```
అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-194.
57d3;3.11e3;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1️⃣9️⃣4️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
```
*భగవద్గీత*
➖➖➖✍️```
(సరళమైన తెలుగులో)```
*7. విజ్ఞాన యోగము.*
(ఏడవ అధ్యాయము)
_________________________
*17. వ శ్లోకము:*
*తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ।*
*ప్రియో హి జ్ఞానినోఽత్యర్థమహం స చ మమ ప్రియః ॥17॥*
”పైన చెప్పబడిన భక్తులలో ఎల్లప్పుడూ యుక్తుడుగా ఉండేవాడు, పరమాత్మ యందు ఏకాగ్రభక్తి కలిగి ఉండేవాడు, అయిన జ్ఞానికి నేనంటే ఎక్కువ ఇష్టం. అటువంటి జ్ఞాని అంటే నాకూ ఇష్టమే.”```
పైన చెప్పబడిన నలుగురు భక్తులలో జ్ఞాని ఉత్తముడు అని అంటున్నాడు పరమాత్మ. ఎందుకంటే జ్ఞానిలో పైన చెప్పబడిన ముగ్గురిలో అంటే ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసువులలో లేని గుణాలు ఉన్నాయి.
అవి 1. నిత్య యుక్త. 2. ఏక భక్తి.
నిత్య యుక్తత్వము అంటే నిరంతరము పరమాత్మతో కూడి ఉండటం. పరమాత్మతో సంబంధము పెట్టుకోవడం, ఇతరముల గురించి ఆలోచించకపోవడం. అంటే ఎల్లప్పుడూ ధ్యానంలో ఉంటూ మనసును ఆత్మలో లీనం చేసి ఆత్మానందాన్ని పొందుతుంటాడు. మొదటి ఇద్దరూ కేవలం అవసరం ఉన్నప్పుడు భగవంతుని స్మరిస్తారు. తరువాత తమ తమ కార్యములలో లీనం అవుతారు. మరలా అవసరం వచ్చినప్పుడే భగవంతుడు వారికి గుర్తుకు వస్తాడు. అంటే పార్ట్ టైమ్ అన్నమాట. వారిని అనిత్య యుక్తులు అంటారు. అటువంటి వారు ప్రాపంచిక విషయములలో లీనం అయి ఉన్నప్పుడు వారిలో అజ్ఞానం చేరే అవకాశంఉంది.
కాని జ్ఞాని ఫుల్ టైమ్ వర్కర్. సర్వకాల సర్వావస్థలయందు ఆత్మతో అనుసంధానము అయి ఉంటాడు. ఆత్మానందంలో మునిగితేలుతుంటాడు. అతడికి ఏ సమయంలో కూడా అజ్ఞానం ఆవహించే అవకాశం లేదు. అందుకే జ్ఞానిని నిత్యయుక్తుడు అని అన్నారు. అనిత్య యుక్తులుగా ఉన్నవారు కూడా మొదట కేవలము కోరికల కోసం భగవంతుని స్మరించినా, క్రమక్రమంగా భగవంతుని మీద ఆసక్తి పెంచుకొని జ్ఞానులు అయ్యే అవకాశం ఉంది. కాని వారు ఆ దిశగా ప్రయత్నం చేయాలి. రోజూ ధ్యానం చేయాలి. మనసును ప్రాపంచిక విషయముల నుండి క్రమక్రమంగా భగవంతుని వైపు మళ్లించాలి. అంతే కానీ ఇది నా వల్లకాదు అని నిరాశ పడకూడదు. ప్రయత్నం అన్ని విధాలా మంచిది.
ఇంక జ్ఞాని రెండవ లక్షణం ఏకభక్తి. ఏకాగ్రత. ఒకే పరమాత్మ. రోజుకో దేవుడిని ప్రార్థించడు. అతని లక్ష్యం అత్మానందాన్ని పొందడమే. ఒక్క పరమాత్మను తప్ప వేరే ఎవరినీ పూజించడు. అదే ఏకాగ్రభక్తి. కాని 90 శాతం మందికి ఇది సాధ్యంకాదు. కొంతమందికి ధనం మీద, పదవుల మీద, అధికారము మీదా, సుఖాల మీద, వాటిని తనకు ప్రసాదించే దేవతల మీదా, భార్య, సంతానము మీదా, బంధుమిత్రుల మీదా, వారి వారి అవసరానికి పనికివచ్చే దేవుళ్ల మీదా భక్తి ఉంటుంది. ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్టు భక్తి మారిపోతూ ఉంటుంది. వారి మనస్సు చంచలంగా ఉంటుంది. ఎక్కడా, దేని మీదా నిలువదు, గెంతుతూ ఉంటుంది. దానిని ఏకాగ్రభక్తి అనరు. ధ్యానం చేయడానికి ఇటువంటి భక్తి పనికిరాదు. జ్ఞాని అయినవాడు పరమాత్మయందే దృష్టి పెట్టాలి. అతని దృష్టి చెదిరి పోకూడదు. ఏకాగ్రంగా ఉండాలి. అందుకే జ్ఞానిని ఉత్తముడు అని అన్నాడు.
