్దికి బంధుత్వ భావన ఉండదు. అతడి కోరికలచే అతడు పరిమితం కాబడడం లేదు. ఈ విధంగా అతడి మనోబుద్ధులు వాటి సహజ గుణాలయిన కోరికల భావాల ఒత్తిడినుండి విడివడి. ధ్యానఫలమయిన శాంతస్థితిని అనుభవిస్తూ తృప్తిగా ఉండగలుగుతాయి.

ఈ విధమయిన నిత్యతృప్త మానసంతో, శాంతబుద్ధితో కిరీటం లేని చక్రవర్తివలె జ్ఞాని జీవిస్తూ ఉంటాడు. అతడు సరదాగా, తన ప్రారబ్ధవశాత్తూ ప్రాప్తించిన మనశ్శరీరాలతో ప్రపంచాన్ని శాంతంగా వీక్షిస్తూ క్రీడించనూ గలడు, ఏకాంతంలో గిరి గహ్వరాలలో నదీతీరాలలో సమాధిస్థితుడై స్వరూపనిష్ఠలో కాలాతీతంగా ఉండనూగలడు.

జ్ఞానిశరీరం ఎక్కడ ఉంది అన్న విషయం అతడికి అనవసరం; అప్రస్తుతం, ఆ శరీరం ప్రారబ్ధానుగుణంగా అనంత సుఖభోగాల మధ్యనయినా, మహాకష్టదశ లోనయినా ఉండవచ్చును. ఆ పరిస్థితులేవీ అతనికి సుఖదుఃఖాల నివ్వజాలవు. అహంకారమేలేని అతడు విషయభోగాల సుఖాన్ని కానీ, ప్రాపంచిక కష్టాలను కాని అనుభవించడు. శరీరం ప్రారబ్ధానుగుణంగా అనుభవించడాన్ని, సాక్షిగా, శాంతంగా, నిర్వికారంగా చూడగలుగుతాడు. అహంకార మమకార రహితుడయిన అతనిని ఇంద్రియ భోగ్యక్షేత్రాలు కదలింపజాలవు. సర్వమూ భావనామయ మని, భావాలు తన నర్తనలని, భావం భావాన్ని కదిలిస్తోందని స్పష్టంగా చూస్తూ శాంతంగా సర్వదా కేవలంగా తానుగా ఆత్మగా ఉండగలుగుతాడు.

జ్ఞాని సుఖభోగాల ననుభవిస్తున్నట్టుగానీ, సత్కర్మ నిష్టాగరిష్ఠుడై ఉన్నట్టుకానీ, లేదా ఏకాంతంలో సమాధి స్థితుడయినట్టు కానీ మనకనిపించ వచ్చును. ఇది మన దృష్టిమాత్రమే. అతడే స్థితిలో ఉన్నట్టు మనం భావించినా అవన్నీ మన భావనలే. అతడు మాత్రం సదా ఆత్మానుభవస్థితుడై ఏకత్వాన్ని సర్వదా చూస్తూ శాంతుడై ఉంటాడు. జీవన్ముక్తునికి అతని మనఃకల్పిత ఉపాధీ, జగత్తూ ఇంద్రజాలంవలె స్వప్నం వలె ఉన్నా లేకున్నా ఒకటే. అహంకారంతో తాదాత్మ్యం చెందినప్పుడు మాత్రమే ఏదైనా ఆ విధంగా ఉండాలని కాని, ఇంకొక విధంగా మారాలని అనిపిస్తుంది. బుద్ధిలో విలువలతో తాదాత్మ్యం చెందిన అహంకారం మాత్రమే స్థితిని మార్పును గుర్తిస్తూ కోరుతూ ఉంటుంది. అహంకార వర్జితుడయిన జ్ఞాని నిర్వికారంగా భావాల లీలలను వీక్షించగలుగుతాడు!🙏🙏🙏

No comments:

Post a Comment