చాలా మందికి ఒక దురభిప్రాయం ఉంది. కలియుగంలో కేవలం హరినామ స్మరణ చేస్తే చాలు. అదే భక్తి. ఇంక ఏమీ అక్కరలేదు. దానికి ఉదాహరణగా గోపికలను చెబుతారు. శ్రీహరినామ స్మరణ చేయడం, కీర్తించడం, పాటలు పాడటం, ఇదే భక్తి అనుకుంటారు. కాని ఇది భక్తికి మార్గమే కానీ ఏకాగ్రభక్తి కాదు. అంటే జ్ఞానికి ఇది ప్రాధమిక విద్య మాత్రమే. తరువాత సెకండరీ విద్య, తరువాత ఉన్నత విద్య కూడా ఉన్నాయి. అప్పుడే అతడు జ్ఞాని అవుతాడు. అంటే, అంతకు ముందు పాపపు జీవనం గడిపినవాడు, పాపాలు చేయడమే వృత్తిగా కలవాడు, పైన చెప్పిన పనులు అంటే భజనలు చేయడం, కీర్తనలు పాడటం, నృత్యం చేయడం, పూజలు, వ్రతాలు చేయడం ఇత్యాదులు చేస్తే వాడికి
ఆ పాపపుపనుల నుండి విముక్తి లభించి, మనసు భగవంతుని మీదికి మళ్లుతుంది. మంచి గురువును ఆశ్రయిస్తాడు. శాస్త్రములు చదువుతాడు. జ్ఞానం సంపాదిస్తాడు. క్రమక్రమంగా అతడి మనసు ధ్యానం మీదికి మళ్లుతుంది. అది ఒక జన్మలో కాదు. ఎన్నో జన్మలు కావాలి. ఒక జన్మలో చేసింది మరుజన్మలో కొనసాగించాలి. దీనిని తెలుసుకోకుండా కేవలం భజలనుచేసి కీర్తనలు పాడితే మోక్షం వస్తుంది అని, అదే ఏకాగ్రభక్తి అని అనుకోవడము పొరపాటు. అటువంటి భక్తికూడా అవసరమే కానీ అది జ్ఞానికి తొలిమెట్టు మాత్రమే.
అందుకే పరమాత్మ ఈ శ్లోకంలో స్పష్టంగా పైనచెప్పబడిన లక్షణములు ఉన్న జ్ఞానికి అంటే నిత్యయుక్తుడు అయిన జ్ఞానికి, అంటే ఎల్లప్పుడు పరమాత్మలో మనసును లీనం చేసి ఆత్మానందాన్ని అనుభవిస్తున్న జ్ఞానికి, నేను ఎంతో ఇష్టుడను అని చెప్పాడు.
చాలా మంది నేను దేవుడిని పూజిస్తున్నాను. భగవంతుని కొలుస్తున్నాను. పరమాత్మను ధ్యానిస్తున్నాను. నాకు దేవుడి మీద చాలా భక్తి అని అంటూ ఉంటారు. అంటే వారి దృష్టిలో దేవుడు వేరు. భక్తుడు వేరు అని భావన. ఆ భావన ఉన్నంత వరకు అతడు జ్ఞాని కాలేడు. నాకు పరమాత్మకు భేదం లేదు. అహం బ్రహ్మాస్మి అనే స్థితికి వస్తేకాని అతడు జ్ఞాని కాలేడు. అటువంటి జ్ఞానికి నేనంటే ఎంతో ఇష్టం. ఆ జ్ఞాని కూడా నాకు ఎంతో ఇష్టుడు అని చెప్పాడు కృష్ణుడు.✍️```
```(సశేషం)
🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం,
(రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏
No comments:
Post a Comment